కళాంజలి

అక్షరశిల్పి అహ్మద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షకీల్ అహ్మద్ ప్రఖ్యాత రచయిత, కవి, పరిశోధకుడు. వీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. బహుభాషా ప్రవీణులు కూడా. తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్లం, తమిళం, కన్నడ భాషలలో అవలీలగా మాట్లాడగలరు, రాయగలరు. సంస్కృతం, అరబిక్ వచ్చు. ఎన్నో సన్మానాలు, అవార్డులు పొందినా, నిండు కుండ తొణకదు అంటారు. వీరి మాట సున్నితం, మనస్సు నవనీతం. తీయగా, హాయిగా, చమత్కారంగా నవ్వుతూ, నవ్విస్తూ మాట్లాడతారు వీరు. వయసులో చిన్నవారైనా, ఔన్నత్యంలో ఎంతో పెద్దవారు. వీరి మూర్తి చిన్నది - స్ఫూర్తి పెద్దది. షకీల్ అహ్మద్‌లో ఎన్నో గొప్ప విషయాలు సాహిత్య పరంగా ఉన్నాయి. అయితే అన్నిటికీ మించి, వీరు మంచి మనిషి. ఇంక చెప్పేదేమున్నది? షకీల్ అహ్మద్ గారితో ముఖాముఖి-
ప్రశ్న: మీ బాల్యం గురించి చెప్పండి.
జ: నాకు 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మమ్మ నన్ను దత్తత తీసుకున్నారు. అందుకే అమ్మమ్మ తాతగారినీ, అమ్మానాన్న అని పిలుస్తాను. ఆవిడ నన్ను స్వతంత్ర భావాలు ఉండేలా, సున్నిత మనస్తత్వం ఉండేలా పెంచింది. పెద్దవాడిని అయిన నాకు జనక తల్లి ఎవరో తెలిసింది. కాని, దత్తత వెళ్లడం వల్ల చదువు బాగా అబ్బింది.
ప్ర: ఒక కళాకారుడిగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?
జ: పెద్దగా ఇబ్బందులేం లేవు. కాని ఉత్తర భారతంలో ఉన్నట్టు, ఇక్కడ హిందీకి పెద్దగా ప్రోత్సాహం ఉండదు. హిందీ పుస్తకాలు ప్రచురించడానికి పబ్లిషర్స్ ముందుకు రారు. ఒక కళాకారుడికి ప్రోత్సాహం చాలా ముఖ్యం. నా స్నేహితులు ఎంతో సహాయం చేశారు. నా పుస్తకాలను ప్రచురించారు. అందరూ బావుంది అని మెచ్చుకుంటే మనసుకి సంతోషంగా ఉంటుంది.
ప్ర: మీకు ఎన్నో అవార్డులు వచ్చాయి కదా!
జ: చాలా సన్మానాలు జరిగాయి. అవార్డులూ వచ్చాయి. అన్నింటికీ మించి నేను చేసిన కళాసేవను అందరూ మెచ్చుకున్నారు. అదే నిజమైన ఆనందం, సంతోషం.
ఆంధ్రప్రదేశ్ ముదిరాజు మహాసభ పురస్కారం - 2007
రాగరాగిణి ఆర్ట్స్ అసోసియేషన్ అవార్డు - 2008
విజ్ఞాన సరోవర ప్రచురణ - రెసిడెన్సీ నవల (అనువాదం) - 2009
ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడెమీ పురస్కారం - ఉత్తమ హిందీ అనువాదం - రెసిడెన్సీ - 2009
కమలాకర్ లలిత కళాభారతి ఉగాది పురస్కారం - 2008
బసవ సంక్షేమ సమితి, హైదరాబాద్ - 2009
జిఎంఆర్ ఫౌండేషన్ ఆత్మీయ సన్మానం - 2010
కమలాకర మెమోరియల్ ట్రస్టు ఆత్మీయ సన్మానం, అప్పటి కర్ణాటక గవర్నర్ శ్రీమతి వి.ఎస్.రమాదేవి చేతుల మీదుగా. 2010
అక్షర శిల్పి అవార్డు - శిప్రముని కళాపీఠం - 2012
ఆచార్య భీమ్‌సేన్ నిర్మల్ అవార్డు - అనువాదం కోసం
ఎ.వి.ఎడ్యుకేషనల్ సొసైటీ, హైదరాబాద్‌చే ఆత్మీయ సన్మానం.
ప్ర: మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన పుస్తకం ఏది?
జ: పాల్‌బ్రంటన్ రాసిన ‘సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా’ పుస్తకం నాకు చాలా ఇష్టం. ఎన్నోసార్లు చదివాను. అందులో అతను ఆత్మ సాక్షాత్కారం చేసుకోవడానికి, ఎందుకు ఈ ప్రపంచానికి వచ్చాము? ఎక్కడికి వెళతాము? అనే ప్రశ్నలకి జవాబు అనే్వషిస్తూ రమణ మహర్షి వద్దకు వెళతాడు. ఆ ప్రయాణంలో ఇలా అంటాడు - నా యాత్ర నాస్తికుల తీర్థయాత్రలాగా ఉంది’. ఆ ఒక్క వాక్యం నన్ను ఎంతో ఆలోచింపజేసింది. ఎంతో ప్రభావితం అయ్యాను ఆ పుస్తకం చదివి.
