నల్గొండ

9మంది ఎస్‌ఐలకు పదోన్నతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జనవరి 3: జిల్లాలోని పలు స్టేషన్లలో పని చేస్తున్న 9 మంది ఎస్‌ఐలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్పీ డివి.శ్రీనివాసరావు సీఐలుగా పదోన్నతి కల్పించారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన సురేశ్‌బాబు, శివకుమార్, బాలగోపాల్, వీడీఆర్‌ఎల్.ప్రసాద్, పీయండి.ప్రసాద్, అయోధ్య, గౌరీనాయుడు, యాలాద్రి, ప్రసాదరావులను జిల్లా కార్యాలయంలో ఎస్పీ ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పదవులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, సక్రమమైన మార్గంలో విధులు నిర్వర్తించి పోలీస్ వ్యవస్థకు మంచి పేరు తీసుకరావాలన్నారు.
రైలు కింద పడి బిటెక్ విద్యార్థి బలవన్మరణం
మిర్యాలగూడ టౌన్, జనవరి 3: మిర్యాలగూడ పట్టణం గణేష్‌నగర్‌కు చెందిన వెంజర్ల సురేష్ (24) బి.టెక్ విద్యార్ధి బుధవారం తెల్లవారుజామున రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బి.టెక్ పూర్తి చేసి ఎం.టెక్ కోచింగ్‌లో ఉన్న సురేష్ మంగళవారం సాయంత్రం 7 గంటలకు ఇంటినుంచి వెళ్లాడని తిరిగి రాలేదని తండ్రి యాదయ్య పేర్కొన్నాడు. తెల్లవారు జామున 5.30 నిమిషాలకు రైల్వే స్టేషన్ మాస్టరు రైల్వే పోలీసులకు వాటర్‌ట్యాంక్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై మృతదేహం ఉందన్న విషయాన్ని తెలియజేయడంతో వెంటనే రైల్వే పోలీస్ ఎస్‌ఐ అచ్యుతం సంఘటన స్థలానికి వెళ్లారు. అతని జేబులో ఉన్న ఆధారాలను బట్టి తెలుసుకుని తండ్రి యాదయ్యకు సమాచారం ఇవ్వగా ఆయన వచ్చి గుర్తించారని ఏస్‌ఐ అచ్యుతం తెలిపారు. నోటుబుక్‌లో సూసైడ్ నోట్ రాసుకున్నాడని ఎస్‌ఐ తెలిపారు. తన చెల్లెలను మంచిగా చూసుకోవాలని, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతఙ్ఞతలు తెలిపాడని, ఆత్మహత్యకు కారణాలను వివరించలేదన్నారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
కమ్మేసిన మంచు దుప్పటి
చౌటుప్పల్, జనవరి 3: చౌటుప్పల్ మండల వ్యాప్తంగా బుధవారం ఉదయం మంచు దుప్పటి కమ్మేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలు లైట్లు వేసుకోని నిదానంగా వెళ్లాల్సి వచ్చింది. ఉదయం తొమ్మిది గంటల వరకు మంచు కమ్ముకోని ఉండటంతో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొమ్మిది గంటల తర్వాత క్రమంగా మంచు తెరలు తొలగిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
మర్రిగూడలో..
మర్రిగూడ : మండల వ్యాప్తంగా గ్రామాల్లోని వ్యవసాయ పొలాలు, రహదారులు, గుట్టలు మంచు దుప్పటిలో మునిగిపోయాయి. బుధవారం ఉదయం 9 గంటల వరకు కూడా మంచు కురుస్తుండటంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పొలం వద్దకు వెళ్లే వ్యవసాయ కూలీలు మంచులో వెళ్తూ ఒకింత అనుభూతిని పొందారు.

