నిజామాబాద్

అయ్యప్ప కమిటీ హాల్‌కు 5లక్షలు * షబ్బీర్ అలీ వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జనవరి 3: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప సేవ సంఘం ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయం పక్కనే నిర్మించనున్న అయ్యప్పకమిటీ హాల్ నిర్మాణం కోసం 5లక్షల రూపాయల నిధులను శాసనమండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌షబ్బీర్‌అలీ మంజూరు చేసినట్లు అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షుడు చీల ప్రభాకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని షబ్బీర్ నివాసగృహానికి వెళ్లి అయ్యప్ప సేవ సంఘం కమిటీహాల్ నిర్మాణం కోసం నిధులు అడగ్గానే ఆయన మంజూరు చేశారన్నారు. హైదరాబాద్ వెళ్లి షబ్బీర్‌అలీని కలిసిన వారిలో మున్సిపల్ మాజీ చైర్మన్లు కైలాస శ్రీనివాస్, యదా అంజయ్య, కౌన్సిలర్‌లు బట్టు మోహన్, కూర శ్రీనివాస్, పిప్పిరి శ్రీనివాస్‌స్వాములు ఉన్నారు.

ముగిసిన నామినేషన్ పర్వం
మద్నూర్, జనవరి 3: మండల కేంద్రంలోని ఎంపిటిసి 2 స్థానానికి 7 నామినేషన్‌లు రాగా, స్క్రూటిని పర్వం సైతం పూర్తి అయినట్లు ఎన్నికల అధికారి కిషన్ బుధవారం తెలిపారు. వివిధ పార్టీల అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థి సైతం నామినేషన్ వేసినవారిలో ఉన్నా రు. ఒక్కొక్కరు రెండు నామినేషన్‌లు దాఖలు చేయగా, గురువారం విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉందని ఎన్నికల అధికారి తెలిపారు. ఎంపిటిసి 2 స్థానానికి బిజెపి ఎంపిటిసి రాజీనామా చేయడంతో ఈ స్థానాన్ని బీజేపీ అభ్యర్ధే కైవసం చేసుకోవాలని దృఢ సంకల్పంతోఉన్నారు. అలాగే అధికార పార్టీ నాయకులు సైతం టిఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపించుకునే ప్రయత్నం ముమ్మరం చేశారు. కాంగ్రేస్ పార్టీ అధికార పార్టీకి ధీటుగాప్రజల్లోకెళ్తామని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇండిపెండేంట్ అభ్యర్థి కూడా నేను సైతం అంటూ రేసులోఉన్నారు.

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
* భూ ప్రక్షాళనపై ఆర్డీవో రాజేశ్వర్
మద్నూర్, జనవరి 3: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన భూప్రక్షాళన కార్యక్రమంలో రైతుల భూముల రికార్డుల నమోదులో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలతోపాటు కేసులు నమోదు చేయడం జరుగుతోందని, బాన్స్‌వాడ ఆర్డీవో రాజేశ్వర్ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని ఎడీవో కార్యాలయంలో జరుగుతున్న పహణీల వేరిపికేషన్ కార్యక్రమాన్ని ఆర్డీవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూప్రక్షాళన టీం లీడర్లతో మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాల్లో సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారన్నా సమాచారంతో ఆకస్మిక తనిఖీ చేయడం జరిగిందన్నారు. ప్రలోభాలకు గురైనట్టు రుజువైతే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలుతప్పవన్నారు. భూరికార్తుల ప్రక్షాళన పూర్తిగా పారదర్శకంగా చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరి ఆదార్ నంబర్‌తోపాటు, పట్ట్టాదార్ పాస్ పుస్తకాల్లోని వివరాలను పరిశీలించాలన్నారు. తహశీల్దార్లు దన్వాల్, ప్రమోద్, ఆర్‌ఐ శీతల్, విఆర్‌ఓలు, విఆర్‌ఎలు తదితరులు ఉన్నారు.

