తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

సమాంతర సాహిత్యం... కావాలి ప్రత్యామ్నాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సమాంతరం’ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయ. దానినే ‘ప్రత్యామ్నాయం’ అని కూడా భావించే వారు ఉన్నారు. సమాంతరం, ప్రత్యామ్నాయం ఏదైనా అంతిమంగా అది ప్రజాసాహిత్యం అనే విస్తృతార్థంలో హాయిగా కలిసే పాయలే. ప్రజలు- పాలకులు, ప్రజలు-పండితులు, ప్రజలు-పరాయికరణ వంటి వ్యతిరేకార్థాలు, చట్రాలు, ఉత్తర దక్షిణ ధృవ తేడాలు కొట్టవచ్చినట్లుగా కనుపిస్తాయి. అలాంటి వ్యవస్థలో ప్రజలపక్షం అనే కేంద్రకం వద్ద నిలబడి చూసినప్పుడు ఒక ప్రత్యేకమైన, విలక్షణమైన దృక్పథం, చూపు, రాజకీయం, ప్రయోజనం సాధించడానికి పై పదాలలో దాగిన భావనలు అవసరం అవుతాయి. అనేక అస్తిత్వాలు, ప్రజాస్వామిక, సామ్యవాద ఆలోచనలకి అనుగుణంగా జరిగే అనేక ఉద్యమాలు, కార్యక్రమాలు, మార్పులు ప్రజానుకూలంగా మారకతప్పదు. చరిత్ర, సాహిత్యం, కళా సాంస్కృతిక రంగాలు నిరంతరం మారుతూంటాయి. ‘మార్పు’ కోసం తపిస్తాయి. ఈ క్రమంలో పలు అవసరాల దృష్ట్యా, వివిధ దశలలో వీటిని పిలుచుకుంటాం. అంతిమంగా వాటిని ప్రజలపరం చేసే ఆశయంలో సాగే ప్రయాణంలో ఇది ఒక అనివార్యమైన స్థితి.
అందుకే అనేక ఆలోచనల సారాంశంగా ఒక బలీయమైన రాజ్యయంత్రం పకడ్బందీగా ఏర్పాటు చేసిన వ్యవస్థ (ప్రధాన స్రవంతి?) ప్రశ్నించడానికి, మార్చడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి సాహిత్యాన్ని చూడాలి. అప్పుడు అనేకమైన ప్రజాసమూహాల అవగాహన మేరకు కొన్ని కాలానుగుణమైన పారిభాషిక పదాలు, పేర్లు ప్రచారంలోకి వస్తాయి. వాటిని ఒకసారి చూద్దాం -
సమాంతర భావనలు, పదాలు..
రాజకీయ దృక్పథంతో సమాజంలో కనిపించే రెండు శక్తులను పాలకులు - పాలితులు, రాజులు - ప్రజలు అని పిలుస్తుంటాం.
సామాజిక కోణంలో ఉన్నతవర్గం - కిందివర్గం, శిష్టులు -సాధారణులు, పట్టణం-పల్లె అని వివిధ రకాలుగా వ్యవహరిస్తాం. కులమతపరంగా అగ్రవర్ణం-క్రింది కులం, వైదికులు-అవైదికులు, బ్రాహ్మణులు - శూద్రులు, జానపదులు (ఇంకా కిందివారిని కలిపి) అంటాం. ఆదివాసులు అని ప్రత్యేకంగా ఉన్నారు. వీరి సాహిత్యం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. స్థిరనివాసం పక్కనే అస్థిరంగా సంచారం చేసే కులాల సాహిత్యం, కళలు, సంస్కృతి ప్రత్యేకంగా కనుపిస్తుంది.
మార్క్సిస్టు సిద్ధాంతపరంగా, చారిత్రక ఆర్థిక కోణాల్లోంచి ఉపరితలం - పునాది, ధనిక - పేద, యజమానులు-బానిసలు, భూస్వామి-రైతు, పెట్టుబడిదారు - కూలీ, విశ్రాంతివర్గం-శ్రామికవర్గం, దోపిడీవర్గం-దోచుకోబడే వర్గం అనే తేడాని సూచించే పదాలు ఉన్నాయి.
