సబ్ ఫీచర్

అడుగడుగునా అనుభూతి ముద్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనిమిదో అడుగు
- కొండపల్లి నీహారిణి
9860360082
*
ఏడడుగుల వరకు పరిమితం చేసిన అడుగుల్ని ఎనిమిదో అడుగు వేయించారు కొండపల్లి నీహారిణి. తెలంగాణ యాసలో భాషలో తన భావాల్ని విస్తృతంగా విపులంగా విశదీకరించారు. కవిత్వానికేదీ అనర్హం కాదని ప్రతి కవితా శీర్షికలోనూ నిర్దుష్టంగా తెలిపారు.
‘శతపత్ర సౌందర్యాన్ని కోరే సాహితీ వటవృక్షాన్నీ నీ కవితా వధూటి వదనాన్ని ఎగా దిగా చూసిన ఈ సమాజానికి నీవొక సవాల్‌వి!’ లోకాన్ని కొత్తగా చూపించే విలక్షణం కవిత్వానికుండడం, అందుకు కవికారకుడు కావడం వాస్తవం. ఏ భాషలో కవిత్వం అద్భుతంగా పండుతుందో, ఆ భాష అత్యంత అభివృద్ధి దిశకు, ఆ జాతి అత్యున్నత నాగరికత దశకు చేరువవుతుంది. ఏ జాతి అత్యంత నాగరికతను సంతరించుకో గలిగిందన్నది ఆ జాతి భాష మనుగడపైనే ఆధారపడింది. భాషలోని తీక్షణత, వాడివేడి కవిత్వంలోనే లభిస్తుంది.
‘తూరుపు తొలి కిరణం.. ఉదయం విరిసే పువ్వు.. సీతాకోక చిలుకలు తాగే తేనె, అంతా కొత్తనే’ అనడమన్నది శాస్ర్తియ దృక్పథం సంతరించుకుని కవిత్వీకరించిన సత్యం. ‘పండ్లను మీరిన తీపి, పూలను మీరిన సువాసన’ అనడంతో కొత్తగా చెబుతున్న ధోరణిని మనం మననం చేసుకోగలం. ప్రతి కవితలోనూ మనకు రెండు మూడు వాక్యాలు కొత్తకొత్తగా కనిపిస్తాయి. అందుకు కారణం నూతనత్వంతో కవిత్వం తొణికిసలాడడమే ననిపిస్తాయి. కొండపల్లి నీహారిణి చిన్నతనంలో చెరువులో మునిగిపోతున్నప్పుడు అక్కయ్య బుచ్చయ్యలు తనను కాపాడిన జ్ఞాపకాన్ని ‘తవ్వకున్న చెరువు కథల్లో నేనో మునగని రూపాన్ని, అర్ధశతాబ్దపు లోతుల్లో తేలిన అమరిన పుష్పాన్ని’ అని చెప్పడంతో స్మరించుకున్న తీరు హృద్యంగా ఉంది. అలాగే రోహిత్ (ఆత్మ)హత్య గురించి ‘బలవన్మరణానికి ముందు తల్లి గుండెకు వ్రేలాడదీసిన అనురాగ పటం నీదని ఎట్లా మరచావని’ తనయున్ని ప్రశ్నించడం తనలోని మాతృత్వానికి నిదర్శనమని చెప్పక తప్పదు. ‘నేల మీద బంతి కొరకు పరుగెత్తే చిన్న పాదాల్లా రెండు కళ్లూ పడమటి కిటికీ దగ్గరికెళ్తుంటే, క్షణాల్ని మింగేసే కాలం ఎప్పటిలాగానే సాయం అడుగుతూ పొద్దుగుంకిస్తుంది’ అంటూ ఒక చిత్రాన్ని కవితా చిత్రికలో చూపెడతారు ‘చినుకు చినుకు కలిపి చిత్రాల వాగాయె, మొగ్గలన్నీ విరిసి పూలసంద్రాలాయె, తీరొక్క నవ్వులు ఎట్ల వచ్చెనమ్మ, నూటొక్క మాటలు మాలగడ్తెనమ్మా’ అంటూ పాట గట్టడంతో వీరు పాటలు రాస్తే బాగుండనిపిస్తది. ‘దహనకాలపు చితిపై ఆమె’ అన్నపుడు గుండె తొలిచే విషయాన్ని చిత్రిస్తారు. ‘తవ్వడం మొదలయ్యాక అడుగెంతో చూడంగదా!’ అంటూనే తను చిన్నప్పుడు పొందిన ఒక పాఠ్యాన్ని ‘పుస్తకాన్నో దారిలేని అడవనుకున్న, అడవి అమ్మ వంటిదని తెలియక’ అని తనకు తానుగానే సత్యాన్ని ఆవిష్కరించుకుంటారు. ‘మనుషుల్ని పులుముకోవడానికిప్పుడు ఒక సందర్భం కావాలి, ఈ విశాల ప్రపంచంలో ఒంటరితనాన్ని వీడ’నని సమూహంలో వున్నా తను ఏకాంతాన్ని కవిత్వాన్ని కోల్పోవడం జరగదని, అందులోంచే జీవితాన్ని అనుభవం ద్వారా పిండుకోవడం జరుగుతుందని స్పష్టంగా చెబుతారు. ‘కులాల పొట్లాల్లో వేగిన పల్లీలు పార్కు మూలలు వెతిక, కలల పూ వనాల అనాగరికతా విరులు పల్లెపల్లెను చేరె’ అంటూ చురకలేస్తారు. ‘ఆమె, చింపిన కాగితపు ముక్కల్లో ఒక అస్పష్టపు అక్షరం, ఆమె పగిలిన అద్దపు రూపుల్లో చిందరవందర చిత్రం’ అంటూ నూతన కవితాత్మకమైన వాక్యాన్ని మన ముంగిట దృశ్యీకరిస్తారు. ‘అడుగులో అడుగేసే భూమి తనకందరూ సమానమన్నది, అందరానివే అందుకోవాలని ఆకాశం చెబుతున్నది’ అంటూ ఒక సత్యాన్ని కవిత్వంగా పొందుపరిచి విడుదల చేయడం స్పందన కలిగిస్తుంది. ‘చిలుకల చిగుళ్ల మేత, చెట్టుకు రెక్కల స్పర్శ, గుల్మాల చుట్టూ తుమ్మెదల మోత, పూరెమ్మల పలకరింత, ప్రేమ లాలన ఒక వింత’ అంటూ కృష్ణశాస్ర్తీని గురుతుకు తెస్తారు. అనుభూతుల్ని ఒకదాని వెంటొకటి చెప్పడమన్నది సౌందర్యాన్ని గుప్పించడమన్నది కవిత్వ తత్వం తెలిసిన వారికి వెన్నతో పెట్టిన విద్య. ఆ విద్యలో వీరు తన భావ సౌందర్యంతో భాషాపటిమతో ఆకట్టుకునే విధానంలో నిష్ణాతని తెలుపుతుంది. ‘గాయాలెప్పుడూ కాలానికి లొంగి ఎండేవే’ వాస్తవాన్ని ఆత్మావలోకనం చేసి విడుదల చేసేదే కవిత్వమని వీరి కవితల్ని వీక్షిస్తే తెలుస్తుంది. బతుకేదైనా తనకు తాను ఇష్టపడేది తమ జీవితంలో పూర్తి భాగమై చివరకంటా నిలబెడుతుంది. బాల్యంలోంచే ఆ అభివ్యక్తి చివరకంటా రూపుదిద్దుకుంటూనే వుంటుంది అది చిత్రమో, నాట్యమో, సంగీతమో, సాహిత్యమో ఏదో ఒక కళలోకి తనని లాక్కుంటుంది. ఆ కళలోనికెళ్లిన వాళ్ల నుంచే తను నూతనంగా వినూత్నంగా బయటికొస్తుంది.
లోకంలోని రసాయనిక భౌతిక చర్యలన్నింటిని తను అంతర్గతంగా జరిగే రసచర్యతో పటిష్టమైన పదజాలంతో నిర్దుష్టమైన భావజాలంతో స్పష్టంగా చెప్పడమనేది జరుగుతుంది. కొండపల్లి నీహారిణిలో భాష భావం అనుభూతిలోంచి పలుకుతుంది. సందర్భానుసారంగా రాసిన కొన్ని కవితల్ని వదిలేస్తే తను కవిత్వం మీదనే దృష్టి సారించి జీవితాన్ని సాగిస్తుందని తెలుస్తోంది. అస్పష్టత అయోమయత కనిపించకపోవడం వీరి కవితల్లో ప్రధానాంశం. ఎనిమిదో అడుగు నుంచి మరిన్ని అడుగులు ముందుకేస్తూ జీవితాన్ని కవితామయం చేసుకొని ఇంకొన్ని కవితల్ని భవిష్యత్తుకి అందిస్తారని ఆశిద్దాం.

- యక్కలూరి శ్రీరాములు