రైతు పక్షపాతి సీఏం కేసీఆర్
* ఎమ్మెల్యే ఏనుగురవీందర్‌రెడ్డి
ఎల్లారెడ్డి, జనవరి 3: సీఏం కేసీఆర్ రైతు పక్షపాతి అని రైతులు ఆర్థికంగా అభివృద్ది సాధించేందుకోసం అహర్నిషలు కృషిచేస్తున్నారని, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి అన్నారు. బుధవారం దేవన్‌పల్లిగేటు వద్దగల పోచారం ప్రధా న కాలువ షట్టర్‌పైకి లేపి, దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పోచారం ప్రాజెక్ట్ నీటిని ఈసారి బీ జోన్‌కు కేటాయించడం జరిగిందన్నారు. యాసంగిలో బి జోన్ రైతులు పంటలు సాగు చేసుకునేందుకోసం నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. నీటిని రైతు లు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అనంతరం నీటిపారుదల శాఖ డీఈఈ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బిజోన్ పరిధి కింద పంటల సాగు కోసం చివరి ఆయకట్టువరకు డిస్ట్రీబ్యూటర్ 45 నుంచి 73వ డిస్ట్రీబ్యూటరీ తిమ్మారెడ్డి వరకు నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నా రు. సోమవారం పోచారం ప్రధాన కాలువ ద్వారా బి జోన్‌కు నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. బుధవారం పెద్దచెరువులోకి నీరు రావడంతో ఎమ్మెల్యే నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. మొత్తం నాలుగు విడతలుగా నీటిని విడుదల చేయడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వి.దేవేందర్‌రెడ్డి, తహశీల్దార్ అంజ య్య, నీటిపారుదల శాఖ ఎఈఈలు కేశవరెడ్డి, మోహన మురళిలు, స్థానిక ఎంపిపి నక్కగంగాధర్, జడ్పీటిసి చినబాలి సామెల్, ఏఎంసి చైర్మైన్ మారెడ్డి వెంకట్‌రాంరెడ్డి, సొసైటీ చైర్మైన్ బోండ్ల సాయులు, కో-ఆఫ్షన్ సభ్యుడు రఫీక్, ఎంపిటిసి సభ్యులు షకవత్‌అలీ, రాజశేఖర్, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, మైనార్టీ అధ్యక్షులు విద్యాసాగర్, వాహబ్,ప్రధాన కార్యదర్శి ప్యాలాలా రాములు, టిఆర్‌ఎస్ నాయకులు మాజీ సొసైటీ చైర్మైన్ సాయాగౌడ్, తిరుపతి, మల్లేష్, బోనగిరి వెంకటేశం, మామిడి అరవింద్‌కుమార్, మోహినోద్దిన్ తదితరులు పాల్గొన్నారు.

మండలాల్లో కలెక్టర్ సుడిగాలి పర్యటన
ఆంధ్రభూమి బ్యూరో
కామారెడ్డి, జనవరి 3: పలు మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, భూప్రక్షాళన పనులను కలెక్టర్ డాక్టర్ సత్యనారాయణ బుధవారం సుడిగాలి పర్యటనలతో పరిశీలించారు. ముందు గా భిక్కనూరు, రాజంపేట్ మండలా ల్లో జరుగుతున్న భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 22మండలాలకు సంబందించి 473 గ్రామాల్లో రికార్డుల ప్రక్షాళన జరుగుతోందన్నారు. అంతట సిబ్బంది వేగంగా పనిచేస్తున్నారని, ఆన్‌లైన్ డాటా ఎంట్రీ జరుగుతోందన్నారు. పిఓటి కింద 12,400ఎకరాలు, బి కేటగిరి కింద, వివాదాలకు సంబంధించిన భూములు కూడ ఈకార్యక్రమం పూర్తికాగానే కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరుగుతోందన్నారు. అక్కడి నుండి కలెక్టర్ హౌజింగ్‌బోర్డులో జరుగుతున్న వైకుంఠదామం పనులను పరిశీలించారు. స్మృతివనం ప్రహారిగోడ పనులను, సమీకృత కలెక్టరేట్ సముదాయాలు పరిశీలించారు. ఆర్డీవో శ్రీను, పంచాయతీరాజ్ అధికారులు, నేషనల్ హైవే ఇంజనీర్ ఇన్ చీప్ గణపతిరెడ్డి, ఇతర శాఖల అధికారులు ఉన్నారు.