విపక్ష నేతలకు
వంద జన్మలెత్తినా అధికారం కల్ల
* ఎమ్యెల్యే గాదరి కిశోర్‌కుమార్
తుంగతుర్తి, జనవరి 3: వంద జన్మలెత్తినా ప్రతిపక్ష పార్టీల నేతలు అధికారంలోకి రాలేరని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్ దెప్పిపొడిచారు. బుధవారం మండలపరిధిలోని కర్విరాల, గానుగుబండ, నాగారం మండలంలోని శాంతినగర్ గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ పాటు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు అధికారం కోల్పోయి ప్రభుత్వంపై విచక్షణారాహిత్యంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడున్నర ఏళ్లలో 365 సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెరగని ముద్ర వేశారన్నారు. కుంటిసాకులతో ప్రజల మద్యకు వచ్చే ప్రతిపక్షాలు వంద జన్మలెత్తినా ఆముద్రను చెరిపివేయలేరని అన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న పధకాలు మిగతా రాష్ట్రాల వారికి ఆదర్శంగా నిలిచాయని వివరించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 22.10కోట్ల వ్యయంతోసిసి రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలోజిల్లా టెలికాం బోర్డు సభ్యులు గుండగాని రాములు గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు గుడిపాటి సైదులు, నాయకులు నల్లు రాంచంద్రారెడ్డి, తేజానాయక్, తాటికొండ సీతయ్య, శ్రీశైలం, కరుణాకర్, వెలుగు సైదులు, వెలుగు లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.
గాయపడ్డ కార్యకర్తలకు ఎమ్మెల్యే పరామర్శ
గానుగుబండ గ్రామంలోఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడిలోగాయపడ్డ టీఆర్‌ఎస్ కార్యకర్త శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే కిశోర్‌కుమార్ పరామర్శించారు.

సూర్యాపేట జిల్లాలో
19,546 ఎకరాల ఖాళీ సర్కారు భూములు
సూర్యాపేట, జనవరి 3: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల శుద్దికరణ పూర్తికావడంతో జిల్లాలో ఉన్న భూముల లెక్కలన్నీ తేలాయి. గడువుకు ముందే జిల్లాలో పరిశీలనను పూర్తిచేసిన యంత్రాంగం తమ పరిశీలనలో గుర్తించిన అన్ని రకాల భూముల సమగ్ర వివరాలతో తుది నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. గత ఏడాది సెప్టెంబర్ 15వతేదీన రాష్టవ్య్రాప్తంగా ప్రారంభమైన ఈకార్యక్రమం డిసెంబర్ 30 నాటికి ముగిసింది. కాగా సూర్యాపేట జిల్లాలో మాత్రం జిల్లా రెవిన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి 12 రోజుల ముందుగానే భూపరిశీలన ప్రక్రియను పూర్తిచేసి ఆదర్శంగా నిలిచారు.
జిల్లాలో 8,86,080 ఎకరాలు
నూతనంగా ఏర్పాటైన సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల పరిధిలో 279 రెవిన్యూ గ్రామాల్లో మొత్తం 8,86,080.08 ఎకరాల భూములు ఉన్నట్లు యంత్రాంగం గుర్తించింది. ఈ భూములన్నీంటిని పరిశీలించిన అధికారుల బృందాలు ఇందులో 88,41,865.14 ఎకరాల భూములు ఎలాంటి వివాదాలు లేకుండా స్పష్టంగా ఉన్నట్లు తేల్చారు. 44,214.34 ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేనట్లుగా గుర్తించారు. జిల్లావ్యాప్తంగా 7,80,986 సర్వేనెంబర్లు ఉండగా వాటిలో 7,25,109 సర్వేనెంబర్లు సక్రమంగా ఉన్నట్లు 55,877 సర్వేనెంబర్లు సక్రమంగా లేనట్లుగా గుర్తించడంతో అట్టి భూముల్లో పరిశీలన పూర్తికాలేదు.
