మెయిన్ ఫీచర్

ఎప్పటికీ నిలిచేది పుస్తకమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం మారుతుంటుంది. మారిన కాలంతోపాటు ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతుంటాయ. అవి మంచికి కావొచ్చు.. చెడుకు కావచ్చు. కాని చెడుని తరిమికొట్టి వాటిలో మంచినే తీసుకోవాలి. మనిషి వౌఖిక భాషనుండి లిఖిత భాష ఏర్పడిన వరకు వచ్చిన అభివృద్ధి ఒక ఎతె్తైతే, లిఖిత భాష తర్వాత వచ్చిన నూతన ఆవిష్కరణలు మరింత శక్తివంతంగా, మానవ మేథస్సును మరింత చురుకుగా, పదునుగా తయారుచేసే ఆధునిక శక్తియుక్తులు లిఖిత సాహిత్యం కల్పించింది. భారతీయ సినిమా మూకీనుండి టాకీదాకా వచ్చిన పెనుమార్పులు, నూతన ఆవిష్కరణలు ఎంత వేగవంతంగా జరిగాయో అంతే వేగంగా సాహిత్య రంగంలోనూ చోటుచేసుకున్నాయ.
తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నవల, నాటకం వంటి ప్రక్రియలు ఏర్పడ్డాక- కవిత్వంలో భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, స్ర్తివాద కవిత్వం, దళిత కవిత్వం, ముస్లిం మైనారిటీ వాద కవిత్వం వంటి ఉద్యమ కవిత్వం వెలువడిన తర్వాత, తెలుగు కవిత్వంలో పద్యం, గేయం, వచన కవిత్వం- మినీ కవిత, తెలుగు హైకూ, నానీలు వంటి మినీ రూపాలలో శాఖోపశాఖలుగా విస్తరించాక- మళ్ళీ కవిత్వ ప్రచురణలో ‘అంతర్జాలం’ (ఇంటర్నెట్) ప్రవేశంతో నూతన ఆవిష్కరణలు మనిషి ఊహించని స్థాయిలో జరిగాయి, జరుగుతున్నాయ.
చరిత్రలో లిఖిత సాహిత్య ప్రారంభ దశలో తాళపత్ర గ్రంథాలు, తాటాకుల మీద రచనలు.. ఆ తర్వాత కాగితం వినియోగంతో చిన్నచిన్న పత్రికలు గ్రంథాలుగా వెలువడడం చూసాం. ఆ తర్వాత సాహిత్య పత్రికలు ప్రత్యేకంగా వెలువడడం గమనించాం. అయితే ఇవన్నీ పాఠకుడిని చేరాలంటే కొంత కాలం-కొంత సమయం అన్నది నియమంతో ముడిపడి ఉంటుంది. మనిషి తన హృదయంలో జరిగే భావాలను వివిధ సాహిత్య ప్రక్రియల రూపం వ్యక్తం చేసుకోడానికి, తోటిమనిషితో పంచుకొని తద్వారా సమాజంలో జరుగుతున్న అనేక సామాజిక సంఘటనలను రచనల రూపంలో వ్యక్తం చెయ్యడానికి, సామాజిక మార్పుకు దోహదపడటానికి పత్రికలు, గ్రంథాల ప్రచురణ రూపం ఎంతగానో ఉపయోగపడ్డాయి. అనేక సామాజిక అంశాలతో కూడిన వైవిధ్య రచనలతో మన తెలుగు కవులు, రచయితలు తమతమ రచనల ద్వారా ప్రచురణలైన పత్రికలు, గ్రంథమాధ్యమాల ద్వారా ఎంతగానో సాహిత్య సేవ చేసారు, చేస్తున్నారు. దానికి ప్రచురణ రంగం ఎంతగానో దోహదపడింది. ఒక కవి రాసిన, కవితో, కథో, నవలో ఒక గ్రంథస్తరూపంలో పాఠకుడికి అందించి, తద్వారా భావితరాలకు కూడా ఆయా కాలాలలోని సమస్త విషయాల్ని భద్రపరిచి అందించేందుకు ఎంతో ఉపయోగకారి అయింది ప్రచురణ రంగం.
మొదట్లో కాల నియమ పత్రికలు రచయితల వివిధ ప్రక్రియలలో రచించిన రచనలు ప్రచురించేవి. అటువంటి రచనలు భావి తరాలకి స్ఫూర్తినిచ్చేవిగా అందించబడాలంటే అవి ఒక గ్రంథస్థరూపం కావాలి. అటువంటి గొప్ప సాహిత్యానికి ప్రచురణ మాథ్యమం మానవ మేథస్సును భద్రపరిచే గొప్ప సేవకు దోహదపడింది.
రేడియో ప్రసారాలు ప్రారంభ తదుపరి జరిగిన మార్పుల కారణంగా అది మరింత వేగవంతం సంతరింప జేసుకుంది. శ్రావ్య మాధ్యమంగా రేడియో రంగప్రవేశం లిఖిత సాహిత్యరూపం నుండి వౌఖిక రూపంలో.. అక్షరాస్యుల నుండి నిరక్షరాస్యుల వరకు సాహిత్య గుబాళింపు జనబాహుళ్యం చెందింది. ఎన్నో విశేషాలను క్షణాలలో జనం చెంతకు తీసుకుపోయే సాధనంగా ఎదిగింది రేడియో. ఆ తర్వాత బుల్లితెర రాజ్యం ఏలికలో శ్రవ్యరూపం నుంచి దృశ్యమాధ్యమంలోకి సాహిత్యరూపం రూపాంతరం చెందింది. నట్టింట బుల్లితెర రంగప్రవేశం కారణంగా అప్పటివరకు మనిషికి వినోదం, విజ్ఞానం అందించే సాధనాలుగా ఉన్న ‘పుస్తకం- సినిమాలు’ బుల్లితెర రంగప్రవేశం ధాటికి ఈ రెండు రంగాలకు గట్టిదెబ్బ తగిలిందని చెప్పడంలో ఏమాత్రం అసత్యం లేదనవచ్చు.
గత దశాబ్దకాలంలో ప్రసార మాధ్యమంలో ఎవరూ ఊహించని గొప్ప మార్పు, వచ్చిన నూతన విప్లవం అంతర్జాలం. ప్రచురణ రంగం తర్వాత తెలుగు సాహిత్యంలో మరింత ఊపుని కలిగించి, కొత్త కవులు, రచయితలను తీర్చిదిద్దే సాధనంగా కూడా అంతర్జాలం రూపాంతరం చెందింది. దీనికి కాలమానం, ప్రాంతం, సందర్భం అనే భేదాలు లేవు. గతంలో శ్రీశ్రీ ప్రభావంతో ఎందరో కవులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. కుందుర్తి వచన కవిత్వ ప్రచారం కారణంగా ఎందరో యువకవులు కవితలు రాయడానికి స్ఫూర్తిని అందించబడ్డారు. అయితే ఈ రచనలన్నీ కేవలం ఆయా ప్రాంతాలకే పరిమితం. అవి పత్రికలలోనో, పుస్తకాలుగా- కవితా సంపుటాలు, సంకలనాల రూపంలోనో వెలువడేవి. ముఖ్యంగా పత్రికలలో వచ్చిన కవిత్వం, సాహిత్యమే ఎక్కువమందికి చేరువయ్యేవి. సంపుటాల రూపంలో చదివేవారు సంఖ్య కేవలం ఆయా ప్రక్రియలపై ఆశక్తి కలిగినవారే చదివే అవకాశం తక్కువ స్థాయిని కలిగి వుండేవి. వీటిని చదవడానికి సమయం, నియమం పెట్టుకుంటేనే