మహబూబ్‌నగర్

ఇంటింటికి నల్లానీరు రాకుంటే గ్రామాల్లోకి రాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం
* కేసుల కారణంగానే ఉదండాపూర్ నిర్మాణం ఆలస్యం
* రిజర్వాయర్ నుండి 1.50లక్షల ఎకరాలకు సాగునీరు
* రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్, జనవరి 3: ఇంటింటికి స్వచ్ఛమైన నల్లానీరు ఇవ్వకుంటే గ్రామాల్లోకి తాను రానని, ఇదే విషయాన్ని తమ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ప్రకటించారని, అంత దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు రాష్ట్రంలో ఎవరూ లేరని అది కేసీఆర్ ఒక్కరేనని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని రాజాపూర్ మండలం కుచర్‌కల్ గ్రామంలో బీసీ, ఎస్సీ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అదేవిధంగా కస్తూర్బాగాంధీ పాఠశాలను మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కుచర్‌కల్, ఖనాపూర్ గ్రామాలతో పాటు వివిధ గ్రామాలకు చెందిన వందలాది మంది కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సమాజంలో అసమానతలను తొలగించడానికి ఆడపిల్లలు చదువుకోవాలని ఎంతగానో తపత్రయపడిన సావిత్రిబాయి పూలేను అందరు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. కుచర్‌కల్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని మరో ఏడాదిలోపు అన్ని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. మరో ఆరునెలల్లోపు కుచర్‌కల్ గ్రామంతో పాటు వివిధ గ్రామాల్లో కృష్ణానది జలాలు ప్రతి ఇంటికి రాబోతున్నాయని స్వచ్ఛమైన నీటిని నల్లాల ద్వారా అందించబోతున్నామన్నారు. మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుందన్నారు. ఒకవేళ తాము 2018లో రాజాపూర్ మండలంలో ఇంటింటికి నల్లాల ద్వారా మంచినీటిని అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ గ్రామాల్లో ఓట్లు అడగమని గ్రామాల్లోకి రామని స్పష్టం చేశారు. ఇది ధైర్యంగా చెబుతున్నామని, తాము కాంగ్రెస్ నాయకుల మాదిరిగా కామని కాంగ్రెస్ నాయకులవి దొంగమాటలని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల నిర్వాకం కారణంగానే పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల్లో జాప్యం జరిగిందని ఇప్పటికే ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు సగం పూర్తి కావల్సి ఉండేదని కాంగ్రెస్ నాయకులు వేసిన కేసుల వల్ల జాప్యం జరిగిందని ఆరోపించారు. ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా జడ్చర్ల నియోజకవర్గంలో దాదాపు 1.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్, టీడీపీ నాయకుల పాలనలో జడ్చర్ల నియోజకవర్గంలో పెచ్చులు తెచిన రోడ్లకు ప్యాచ్‌లు కూడా వేయలేదని ఎద్దెవా చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజాపూర్ నుండి తిరుమలాపూర్ వరకు డబుల్ బీటీరోడ్డును వేస్తున్నామని ఆ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయన్నారు. చెన్నవెల్లి బ్రిడ్జి కోసం పలు గ్రామాల ప్రజలు దశాబ్దాల కాలం పాటు నేడురేపు అని గత పాలకులు ప్రజలను మభ్యపెట్టారని తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రిగా అయ్యాక ప్రత్యేకంగా చొరవ తీసుకుని చెన్నవెల్లి బ్రిడ్జిని మంజూరు చేసి పనులు ప్రారంభించిన ఘనత తమకే దక్కిందన్నారు. బాలానగర్ మండల కేంద్రం నుండి ఉడిత్యాల గ్రామానికి బస్సుద్వారా గానీ ఇతర వాహనాలపై రావాలంటే గంటకుపైగా సమయం పట్టేదని ప్రస్తుతం కేవలం పదినిమిషాల్లో గ్రామానికి చేరుకుంటున్నామని రోడ్డును బాగుచేసినందునే వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు తీరాయన్నారు. రాబోయే కాలంలో భూముల రిజిస్ట్రేషన్‌లో కూడా బారీ సంస్కరణలు రాబోతున్నాయని ఇక తహశీల్దార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారని అందుకు లోతుగా చర్చిస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమం కోసం దేశంలోనే 40వేలకోట్లతో సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. అనంతరం రాజాపూర్ గ్రామంలో విశ్వబ్రాహ్మణుల నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాగ్యమ్మ, జడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ సుగుణమ్మ, నాయకులు లక్ష్మణ్‌నాయక్, పాండురంగయ్య, ఆనంద్‌గౌడ్, రాంమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