జిల్లాలో 6,25,790 ఎకరాల వ్యవసాయ భూములు
భూరికార్డుల శుద్ధీకరణలో జిల్లావ్యాప్తంగా 6,25,790 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు తమ సర్వేలో గుర్తించారు. 48,749 ఎకరాల వ్యవసాయేతర భూములు ఉన్నట్లు తేల్చారు. 83,594 ఎకరాల ప్రభుత్వ భూమిగా గుర్తించారు. వీటిలో 32,662 ఎకరాల ప్రభుత్వ భూమి పేదలకు పంపిణీ చేయగా వారివద్దే భూములు ఉన్నట్లు నిర్ధారించారు. జిల్లాలో ఇంకా 19,546 ఎకరాల ప్రభుత్వ భూములు ఖాళీగా సాగుయోగ్యం కానివిగా ఉన్నట్లు పరిశీలనలో గుర్తించారు. 26,347.19 ఎకరాల అటవీభూములు, 4,559.19 ఎకరాల దేవాదాయ భూములు, 615.29 ఎకరాల వక్ప్‌భూములు ఉన్నట్లుగా నివేదిక రూపొందించారు.
44,214.34 ఎకరాల భూములు వివాదాస్పదం
భూరికార్డుల శుద్ధీకరణలో భాగంగా అధికారులు పరిష్కరించని భూములు వివాదాస్పదంగా ఉన్నట్లు నిర్ధారించారు. జిల్లావ్యాప్తంగా 44,214.34 ఎకరాల భూములు వివిధ కారణాల వల్ల వివాదాల్లో ఉన్నట్లు సర్వేద్వారా గుర్తించారు. వీటిలో సివిల్‌కోర్టు కేసుల్లో 3,646.08 ఎకరాలు, రెవిన్యూ కోర్టు కేసుల్లో 1,473.09, అటవీ భూముల సరిహద్దు వివాదాల్లో 705.19 ఎకరాలు, టీవోటీ కేసులు, అసైన్డ్ కేసుల్లో 7,086.24 ఎకరాలు, ప్రభుత్వ శివారు, జమేదారి భూములు 145.15 ఎకరాలు, సాదాబైనామా 629.08 ఎకరాలు, కుటుంబాల మధ్య సర్వేనెంబర్లు తదితర వివాదాల్లో 8,876.19 ఎకరాలు, భూవిస్తీర్ణంలో తక్కువలు, ఎక్కువలుగా 21,652.12 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు.
సమగ్ర వివరాలు సేకరించాం
* జేసీ డి.సంజీవరెడ్డి
జిల్లాలో భూరికార్డుల శుద్ధీకరణను పకడ్బందీగా చేపట్టి సమగ్ర వివరాలను సేకరించాం. ఎక్కడా తప్పులు దొర్లకుండా వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులు సమన్వయం చేసి వివరాలు నమోదుచేశాం. జిల్లావ్యాప్తంగా ఉద్యోగులంతా సమిష్టిగా పనిచేయడంతో గడువుకు ముందుగానే పరిశీలనను పూర్తిచేయగలిగాం. పరిశీలన అనంతరం జిల్లాసమగ్ర భూవివరాల నివేదికను రూపొందించాం. రికార్డుల పరిశీలనలో చేపట్టిన భూముల సర్వేవివరాలన్నీంటిని కంప్యూటరీకరణ చేపడుతున్నాం. గుర్తించిన అటవీ, దేవాలయ, వక్ప్‌భూముల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నాం.