సాధ్యపడుతుంది. కాని అంతర్జాలం ప్రవేశం కారణంగా అది విశ్వవ్యాప్తం అయ్యింది. ఇతర దేశాల్లో నివశిస్తున్న తెలుగువాళ్ళు సైతం తమ భాష ఉనికిని కాపాడుకునే వీలు కలిగింది. సాధారణంగా పత్రికలకు కవితలు, కథలు పంపితే నెలల తరబడి ఎదురుచూడాలి. అసలు అవి ప్రచురితం అవుతాయో, లేదో తెలియని పరిస్థితి. కాని అంతర్జాలంలో అలాకాదు. ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి మాధ్యమాలు, బ్లాగులవల్ల క్షణాలలో తాము రాసుకున్న రచన చిన్నదైనా, పెద్దదైనా నేరుగా అంతర్జాలంలో అందుబాటులో ఉంటుంది. తమలో కలిగిన భావాలను కవిత రూపంలోనైనా వచన రూపంలోనైనా వ్యక్తంచెయ్యడం, దానిని చదివిన పాఠకుడు దానిపై స్పందించడం లేదా విశే్లషణ చెయ్యడం, దానిని మరిందరు తమ అభిప్రాయాలు స్పందనలతో కొనసాగించడం వంటి విస్తృత చర్చ ఈ మాధ్యమంలో ఎంతమంది పాల్గొనడానికైనా వీలుకలగజేస్తుంది. ముఖ్యంగా ఈ మాధ్యమంలో ‘పరిమితం’ అనే అడ్డుగీతే ఉండదు.
అలాగే పత్రికల లాగానే అంతర్జాలంలో కూడా ‘వాకిలి, సారం, విహంగ’ వంటి అనేక తెలుగు నెట్ పత్రికలు ఉన్నాయి. అవి రచయితలు రచించిన రచనలు ప్రచురించడంతోపాటు, వివిధ సందర్భాలలో పోటీలను కూడా నిర్వహిస్తూ రచయితలను మరింత ఉత్తేజితులను చేస్తూ పత్రికలకు సాటిగా, పోటీగా నిలుస్తున్న సంఘటనలు చాలా ఉన్నాయి. కొత్త రచయితలు తయారుకావడానికి ఇవి ఎంతో దోహదపడుతున్నాయి. ఎప్పుడైతే తమ రచనలు నిర్భయంగా ప్రచురించుకునే సౌలభ్యం కొత్తవాళ్ళకు ఈ మాధ్యమం ద్వారా కల్గిందో వీటిలోకూడా ‘గ్రూపులు’ బయలుదేరాయి. ఇందులో తెలుగులో చెప్పుకోదగ్గ కవులను తయారుచేసిన ఫేస్‌బుక్ గ్రూప్ ‘కవి సంగమం’. ప్రముఖ కవి యాకూబ్ దీనికి సారధ్యం వహిస్తున్నారు. ఈ గ్రూప్ ద్వారా చెప్పుకోతగ్గ కవులుగా తయారయినవాళ్ళు అరుణ గోగులమండ, మెర్సీ మార్గరేట్, గండికోట వారజ తదితర కొత్త కవులు ఫేస్‌బుక్ ప్రముఖులుగా చెలామణి అయ్యారు. వారిలో మెర్సీమార్గరేట్ కేవలం ఫేస్‌బుక్ కవయిత్రిగా పరిచయమై, ఒకే ఒక కవితా సంపుటి ప్రచురించుకోవడం ద్వారా ‘కేంద్ర సాహిత్య యువ పురస్కారం’కూడా పొందటం ఈ మాధ్యమం ఇచ్చిన స్ఫూర్తే కారణం.
