సాహితి

కవిత్వమే కవి పరిచయ పత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడారి ఉపరితలంమీద అంకురాల సమూహం కవిత్వమైనప్పుడు- నాగరికత శిథిలాల్లో పదాల పరిమళాలను మోసుకొస్తూ, అంతరించిపోయిన నదుల్లోంచి అంతర్వాహినిలో ఉబికి వస్తున్న పురాతన స్పర్శనూ, చారిత్రక జ్ఞాపకాల్ని మోసుకొచ్చి అక్షరీకరించేది మహాకవిగాక మరెవరు?! ఒక కవిత పూర్తిచేశాక, అది ఇచ్చిన కుదుపులాంటి స్థితిలోనే చాలాకాలం- కాకుంటే చాలా సేపటివరకు అలా ఆ కవిత గురించే ఆలోచిస్తూ ఉండిపోయినట్లయితే.. కచ్చితంగా చెప్పవచ్చు అది ఉన్నత విలువలుగల ఉత్తమ కవితే కాదు పదహారణాల ప్రజోపయోగ కవిత ప్రవచించవచ్చు.
కవిత్వం రాసేవాళ్ళు చాలామంది వుంటారు. కవిత్వ రహస్యం తెలిసినవాళ్ళు మాత్రం వేళ్ళమీదే వుంటారు. కవి జీవిస్తున్న సమాజ పరిధి ఎంత విస్తృతిలో వుంటే కవిత్వ విస్తృతి అంత పెరుగుతుంది. దీనికితోడు దార్శనికత, కాల్పనికతలుండే స్థాయిని అనుసరించే సాహిత్య లోకంలో కవి స్థానం నిర్దేశింపబడుతుంది. కవికి కవిత్వమే పరిచయ పత్రం. వాద వివాదాల సిద్ధాంత రాద్ధాంతాలు, సంకుచిత విషయాధారిత అత్యావేశాలు, కవిత్వ గుణాత్మకతను పెంచవు, సరికదా కవి అభివ్యక్తి పరిధిని కుంచింపజేస్తాయి. కవికీ సమాజానికీ విడదీయలేని వినూత్న అనుబంధం ఉంటుంది. దాంతో కవినీ, సమాజాన్నీ విడివిడిగా చూడకూడదు. ఎవరికీ అనుకరణ కానీ, అనుసరణ గానీ లేకుండా అప్పుడే వికసించిన పూల తాజాదనంలా కవిత్వం ఉండాలి. కవిత్వ నిర్మాణ వ్యూహలవల్లనే కాకుండా వ్యక్తిత్వాల వల్ల కూడా ఆ కవిత్వాలకి భిన్నంగా కనిపించే ఏకరూపత వస్తుంది. కవికి తనకు సంబంధించిన కవిత్వ విషయంలో ఎలా ఖచ్చితంగా వుంటాడో, తన విశ్వాసాల పట్ల కూడా అంతే భరోసాగా వుంటేనే ఉత్తమ కవిగా ఎదగగలడు.
ఏ కాలమైనా ఏ దేశమైనా ఏ జాతి వ్యక్తి అయినా కవిత్వానికి జీవ భూతమైంది, సృజన చేతన మాత్రమే. సృజన చేతన వెనుకనుండి అనేకమైన కవితాంశలు పనిచేస్తాయి. ప్రతిభ, సంకల్పం, అనుభవం, అనుభూతి సాధన లక్ష్యం మొదలైన అంశాలు వివిధ నిష్పత్తుల్లో కలిసి ప్రత్యేకమైన వ్యక్తిత్వం అవతరిస్తుంది. కొంతమంది కవులకు కొన్ని చోట్ల కవిత్వాన్వయం కుదరదు. కుదరకపోతే కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే వుంటారు. ఒక భావం నుంచి మరో భావానికి చెప్పకుండా జారుకుంటారు. ఒక సంకేతం నుంచి ఇంకో సంకేతానికి విహంగంలాగా ఎగిరిపోతుంటారు. ఒక వాక్యం నుంచి మరో వాక్యానికి అడ్డం వచ్చే సింటాక్సు కాలవను దూకిపోతుంటారు. అందువల్ల వారి కవిత్వం సర్రియలిస్టు ఎఫెక్టు వస్తుంది. కవులు చాలామంది సమాజంలోని రుగ్మతలను, లోటుపాట్లను, లోభిత్వాన్ని, బలహీనతలను అనేకానేక పార్శ్వాలను తమ రచనలలో ప్రతిఫలింపజేస్తుంటారు. కవిత్వ విషయ పరిశీలన జరగటానికి, ఇంతకుముందు చెప్పినట్లు విశే్లషణ చట్రాన్ని విస్తృతం చేసుకోవటం చాలా అవసరం.