సుందర పుణ్యక్షేత్రంగా
చెర్వుగట్టు అభివృద్ధి

నార్కట్‌పల్లి, జనవరి 3: సుందర పుణ్యక్షేత్రంగా చెర్వుగట్టు బాసిల్లుతూ తెలంగాణకే తలమానికంగా గుర్తింపు సాధించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టులో జరిగిన శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలోని దేవాలయాలన్నీ అభివృద్ధిలోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. దేవాలయాల్లో ధూప, దీప, నైవేధ్యాలకు నిధులందించి వాటి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న యాదగిరిగుట్ట క్షేత్రాన్ని దేశంలోని దేవాలయాల్లో ప్రముఖ దేవాలయంగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషి మాటల్లో చెప్పలేనిదని, అదేవిధంగా చెర్వుగట్టు క్షేత్రాన్ని తీర్చిదిద్దేందుకు అవసరమైన సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెర్వుగట్టులో పర్యటించే వీలుందన్నారు. ఇప్పటికే చెర్వుగట్టు క్షేత్రం మహిమలు వర్ణించలేమని, అమావాస్యలాంటి పుణ్యరోజుల్లో లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారని, అలాంటి సమయాల్లో ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు నూతన పాలక వర్గం సౌకర్యాలు మెరుగుపర్చాలని, అందుకు తన సహకారం అందిస్తానన్నారు. చెర్వుగట్టు దర్శనంతో తన మనసు పులకరించిందని తెలిపారు. క్షేత్రంలో సౌకర్యాలు మెరుగుపరిచి భక్తుల సంఖ్య రెట్టింపు అయ్యేలా పాలక వర్గం నిబద్ధతతో పని చేయాలని సూచించారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ చెర్వుగట్టు క్షేత్రం మహిమాన్విత క్షేత్రమని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా పాలక వర్గం కృషి చేయాలన్నారు. కాగా నూతనంగా నియామకమైన చైర్మన్ నల్లా వెంకన్న, ధర్మకర్తలు యామ దయాకర్, విజయలక్ష్మి, కొల్లూరి శ్రీనివాసులు, బిక్షం, నాంపల్లి శ్రీనివాస్, మేకల వెంకట్‌రెడ్డి, రేగట్టె నర్సింహారెడ్డిలతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు రామలింగేశ్వర స్వామితో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత మంత్రికి దేవస్థాన అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి అనంతరం ఆలయ పూజారులు స్వామి వారి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డి, ఆర్డీవో వెంకటాచారి, ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సర్పంచ్ రమణ బాలకృష్ణ, ఎంపీటీసీ నల్లా అనిత, నార్కట్‌పల్లి సర్పంచ్ పుల్లెంల అచ్చాలుగౌడ్, మండల టీ ఆర్‌యస్ అధ్యక్షుడు సత్తయ్య, ఎంపీడీవో సురేశ్, చెర్వుగట్టు ఈ వో అంజనారెడ్డి, సూపరింటెండెంట్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేదరికాన్ని జయించి సంకల్పాన్ని సాధించిన నల్లా
వయసులో చిన్నా.. పేదరికం అభివృద్ధికి అడ్డుగోడ.. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో తాను నమ్ముకున్న జడల రామలింగేశ్వరుడికి సేవ చేయాలన్న సంకల్పాన్ని జయించగలిగాడు నేడు ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ నల్లా వెంకన్న. అంతే కాదు చెర్వుగట్టుకే ఆనవాయితీగా వస్తున్న చైర్మన్ పదవిని పక్క గ్రామమైన ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి దక్కించుకోవడంలో కూడా రికార్డు సాధించాడు. సామాన్య కుటుంబంలో జన్మించిన నల్లా వెంకన్న పేదరికంతో జీవనం కొనసాగిస్తూనే ఎంతో మంది గ్రామంలో నైపుణ్యం కలిగిన రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ ప్రజలకు చేరువై మన్ననలు పొంది తన భార్య నల్లా అనితను ఎంపీటీసీగా గెలిపించుకొని రికార్డు సృష్టించాడు. అంతటితో ఆగకుండా తాను నమ్ముకున్న రామలింగేశ్వర స్వామికి సేవ చేయాలన్న ఆత్మవిశ్వాసంతో టీఆర్‌ఎస్ పార్టీలో కీలక వ్యక్తిగా కృషి చేసి మంత్రి, ఎమ్మెల్యే మన్ననలతో చైర్మన్‌గా ఎంపికై రికార్డు సృష్టించి సంకల్పం ఉంటే పేదరికాన్ని జయించవచ్చని నిరూపించాడు.