బోధన్ టు మహారాష్ట్ర పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా
బోధన్, జనవరి 3: బోధన్ నుండి మహారాష్టక్రు పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వివిధ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఈ జీరో దందాకు బోధన్ చుట్టుప్రక్కల గ్రామాల రహదారులను రాచమార్గాలు గా ఎంచుకుని తమ చీకటి దందాను యధేచ్చగా కొనసాగిస్తున్నారు. ఏకంగా పిడిఎస్ బియ్యాన్ని ఇక్కడి నుండి వాహనాలలో దర్జాగా తరలిస్తున్నారంటే అక్రమ రవాణా ఏస్థాయిలో జరుగుతుందో తెలిసిపోతోంది. నిజామాబాద్ నుండి రెండు వాహనాలలో పిడిఎస్ బియ్యం బోధన్ మీదుగా తరలిస్తున్నారన్న సమాచారంతో బోధన్ ఎసిపి రఘు ఆదేశాలతో బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు బోధన్ ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వర్లు తన సిబ్బందితో శ్రీనివాస థియేటర్ నుండి బెల్లాల్ వెళ్లే రహదారి లో రెండు వాహనాలను పట్టుకున్నారు. బియ్యం బస్తాలతోపాటు వాహనాలను స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్లు ఇచ్చిన సమాచారం మేరకు పిడిఎస్ బియ్యాన్ని మహారాష్టల్రోని బిలోలికి తరలిస్తున్న శేఖ్‌సాజిద్, ముస్తాఖ్, సోమమోహన్, జాఫర్‌లను అరెస్టు చేసి వారిపై చట్టపరంగా కేసు నమోదు చేశారు. బియ్యా న్ని సివిల్ సప్లయ్ అధికారులు శశిభూషణ్, వసంతలకు అప్పగించారు.
రాచమార్గాలపై నిర్లక్ష్యమెందుకో...?
డివిజన్‌లోని మహారాష్టక్రు సరిహద్దులో ఉన్నటువంటి గ్రామాల మీదుగా అక్రమ రవాణాయధేచ్చగా సాగుతున్నా అధికారులు ఈ వైపు కనీసం కనె్నత్తి కూడా చూడకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రెండు రోజులలోనే బోధన్ పోలీసులు కిరోసిన్, పిడిఎస్ బియ్యం రవాణాకు సంబంధించిన వాహనాలను పట్టుకున్నారు. డివిజన్‌లోని ఖండ్‌గాం, కందకుర్తి, పోతంగల్, సాలూరా రహదారులు మహారాష్టక్రు అక్రమ రవాణా చేసేందుకు రాచమార్గాలుగా మారాయి. ఇదిలా ఉండగా గుట్కా, మద్యం, బియ్యం, మద్యం, పప్పుదినుసుల అక్రమ రవాణాకు సంబంధించి కొంత సమాచారం అధికారులకు తెలిసినా దృష్టి సారించక పోవడం విమర్శలకు తావిస్తోంది. రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో తనిఖీలు నిర్వహించినట్లయితే ఈ అక్రమ రవాణాకు కళ్లెం పడే అవకాశం ఉంటుంది.