ప్ర: మీ రచనల గురించి చెప్పండి.
జ: నేను ఎన్నో కథలు, కవితలు, వ్యాసాలు ప్రచురించాను. ఎన్నో హిందీ, తెలుగు పత్రికలు, మేగజీన్లలో నా రచనలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, వార్త, ఈనాడు, సాక్షి, బసవ కృప, విశ్వహిందు, శ్రీరామదూతం, వందేహం రామదూతం, తెలుగుదేశం మొదలగు ఎన్నో పత్రికల్లో ప్రచురించాను. నేను రాసిన కొన్ని రచనలు-
అమ్మ చెట్టు, ఆత్మీయులు, కుక్క దొరికింది, అతివలు అంత సులభమా, మంచిని సమాధి చేస్తారా, ప్రాయశ్చిత్తం, మరో ఉదయం, దూరపు కొండలు.. మరిన్ని ఉన్నాయి మజిలీలు.
నేను రాసిన అమ్మచెట్టు నాకు చాలా పేరు తెచ్చింది. నన్ను ‘అమ్మచెట్టు షకీల్’ అని పిలవడం మొదలుపెట్టారు అందరూ.
ప్ర: మీరు అనువాదాలు కూడా ప్రచురించారు కదూ..
జ: నాకు ఉర్దూ, హిందీ, ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడ, సంస్కృతం, అరబిక్ వచ్చు. అందుకే ఒక భాషలో పుస్తకం వేరే భాషలోకి సునాయాసంగా అనువదించగలను. నా కొన్ని అనువాద ప్రచురణలు - రెసిడెన్సీ - మొహబ్బత్ కీ అనోఖీ దాస్తాన్ - దీనిని తెలుగులో ముదిగొండ శివప్రసాద్‌గారు రాశారు. నేను హిందీలో ప్రచురించాను. ఇది కోఠీ రెసిడెన్సీపై జేమ్స్ అఖిలీస్ పాట్రిక్ - ఖైరున్నీసాల ప్రేమగాథ.
* నాగపూర్ణిమ - దీన్ని తెలుగులో ముదిగొండ శివప్రసాద్‌గారు రాశారు. హిందీలో నేను అనువదించాను. శాతవాహనుల కాలంనాటి బౌద్ధ భిక్షువు ఆచార్య నాగార్జునపై నవల ఇది.
* మేరీ కహానీ - అప్నీ జుబానీ. ఇది కేవీ రంగారెడ్డిగారి స్వీయ చరిత్ర - హిందీలోకి అనువదించాను.
* సమత కీ స్థాపనా మే - మహాన్ కర్మయోగి. దీనిని. డా.పి.్భస్కరయోగి రాశారు. నేను హిందీలో ప్రచురించాను
* ఏక్ అవుర్ శివాజీ - ధర్మవీర్ ఛత్ర శాతకీ గాథ. దీనిని డి.చెన్నయ్యగారు రాశారు. నేను హిందీలో ప్రచురించాను.
* సిఖ్ పంత్ అవుర్ ఉస్కే సంస్థాపక్. దీన్ని ఉర్దూలో వౌలానా ఖ్వాజా హసన్ నిజామీ రాశారు. ఉర్దూ నుండి హిందీలో నేను ప్రచురించాను. అనువాదం చేసేటప్పుడు మూల రచయిత భాష, భావం పట్టాలి. అసలు రసం, భావం చెడకుండా వేరే భాషలోకి అనువాదం చేయాలి. ఇది కత్తిమీద సాము. లేకపోతే నవల అందం చెడిపోతుంది.
ప్ర: మీపై కళాకారుడిగా ఎవరి ప్రభావం పడింది?
జ: నా భాషలో, భావనలో ప్రఖ్యాత రచయిత ముదిగొండ శివప్రసాద్ గారి ప్రభావం చాలా ఉంది. 2004లో వారితో పరిచయం అయింది. అప్పటి నుండి, ఆయన శైలి నేను దత్తత తీసుకున్నాను. నేను ప్రచురించిన మొదటి పుస్తకం రెసిడెన్సీ ఆయన రాసిందే.
ప్ర: కళాకారులకు మీరిచ్చే సందేశం ఏమిటి?
జ: మంచి మార్గంలో వెళ్లేటట్లు, పాజిటివ్‌గా, సమాజానికి సహాయం చేసేలా ఉండాలి ఏ కళ అయినా. రచనా వ్యాసంగం ఇంకా అన్ని కళల్లోనూ కళాకారుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఎందుకు సమాజం - కళ పరస్పరం ఆధారితమైనవి. ఒక రచయిత మంచి సందేశాన్ని ఇవ్వాలి. థాట్ ప్రోవోకింగ్‌గా, ఆలోచింపజేయగలిగి ఉండాలి. పాఠకులను స్పందింపజేయాలి.

-డాక్టర్ శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి