సంపాదకీయం

చైనా గాలిపటం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పతంగ్‌లు - గాలిపటాలు - చైనా నుంచి దిగబడిపోతుండడం మరో చర్చా వైపరీత్యం! కొండనాలుకకు మందేయమంటే ఉన్న నాలుకను ఊడబెరికాడు - అన్నది సామెత! ఈ సామెత చైనాతో మన వాణిజ్య సంబంధాలకు చక్కగా అన్వయవౌతోంది. చైనా నుండి దిగుమతి అవుతున్న ‘ప్లాస్టిక్’ దారం - మాంజా - వల్ల జరుగుతున్న అనర్థాల గురించి గత నాలుగేళ్లుగా ప్రచారమైంది. ఈ ‘మాంజా’ను వాడరాదన్న ప్రభుత్వపు ఉత్తరువులు అమలు జరగడం లేదన్నది బహిరంగ రహస్యం. ‘దారం’ వాడకాన్ని నిషేధించడం వల్ల సమస్య సమసిపోదు, దారం చైనానుండి దిగుమతి కాకుండా నిరోధించాలి - అన్నది జరిగిన ప్రచారం! కానీ ‘దారం’ పెద్ద సమస్య కాదని ఇప్పుడు తేలిపోయింది. ఎందుకంటె లక్షల సంఖ్యలో గాలిపటాలే చైనా నుంచి దిగుమతి అవుతున్నాయట! వీటి పోటీకి తట్టుకోవడం స్వదేశీయ ఉత్పత్తిదారులకు అసాధ్యమైపోయింది. అందువల్ల ఈ కుటీర పరిశ్రమలు ఒకటి తరువాత ఒకటిగా మూతపడిపోతున్నాయి. ఈ విపరిణామం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రప్రభుత్వానికి ఆందోళన కలిగించి ఉండాలి. కానీ ప్రభుత్వాలు ఆందోళకు గురి అవుతున్న జాడ లేదు! కేంద్రప్రభుత్వం ‘్భరత్‌లో నిర్మించండి’ - మేక్ ఇన్ ఇండియా - అన్న స్వదేశీయ పారిశ్రామిక స్ఫూర్తిని మూడేళ్లుగా ప్రచారం చేస్తోంది. కానీ దేశవ్యాప్తంగా గాలిపటాల - పతంగ్‌ల -ను తయారు చేస్తున్న వేలాది కుటీర పరిశ్రమల వారు దివాలా తీస్తుండడం ఈ స్ఫూర్తికి పొంతన కుదరని కఠోర వాస్తవం. ప్రపంచీకరణ మాయాజాలంలో రెండు దశాబ్దులుగా తగుల్కొని ఉన్న ప్రభుత్వాలను విదేశీయుల ‘పెట్టుబడి’ బంగారు జింక వలె మురిపిస్తోంది. ఈ మైమరపునకు గురి అయి ఉన్న ప్రభుత్వాలు నిరంతరం విదేశాల నుంచి పెట్టుబడులను, బహుళ జాతీయ సంస్థలను మన దేశానికి తరలించుకొని రావడంలో తలమునకలై ఉన్నాయి. అందువల్ల పాలకులకు చిన్న పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, కుటుంబ పరిశ్రమలు మూతపడుతున్న సంగతి పట్టడం లేదు. ఆహారశుద్ధి - ఫుడ్ ప్రాసెసింగ్ - పేరుతో ‘బహుళ జాతీయ సంస్థల’ కోసం ఏర్పడుతున్న వాణిజ్య ప్రాంగణాలు ‘కేంద్రీకరణ’ను వ్యవస్థీకరిస్తున్నాయి. అప్పడాలు, వడియాలు, మసాలా దినుసులు, ఆవకాయలు, పళ్ల గుజ్జులు ‘శుద్ధి పద్ధతి’ ద్వారా తయారు చేసి పంపిణీ చేస్తున్న కుటుంబాలు దీనివల్ల ఉపాధిని కోల్పోయాయి, కోల్పోతున్నాయి. చిన్న ఉత్పత్తిదారులు అట్టడుగు వర్గాల వారు ఈ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’తో పోటీ పడలేరు.. దీనికి తోడు చైనాలో తయారయి మన దేశాన్ని ముంచెత్తుతున్న అనవసరమైన వస్తువులు మన ఆర్థిక వ్యవస్థను కుదేలుమనిపిస్తున్నాయి! గాలిపటాలు, గాలిపటాలను ఎగురవేయడానికి అవసరమైన దారం తయారు చేస్తున్న లక్షలమంది చిన్న ఉత్పత్తిదారులు, శ్రామికులు ఉపాధికి దూరమైపోతుండడానికి చైనా వాణిజ్య దురాక్రమణ దోహదం చేస్తోంది. గాలిపటాల వైపరీత్యం ఒక ఉదాహరణ మాత్రమే! మనదేశంలో సంప్రదాయసిద్ధంగా తయారవుతున్న వందల వస్తువులకు పోటీగా చైనా వస్తువులు వెల్లువెత్తుతున్నాయి! వినాయక ప్రతిమలు, దీపావళి ప్రమిదలు కూడ చైనా నుంచి వచ్చేశాయి..
చైనా నుంచి వచ్చిన ప్లాస్టిక్ దారాన్ని గాలిపటాలను ఎగురవేయడానికి వాడడం వల్ల వాతావరణం కాలుష్యగ్రస్తవౌతోందన్న నిర్ధారణ జరిగి ఏళ్లయింది. ఈ దారాన్ని పట్టుకున్న చిన్నపిల్లల చేతులకు పుండ్లు ఏర్పడ్డాయి. ఈ దారం గొంతులకు తగిలి అనేకమందికి గాయాలయ్యాయి. ఆకాశంలో విహరిస్తున్న పక్షులు ఈ దారం తగిలి గాయపడి మరణించాయి! దేశంలో ఈ చైనీయ ‘మాంజా’ను ఉపయోగించడం తాత్కాలికంగా నిలిపివేయాలని ‘జాతీయ హరిత న్యాయమండలి’ - నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ - ఎన్‌జిటి - 2016 డిసెంబర్‌లో ఆదేశించింది. గత ఏడాది జనవరిలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్లాస్టిక్ దారాన్ని రాష్టవ్య్రాప్తంగా నిషేధించింది. గత జూలైలో ‘హరిత న్యాయ మండలి’ తుది తీర్పు చెప్పింది, దేశవ్యాప్తంగా చైనా ‘మాంజా’ను నిషేధించింది! ఈ నిషేధం తరువాత చైనా ‘దారం’ ధరలు మరింత పెరిగాయట! నిషిద్ధ వస్తువు కాబట్టి పోలీసులు, అధికారులు తమను పట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి వ్యాపారులు ఈ ప్రమాదానికి తెగించి ‘్ధర్యంగా అమ్మాలి కాబట్టి ధరలు పెరిగిపోయాయట! కానీ కేంద్రప్రభుత్వం ఈ ‘మాంజా’ దిగుమతిని ఎందుకని ఆపించడం లేదు?? కేవలం వాడకాన్ని నిషేధించడంవల్ల చైనా దారం, యథావిధిగా వచ్చిపడుతున్నది..
పత్తితో, నూలుతో తయారవుతున్న దారం పర్యావరణ సంతులనాన్ని పరిరక్షిస్తోంది. కానీ నూలుదారం ధరలు ప్లాస్టిక్ దారం ధరలకంటె నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయట! అందువల్ల ‘తక్కువ ధరల’ మాయాజాలంలో తగుల్కొన్న వినియోగదారులు ఈ చైనా దారాన్ని కొనేస్తున్నారు. దేశవ్యాప్తంగా తయారవుతున్న ‘నూలు దారం’ అమ్మకాలు తగ్గిపోయాయి. వందలాది కుటీర పరిశ్రమలు మూతపడినాయి. హైదరాబాద్‌లోనే ఇలా నూలుదారం తయారు చేస్తున్న దాదాపు యాబయి దుకాణాలు మూతపడుతున్నాయట! ఇప్పుడు ‘‘పులిమీద పుట్ర’’వలె లక్షలకొలదీ ‘పతంగ్’లు చైనా నుండి వస్తున్నాయి. ఈ ‘ప్లాస్టిక్’ గాలి పటాల పోటీని మనదేశంలోని ‘కాగితం’ గాలిపటాలు తట్టుకోలేవన్నది జరిగిన నిర్ధారణ. అందువల్ల ‘కాగితం’ పతంగ్‌లను తయారు చేస్తున్న చిన్న యజమానులు, కార్మికులు దుకాణాలు మూసివేసి ఇతర ఉపాధులను వెతుక్కోవలసి వస్తోంది! ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తి ఏమయినట్టు?? హైదరాబాద్ ధూల్‌పేట తదితర ప్రాంతాలలో తరతరాలుగా కాగితం ‘పతంగ్’లను తయారు చేస్తున్నవారు గత రెండేళ్లుగా ఉత్పత్తులను సగానికి సగం తగ్గించివేశారట! ‘పతంగ్’లు ఈ వాణిజ్య వైపరీత్యానికి, చైనా వ్యూహాత్మక దురాక్రమణకు, ప్రపంచీకరణ విష ఫలితాలకు ‘ప్రతీక’ మాత్రమే. అసలు వైపరీత్యం చైనాతో మన వ్యాపారం.. 1962లో మన దేశాన్ని దురాక్రమించిన చైనా మనకు శత్రుదేశం! దురాక్రమించిన మన భూభాగాలను చైనా తిరిగి మనకు అప్పగించేవరకూ ఈ శత్రుదేశంతో మనకు స్నేహ సంబంధాలు అవసరం లేదన్నది 1988 వరకూ మన ప్రభుత్వ విధానం. అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ఈ విధానాన్ని భగ్నం చేశాడు! సరిహద్దు వివాదంతో నిమిత్తం లేకుండా చైనాతో మనం సకలవిధ సంబంధాలను పెంపొందించుకోవాలన్నది రాజీవ్‌గాంధీ ప్రభుత్వం మొదలుపెట్టిన ‘పథభగ్న దౌత్యం - పాత్‌బ్రేకింగ్ డిప్లసమీ-!!
ఈ పథభగ్న విధానం కారణంగా చైనా వస్తువులు మనదేశంలోకి చొరబడిపోయాయి. చైనా వస్తువులు అత్యధికంగా దిగుమతి అవుతున్న దేశం మనది. కానీ మన వస్తువులను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం మాత్రం చైనాకాదు. ఫలితంగా చైనాతో జరుగుతున్న వాణిజ్యంలో మనకు ప్రతి ఏటా భారీగా లోటు ఏర్పడుతోంది. ‘లోటు’ ఏర్పడటమంటే మన ‘విదేశీయ వినిమయ ద్రవ్యం - ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ కరెన్సీ - చైనాకు తరలిపోవడమన్నమాట! ఇలా ప్రతి ఏటా సగటున రెండున్నర లక్షల కోట్ల రూపాయలు భారతీయుల శ్రమార్జిత ‘విదేశీయ ద్రవ్యం’ చైనాకు తరలిపోతోంది. ప్రభుత్వం ఆలోచించాలి... జనం యోచించాలి! చైనా వస్తువులు కొంటారా??