మెయన్ ఫీచర్

సంచలన తీర్పులు.. సమగ్ర మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సగటు భారతీయుడు కోరుకునే రీతిలో ఎపుడూ స్పందించే సర్వోన్నత న్యాయస్థానం 2017లో సంచలన తీర్పుల ద్వారా తనదైన ముద్రవేసుకుంది. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో స్పందించిన తీరు, చారిత్రాత్మక తీర్పులతో ప్రజల్లో న్యాయవ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచింది. కొన్ని కేసులను కొట్టివేయడం ద్వారా పరిపాలనాపరమైన లొసుగులను కూడా ఎత్తిచూపింది. ప్రాథమిక విచారణ నివేదిక రాయడంలోనూ, అక్కడి నుండి కేసు నమోదు మొదలు దర్యాప్తు తీరు, అభియోగాల నమోదు, శాస్ర్తియ పద్ధతిలో సాక్ష్యాల సేకరణ, చట్టపరిధిలో కేసును నిర్ధారించేందుకు అవసరమైన న్యాయ ప్రక్రియను అనుసరించడంలోనూ దర్యాప్తు సంస్థల లొసుగులను నిలదీసింది. ముంబై పేలుళ్ల కేసు, నిర్భయ కేసు, ఆరుషి కేసు విషయంలోనూ తీవ్రమైన శిక్షలనే ఖరారు చేసింది. 2జి కేసులో పరిపాలనాపరమైన లోటుపాట్లను ప్రాసిక్యూషన్ వైఫల్యాలను ఎత్తిచూపింది. డేరాబాబాను జైలుకు పండటంలోనూ, వ్యక్తిగత గోప్యత అంశంలోనూ, మూడుమార్లు తలాక్ విషయంలోనూ కీలక తీర్పులను వెలువరించింది. యుక్తవయస్కురాలైన ఆరుషీ హత్య కేసులో ఆమె తల్లిదండ్రులు రాజేశ్ , నూపూర్ తల్వార్‌లను నిర్దోషులుగా విడుదల చేసింది. అదే పరిస్థితి 2 జి కుంభకోణంలోనూ జరిగింది. స్పెక్ట్రమ్ కుంభకోణంలో నిందితులు అంతా నిర్దోషులుగా బయపడ్డారు. ఇదంతా ఒక ఎత్తయితే, రానున్న రోజుల్లో సుప్రీంకోర్టు ముందుకు మరిన్ని కీలక కేసులు రాబోతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య అధికారాల పరిధికి సంబంధించి జరుగుతున్న పోరుపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. అలాగే ‘మరణశాసనం’పై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించనుంది. ఆధార్ రాజ్యాంగబద్ధత, వివాహానంతరం పార్శీ మహిళల హక్కులు, రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం, రోహింగ్యాలను వెనక్కు పంపించే అంశం, లవ్‌జిహాద్‌లో హదియా కేసు, రాజ్యాంగంలో ఆర్టికల్ 35ఎ రద్దు, సెక్షన్ 377 ఐపిసి, నిర్భయ కేసు పునర్‌విచారణ పిటీషన్, కావేరీ వివాదం వంటి ప్రధాన కేసులు ఇప్పటికే జాబితాలో ఉన్నాయి. వీటికితోడు కొత్త కేసులు ఎన్ని వస్తాయనేది కాలమే చెప్పాలి.