పెత్తందార్ల వ్యవస్థను రూపుమాపాలి
* బీసీలు రాజ్యాధికారం వైపు అడుగాలి
* రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయగౌడ్
ధరూర్, జనవరి 3: పెత్తందార్ల వ్యవస్థను రూపుమాపడం కోసం మనం మారాలి, బీసీలు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయగౌడ్ అన్నారు. నడిగడ్డ యువత ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 187వ జయంతి సందర్భంగా బుధవారం ధరూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సదస్సుకు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయగౌడ్, జడ్పి ఛైర్మన్ బండారి బాస్కర్, మార్కెట్ యార్డు చైర్మన్ బండ్ల లక్ష్మీదేవమ్మ, ధరూర్ జడ్పీటీసీ పద్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సావిత్రిబాయి పూలే 187వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా జడ్పీచైర్మన్ మాట్లాడుతూ చదువుల తల్లి సావిత్రి బాయిపూలే సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. దేశంలోనే మొట్ట మొదటి ఉపాధ్యాయురాలు మహిళా ఉద్యమాలు నిర్వహించి అనేక హక్కులను సాధించిన పోరాట యోధురాలు సావిత్రిబాయి పూలే అని ఆమె స్ఫూర్తితో మహిళలు తమ హక్కుల కోసం సాధన కోసం ఉద్యిమించాలని పిలుపునిచ్చారు. అనంతరం బీసీ కమిషన్ సభ్యుడు డాక్టర్ ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ నడిగడ్డలో బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడాలని సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో అనేక వరాలు ఇచ్చారని, కాని మనం మారాలని, మనం మారకుండా ఇక్కడున్న పెత్తందార్ల వ్యవస్థ గుప్పిట్లో నుంచి బయటికి వచ్చినప్పుడే మనలో మార్పు వస్తుందని, పేదవారిని ఆదరిద్దాం, రాబోయే రోజులలో మార్పు తీసుకవచ్చి చరిత్రను సృష్టించి వారికి బుద్ధి చెబుద్దామని సూచించారు. గతంలో పాలమూరు జిల్లాలో పేద బీసీలకు టికెట్లు ఇస్తే అక్కడున్న పెత్తందార్లను ఓడించి చరిత్ర సృష్టించారన్నారు. కాని నేటి రాజకీయ అధినేతలు డబ్బుల కోసం పెత్తందార్లకే బీఫారం టికెట్లు ఇస్తున్నారని, రాబోయే రోజులో వేలామందితో పెద్ద సమావేశం పెట్టి బడుగులకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేయాలి, లేకపోతే డిపాజిట్లు రాకుండా గల్లంతు చేస్తామని హెచ్చరించాలని తెలిపారు. రాబోయే రోజులో ఎవరికి భయపడకుండా ఇదే చైతన్యంతో నడిగడ్డ యువత జిల్లా ప్రజలను చైతన్య పరిచి ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ అధ్యక్షుడు గట్టు తిమ్మప్ప, పీఏసీ చైర్మన్ సీసల్ వెంకట్‌రెడ్డి, నడిగడ్డ యువత జిల్లా అధ్యక్షుడు చక్రధర్ రెడ్డి, వివిధ మండలాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

24 గంటల విద్యుత్‌తో రైతులకు మేలు
* మంత్రి జూపల్లి
వీపనగండ్ల, జనవరి 3: రైతులకు 24గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న దేశంలో తెలంగాణ రాష్టం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం వీపనగండ్లలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి హజరయ్యారు. ముందుగా టీఎమ్మార్పిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చదువుల తల్లి సావిత్రి బాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశంలోమాట్లాడుతూ గతంలో రైతులు విద్యుత్ కోసం పొలాల వద్దనే పడిగాపులు గాసేవారని, కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందొ తెలియని పరిస్థితి వుండేదని అన్నారు. నేడు దేశంలోనే 