ఇంటికి పంపలేదని భవనంపై నుంచి దూకిన వైనం
కస్తూర్బా పాఠశాల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబా ద్, జనవరి 3: కోరిన వెంటనే సెలవుపై ఇంటికి పంపలేదనే మనస్థాపంతో కస్తూర్బా పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. పాఠశాలలోనే రెండంతస్తుల భవనంపై నుంచి కిందకు దూకి తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలైంది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఎడపల్లి మండలం బాపునగర్ గ్రామానికి చెందిన శే్వత(13) అనే బాలికను ఆమె తల్లిదండ్రులు నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశ్యంతో సమీపంలోనే ఉన్న రెంజల్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో చేర్పించారు. ఏడవ తరగతి చదువుతున్న శే్వత ఇటీవలే క్రిస్మస్ సెలవుల సందర్భంగా ఇంటికి వెళ్లి వచ్చింది. అయితే మరోమారు ఇంటిపై బెంగ పెట్టుకోవడంతో తనను సెలవుపై ఇంటికి వెళ్లేందుకు అనుమతించాలని ప్రిన్సిపాల్ మమతను కోరింది. అందుకు ప్రిన్సిపాల్ అంగీకరించకపోవడంతో తన ఆరోగ్యం బాగాలేదని, ఇంటికి వెళ్లి వస్తానని ప్రాధేయపడింది. ఇటీవలే క్రిస్మస్ సెలవులకు వెళ్లి రావడంతో ఆమెను ఇంటింకి పంపించేందుకు ససేమిరా కుదరదని ప్రిన్సిపాల్ మమత కరాఖండీగా తేల్చి చెప్పారు. మరో వారం రోజుల్లో సంక్రాంతి సెలవులు వస్తాయని, అప్పుడు ఇంటికి వెళ్లవచ్చని సూచించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శే్వత, పాఠశాలలోని రెండవ అంతస్తు పైకి వెళ్లి ఒక్క ఉదుటన అక్కడి నుండి కిందకు దూకేసింది. అక్కడే ఉన్న సిబ్బంది ఆమెను గమనించి హుటాహుటిన 108 అంబులెన్స్‌లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు శే్వత తలకు బలమైన గాయాలేవీ తగలనప్పటికీ, రెండు కాళ్లు విరిగాయి. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, కాళ్లు ఫ్రాక్చర్ అయ్యి, ఇతర శరీర భాగాల్లో అక్కడక్కడా స్వల్ప గాయాలయ్యాయని వైద్యులు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేష్ జిల్లా ఆసుపత్రిలో విద్యార్థిని శే్వతను పరామర్శించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెలవుపై ఇంటికి వెళ్లేందుకు అనుమతించలేదనే చిన్న కారణంతో అభంశుభం తెలియని వయస్సులో ఉన్న చిన్నారి బలవన్మరణానికి యత్నించడం పలువురిని విస్మయానికి గురి చేసింది.

జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పాటుపై చిగురిస్తున్న ఆశలు
* అశోక్‌ను కలిసిన ఎంపి కవిత
* కేంద్ర కమిటీని పంపాలని విజ్ఞప్తి
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, జనవరి 3: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలో మినీ ఎయిర్‌పోర్టు నిర్మాణం ప్రతిపాదనలు చాలాకాలం నుండి పరిశీలన దశలో ఉండగా, తాజాగా మరోమారు ఎంపి కల్వకుంట్ల కవిత ఈ అంశంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. బుధవారం ఆమె కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్ గజపతిరాజును కలిసి జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. స్థానికంగా ఎయిర్‌పోర్టును నెలకొల్పేందుకు అనువైన పరిస్థితులు, సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు వీలుగా కేంద్ర కమిటీని పంపాలని కోరారు. ఎంపీ విజ్ఞప్తి పట్ల కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు సానుకూలంగా స్పందించారని ఎంపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. దీంతో ఎంపీ కృషి ఫలించి కేంద్ర బృందం సందర్శనకు వస్తే విమానాశ్రయం ఏర్పాటు కల నెరవేరేందుకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. నిజానికి గత కొన్నాళ్ల క్రితమే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్భంగా మంత్రి కేటీఆర్ కూడా కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి జక్రాన్‌పల్లిలో మినీ ఎయిర్‌పోర్టును నెలకొల్పాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. తాజాగా ఇప్పుడు మరోమారు ఎం.పీ కవిత తన ప్రయత్నాలను ముమ్మరం చేయడం ఆశలు రేకెత్తిస్తోంది. జక్రాన్‌పల్లిలో విమానాశ్రయం నెలకొల్పాలనే ప్రతిపాదన గత పుష్కరకాలం క్రితమే తెరపైకి రాగా, ఈ దిశగా అధికార వర్గాల్లోనే ఆశించిన స్థాయిలో కదలిక కనిపించలేదు. దేశ వ్యాప్తంగా అనువైన ప్రాంతాల్లో విమానాశ్రయాలను నిర్మించాలని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించినప్పటికీ, అందులో నిజామాబాద్‌కు స్థానం కల్పించే విషయాన్ని పరిశీలన దశకే పరిమితం చేశారు. ఇదివరకే ఇండియన్ ఎయిర్‌పోర్ట్ అథారిటీకి చెందిన డిప్యూటీ డైరెక్టర్ డీబీ.సింగ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన అధికారుల బృందం జిల్లాకు చేరుకుని విమానాశ్రయం నెలకొల్పేందుకు అనువైన పరిస్థితులను పరిశీలించింది. 44వ నెంబర్ జాతీయ రహదారికి చేరువలో జక్రాన్‌పల్లి మండలంలోని కొలిప్యాక్, బ్రాహ్మణపల్లి, తొర్లికొండ, మనోహరాబాద్, జక్రాన్‌పల్లి గ్రామాల శివార్లతో కూడిన సుమారు 900 ఎకరాల స్థలం ఇక్కడ అందుబాటులో ఉంది. ఇందులో 600ఎకరాలు అసైన్డ్ భూమి కాగా, మరో 300ఎకరాలను అధికారులు గుర్తించారు. అయితే ఎయిర్‌పోర్టు నిర్మాణానికి 1400ఎకరాల స్థలం అవసరమవుతుందని ఎయిర్‌పోర్టు అథారిటీకి చెందిన అధికారుల బృందం పేర్కొనడంతో మిగతా 600ఎకరాలను సైతం భూసేకరణ జరిపేందుకు ఆ సమయంలో జిల్లా రెవెన్యూ అధికారులు సంసిద్ధత తెలిపారు. మనోహరాబాద్ శివారులో స్థలాన్ని పరిశీలించిన ఎయిర్‌పోర్టు అథారిటీ బృందం పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేసి వెళ్లారు. కానీ ఈ ప్రక్రియ పరిశీలన దశకే పరిమితమైంది. తాజాగా మరోమారు దీని ప్రస్తావన రావడంతో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం పట్ల స్థానికుల నుండి కూడా సానుకూల ధోరణే వ్యక్తమవుతోంది. స్థానికంగా విమానాశ్రయం ఏర్పడితే తమ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం సేకరించే భూములకు సరైన రీతిలో నష్టపరిహారం చెల్లించాలని, భూనిర్వాసితులుగా మారుతున్న కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరం భూమి దాదాపు పది నుండి పదిహేను లక్షల రూపాయల వరకు ధర పలుకుతుండగా, భూసేకరణ కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చించాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది. ప్రధాన ప్రతిబంధకంగా కనిపిస్తున్న భూసేకరణ సమస్యను అధిగమిస్తే, స్థానికంగా విమానాశ్రయం ఏర్పాటు కల సాకారం అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం నుండి అత్యధిక సంఖ్యలో గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి ఎంతో వెసులుబాటు లభించడమే కాకుండా, జిల్లా ప్రగతికి ఎయిర్‌పోర్టు దోహదపడనుందని చెప్పవచ్చు.