సాహిత్య కళారంగాలలో దీనినే మార్గ - దేశీ అని పిలుస్తారు.
అలాగే చరిత్ర రచనలో, సాహిత్య చరిత్ర రచనలోనూ ప్రధాన స్రవంతి - సమాంతర (ప్రజా) స్రవంతి ఉన్నదని పేర్కొంటుంటాం.
ఉన్నత, ధనిక వర్గాలకి చెందిన భావజాలం ప్రధాన స్రవంతిగా చెలామణి అవుతుంది. ప్రజలది సమాంతరం అవుతుందని ఒక భావన ఉంది. భావజాల రంగంలో విలువలని ఆపాదించే పదాలివి. నిజానికి సమాంతర సాహిత్యం, కళలు, సంస్కృతి, మూలవాసీ సాహిత్యం, కళలు, సంస్కృతి పునాదిగా ఉంటుంది. ఇది మూలాలికి సంబంధించింది. పునాది లేనిదే పై నిర్మాణం లేదు. కాని పునాదిని విస్మరించడానికే ఉపరితలాంశాన్ని పదేపదే నిర్మించడం జరుగుతుంది. దానికి నగిషీలు చెక్కబడతాయి. రాజ్యయంత్రం యావత్తూ దాన్ని కాపాడడానికే ప్రయత్నిస్తుంటుంది. దీనిని గురించే కవులు, రచయితలు, కళాకారులు ప్రత్యేకంగా పోషించబడతారు. వీరు ప్రజలకు దూరమై పాలక పక్షం చేరిపోతారు. అవార్డుల కోసం వెంపర్లాడుతారు.
సాహిత్య పరంగా చూస్తే ప్రత్యామ్నాయ సాహిత్యం, జానపద సాహిత్యం, గిరిజన సాహిత్యం, దేశి సాహిత్యం, మాండలిక సాహిత్యం, ప్రజా సాహిత్యం తదితర పేర్లు కనిపిస్తాయి. ఈ పాయలన్నింటిని కిలిపి సమాంతర సాహిత్యం అని పిలుస్తుంటారు. కాని అది సరైనదేనా అనిపిస్తుంది.
సమాంతర సాహిత్యానే్న జెండర్ పరంగా స్ర్తిల సాహిత్యం అనీ, కులపరంగా అట్టడుగు వర్గాల సాహిత్యం అనీ, దళిత సాహిత్యం అనీ పిలుస్తాం. జాతిపరంగా మైనారిటీ సాహిత్యం అని పిలుస్తాం.
లేఖనం దృష్ట్యా లేఖనం కానిదాన్ని వౌఖిక సాహిత్యం అనీ, నోటి సాహిత్యం అనీ వ్యవహరిస్తాం.
ఇన్ని రకాలుగా కనిపించే వినిపించే సాహిత్యాన్ని ఒకచోట కలిపి ‘సమాంతర’ అనే పేరుతో పిలుచుకొంటున్నాం.
శిష్ట సాహిత్యంగా పిలవబడే సాహిత్యం మాత్రమే సాహిత్య చరిత్రలో అధికభాగం ఆక్రమించుకుంది. ఈ వర్గానికి చెందిన సాహిత్యమే ప్రధానంగా పరిశీలించబడింది. ఐతే సమాజంలో అత్యధిక శాతం ప్రజలకు సంబంధించిన సమాంతర సాహిత్యానికి, శిష్ట సాహిత్య చరిత్రలో సరైన చోటులేదు. సాహిత్య సృజనలో మాత్రం సమాంతర సాహిత్యం ఇతివృత్తాలు, బాణీలు, సంగీతం, ఛందస్సు, భాషలను తీసుకుని శిష్ట రచనలు పరిపుష్టి చెందుతున్నాయి. అదే సమయంలో వీటికి ఆ సాహిత్య చరిత్రలో స్థానం కల్పించబడడంలేదు. శివకవుల కాలం నాటి నుండి నేటి దాకా మత, ధార్మిక, రాజకీయ ఉద్యమాల కాలంలో కొంత ప్రజాస్వామీకరింపబడినట్లు అనిపించినా ఈ సాహిత్యానికి సరైన స్థానం కల్పించలేకపోయాం. కవిత్వానికి, వ్యాకరణ ఛందో రీతులు సంకెళ్లు ఎలాగో సాహిత్య చరిత్ర రచన కూడా చాలా రిజిడిటీతో, కట్టుబాట్లతో ఉన్నట్లు కనిపిస్తున్నది.
