క్రీడాభూమి

ఆధిపత్యం కొనసాగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేప్ టౌన్, జనవరి 3: సుమారు మూడేళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన టీమిండియా అదే ఆధిపత్యాన్ని దక్షిణాఫ్రికా టూర్‌లోనూ కొనసాగిస్తుందా లేదా అన్నది ఉత్కంఠ రేపుతున్నది. నిజానికి 2015 జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకూ భారత్ ఎదురులేని జట్టుగా పేరు సంపాదించింది. చాంపియన్స్ ట్రోఫీని మినహాయిస్తే, దాదాపుగా ఆడిన ప్రతి సిరీస్‌నూ, టోర్నీనీ గెల్చుకొని, తనకు తానే సాటి అని నిరూపించుకుంది. లండన్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరినప్పటికీ, తుది పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓడడం ఒక్కటే గత మూడేళ్ల కాలంలో భారత్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2015 వరల్డ కప్‌లో సెమీ ఫైనల్ వరకూ వెళ్లిన భారత్, గత ఏడాది ప్రపంచ టీ-20 చాంపియన్‌షిప్‌లోనూ సెమీస్ చేరింది. మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే, టీమిండియా టెస్టు ఫార్మాట్‌లో తొమ్మిది సిరీస్‌లను గెల్చుకుంది. ఒక సిరీస్‌ను డ్రా చేసుకుంది. మొత్తం మీద 12 ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తొమ్మిది విజయాలను నమోదు చేసింది. మూడు సిరీస్‌లను చేజార్చుకుంది. ఈ మూడు సిరీస్‌లు వరుసగా బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో 2015లో జరిగినవే. అంటే, 2016, 2017 సంవత్సరాల్లో భారత్ ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోలేదు. ఈకాలంలో ఎనిమిది సిరీస్‌లు ఆడి, అన్నింటినీ తన ఖాతాలో వేసుకుంది. టీ-20 ఇంటర్నేషనల్స్ ఫార్మాట్‌లో కొంత వెనుకబడినప్పటికీ, మొత్తం 13 సిరీస్‌ల్లో ఎనిమిది విజయాలను సాధించగలిగింది. రెండు సిరీస్‌లు డ్రాకాగా, మూడు సిరీస్‌ల్లో మాత్రమే పరాజయాలను ఎదుర్కొంది. ఇందులో రెండు పర్యాయాలు భారత్‌పై వెస్టిండీస్ విజయాలను నమోదు చేసింది. మరొకటి, దక్షిణాఫ్రికా చేతిలో, 2015లో, మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ఎదురైంది.
మొత్తం మీద 2015 జనవరి ఒకటి నుంచి భారత్ అన్ని ఫార్మాట్స్‌లో కలిపి 135 మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 87 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. 36 మ్యాచ్‌లను కోల్పోయింది. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఫలితాలు తేలలేదు. మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అంటే, టీమిండియా 64.44 శాతం మ్యాచ్‌లను గెల్చుకుంది. అదే కాలానికి గణాంకాలను పరిశీలిస్తే, భారత్ తర్వాత న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు 118 మ్యాచ్‌లు ఆడి, 69 విజయాలు సాధించింది. దక్షిణాఫ్రికా 116 మ్యాచ్‌ల్లో 68 మ్యాచ్‌లను కైవసం చేసుకుంది. ఈ గణాంకాలే భారత్ ఆధిపత్యం ఏ తీరులో కొనసాగిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్ టెస్టు ఫార్మాట్‌లో నంబర్ వన్ స్థానంలో నిలిచిన భారత్ వనే్డల్లో రెండు, టీ-20 ఇంటర్నేషనల్స్ ఫార్మాట్‌లో మూడు స్థానాల్లో ఉంది.
కోహ్లీ నాయకత్వంలో గత ఏడాది భారత్ అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకుంది. అన్ని ఫార్మాట్స్‌లో కలిపి 47 మ్యాచ్‌లు ఆడి, 38 విజయాలు సాధించింది. వీటిలో 30 వనే్డలుకాగా, 8 టెస్టులు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక విజయాల జాబితాలో భారత్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. 2003లో ఆస్ట్రేలియా జట్టు అన్ని ఫార్మాట్స్‌లో కలిపి 53 మ్యాచ్‌లు ఆడి, 37 విజయాలను నమోదు చేసింది. ఇందులో 7 టెస్టులు, 21 వనే్డలుకాగా, మిగతా 9 టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు. ఏ రకంగా చూసినా, గత ఏడాదిపై తనదైన ముద్ర వేసిన టీమిండియాకు, కొత్త సంవత్సరం ప్రారంభంలోనే సిసలైన పరీక్ష ఎదురుకానుంది. బలమైన టెస్టు జట్లలో ఒకటైన దక్షిణాఫ్రికా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల మధ్య జరిగే టెస్టు సిరీస్ సహజంగానే అందరి దృష్టినీ ఆకట్టుకుంటుంది. టీమిండియాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేకపోయినా, దక్షిణాఫ్రికాలో ఆడాల్సి రావడం వల్ల కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు. అక్కడి వాతావరణానికి, పిచ్‌ల తీరుకు ఆటగాళ్లు ఎంత త్వరగా ఆలవాటు పడతారనే అంశంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తోపాటు ఆరు మ్యాచ్‌ల వనే్డ, మూడు మ్యాచ్‌ల టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్‌లను కూడా టీమిండియా ఆడుతుంది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత, శ్రీలంక, బంగ్లాదేశ్ కూడా పాల్గొనే ముక్కోణపు వనే్డ ఇంటర్నేషనల్ టోర్నీలో ఆడుతుంది. అనంతరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఉంటుంది. టీమిండియాకు ఎంపికైన లేదా ఎంపికయ్యే ఆటగాళ్లంతా దాదాపుగా ఏదో ఒక ఫ్రాంచైజీ తరఫున ఐపీఎల్‌లో ఆడడం ఖాయం. ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు కోసం మరోసారి సవాలుగా నిలిచే ఇంగ్లాండ్ పర్యటన ఎదుచూస్తున్నది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఇంగ్లాండ్‌లో టీమిండియా మూడు టీ-20, మూడు వనే్డ ఇంటర్నేషనల్స్‌తోపాటు ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడుతుంది. ఆతర్వాత, ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లి, అక్కడ బార్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం టెస్టు సిరీస్ ఆడుతుంది.
ఒక రకంగా చెప్పాలంటే, 2017లో భారత జట్టు ఎక్కువ మ్యాచ్‌లు స్వదేశంలో ఆడితే, ఈ ఏడాది అందుకు భిన్నంగా విదేశాల్లో ఆడుతుంది. స్వదేశంలో ప్రత్యర్థి జట్లపై విరుచుకుపడే భారత్ విదేశాల్లో చేతులెత్తేస్తుందనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. 1992లో మొదటిసారి దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దక్షిణాఫ్రికాలో సఫారీలపై ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా గెల్చుకోలేకపోయింది. ఇంత వరకూ అందని టెస్టు సిరీస్‌ను కోహ్లీ సేన సాధించుకొని తిరిగి వస్తుందా? లేక గతంలో మాదిరిగానే రిక్త హస్తాలతో వెనుదిరుగుతుందా? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. కేప్ టౌన్‌లో ఈనెల ఐదు నుంచి మొదలయ్యే మొదటి టెస్టుతో ఆరంభం కానున్న పోరు ఉత్కంఠ భరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తున్నది.

ప్రాక్టీస్ సెషన్‌లో ధావన్ రొటీన్ వామప్