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా అమలు చేశారని కొనియాడారు. రైతులు స్వచ్ఛందంగా ఆటోమేటిక్ స్టాటర్లను తొలగించి విద్యుత్ అధికారులకు సహకరించాలన్నారు. వాటిని తొలగించిన రాష్ట్రంలోనే వీపనగండ్ల మండలం ఆదర్శంగా నిలవాలని కోరారు. అలాగే మిషన్ భగీరథ పనులు కూడా పూర్తి కావచ్చాయని, ప్రతి ఇంటికి వంద లీటర్ల రక్షిత మంచినీటిని అందించడం జరుగుతుందన్నారు. గ్యాస్ కనెక్షన్ లేనివారికి ప్రతి ఇంటికి సర్వే చేసి గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని తహశీల్దార్ రమేష్‌రెడ్డికి ఆదేశించారు. మహాత్మగాంధీ కలలు గన్న స్వరాజ్యం రావలంటే స్వచ్ఛగ్రామంగా స్వచ్ఛ తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ప్రతి గ్రామ పంచాయతీని శుభ్రపరుచుకోవాలన్నారు. శ్మశాన వాటికలలో వైకుంఠ ధామాలు పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి నిరుపేదలకు రేషన్ కార్డులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పుల సంఖ్య పెరగడమే కాక రోగులకు మెరుగైన సేవలందుతున్నాయని, గ్రామాలలో దోమల నివారణ కోసం పంచాయతీల నిధుల నుంచి ఫాకింగ్ మిషన్లను కొనుగోలు చేయాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా గ్రామాలలో వేసే పైపులైన్ కోసం రోడ్లను తవ్విన తరువాత వాటిని బాగుచేసే బాధ్యత ఆ కాంట్రాక్ట్‌లే చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే రెండు సంవత్సరాలలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు టీఆర్‌ఎస్ మండల నాయకులు ఎత్తం కృష్ణయ్య బైక్ ప్రమాదంలో గాయపడటంతో మంత్రి పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్డీవో గణేష్, ఆర్డీవో చంద్రయ్య, ఎంపీడీవో సుజాత, తహశీల్దార్లు రమేష్‌రెడ్డి, నదిం, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.

రైతును రాజుగా మార్చేందుకు చర్యలు
మార్కెటింగ్ శాఖలో అనూహ్యమైన మార్పులు
* ఇ-నామ్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి

జడ్చర్ల, జనవరి 3: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర మార్కెటింగ్‌శాఖలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయని రాష్టవ్రైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ఆన్‌లైన్ ద్వారాప్రారంభించిన ఐదింటిలో ఒకటైనా ఈ-నామ్ కేంద్ర భవనాన్ని మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులను రాజులుగా మార్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. రైతు లేనిదే రాజ్యం ఉండదని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ప్రయోజనం చేకూర్చే శాఖలన్నింటిలో మార్పులు తీసుకువచ్చారన్నారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రిగా అనుభవజ్ఞుడైన హరీశ్‌రావు బాధ్యతులు చేపట్టిన తరువాత మార్కెటింగ్ శాఖలో అనూహ్యమైన మార్పులు వచ్చాయన్నారు. మార్కెట్‌లలో రైతులు తమకు మద్దతు ధర లభించకుంటే తమ పంటలను భద్రపరుచుకునేందుకు అవసరమైన మేర గోదాంలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అంతేకాక రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకుగానూ నేరుగా ప్రభుత్వమే మహిళా మండళ్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పంటలను కొనుగోలు చేస్తుందన్నారు. అదేవిధంగా 24 గంటల పాటు నిరంతరాయంగా రైతులకు విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తమదేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ తమ పబ్బంగడుపుకోవాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. తమ వైఖరిలో మార్పు తెచ్చుకోకుంటే ఆపార్టీ నాయకులకు పుట్టగతులుండవని హెచ్చరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శోభగోవర్థన్ రెడ్డి, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి,నాయకులు గోవర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అన్నదాతలు.. ఆపోహలొద్దు..