అధికారాలపై సిగపట్లు
దేశంలో లెఫ్టినెంట్ గవర్నర్ల అధికారాలపై మరోసారి ఢిల్లీ ప్రభుత్వం చర్చకు లేవనెత్తింది. డిసెంబర్ 6న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం లెఫ్టినెంట్ గవర్నర్ల అధికారాలపై తమ తీర్పును రిజర్వు చేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎ కె సిక్రీ, జస్టిస్ ఎ ఎం ఖాన్‌విల్కర్, జస్టిస్ డి వై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషన్ కూడా ఉన్నారు. దైనందిన పరిపాలనా కార్యకలాపాల్లో రాష్ట్ర ప్రభుత్వానికే విస్తృత అధికారాలున్నాయని ఢిల్లీ ప్రభుత్వం వాదించగా, లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చే ఉత్తర్వులే తుది ఆదేశమని కేంద్రప్రభుత్వం వాదించింది. ఢిల్లీ దేశ రాజధాని కనుక స్థానిక ప్రభుత్వం కంటే కేంద్రప్రభుత్వ ప్రతినిధిగా ఉంటున్న లెఫ్టినెంట్ గవర్నర్‌నే పరిపాలనాధిపతిగా గుర్తిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 15 రోజుల పాటు ఇరువర్గాల వాదనలను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. సీనియర్ న్యాయమూర్తి గోపాల్ సుబ్రమణియన్ ఢిల్లీ ప్రభుత్వం తరఫున వాదించారు. ఇటు చట్టాలను చేస్తూ ప్రజాసంక్షేమాన్ని పరిరక్షిస్తూ, స్థానికుల అవసరాలను పట్టించుకునే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదని లెఫ్టినెంట్ గవర్నర్‌ను పాలనాధికారిగా ఎలా గుర్తిస్తారని సుబ్రమణియన్ వాదించారు. శాసనసభ్యులు, మంత్రివర్గం, ముఖ్యమంత్రి ఉన్నారని, చట్టాలను చేయడంతో పాటు చట్టసవరణలు, చట్టాల అమలుకు ప్రజలు వారికి పాలనాధికారం ఇచ్చారని ఆయన వాదించారు. ఢిల్లీ ప్రభుత్వం తరఫున పి.చిదంబరం, రాజీవ్ ధావన్, శేఖర్ నేపడే , ఇందిరా జైసింగ్ వాదించగా కేంద్రప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ మణీందర్ సింగ్ తమ వాదనలు వినిపించారు.
ప్రశాంతంగా మరణించే హక్కు
కామన్ కాజ్ దాఖలు చేసిన మరో కీలక పిటీషన్ సంచలన నిర్ణయాలకు తెరతీయనుంది. ఎవరైనా ఒక పురుషుడు లేదా స్ర్తి కోమా దశలోకి వెళ్లి, లేదా బ్రెయిన్ డెడ్ దశలో ఇక ఎంత మాత్రం జీవించేందుకు అవకాశం లేదని వైద్యపరంగా నిర్ధారణ అయిన తర్వాత కూడా వారిని బతికించేందుకు విశ్వప్రయత్నం చేయడం, వైద్యపరమైన మద్దతు ఇవ్వడం ఆయా కుటుంబ సభ్యులకు ఆర్ధికదివాలా తప్ప మరొకటి కాదని, అలాంటి రోగులు స్వచ్ఛందంగా ముందుగానే మరణశాసనం (వీలునామా/ సంకల్పం) రాసేందుకు అవకాశం కల్పించాలని కామన్ కాజ్ ఎన్‌జిఓ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
ఎన్‌జిఓ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపిస్తున్నారు. అలాంటి రోగులు ఒక వేళ ముందుగానే తమకు ఎలాంటి వైద్య సేవలు అందించాల్సిన అవసరం లేదని వీలునామా రాసే పక్షంలో అందుకు వీలుగా స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా అటువంటి వీలునామాను దిగువస్థాయి న్యాయమూర్తి అంగీకారం పొందాలని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హింస పడకుండా మరణం ప్రశాంతంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారని, జీవించే హక్కు ఎలా ఉందో ప్రశాంతంగా మరణించే హక్కు కూడా అందులో భాగమని ఎన్‌జిఓ వాదిస్తోంది. కోమా దశలోకి వెళ్లిన వ్యక్తి ఎలాంటి ప్రకటన చేయలేడు, కనుక అటువంటి దుస్థితికి ముందే ఆ వ్యక్తికి వీలునామా రాసే హక్కు కల్పించాలని, తద్వారా కోమాలో సైతం తనకు ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని కోరేందుకు వీలుకలుగుతుందని ప్రశాంత్ భూషణ్ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఒక వ్యక్తికి అందిస్తున్న వైద్య సేవలను డాక్టర్ల ప్యానల్, కుటుంబ సభ్యులు, సంబంధిత హైకోర్టు ఆమోదంతో విరమించచేయవచ్చని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే ఇందుకు సంబంధించిన తుది తీర్పును త్వరలో ఇవ్వనుంది.
