మెయిన్ ఫీచర్

వ్యంగ్య సృజనకు రా‘రాజు’.. విశ్వనాథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్యంత సృజనాత్మక ప్రక్రియ వ్యంగ్యం. ఉన్నది
ఉన్నట్టు చూపుతూ, ఉన్నదానిలోని అనౌచిత్యము అసందర్భమూ అయిన అంశాలను ఎత్తి చూపిస్తూ పఠితను ఓ వైపు హాస్యం స్ఫురిస్తూ కూడా మరోవైపు లోతైన
అవగాహన, దీర్ఘమైన ఆలోచనను కలిగించేదే వ్యంగ్యం. అలాంటి వ్యంగ్య సృజనలో విశ్వనాథ అందెవేసిన చేయి.

సాహిత్య ప్రక్రియలో అన్నిటికన్నా వాడి అయినదీ, వేడి అయినదీ వ్యంగ్యం. వ్యంగ్యం అంటే వంకరగా విమర్శించటం, ఎద్దేవా చేయటం కాదు. అత్యంత సృజనాత్మక ప్రక్రియ వ్యంగ్యం. ఉన్నది ఉన్నట్టు చూపుతూ, ఉన్నదానిలోని అనౌచిత్యము అసందర్భమూ అయిన అంశాలను ఎత్తి చూపిస్తూ పఠితను ఓ వైపు హాస్యం స్ఫురిస్తూ కూడా మరోవైపు లోతైన అవగాహన, దీర్ఘమైన ఆలోచనను కలిగించేదే వ్యంగ్యం. అలాంటి వ్యంగ్య సృజనలో విశ్వనాథ అందెవేసిన చేయి. ఆయన లాంటి వ్యంగ్యాన్ని మరెవరూ సృజించలేదు. ఇంకెవరూ సృజించలేరు. ఇందుకు చక్కని నిదర్శనం- విశ్వనాథ విరచిత కథ ‘రాజు’.
రాజు-కథ చదవటం అంటే భారతీయ సాంప్రదాయ చరిత్రను, సామాజిక పరిణామ క్రమాన్ని విహంగ వీక్షణం చేయటం లాంటిది. ఇదొక ఉధృతమైన ప్రవాహ మధ్యలో నుంచుని పరుగులిడే నదీ ప్రవాహాన్ని దర్శించటం లాంటిది. భారతీయ సాంప్రదాయిక విశ్వాసం ప్రకారం యుగాలు నాలుగు కృత, త్రేత, ద్వాపర కలి. కృత యుగాన్ని సత్య యుగం అంటారు. అంతా సత్యమే. ఎలాంటి వాదాలు వివాదాలు లేకుండా అంతా శాంతంగా సాగిపోతుంది. ఆ తరువాత నుంచి ఇంకో యుగానికి సామాజిక జీవనం, మానవ ప్రవర్తన, ఆలోచనలు దిగజారుతుంటాయి. దీనికి పరాకాష్ఠ కలియుగం. ఆ తరువాత ప్రళయం సంభవించి సృష్టి మళ్లీ ఆరంభమవుతుంది. ఈ సిద్ధాంతం ఆధారంగా భారతీయ సామాజిక జీవనంలో ఆలోచనల్లో కనిపిస్తున్న విపరీత ధోరణిని, మానవ సంబంధాలలో కనిపిస్తున్న విచ్ఛిన్నకర ధోరణిని వ్యంగ్యంగా ఎత్తి చూపించడమే కాదూ, జగద్రక్షక సిద్ధాంతాలుగా తెరపైకి వచ్చి మానవ జీవనాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఆలోచనలను విషపూరితం చేస్తున్న విదేశీ సిద్ధాంతాలను అత్యంత వ్యంగ్యంగా విమర్శించడం ‘రాజు’ కథలో కనిపిస్తుంది. ఈ కథలో నలుగురు రాజులు రాజ్యానికి వస్తారు. నలుగురు నాలుగు యుగాలకు ప్రతినిధులు. ఈ దృష్టితో కథను చదవడం ఆరంభిస్తే ఈ కథలో విశ్వనాథ చెప్పదలచుకున్న విషయం, చెప్పిన విషయం, అందులోని వ్యంగ్యం, ఆవేదనలు, ఆలోచనలు స్పష్టమవుతాయి. రచయిత భావనా బలానికి ఆలోచన వైశిష్ట్యానికి అత్యద్భుతమైన సృజనాత్మకతకు ఆశ్చర్యం కలుగుతుంది. చెప్పదలచుకున్న అంశాన్ని స్పష్టంగా చెప్తూనే ప్రతి పదంలో ప్రతి వాక్యంలో సముద్రమంత అగాథమైన అర్థాలను ఇముడ్చి ప్రదర్శించడమనే రచనా సంవిధానానికి జోహార్లర్పించాలనిపిస్తుంది.