* క్వింటాల్ కందులు రూ.5450 బండారి భాస్కర్
* పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్మన్
గద్వాలటౌన్, జనవరి 3: అన్నదాతలూ అపోహలకు గురి కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో కందులు కిల్లో నుంచి ఎంత మొత్తంలో తీసుకవచ్చిన కొనుగోలు చేస్తుందని ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆవరణలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల కన్న తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, యావత్ భారత్‌దేశం గర్వించేలా అన్నదాతలకు 24 గంటలు ఉచిత విద్యుత్ అందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నీ ఆయన కొనియాడారు. గత ప్రభుత్వాలు కరెంటు మేమే తయారు చేసినామని పొగడ్తలు చెప్పేవాళ్లు నాడు రైతులకు ఎందుకు ఉచిత విద్యుత్ ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ప్రారంభించిన కొనుగోలు కేంద్రంలో నిబంధనల మేరకు రైతులు కందులను విక్రయించి క్వింటాలుకు రూ.5450 చొప్పున మద్దతు ధరను పొందాలని అన్నారు. కందులో 12శాతానికి మించి తేమ, 2శాతం కంటే ఎక్కువ వ్యర్థ పదార్థాలు ఉండరాదని చెప్పారు. కొనుగోలు కేంద్రంలో కందుల విక్రయానికి రైతులు పట్టాపాస్ పుస్తకం, వీఆర్వో, ఏవోలు పంట సర్టిపికెట్, బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్ తీసుకరావాలన్నారు. రైతులకు చెల్లింపులు వారివారి ఖాతాలకు నేరుగా జమచేయటం జరగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల మార్కెట్ చైర్మన్ బండ్ల లక్ష్మీదేవమ్మ, వైస్ చైర్మన్ నజీర్, ఎంపీపీ సుభాన్, జిల్లా మార్కెటింగ్ అధికారిణి పుష్పమ్మ, ధరూర్ పీఏసీఎస్ అధ్యక్షుడు సీసల వెంకట్‌రెడ్డి, మార్కెటింగ్ అధికారులు మల్లేషం, మాజీ డీసీసీబి మాజీ ఛైర్మన్ గట్టు తిమ్మప్ప, రైతులు పాల్గొన్నారు.

డబుల్‌బెడ్‌రూం ఇళ్లను
గడువులోగా పూర్తి చేయాలి
* లాటరీ ద్వారా ఈ నెలాఖరునాటికి లబ్ధిదారులకు అందజేత
* మహబూబ్‌నగర్ కలెక్టర్ రోనాల్డ్‌రోస్

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, జనవరి 3: మహబూబ్‌నగర్ జిల్లాలో ఇల్లు లేని నిరుపేదలకు రెండు పడకల ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం నిర్ధేశించిన సమయంలోగా పూర్తి చేయాలని, ఆ దిశగా పనిచేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లు అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో ఏర్పాటు చేసిన రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. అనంతరం కలెక్టర్ రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలు వీరన్నపేట, దివిటిపల్లి, క్రిష్టియన్‌పల్లి పాత పాలమూరు, పాతతోటలో నిర్మాణం జరుగుతున్న ఇళ్ల ప్రగతిపై, పనులలో అలసత్వంపై అధికారులను, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పూర్తయిన ఇళ్లను ఈనెల చివరినాటికి లాటరీ తీసేవిధంగా చూడాలన్నారు. క్రిష్టయన్‌పల్లిలో ఫేస్-2 పనుల టెండర్లు ఎంతవరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. రెండు పడకల గదుల ఇళ్ల లబ్ధిదారులకు అందజేసిన వాటిలో నీటికొరత ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే యుద్ధప్రాతిపాదికన నీటికొరతను తీర్చేందుకు చూడాలని ఆదేశించారు. అర్బన్, రూరల్‌లలో రెండు పడకల గదుల నిర్మాణంలో లబ్ధిదారులను గుర్తించి ఇది మీ ఇల్లు అనేది తెలియజేసినట్లయితే సొంత ఇంటిమాదిరిగా దగ్గరుండి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతారని తెలిపారు. అనంతరం బైపాస్‌రోడ్డు పనుల విస్తరణ పనులు ఎస్‌వీఎస్ నుండి క్రిష్టియన్‌పల్లి వరకు వేగవంతం చేయాలని ఆదేశించారు. సర్వే నంబర్ 19 మాత్రమే అవార్డు పాస్ చేయాల్సి ఉందని, దీనిని వెంటనే పూర్తి చేసి బైపాస్‌రోడ్డు పనులలో ఎలాంటి ఆలసత్వం ప్రదర్శించకుండా నిర్ధేశించిన లక్ష్యంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీనారాయణ, ఆర్‌అండ్‌బీ ఈఈ, ఎస్‌ఈ పంచాయతీరాజ్, హౌసింగ్ పీడీ రమణరావు, అర్బన్ తహశీల్దార్ ప్రభాకర్, సర్వేయర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