బయోమెట్రిక్ విధానంతో సరకుల సక్రమ సరఫరా
* పౌరసరఫరాల రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వరరావు
మిర్యాలగూడ టౌన్, జనవరి 3: ప్రజాపంపిణీ వ్యవస్థలో నిత్యావసర వస్తువుల పంపిణీలో సక్రమ సరఫరాకై బయోమెట్రిక్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నదని రాష్ట్ర పౌరసరఫరాల డిప్యూటీ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం స్థానిక సాయినాధ్ ఫంక్షన్‌హాలులో మిర్యాలగూడ, త్రిపురారం, దామరచర్ల, హాలియా, వేములపల్లి మండలాల డీలర్లకు ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ-పాస్)పై ఒక రోజు శిక్షణ కార్యక్రమం, ఈ-పాస్ మెషిన్‌ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డీలర్లకు వెయింగ్ మెషిన్లతో పాటు బయోమెట్రిక్ మెషిన్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. రేషన్‌కార్డు దారుల ఆధార్ నంబర్‌తో తీసుకోవాలని రేషన్ ఇచ్చే సమయంలో వారి వేలిముద్రలు సేకరించాలన్నారు. వేలి ముద్రలు రాని సమయంలో ఐరిష్ నమోదు చేసుకోవాలన్నారు. అదే విధంగా ఎన్ని కిలోల బియ్యం రేషన్ ఇస్తున్నామో వెయింగ్ మెషిన్ అన్ని కిలోలు అంటు నిరక్షరాస్యులకు వినిపించేలా సౌకర్యం ఉందన్నారు. అదే విధంగా నిత్యావసర వస్తువుల గోదాములలో సీసీ కెమెరాలను బిగిస్తున్నామన్నారు. ఎలాంటి అవకతవకలు లేకుండా నిత్యావసర వస్తువుల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తూకంలో ఎలాంటి ఎక్కువ తక్కువలు కాకుండా చూస్తున్నామన్నారు. బయోమెట్రిక్ విధానం వల్ల నిరుపేదలకు మేలు జరుగుతుందని స్థానిక ఇంచార్జి ఆర్డీఓ గోపాల్‌రావు అన్నారు. సమావేశంలో డీసీఏస్‌ఓ ఉదయ్‌కుమార్, ఏసీఏస్‌ఓ మహమూద్‌అలి, మిర్యాలగూడ, త్రిపురారం, హాలియా తహసీల్దార్లు మాలి కృష్ణారెడ్డి, గణేష్, ప్రమీల, డిప్యూటీ తహశీల్దార్ రఘు పాల్గొన్నారు.

జర్నలిస్టు రాధాకృష్ణకు ఎన్‌ఆర్‌ఐల చేయూత
* వాట్సాప్ మెసేజ్‌కు స్పందన
నాంపల్లి, జనవరి 3: రెండు కిడ్నీలు చెడిపోయి తీవ్ర అనారోగ్యానికి గురైన నాంపల్లి మండల ఆంధ్రభూమి విలేకరి రాధాకృష్ణ రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆంధ్రభూమి ప్రచురించిన ప్లీజ్ హెల్ప్ మీ కథనాన్ని వాట్సాప్‌లో చూసిన ఎన్‌ఆర్‌ఐలు రమేష్ దేవ, జలగం సుధీర్, సద్గురు ప్రసాద్‌లు రాధాకృష్ణ ఇంటికి చేరుకొని ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణతో వారు మాట్లాడుతూ నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో ఫ్లోరోసిస్‌పై అధ్యయనం చేసేందుకు వచ్చామని, ఆరోగ్య పరిస్థితిని వాట్సాప్‌లో చూసి చలించిపోయామని, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తామన్నారు. అదే విధంగా ఎన్‌ఆర్‌ఐల సంఘం తరపున ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రస్తుత వైద్య ఖర్చుల నిమిత్తం 5 వేల రూపాయలను రాధాకృష్ణకు అందజేశారు.