అయితే ఈమధ్య పుస్తకం/ పత్రికలలో వచ్చిన రచనల సంఖ్య కంటే అంతర్జాలంలో వచ్చిన కవిత్వమే అత్యధిక సంఖ్యలో ఉంటుందన్నది వాస్తవం. ఇది ప్రసాదించిన సౌలభ్యం కారణంగా వేలాది కవులు, రచయితలు తమ తమ రచనలు ఇందులో ప్రచురించుకుంటున్నారు. మినీ కవిత్వం మొదలుకొని, పెద్ద పెద్ద కవితలు, కథలు, అనేక రచనా రూపాలు ఇందులో క్షణాలలో ప్రసారమవుతున్నయి. చదివే వారికంటే రాసే వాళ్ళ సంఖ్య ఇందులో ఎక్కువగా కనిపిస్తున్నది. రాసిన ఆయా రచనలలో వాసిలో, రాసిలో అనేక భేదాలు వుండటం- ఒక దిశలో అది అసలు కవిత్వమా? లేక పూర్తి ‘పదాల కూర్పుతో’ అల్లిన వచనమా? అన్న సందిగ్ధంలో ఇంటర్‌నెట్ వెలువరిస్తున్న సాహిత్యం ఒకొక్క సందర్భంలో అయోమయానికి గురిచేస్తున్న విమర్శనా లక్షణం. అదీకాక అంతర్జాలంలో వచ్చే సాహిత్యమంతా భద్రత కలిగి వుండకపోవడం, అంటే రేపటి తరానికి ఆ రచనలు అందించే రక్షణ ‘గ్రంథస్త’ కలుగజేసే అవకాశం ఉండకపోవడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అవార్డులకు, పురస్కారాలకు అర్హత కలిగి వుండకపోవడం వంటివి ప్రతికూలతలుగా చెప్పుకోవచ్చు.
శ్రావ్య, దృశ్య మాధ్యమాలు ఎంతటి నూతన ఆవిష్కరణలు ఆవిష్కరించినా స్థూలంగా ముద్రణ రూపం కలిగివున్న గ్రంథాన్ని మించి మనగలగలేవు. పైన పేర్కొన్నట్లు ఒక గ్రంథమైతే ఎప్పుడు పడితే అప్పుడు ఎవరైనా, ఎక్కడైనా, రాత్రి, పగలు అనే తేడా లేకుండా చదువుకోవచ్చు. అదే ప్రసార మాధ్యమాలైతే కేవలం విద్యుత్ మీద ఆధారపడవల్సి వస్తుంది. విద్యుత్ లేకపోతే ఎంత శక్తివంతమైన మాధ్యమమైనా ఈ మూడు మాధ్యమాలు ప్రజల చెంతకు చేరలేవు. అంతేకాదు, ఏ రేడియోలో రచన ప్రసారమైనా, ఏ బుల్లితెరమీదో, అంతర్జాలంలోనో కవితో, కథో ప్రసారమైనా, దానిని చివరికి పుస్తక రూపంలో గ్రంథస్తం చేస్తేనే దాని విలువ, భావి తరాలకి భద్రత. కనుక పుస్తకానికున్న సౌలభ్యం, ప్రయోజనం, విలువ మరే మాధ్యమం ఇవ్వలేదన్నది కాదనలేని అంతిమ సత్యం.
ఏ మాధ్యమమైనా అంతిమంగా ప్రజలకు చేరువ కావడమే లక్ష్యం. అది కాలంలో వచ్చిన అనేక మార్పులకు తట్టుకుంటూ వాటియొక్క ప్రయోజనాలను కాపాడుకుంటూ ముందుకు దూసుకుపోవడమే గమ్యస్థాన పరమార్థం. దానిని ఎవరూ ఆపలేరు. కాని ఏది మంచికి, ఏది చెడుకు దారితీస్తుందో, ఏది ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుస్తుందో, ఏది సమాజ శ్రేయస్సుకు పాటుపడుతుందో గమనిస్తూ ఉపయోగించుకోవడంలోనే మానవుడి మేధస్సు ఆధారపడి వున్నది.

- చలపాక ప్రకాష్, 9247475975