సుధర్శుడనే రాజు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలిస్తుంటాడు. ఆయన యోగ శక్తితో రోజూ వారణాసి వెళ్లి వస్తూంటాడు. రాజ్యం సుభిక్షంగా, ప్రజలు సుఖంగా ఉంటారు. అలా సాగుతున్న రాజ్యంలో ఓరోజు, పొలం దున్నుతున్న కాపు గుర్రంపై వెళ్తున్న క్షత్రియుడిని చూచి ‘నేనెనే్నళ్ళని దున్నటం? ఇష ఇక్కణ్ణుంచి నువు దున్ను. నేను గుర్రాన్ని ఎక్కుతా?’ అంటాడు. ‘నాలా యుద్ధం చేయలేవు’ అన్న క్షత్రియుడితో అతడు ‘మహా నువ్వే యుద్ధ చేస్తావులెద్దూ. అలవాటయితేసరి, ఎవరుపడితే వారే చేస్తారు’ అంటాడు. వారిద్దరూ తీర్పు కోసం రాజు దగ్గరకు వెళ్తారు. వారి వివాదం విన్న రాజు ‘నేను చాలా రోజులు రాజ్యం చేసాను. నేను అడవికి వెళ్తున్నాను. మీ తగాదా కొత్త రాజుకు చెప్పుకోండి’ అని అడవికి వెళ్లిపోతాడు. అంటే కృతయుగం అయిపోయిందన్నమాట. అంతవరకూ తగాదాలు, అహంకార పోరాటాలు లేకుండా కలసిమెలసి అన్నదమ్ముల్లా, హెచ్చుతగ్గులు లేకుండా సామరస్య పూర్వకంగా జీవించిన సమాజంలో విచ్ఛిన్నకరమైన విషబీజానికి అంకురార్పణ జరిగిందన్నమాట.
ఆయన కొడుకు ధర్ముడు రాజ్యానికి వస్తాడు. వివాదాన్ని విన్న ఆయనకేమీ పాలుపోలేదు. వేదవేదాంగ పారంగతులు, నిత్యాగ్నిహోత్రులు అయిన బ్రాహ్మణుల్ని పిలిచి అభిప్రాయం అడుగుతాడు. వారు తపోదృష్టితో చూసి ‘ఎవరి పని వారు చెయ్యాల్సిందే. మీరు పోట్లాడకూడదు’ అంటారు. ఆ సమస్య అక్కడితో ఆగిపోతుంది. అయితే సుధర్ముడి యోగ శక్తి లేని ధర్ముడు రోజూ కాశీకి వెళ్లలేడు. నది ఒడ్డున రాజధాని కట్టించుకుంటాడు. అయితే ఏమైనా తగాదాలు వచ్చినప్పుడు మాత్రం తీర్పుకు బ్రాహ్మల్ని పిలుస్తూంటాడు. వాళ్లు అగ్నిహోత్రం వదలి అధిక సమయం రాచకార్యాల మీద గడుపుతుంటారు. ఇంతలో ఓరోజు చెమటలు జారుతున్న ఓ కాపు ఎర్రగా బుర్రగా వున్న బ్రాహ్మణుడిని చూస్తాడు. ‘ఆయన సుఖంగా ఇంట్లో కూర్చుంటోంటే దబ్బ పండులా వున్నాడు. దున్ని దున్ని నా రెక్కలు విరిగిపోతున్నాయి. ఇక నేను దున్నలేను. ఎల్లకాలం ఒక్కడు దున్నటం ఎట్లాగేమిటి? అనుకుంటాడు. బ్రాహ్మణుడిని నిలదీస్తాడు. ఇద్దరూ రాజు దగ్గరకు వెళ్తారు. బ్రాహ్మలు ఇంతకుముందు చెప్పినట్టే తీర్పు చెప్తారు. దానికి కాపు ‘నాకు న్యాయం జరగలేదు. ఈయనా బ్రాహ్మడే. వారూ బ్రాహ్మలే’ అని ఆక్షేపిస్తాడు. రాజు తీర్పుని సమర్ధిస్తే, రాజును ఎదిరిస్తాడు. ‘మీ అచ్చమైన బుద్ధి వారి బుద్ధి మూలంగా కలుషితమయింది’ అని ఆరోపిస్తాడు. దాంతో రాజు అడవికి వెళ్లిపోతాడు. మరో యుగం అంతమయింది.
