మెయిన్ ఫీచర్

కన్నడ ఆదికవి పంపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ భాషలలో అత్యంత ప్రాచీనతా విలువలు కలిగిన మన మాతృభాష తెలుగుకు, కన్నడ ఆదికవి పంపన వ్యక్తిగత, సాహితీ జీవితంలో ప్రగాఢ అనుబంధం వున్నట్టు శతాబ్దాలనాటి చరిత్ర స్పష్టం చేస్తోంది. దక్షిణాదిన పంప మహాకవి విలసిల్లిన కాలంలో భాషల ప్రాంతీయతలకు, గిరిగీసుకొన్న సరిహద్దులు, ఆనవాళ్ళు లేవు. రాజ్యాధికారం చెలాయించేనాటి రాజ్యాధీశులు మతాధిపత్యానికి తలవంచిన ప్రాచీన సమాజంలో వెల్లివిరిసిన సాహిత్యం ఏ రూపమైనా తొలినాళ్ళలో మత ప్రచార ఔన్నత్య విలువలకు అద్దంపట్టేది. జైన, బౌద్ధ, శైవ, వీరశైవ, విష్ణు, వైదిక, ఏ మత భావజాలమైనా రాజ్యవంశ వారసత్వంగా సంక్రమించేది. ‘ఆంధ్ర’నాటి రోజులలో అవిభాజ్యం. కన్నడం, తమిళం, మళయాళం వంటి సరిహద్దు ప్రాంతాల భాష, సంస్కృతి ప్రభావం సర్వత్రా మిళితమై వుండేది. ఆంధ్ర దేశంలో జైనమతం, బౌద్ధంకన్నా ముందుగా అడుగుపెట్టినా క్రీ.శ. 7వ శతాబ్ది తరువాత మాత్రమే వ్యాప్తి చెందగలిగింది. జైనమత ప్రాచుర్యంలో దక్షిణ హిందూ దేశంలో శ్రావణ బెల్గోల (ప్రస్తుత కర్నాటక) కంటే వేములవాడ (ప్రస్తుత తెలంగాణ) చాళుక్య రాజ్యాధీశులు (క్రీ.శ.650 నుండి 968 వరకు) సుమారు మూడు శతాబ్దాలు సామంతాధిపతులుగా పాలించారు. వారి ఏలుబడిలో తొలి రాజధాని బోధన నగరం కాగా మలి రాజధాని వేములవాడ. జైన మత ఆరాధన కళాసాహితీ ఔన్నత్యం విలసిల్ల చేసింది. కాని యిదే కాలంలో, చోళ సామ్రాజ్యాధీశుల ఏలుబడిలో ద్రవిడ దేశంలో వేలాది జైనులు దారుణ హింసా దౌష్ట్యాలకు గురి అయి ప్రాణాలు రక్షించుకోవటానికి ఆంధ్రావనికి, తమకు రక్షణ కల్పించే వేములవాడ సీమకు తరలిరావటం చారిత్రక వాస్తవం. ఆంధ్ర ప్రాంతంలోని వేంగిపాడులోని కమ్మనాడు వంగిపర్రు నివాసి అభిరామ దేవరాయ భీముడు, జినేంద్రధర్మం సర్వమతాలకంటే ఉత్కృష్టమని తీవ్ర మతాభినివేశంతో నాటి కర్నాటక రాజ్యంలో అంతర్భాగమైన వేములవాడ చేరినట్టు విక్రమార్జున విజయంలో చెప్పబడింది. క్రీ.శ. 902లో జన్మించినట్టు భావించబడుతున్న పంపన తండ్రి ఆయనే. పంపన సోదరుడు జనవల్లభుడు. పంప మహాకవి తెలుగునాట వేంగీ దేశస్థుడని, కర్నాటక సాహితీ పరిశోధకులు, అంగీకరించక తప్పలేదు. కన్నడ ప్రప్రథమ కవి తెలుగునాట వేములవాడను పాలించిన చాళుక్య అరికేసరి ఆస్థానకవిగా గుర్తింపచేయటానికి, చరిత్ర పరిశోధకులు నేలటూరి వెంకట రమణయ్య పంప మహాకవి తమ్ముడు జినవల్లభుని శాసనం బొమ్మల గుట్టపై కనుగొనటం ఆధారమైంది. దానికితోడు వెంకటరమణయ్య, జిల్లా వృత్తాంతదర్శిని సహాయ సంపాదకునిగా కరీంనగర్ జిల్లాలో ఎంతో ప్రయాసతో జరిగిన అనే్వషణలో కొండమీద పంప మహాకవి సమాధి వెలుగుచూడటం కన్నడ సాహితీ పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. అక్కడి విశ్వవిద్యాలయాల చరిత్రాచార్యులు పరిశోధకులు, తండోప తండాలుగా కన్నడనాడు సాహితీ అభిమానులు స్వయంగా ధ్రువీకరించి సమాధి చూసి నాటి తెలంగాణ సీమలో కొంత ప్రాంతాన్ని పాలించిన కన్నడరాజు ఆస్థాన కవిగా పంపన కన్నడనాడు నివాసి కాదని నిర్ణయించారు. ప్రస్తుత కర్నాటకలోని ధార్వార్ ప్రాంతంలోని లక్ష్మేశ్వర్, పులిగిరిని ఆరికేసరి పాలించే కాలంలో పంపన రాజాశ్రయం పొందినట్టు తెలుస్తోంది. చారిత్రక ఆధారాల నేపథ్యం వలన వేములవాడ చాళుక్యుల కాలంలో జైనం బహుళ ప్రజాదరణ పొందిందని సోమదేవసూరి, పంపమహాకవి వంటి జైన సిద్ధాంత నిష్ణాతులు, పాలకుల ఏలుబడిలో జైన సిద్ధాంతాలను కూలంకషంగా బోధించే రచనలు చేసారని స్పష్టమవుతోంది.
