జాతీయ వార్తలు

చర్చకే రాని తీర్మానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 16: లోక్‌సభలో శుక్రవారం టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే ఎంపీలు సృష్టించిన గొడవ, గందరగోళం వల్ల నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ, ఎన్ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాలను చర్చకు చేపట్టటం సాధ్యం కాలేదు. సభ అదుపులో లేనందున వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, లోక్‌సభలో టీడీపీ పక్ష నేత తోట నరసింహం ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాలు చర్చకు చేపట్టలేమని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఆర్‌జేడీ, వామపక్షాలు, ఎంఐఎం తదితర అన్ని ప్రతిపక్షాలు రెండు అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ప్రకటించాయి. వైఎస్‌ఆర్‌సీపీ, తెలుగుదేశం పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాలను చర్చకు చేపట్టాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. సభ అదుపులో లేనప్పుడు అవిశ్వాస తీర్మానాలను ఎలా చర్చకు చేపడతానని సుమిత్రా మహాజన్ ప్రశ్నించారు. లోక్‌సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ మొదట కొత్త సభ్యుల చేత ప్రమాణం చేయించారు. అనంతరం ముగ్గురు దివంగత సభ్యులకు సంతాపం తెలిపి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. అప్పటికే పోడియం వద్దకు దూసుకు వచ్చిన ప్రతిపక్షం, స్వపక్ష సభ్యులు నినాదాలతో లోక్‌సభ హోరెత్తిపోయింది. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశం కాగానే సభ్యులు సుబ్బారెడ్డి, తోటనరసింహం ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపాదించిన
అవిశ్వాస తీర్మానాల గురించి స్పీకర్ ప్రకటించారు. అయితే అప్పటికే పోడియం వద్దకు దూసుకొచ్చిన అన్నా డీఎంకే, తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు వివిధ సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దఎత్తున నినాదాలకు దిగారు. కావేరీ జల బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే సభ్యులు నినాదాలిస్తే, ఎస్టీ, ముస్లిం మైనారిటీల రిజర్వేషన్లు పెంచాలని టీఆర్‌ఎస్ సభ్యులు నినదించారు. రెండుపార్టీల సభ్యులు పోడియంను చుట్టుముట్టి తమ డిమాండ్ల కోసం పెద్దఎత్తున నినాదాలు ఇవ్వటంతో సభ దద్దరిల్లిపోయింది. అయితే సుమిత్రా మహాజన్ నినాదాలు, గందరగోళం మధ్యనే అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరపటం గురించి ప్రకటించారు. ‘అవిశ్వాస తీర్మానాలను చర్చకు చేపట్టటం తన విధ్యుక్త్ధర్మం. కాబట్టి పోడియం వద్ద గొడవ చేస్తున్నవారంతా తమ సీట్లలోకి వెళ్లాలి’ అని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ‘మీరు గొడవ ఆపకపోతే అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరపటం సాధ్యం కాదు’ అని విస్పష్టంగా ప్రకటించారు. ఈ దశలో కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ సభ్యులు తమ సీట్లలో నిలబడి అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ప్రకటించారు. అయితే అప్పటికే పోడియంను చుట్టుముట్టి టీఆర్‌ఎస్, అన్నాడీఎంకే సభ్యులు సభ దద్దరిల్లేలా నినాదాలు ఇవ్వటంతో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కాలేదు. సభ్యులు తమ సీట్లలోకి వెళితే అవిశ్వాస తీర్మానంపై చర్చా ప్రక్రియ ప్రారంభిస్తామని సుమిత్రా మహాజన్ సూచించారు. అయినా సభ్యులు శాంతించలేదు. నినాదాలతో సభను స్తంభింపజేశారు. దీంతో స్పీకర్ అవిశ్వాస తీర్మానాలపై చర్చ సాధ్యం కాదని ప్రకటించి సభను సోమవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేసి వెళ్లిపోయారు.
అవిశ్వాస తీర్మానానికి మద్దతు
కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ వైఎస్‌ఆర్‌సీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించారు. ఆమె పార్లమెంటు ఆవరణలో ఆ పార్టీ సభ్యుడు సుబ్బారెడ్డితో మాట్లాడుతూ ‘మీరు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్షాల మద్దతు కూడా సంపాదిస్తాం’ అని హామీ ఇచ్చారు. తమ పార్టీ నాయకులు యూపీఏ మిత్రపక్షాల నాయకులతో మాట్లాడుతున్నారని, వారు కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తారని సోనియాగాంధీ చెప్పారు. ఇదిలా ఉంటే వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాలకు యూపీఏ మిత్రపక్షాలతోపాటు తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ కూడా మద్దతు ప్రకటించాయి. అయితే బీజేడీ మాత్రం అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించింది. ఇదిలావుంటే వైఎస్‌ఆర్‌సీపీ, తెలుగుదేశం పార్టీ సోమవారం మళ్లీ ఎన్డీయేపై అవిశ్వాస తీర్మానాలను ప్రతిపాదించనున్నట్లు తెలిసింది.
చిత్రం..సభ్యులు పోడియంను చుట్టుముట్టడంతో గందరగోళంలో పడిన లోక్‌సభ