ఆధార్‌కు రాజ్యాంగబద్ధత
ఆధార్ విశిష్ట సంఖ్యల జారీ రాజ్యాంగబద్ధమేనా అనే అంశంపై దాఖలైన 24వేర్వేరు పిటీషన్లపై త్వరలో సుప్రీంకోర్టు తమ నిర్ణయాన్ని ప్రకటించనుంది. జనవరి 18న ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎ కె సిక్రి, జస్టిస్ ఎ ఎం ఖాన్ విల్కర్, జస్టిస్ డి వై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతుంది. ఆధార్ జారీ, వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్‌ను నిర్బంధం చేయడం, విద్యాంశాలు, పరీక్షలు, ప్రవేశపరీక్షలు, ఎంపిక పరీక్షలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడంపై సుప్రీంకోర్టు వివిధ దశల్లో తమ అభిప్రాయాన్ని చెప్పడంతో పాటు ఆధార్‌ను తాజాగా ఆర్ధిక అంశాలకు జత చేయడంపై కూడా నిష్కర్షగా వ్యాఖ్యానించింది. దాంతో కేంద్రప్రభుత్వం బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్యూరెన్స్ పాలసీలు, పోస్టు ఆఫీసు స్కీమ్‌లు, నగదు నిల్వలకు ఆధార్‌ను అనుసంధానం చేసేందుకు మార్చి 31 వరకూ గడువును పొడిగించింది. చివరికి సెల్‌ఫోన్లకు సైతం ఫిబ్రవరి 6లోగా ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేశారు. డిసెంబర్ 31లోగా ఆధార్‌తో అనుసంధానం కాని బ్యాంకు అకౌంట్లను నిలిపివేస్తామని పేర్కొంటూ కేంద్రప్రభుత్వం గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌ను నిలిపివేసింది. దేశంలో 33 కోట్ల పాన్‌కార్డులు ఉండగా, నవంబర్ వరకూ 13.28 కోట్ల మంది పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకున్నారు.
పార్శీ మహిళల వివాహానంతర హక్కులపై కూడా మరో పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. ప్రత్యేక వివాహాల చట్టం 1954 ప్రకారం పార్శీ మహిళ ఏ మతానికి చెందుతుందో అనే అంశంపై వివాదం నెలకొంది. ఈ పిటీషన్లపై సుప్రీం ఇవ్వబోయే తీర్పు పెను సంచలనం కానుంది.
రామజన్మభూమి వివాదం
బాబ్రీ మసీదు- రామజన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 8న తదుపరి విచారణ జరగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికలయ్యే వరకూ విచారణను వాయిదావేయాలన్న సున్నీ, వక్ఫ్‌బోర్డు తదితరుల అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తోసిపుచ్చారు. అయోధ్యలో వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహీ అఖాడా, రామ్ లల్లాలు సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు ముందు 14 అప్పీళ్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. రామమందిర మూల విరాట్టు రామ్‌లల్లా విరాజ్‌మాన్ తరఫున న్యాయవాది సిఎస్ వైద్యనాధన్‌ను వాదనలు వినిపించాలని ధర్మాసనం సూచించింది. వెంటనే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సున్నీ వక్ఫ్‌బోర్డు, బాబ్రీ మసీదు కార్యాచరణ కమిటీ తరఫున న్యాయవాదలు విచారణ ప్రక్రియ నుండి వాకౌట్ చేస్తామని స్పష్టం చేశారు.