సామాజిక పురోభివృద్ధి, సాంకేతికాభివృద్ధి అనూహ్యంగా పెరిగిపోతున్న ఆధునిక కాలంలో సైతం సాహిత్య చరిత్ర తలుపులు తెరుచుకోలేదు. అందువల్ల సాహిత్య వ్యవస్థలోని ఎన్నో మేలిమి గుణాలు కూడా అజ్ఞాతం అయ్యే ప్రమాదం ఏర్పడి ఉంది. ఆ ప్రమాదం నుండి బయటపడి కొత్త సాహిత్య చరిత్ర నిర్మాణం జరగాలి. ఇందుకు సమాంతర సాహిత్యం నుండి ఎన్నో అంశాలు గ్రహించవలసి ఉంది.
నిజానికి ఈ విభాగం చాలా విస్తృతమైంది. మొదటిసారిగా ఇందుకు సంబంధించిన నానా రకాల అంశాలను సేకరించి వాటి గురించి చెప్పే సందర్భంలో మొదట ఏది సమాంతర సాహిత్యం అనే ప్రశ్న ఉదయిస్తుంది. ముందు దానికి జవాబు చూద్దాం.
ఏది సమాంతరం!
భారతదేశం చరిత్ర పొడవునా రెండు రకాల సంస్కృతి కనిపిస్తుంది. ఒకటి శిష్ట సంస్కృతి. రెండు జానపద (ప్రజా) సంస్కృతి. శిష్ట సంస్కృతి ప్రధాన స్రవంతిగా కనిపిస్తుంది. ఇది అగ్రకుల, వర్గాల వారిదైన పాలకుల సంస్కృతి. వీరి భాష నాడు సంస్కృతం. నేడు ఆంగ్లం. మధ్య యుగాలలో రాత భాష తెలుగే అయినప్పటికీ సంస్కృత భాషా సామీప్యంగల శిష్ట తెలుగు లేదా గ్రాంథిక తెలుగుభాష. ఈ భాషలో వెలువడిన ఆస్థాన సాహిత్యంలో పౌరాణిక గాథా సాహిత్య ప్రక్రియకే ప్రాధాన్యం వహించాయి. వైదిక మతం యొక్క ప్రభావం, ప్రచారమే వీటి ధ్యేయం. ఒకటీ లేదా రెండు శాతం కలిగిన కొద్దిమంది విద్యావంతుల కోసం వారి సాంస్కృతిక, మత సామాజిక హోదాకి అనుకూలమైన సాహిత్యం వెలువడింది. తెలుగులో నన్నయ మొదలు మొన్నటి కొందరి ఆస్థాన కవుల వరకూ ఈ ధోరణే కొనసాగింది.
ప్రజలది ఇందుకు భిన్నమైన సాహిత్య సంస్కృతి. సమాజంలో అత్యధిక శాతంగా ప్రజలు పాలిత వర్గంగా ఉంటారు. నిజానికి శ్రామికులే - ఉత్పత్తికి హేతువులు. పనిపాట్లలో రాటుదేలిన వాళ్లు. నిరక్షరాస్యులు. దేశభాషలో, మాండలిక భాషలో, వృత్తిపరమైన భాషలో వ్యవహారం నడిపేవారు. వీరిది ప్రధానంగా వౌఖిక సాహిత్యం. ప్రధాన స్రవంతికి సమాంతరంగా ఎంతో విలక్షణమైన సాహిత్యం. ఆ సంస్కృతికన్నా మతంకన్నా భిన్నమైన పలు సంస్కృతులను ఆచరించేవారు. శిష్ట సాహిత్యంలో శ్రీరాముడు నూరుపాళ్ల భగవత్స్వరూపుడే. కాని జానపదుల్లో పదహారణాల మానవమాత్రుడు. శిష్ట రామాయణ కథనాలు కూడా వేరువేరుగానే ఉన్నాయి. ఐతే ఇప్పటివరకు జానపదులు తమ ప్రత్యేకమైన రీతిలో వాళ్ల సంస్కృతిని కాపాడుకొంటూ రావడం భారతదేశపు ప్రత్యేకత. చాలా దేశాలలోని సమాంతర మత సంస్కృతులు చాలావరకు రూపం కోల్పోయాయి. ఇక్కడ ఇంకా ప్రజల సాహిత్యం మిగిలిపోయంది. దాని రూపుమాపడానికే పాలకవర్గ సంస్థలు, రచయతలు నిరంతరం ప్రయత్నిస్తుంటారు.