పేదల కోసం 2.75 లక్షల డబుల్ బెడ్‌రూంలు
* అర్హులకు పక్కాగృహాలు
* కొత్త కాలనీల్లో వౌళిక సదుపాయాల కల్పన
* మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ రూరల్, జనవరి 3: రాష్ట్రంలో డబుల్‌బెడ్‌రూం పథకం కింద 2.75లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపడుతున్నామని, నిజమైన లబ్ధిదారులకే పక్కా గృహాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామ పరిధిలో ఉన్న ఎర్రమన్ను కుచ్చ ప్రాంతంలో 50బెడ్‌రూం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లతో పాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న కాలనీల్లో వారికి కావాల్సిన వౌళిక సదుపాయాల కల్పనకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని, అన్ని రకాల వసతులతో కూడిన పక్కా గృహాలను అందిస్తున్నామన్నారు. పేదలకు పక్కాఇళ్లను మంజూరు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని, సొంతింటి కళను సాకారం చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం. కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని, పల్లె, పట్టణ ప్రాంతాల అభివృద్ధికి పాటు పడుతున్నారని చెప్పారు.ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడు వెన్నంటి ఉంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూంల నిర్మాణాలు బాన్సువాడ నియోజకవర్గంలో శరవేగంగా సాగుతున్నాయన్నారు. జిల్లాలో డబుల్ నిర్మాణాల్లో బాన్సువాడ ఆదర్శంగా నిలిచిందన్నారు. సెగ్మెంట్‌లో3వేల ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. పనులను పరుగు పెట్టించే విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని ఆయన తెలిపారు. డబుల్ నిర్మాణాలకు గుత్తెదారులు ముందుకు రాకపోవడంతో స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లను అప్రమత్తంచేసి పనులను మొదలుపెట్టించి పనులను వేగవంతంగా జరిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు బైరాపూర్, అక్బర్‌నగర్, దోమలెడ్గీ ప్రాంతాలలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు పూర్తికాగా, బాన్సువాడ పట్టణంలోని వీక్లీ మార్కె ట్ ప్రాంతంలో కూడా ఇళ్ల నిర్మాణాలు దాదాపుగా పూర్తి అయ్యాయని తెలిపారు. అదేవిధంగా బీడీ వర్కర్స్ కాలనీలో కూడా ఇళ్లు పూర్తయ్యే దశకు వచ్చాయని, తాడ్కోల్ శివారు ప్రాంతంలోకూడా డబుల్ నిర్మాణాలు వేగవంతంగా నడుస్తున్నాయని చెప్పా రు. పనులను పంచాయితీరాజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనుల్లో నాణ్యతను పరిశీలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు. బాన్సువాడ మండలంలోని కృష్ణానగర్ తండాలో డబుల్ ఇళ్లు సుందరంగాతయారయ్యాయని రాష్ట్రానికి అవి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. ప్రభుత్వం అందించే డబుల్ పైకంతో పాటు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఇళ్లు కట్టుకునే వారికి కూడా అవకాశం కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. ఏళ్ల కాలంగా పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న వారికి డబుల్ బెడ్ రూం పథకంతో పక్కా ఇంటి కళ నెరవేరినట్లైందనీ, సీఎం. కేసీఆర్‌ను నిరుపేద కుటుంబాలు మరిచి పోరన్నారు. కృష్ణానగర్ తండాలో45 వరకు గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయని తాను తండాను సందర్శించినప్పుడు పూరి గుడిసెల్లో తమ జీవనాలు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారని, అందుకు చలించి తాను డబుల్ ఇళ్లు కట్టుకునేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. మొదటి విడతగా 34 డబుల్ ఇళ్లకు అనుమతులు మంజూరు చేశామని, ఇప్పటికీ 20 ఇళ్ల వరకు పూర్తి కాగా, మరికొన్ని ఇళ్లు ప్లాస్టరింగ్ వరకు చేరుకున్నాయని ఆయన వివరించారు. డబుల్ నిర్మాణాల్లో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గుత్తెదారులను ప్రోత్సహిస్తూ పనులను పూర్తి చేసే విషయంలో ప్రత్యేక చొరవను చూపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీఓ రాజేశ్వర్, గ్రామ సర్పంచ్ గంగారాంతో పాటు టీఆర్‌ఎస్ నాయకులు నార్ల సురేష్, అంజిరెడ్డి, జంగం గంగాధర్, ఎజాజ్ తదితరులు ఉన్నారు.