అతని తరువాత ధర్మరాజు రాజ్యానికి వస్తాడు. మళ్లీ అదే వ్యాజ్యం వస్తుంది. అదే తీర్పు వస్తుంది. అదే ఆక్షేపణ, ఆరోపణలు వస్తాయి. అయితే రాజు ఖడ్గం చూపి బెదిరిస్తే కానీ వివాదం సమసిపోదు. కానీ రాజు ఖడ్గం చూపితేకానీ తీర్పులను ఎవ్వరూ ఆమోదించకపోవడం ఆనవాయితీ అవుతుంది. అయితే ప్రజలలో మార్పు వస్తుంది. బ్రాహ్మలు పొలాలు దున్నుతూంటారు. కొందరు కాపులు వేదాలు చదువుతూంటారు. క్షత్రియులు యుద్ధాలు మానేస్తారు. వైశ్యులు పేరుకు మిగులుతారు. వ్యాజ్యాలు, తగాదాలు, పితూరీలు పెరుగుతాయి. దాంతో వివాదాలు, వాటికి ఇచ్చిన తీర్పులు తాటాకుల్లో రాయించి దాస్తూంటారు. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలకు ఇదీ తీర్పు అని చెప్పేందుకన్నమాట (ఆధునిక న్యాయ శాస్త్రంపై విసురు). రాజు కూడా ప్రతి వివాదాన్ని వినటం మాని తాటాకుల ఆధారంగా తీర్పు చెప్పేవారిని నియమిస్తాడు. ఇంకొన్నాళ్లకి వ్యాజ్యాలు మరీ విషమంగా వస్తూంటాయి. కారణం తాటాకుల తీర్పులు అని తెలుస్తాయి. ఇంతలో ఆయన మరణిస్తాడు. అతని తరువాత అతని ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడు రాజవుతాడు. అతని దగ్గరకో విచిత్రమైన వివాదం వస్తుంది. ఒక స్ర్తి యందు బ్రాహ్మణుడు, శూద్రుడు కొడుకులను కంటారు. ఆ పిల్లల్లో బ్రాహ్మణ పిల్లవాడు పొలం దున్నాలని, శూద్ర పిల్లవాడు పౌరోహిత్యం చేయాలని అనుకుంటారు. కానీ పొలం వున్న శూద్ర పిల్లవాడు పొలం ఇవ్వనంటాడు. వివాదం విన్న రాజు రాజ్యం వదలి అడవికి వెళ్లిపోతాడు. తరువాత రాజు అయిన రెండోవాడు ఎవరికీ చెప్పకుండా అడవికి వెళ్లిపోతాడు. దాంతో మూడవవాడు రాజు అవుతాడు. కలియుగం ప్రారంభమవుతుంది.