కమ్మనాటి వంగిపర్రు వాస్తవ్యులైన పంపని పూర్వీకులు యజ్ఞయాగాదులు నిర్వహించిన సోమయాజులు, తండ్రి భీమన, వైదికం విడిచి జైనమతం అవలంబించి, కొంతకాలం వనవాసంలో వుండి తర్వాత వేములవాడ రాజాస్థానంలో స్థిరపడినట్టు తెలుస్తోంది. మత ధర్మమే కావ్యధర్మంగా ఆదిపురాణం, విక్రమార్జున విజయాలను పంపన రాసారు. ఆదిపురాణం జైన తీర్థంకరులలో ప్రథముడైన వృషభనాధుని చరిత్ర. 16 ఆశ్వాసాల ఈ గ్రంథాన్ని పంపన మూడునెలల్లో రాసారు.
జినసేనుని సంస్కృత కావ్యమైన పూర్వపురాణ కథావస్తువే ఆదిపురాణం. పంపన, అరికేసరులను శాశ్వతంగా గుర్తుంచుకొనే కావ్యం విక్రమార్జున విజయం. దీనినే పంప భారతం అంటారు. విక్రమార్జునుడైన అరికేసరికి అంకితంగా రాయబడిన ఈ భారత కథ ఆరునెలలలో పూర్తిచేసారట. వ్యాస స్రోక్తమైన మహాభారత కథకు పంపన న్యాయం చేయలేదని విమర్శకుల అభిప్రాయం.
కుర్క్యాల శిలాశాసనాధారాలు
అరికేసరిని పాండవ మధ్యముడైన అర్జునునితో పోల్చడం, వ్యాసుని మూలకథను పంచమవేదమైన భారతాన్ని కేవలం అరికేసరి పురాణ చరిత్రగా వెలువరించటం తీవ్రమైన విమర్శలకు గురి అయింది. ద్రౌపదిని ఒక్క అర్జునుని పత్నిగా చెప్పటం, శ్రీకృష్ణపరమాత్మ భగవత్తత్వాన్ని మరుగుపర్చటం, సుభద్రార్జునులకు పట్ట్భాషేకం జగత్ప్రసిద్ధి చెందిన మహాభారతాన్ని జైన భారతం, కిరాతార్జునీయం, వేణీసంహారం వంటి సంస్కృత గ్రంథాలను పరిశీలించి చేసిన మార్పుల కారణంగా పంపన, దోషారోపణలకు గురికావలసి వచ్చింది. ఈ ధ్వని కావ్యం పూర్తిగా అనౌచిత్య దోషాలతో విమర్శకు గురి అయింది. పురాణ కవి, ఉపమాతీతుడని పేరుపొందిన పంపనను, అరికేసరి స్వయంగా కవితా గుణార్ణవునిగా గౌరవించి ధర్మపురి అగ్రహారం దానం యిచ్చాడు. ఆంధ్ర బ్రాహ్మణుడైన పంప మహాకవి ‘ఆదిపురాణ’, సాహస విక్రమార్జున విజయంతో కన్నడ సాహిత్యానికి శ్రీకారం చుట్టి ఆదికవిగా గణుతికెక్కాడు. పంపకవి సోదరుడైన జినవల్లభుడు, వృషభాచల శిఖరంపై త్రిభువన తిలక జినాలయాన్ని కట్టించటం, అద్యంత తీర్థంకరుల్ని, చక్రేశ్వరిని ప్రతిష్ఠించటం, కవితా గుణార్ణవ తీర్థాన్ని, మదన విలాస ఉద్యానవనాన్ని నిర్మించటం, కుర్క్యాల శిలాశాసనం వివరిస్తోంది. జినాలయాలు నిర్మించటంలో, జినమునుల్ని పూజించటంలో, జైనభిక్షువులకి అన్న వసతి కల్పించటంలో తనకెవ్వరూ సాటిలేరని తెలుగులో కంద పద్యాలలో జినవల్లభుడు చాటి చెప్పుకోవటమే తెలుగు భాష ప్రాచీన పద్యవైభవానికి నిదర్శనమేకాక నన్నయ కంటే వంద ఏళ్లముందే తెలుగు కవితా పద్య రూపం విలసిల్లిన ప్రాచీనత వెలుగు చూసింది. తెలుగుభాషకు ప్రాచీన హోదా రావడానికి గంగాధర మండలంలోని కుర్క్యాల బొమ్మల గుట్టపై గండశిలపై క్రీ.