నియోజకవర్గ సమస్యలను పరిష్కరించండి
- మంత్రులకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి వినతి
నారాయణపేటటౌన్, జనవరి 3: నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి మంత్రులు, ఉన్నతాధికారులకు విన్నవించారు. బుధవారం నియోజకవర్గ టీఆర్‌ఎస్ నాయకుడు గందె చంద్రకాంత్‌తో కలసి నియోజకవర్గ కేంద్రంలో మంజూరైన రోడ్డు వెడల్పు పనుల వల్ల నష్టపోయిన భాధితులకు నష్టపరిహారం చెల్లించాలని మంత్రి కెటిఆర్‌ను కోరారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్‌ను కలసి నష్టపరిహారం నిధులను విడుదల చేయాలని కోరారు. నారాయణపేట మున్సిపాలిటీ అభివృద్దికి మంజూరు చేసిన అభివృద్ధి పనుల పురోగతి విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బి పనుల పురోగతిపై సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతో చర్చించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి స్మారక సూర్యలక్ష్మీ డిగ్రీ కళాశాలను ప్రభుత్వపరం చేయాలని చేస్తున్న కృషిలో భాగంగా సచివాలయంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆర్.రంజీవ్ ఆచార్యతో సమావేశమై కళాశాలను ప్రభుత్వపరం చేసి ఈ ప్రాంతంలో నిరుపేదలకు ఉచిత ఉన్నత విద్యను అందించే ఏర్పాట్లు చేయాలని కోరారు.
సిడ్నీ దేవాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే చల్లా
వెల్దండ, జనవరి 3: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి సిడ్నీలోని ప్రసిద్ధ మురుగన్ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, భార్య అశ్లీషారెడ్డి, కూతురు మహాక్ష, కుమారుడు కృష్ణాదేవారెడ్డి సుబ్రమణ్యస్వామి, గణపతి, శివపార్వతులను దర్శించుకుని అక్కడి భారతీయులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా భారతీయులతో కలిసి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి కుటుంబ సమేతంగా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
మున్సిపల్ కమిషనర్‌గా రామచందర్‌రావు
మహబూబ్‌నగర్‌టౌన్, జనవరి 3: మహబూబ్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా రామచందర్‌రావు బుధవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. గతంలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన దేవ్‌సింగ్‌నాయక్ స్థానంలో రామచందర్‌రావును నియమించారు. కమిషనర్ దేవ్‌సింగ్‌నాయక్ చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు.
దేవరకద్రలో 17 కేసులు నమోదు
* ఎస్‌ఐ అశోక్‌కుమార్‌రెడ్డి
దేవరకద్ర, జనవరి 3: మండల కేంద్రంలో మంగళవారం రాత్రి జిల్లా ఎస్పీ అనురాధ ఆదేశాల మేరకు ఎస్‌ఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు నిర్వహించగా ద్విచక్రవాహనాలతో పాటు, జీపులు, ఆటోలు, ఇతర వాహనాలు నిలిపి డాక్యుమెంట్లను పరిశీలించి, లైసెన్స్ లేని వారికి, హెల్మెట్లు దరించని వారికి జరిమానాలు విధించారు.
ఏమ్‌వీ యాక్టు కింద 17 కేసులు నమోదు చేసి రూ,7900లు, వసూలు చేసినట్లు ఏఎస్‌ఐ అశోక్‌కుమార్ తెలిపారు. ఇక నుంచి మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా లక్ష్మీంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న కిరాణం దుకాణంలో నిర్వహిస్తున్న బెల్టు షాప్‌ను తనిఖీ చేయగా 13ఓసీ క్వాటర్స్ పట్టుకోని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇక నుంచి గ్రామాలలో బెల్టుషాపులు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.