ఈకేసు సున్నితత్వం, దేశ లౌకికత్వం, రాజకీయాలపై పడే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని విచారణను ఐదుగురు లేదా ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నివేదించాలని కపిల్‌సిబాల్, రాజీవ్ ధావన్ వంటి సీనియర్ న్యాయమూర్తులు కోరారు. అయితే దీనిని ప్రధానన్యాయమూర్తి తిరస్కరించారు. వక్ఫ్‌బోర్డు తరఫున వాదనలు వినిపించిన కపిల్‌సిబల్ స్పందిస్తూ, కనీసం విచారణను 2019 జూలైకి వాయిదావేయండి, ఆ తర్వాత మేం వాయిదాలను కోరబోం అని చెప్పడంతో ఇదేం అభ్యర్ధనంటూ ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ కేసు ఫిబ్రవరి 8న విచారణకు రానుంది.
రోహింగ్యాల సమస్య
రోహింగ్యా ముస్లిం శరణార్థులను వెనక్కు పంపించే అంశంపై సుప్రీంకోర్టు జనవరి 31న విచారణ చేపట్టనుంది. దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులతో పాటు 40వేల మంది రోహింగ్యా శరణార్థులను తిప్పి పంపించనున్నట్టు కేంద్ర హోం శాఖ ప్రకటించడంతో వివాదం తెరమీదకు వచ్చింది. రోహింగ్యాల వివరాలను సేకరించాలని కూడా అన్ని రాష్ట్రాలకూ కేంద్రం ఆదేశించింది. భారత్‌లో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, హరియాణ, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్‌లలో రోహింగ్యాలు నివసిస్తున్నారు.
బౌద్ధమతస్థులు మెజార్టీగా ఉన్న మయన్మార్‌లో దాదాపు 12 లక్షల జనాభాతో బెంగాలీ మాండలికం మాట్లాడే రోహింగ్యాలు రఖైన్ రాష్ట్రంలో అక్కడ నివసిస్తున్నారు. ఆ దేశంలో అధికారికంగా గుర్తించిన 135 జాతుల్లో వీరు లేకపోవడంతో వీరికి పౌరసత్వం కూడా లభించడం లేదు. కనీసం గుర్తింపు కార్డులు ఇవ్వకపోగా, ఏ హక్కులూ కల్పించలేదు. పౌరులుగా గుర్తింపు పొందాలంటే ఆదేశంలో కనీసం 60 ఏళ్లునివసించినట్టు రుజువు చేసుకోవాలి. బర్మాలో సైనిక చర్యతో సుమారు మూడు లక్షల మంది బంగ్లాదేశ్‌కు తరలివచ్చారు. అక్కడి నుండి వీరు దేశంలో పలు ప్రాంతాలకు వలస వస్తున్నారు.
మానవతాదృక్పథం ఉండాలి, కాని ఎంత మూల్యానికి అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అన్ని వివరాలతో కోర్టుకు రావాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌ను, ఎఎస్‌జి తుషార్ మెహతాను ఆదేశించింది. లవ్ జిహాద్ హదియా కేసు జనవరి మూడో వారంలో, ఆర్టికల్ 35ఎ రద్దు అంశం స్వలింగసంపర్కాన్ని నేరంగా నిర్ధారించే ఐపిసి 377 మినహాయింపుల అంశంపైనా జనవరిలో సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. నిర్భయ పునర్విచారణ జనవరి 22న ప్రారంభం కానుంది. గత సెప్టెంబర్ 21న రిజర్వు చేసిన కావేరి జలాల వివాదంపై కూడా సుప్రీంకోర్టు త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

-బి.వి.ప్రసాద్