శ. 945లో జైనమతాచార్యునిగా జినవల్లభుడు చెక్కించిన తెలుగు, సంస్కృతం, కన్నడ పద్యాల త్రిభాషా శాసనమే ఆధారం. జినవల్లభుడి ఆధ్వర్యంలో మల్లియరేచన కవి జనాశ్రయం ఛందోగ్రంథం, వేములవాడ చాళుక్యరాజు బద్దెన (960-966) నీతి శాస్తమ్రుక్తావళి, సుమతీ శతకం తెలంగాణ సీమనుంచే తెలుగు సాహిత్యం తొలిగా వెలుగు చూసిందని నిర్ధారిస్తున్నాయి. జైన సిద్ధాంతాచార్యునిగా మహాభారతాన్ని పంపన, ఆ విధంగా అవమానించటమే తదనంతరం వైదిక మత పునరుత్తేజంలో భాగంగా రాజరాజ నరేంద్రున్ని మహాభారత ఆంధ్రీకరణకు ప్రేరేపించి వుండవచ్చు.
తెలుగు కావ్యం జినేంద్ర పురాణం వెలుగుచూస్తుందా?
వేటూరి ప్రభాకరశాస్ర్తీ ప్రబంధ రత్నావళిలో పంపన, కన్నడం, సంస్కృత భాషలలోనేకాక తెలుగులో, జినేంద్ర పురాణం రాసారని స్పష్టం చేస్తోంది. అదే విధంగా పద్మకవిగా పంపన క్రీ.శ.941లో, నిజామాబాద్ జిల్లా బోధన్ రాజాశ్రయంలో కన్నడ కావ్యం విక్రమార్జున విజయం, తెలుగు కావ్యం జినేంద్రపురాణం రాసినట్లు, తెలుగు అకాడమీ ప్రచురణ తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర ముంగిలిలో స్పష్టంగా పేర్కొనబడింది. ప్రభాచంద్ర అనే పేరుగల పద్మకవి, జినేంద్ర పురాణం రాసారని అది అలభ్యమని, సర్వదేవయ్య రాసిన ఆదిపురాణం కూడా కనుమరుగయ్యిందని కర్నాటక బెంగళూరు ఓరియంటల్ రీసెర్చి సీరీస్, జైనిజం ఇన్ సౌత్ ఇండియాలో కన్నడ కవి ప్రొ.ఎస్.కె. రామచంద్రరావు పేర్కొన్నారు. యింకా ఎన్నో ఆధారాలున్నాయి.
ప్రముఖ రచయిత జయధీర్ తిరుమలరావు ‘జినేంద్రానే్వషణలో జ్ఞానేంద్రియం’ శీర్షికన మార్చి 18న రాసిన వ్యాసంలో పంపన రాసినదిగా భావించే జినేంద్ర పురాణం రాత ప్రతి గురించి నేలటూరి వెంకటరమణయ్య గారి ప్రస్తావన పేర్కొంటూ కన్నడ సాహితీ నేలమాళిగను తవ్వి తీసి ఆ జినేంద్రపురాణం వెలుగు చూసే సంకల్పాన్ని అభిలషణీయం చేసారు. అది సాధ్యమయితే అభినందనీయమే. కాని జినేంద్రపురాణం తెలుగు కన్నడ భాషా సుసంపన్నతకు ఒక వారధి అయినా యితివృత్తపరంగా కేవలం ఒక మత పురాణంగానే సంభావించబడుతుంది.

- జయసూర్య, 9440664610