వివాదం విన్న రాజు పగలబడి నవ్వుతాడు. ‘్ధర్మం రెండు విధాలుగా ఉంటుందని’ చెప్పి బ్రాహ్మడు పొలం చేసి వచ్చే ధనం శూద్రుడికివ్వటం, శూద్రుడు పౌరోహిత్యం చేసి వచ్చే డబ్బు బ్రాహ్మడికి ఇవ్వాలని లేకపోతే ఇద్దరూ రెండు పనులు ‘సగం సగం’ చేయాలని తీర్పునిస్తాడు. వాళ్లు రెండో తీర్పు ప్రకారం నడుస్తామంటారు. అంతేకాదు, ఎవరు ఎక్కువ తీర్పులిస్తే వారు గొప్ప అవుతారు. అయితే కథ ఇంతటితో అయిపోతే విశ్వనాథ కథ కానేకాదు. అందరూ ఒక దెబ్బకి రెండు పిట్టలను కొడితే విశ్వనాథ ఒక దెబ్బకి పది పిట్టల్ని కొడతాడు. ఎవరయినా రాజుతో ముత్తాత గురించి, అంటే కృతయుగం గురించి చెప్తే ‘అవి అన్నీ కల్లబొల్లి మాటలోయి, మా ముత్తాత అనేవాడు లేడు. ప్రపంచమంతా మా నాన్నతో మొదలెట్టి వుండాలి. నేనెరిగినప్పటి నుంచే ప్రపంచకం అసలు కన్ను తెరచింది. ఆ సంగతి నాకు తెలుసు’ అంటాడు. కాదన్నవాడిని ఉరితీస్తాడు. ఇదీ విశ్వనాథ వ్యంగ్యాత్మక సృజనాత్మక శక్తికి పరాకాష్ఠలాంటి కథ ‘రాజు’ కథ.
చివరి వాక్యంతో కథ స్వరూపం మారిపోతుంది. ఈ వ్యంగ్యం కేవలం యుగం ప్రకారం మారే సామాజిక మనస్తత్వానికి పరిమితం కాదనీ, విదేశీ మూకలు తమ బలంతో ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలతో అలాంటి తాండవం చేసే సమాజంలో సృష్టించిన విపరీత ధోరణులు, నాటిన విషబీజాలపైన అనీ తెలుస్తుంది. అంతేకాదు విదేశాలలో జనించిన పలు విచ్ఛిన్నకర సిద్ధాంతాల విషవాయువుల తాడితమైన భారతీయ సమాజం ఎలా తనని తాను మరచి, తన అసలు స్వరూపాన్ని విస్మరించి వారి రంగుటద్దాలతో తనని తాను చూసుకుని కుచింపచేసుకుని ఎలా వికృతమవుతోందో స్పష్టంగా ప్రదర్శిస్తుందీ కథ. అయితే ఈ కథ సాంప్రదాయిక వర్ణాశ్రమ ధర్మాన్ని సమర్థిస్తున్నదనుకుంటే పొరపాటు. ఈ కథ ద్వారా విశ్వనాథ ఒకప్పటి సమాజంలో వర్ణాశ్రమ ధర్మాలు ఈనాడు దుర్భుద్ధులు, సమాజంపట్ల అవగాహన లేక విదేశీ రంగుటద్దాలు ధరించినవారు ప్రచారం చేస్తున్న రీతలో లేదని, ఒకప్పుడు ఎలాంటి భేదభావాలు, హెచ్చుతగ్గులు, అహంకారాలు, న్యూనత భావాలు, అణచివేతలు లేని ఉత్కృష్టమైన సమాజం మనదని, దానిలో విషబీజాలు నాటి దుష్ప్రచారం చేస్తున్నారన్న భావనను సూచనప్రాయంగా ప్రదర్శిస్తాడు విశ్వనాథ. మన సమాజాన్ని, గతాన్ని, సామాజిక ప్రవృత్తిని, మనస్తత్వాన్ని తెలుసుకోకుండా విదేశీ పాలకులు, విదేశీ సిద్ధాంత ప్రభావితులు మన నడుమ నాటిన విష బీజాలు, నిర్మిస్తున్న అడ్డుగోడల ప్రభావంతో చెలరేగుతున్న విచ్ఛిన్నకరమైన ధోరణులపై విశ్వనాథ ప్రయోగించిన వ్యంగ్యాస్త్రం ఈ ‘రాజు’ కథ. అందుకే ఈ కథ రంగుటద్దాల, కళ్లకు గంతల సాహిత్య ప్రపంచంలో ప్రచారం పొందలేదు.

- కస్తూరి మురళీకృష్ణ, 9849617392