నిజానికి సమాంతర సాహిత్యాన్ని జానపద సంస్కృతి అన్నా అందుకు భిన్నమైన గిరిజన సంస్కృతిని కూడా ప్రస్తుతం అందులోకే జోడించక తప్పదు. లేదా మరికొంత విస్తరించి ‘ప్రజాసంస్కృతి సాహిత్యాలు’ అని చెప్పుకోవచ్చు.
ప్రజాసాహిత్యంలో పైన పేర్కొన్న సాహిత్యాలే కాకుండా పామర సాహిత్యం, కులపురాణ సాహిత్యం, ఆనాదృత వాఙ్మయం, శ్రామిక సాహిత్యం, అభ్యుదయ, ఉద్యమ, పోరాట, విప్లవ సాహిత్యాలు ఇందురో చేరతాయి. దీనే్న మరోమాటలో జనసాహిత్యం అనికూడా కొందరు అంటారు. జన ప్రజ పదాలు సమానార్థకాలు. కానీ రాజకీయ, తదితర అంశాల ఆలోచనల వల్ల ఆ పదాల వాడకం వేరువేరుగా ఉంటుంది. జనసాహితి అని ఒకరంటే, ప్రజాసాహితి అని, విప్లవ సాహితి అని అంటారు. ప్రస్తుతం ప్రత్యేకంగా వస్తున్న స్ర్తివాద సాహిత్యం, దళిత సాహిత్యం, మైనారిటీ కవిత్వం కూడా ప్రజాసాహిత్య విభాగంలోనే చేరిపోతాయి. చరిత్ర పారిభాషిక పదం దృష్ట్యా దీన్ని కొందరు అడుగువర్గాల చరిత్ర, సాహిత్యాలు ఒఖఇ ఘఆళూశ అనే అర్థంలో వాడుతున్నారు. ఆయా సాహిత్యాలు రూపొందే విధానం, ప్రసారమయ్యే ప్రచారరీతి, నాటి సాహిత్య విలువలు, స్వభావం రీత్యా శిష్ట, ప్రజాసాహిత్యం వేరువేరుగా ఉంటాయని చెప్పవచ్చును. ఒక్కోచోట వీటి స్వభావాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. ఈ రెండు సాహిత్యాల పాఠకులు, లేదా శ్రోతలు కూడా వేరుగానే ఉంటారు. ప్రజాసాహిత్యంలో ప్రజల కళలు కూడా ఒక భాగంగానే ఉంటాయి. ఒగ్గుకథ, యక్షగానం, బుర్రకథలు మొదలైన దృశ్యకళలు - శారద కథ, జమిడికి కథ, కినె్నర పాటలు మొదలైన శ్రవ్య కళారూపాలు కూడా సమాంతర లేదా ప్రజాసాహిత్యంలో భాగాలే. పై రెండు రకాల సాహిత్యానికి శ్రోతలు లేదా ప్రేక్షకులే ఉంటారు. పాఠకులు ఉండరు. ప్రదర్శన performance సాహిత్యం literature రెండూ ఒకటే. శిష్ట సాహిత్యంలో కవి, పాఠకుడు వేరు. అందుకే శిష్ట సాహిత్యం వ్యక్తిగతం. ప్రజాసాహిత్యం సామూహికం.
ఇన్ని విధాలుగా సమాంతర మన సాహిత్య సంస్కృతిలో మిళితం అయ ఉంటుంది. ఇంత పెద్ద కడలి విస్తృతి, లోయని గుర్తించాలి. దానిని ఆహ్వానించాలి.
అలా జరగకపోతే ఒక పెద్ద అగాధం ఏర్పడుతుంది.

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242