కవిత్వం నిత్య నూతనత్వం పొందడానికి ప్రక్రియ వైవిధ్యం, ప్రయోగ వైశిష్ట్యాలు తోడ్పడతాయి. ప్రపంచీకరణ ఫలితాలు బడుగు బలహీన వర్గ దేశాల ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక, సాహిత్య సామాజిక వ్యవస్థ పనితీరుమీద బలమైన దెబ్బతీస్తున్నాయి. స్థానికత, సంస్కృతి మూలాలను సర్వనాశనం చేసి, ఆ స్థానంలో ప్రపంచ కవితా సంస్కృతి అంటూ సంకీర్ణ సాంస్కృతిక దోపిడీ విలువలతో కూడిన కుహనా జనరంజక సంస్కృతిని ప్రవేశపెడుతున్నాయి.
కవిత్వంలో భావావేశంతోపాటు సిద్ధాంత శక్తి వుంటుంది. కొందరు విప్లవాన్ని, అభ్యుదయాన్ని, సామాజిక అణచివేతని, మానవ సంబంధాలని కవిత్వాంశం చేసుకుంటారు. కవిత్వం సూక్తిగా మారితే, తత్త్వంగా మారితే అది నాలుకల మీద నర్తిస్తుంది. తెలుగు కవిత్వం ఇటీవల కాలంలో కొత్త శక్తిని స్ఫూర్తినీ తెచ్చుకోవడం చూస్తున్నాం. ఎంతో వస్తు వైవిధ్యాన్నీ విస్తృతినీ సంతరించుకుంటుంది. అట్టడుగు వర్గాలకు చెంది, ఇంతవరకు కవిత్వానికి ఎక్కని అనేక వృత్తులు, తెగలు, మతాల జీవన సంఘర్షణను, అందులోని విషాదాన్ని మానవీయమైన స్పందనలను తెలుగు కవిత్వం అద్భుతంగా చిత్రించగలదు. కవిత్వంలో ప్రాంతీయ స్పృహలో విశ్వజనీనతతోపాటు స్థానీయత కూడా నిక్షిప్తం అవుతూ వుంటుంది. వర్గ, దృక్పథంలో ఆలోచించినప్పుడు, ప్రవర్తించినప్పుడు వారి ప్రాంతీయ స్పృహ వేరుగా వుంటుంది. కవిత్వంలో ఇతివృత్తాలు కోకొల్లలుగా దర్శనమిస్తాయి. ఆకలి, ఆందోళన, అలజడి, ఆవేదన, దగా, దోపిడీ అధికార ప్రాబల్యం- ధనస్వామ్యపు బలం, నిస్సహాయత, నిర్వీర్యత, ఏకాకితనం- ధన తాపత్రయం, వౌలిక విలువల పతనం, మానవ సంబంధాల విచ్ఛిత్తి- ఇవన్నీ ఇంకా ఎనె్నన్నో కవిత్వంలో చోటుచేసుకుంటున్నాయి. జీవితానికి మరో చిరునామా కవిత్వమే. ఆలోచించలేని వాడికి మనస్సునూ అనుభూతి శూన్యుడైన వాడికి హదృయాన్ని ఇచ్చేంత శక్తివంతమైనది కవిత్వమే. కవిత్వం కేవలం భావోద్రేకం, ఆవేశోద్వేగం కాదు. భావుకులకు బుద్ధిబలాన్ని, మేధావులకు హృదయ స్పందనను, తాత్వికులకు భావోద్వేగాన్ని కలిగించేది వుండాలి.
మానవ సంబంధాల్లోని తీపి వగరుల్నీ, ఎడనెడ ఇతర రుచుల్నీ కొత్త కోణంలో విశే్లషించడం కూడా కవితా రచనలో అద్భుత శైలి అనిపిస్తుంది. కవిత్వమనేది ఒక ఉద్యమంగా సాగాలి. మనం రాసుకుని మనం చదువుకోడానికే కాదు కదా. ఇతర ప్రాంతీయుల గురించి తెలుసుకోవాలన్నా, కనీసం మన చుట్టుప్రక్కల సమాజంలోనైనా ఒకరి భావాలు ఒకరు ఇచ్చిపుచ్చుకోవడానికైనా కవిత్వం అనివార్యమైన గొప్ప సాహిత్య ప్రక్రియ.

- ఎస్.ఆర్ భల్లం, 9885442642