కృష్ణ

జన్మభూమి స్ఫూర్తితో ‘ఆదరణ-2’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు గాను అధికార తెలుగుదేశం పార్టీ పాత పథకాలను మళ్లీ తెర మీదకు తీసుకువస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు అమలు చేసిన పథకాలను మళ్లీ పునరుద్ధరించి ప్రజల మన్ననలు పొందాలని చూస్తున్నారు. గతంలో విశేష ప్రాచుర్యం పొందిన ‘జన్మభూమి’ని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరించి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపించింది. నాలుగు విడతలుగా నిర్వహించిన జన్మభూమి సత్ఫలితాలను ఇచ్చింది. జన్మభూమి మాదిరిగానే నేడు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆదరణ’ పథకాన్ని పునః ప్రారంభించింది. 1999వ సంవత్సరంలో సీఎంగా ఉన్న చంద్రబాబు బడుగు బలహీన వర్గాల కోసం ఆదరణ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకం కింద కుల వృత్తులు చేసుకునే వారికి సబ్సిడీతో కూడిన పని ముట్లు అందచేశారు. అప్పటిలో ఆదరణ పథకానికి విశేషమైన స్పందన వచ్చింది. మరో ఏడాదిలో ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో జన్మభూమి స్ఫూర్తితో ‘ఆదరణ-2’ అంటూ కుల వృత్తులకు చేదోడువాదోడుగా నిలిచేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధించి విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మూడు శ్లాబ్‌లుగా కుల వృత్తిదారులకు పని ముట్లను అందస్తారు. జిల్లాలో 19వేల 380 మంది లబ్ధి పొందనున్నారు. ఆదరణ-2 పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. రజకులు, నాయాబ్రాహ్మణులు, వడ్డెర, కుమ్మరి, వాల్మకీబోయ, కృష్ణబలిజ, విశ్వబ్రాహ్మణ, మేదర, ఉప్పర కులస్థులు వారి కుల వృత్తితో పాటు వ్యవసాయ, వ్యవసాయేతర పనులకు అవసరమైన పని ముట్లను ఆదరణ-2 పథకం కింద పొందవచ్చు. లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా కమిటీ, డివిజన్, మండల కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఎంపిక కమిటీలో జాయింట్ కలెక్టర్, పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, డీఆర్‌డీఎ పీడీ, జెడ్పీ సీఇఓ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, వ్యవసాయ శాఖ జెడీ, బీసీ వెల్ఫేర్ ఈడీ, చేనేత జౌళి శాఖ ఏడీ, మత్స్య శాఖ జెడీ, పురపాలక సంఘాల కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. బీసీ కార్పొరేషన్ ఈడీ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
అర్హులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు: బీసీ కార్పొరేషన్ ఈడీ పెంటోజీరావు
ఆదరణ-2 పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చని బీసీ కార్పొరేషన్ ఈడీ, జిల్లా కమిటీ మెంబర్ కన్వీనర్ జి పెంటోజీరావు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేశామన్నారు. లబ్దిదారులు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఆదరణ.ఎపి.జిఓవి.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది ఏమీ లేదన్నారు. త్వరలోనే ఎంపిక తేదీలను ప్రకటిస్తామన్నారు.

అభివృద్ధికి ఓర్వలేకే ఆరోపణలు

కృత్తివెన్ను, మే 22: తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొంత మంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఒడుగు తులసీరావు అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రరావు గోగిలేరు డ్రైనేజీని పరిశీలించి పనుల్లో నాణ్యత లేదని, పనుల్లో అవినీతి జరిగిందనడం హాస్యాస్పదమన్నారు. ఎన్నో ఎళ్లుగా కలగా మిగిలిన గోగులేరు డ్రెయిన్ తవ్వకం తమ ప్రభుత్వ హయాంలో జరిగిందన్నారు. ఎమ్మెల్యే కాగిత చొరవతో ఆ ప్రాంత మత్స్యకారులకు, ఆక్వా రైతులకు అనుకూలంగా డ్రెయిన్ నిర్మాణం జరిగిందన్నారు. లక్ష్మీపురం నీటి సంఘం అధ్యక్షుడు పులగడం నాగభూషణం మాట్లాడుతూ లక్ష్మీపురం లాకు వద్ద రూ.లక్షా 60వేలతో నీరు-చెట్టు పథకం ద్వారా చెరువు తవ్వకం జరిపితే బీజెపీ నేత ఆలపాటి లక్ష్మీనాయణ జేబులు నింపుకున్నారనడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామంలోని కొంత మంది నాయకులు తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. నీరు-చెట్టు పథకం కింద అవినీతికి పాల్పడ్డామని ఆరోపిస్తే బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఈ సమావేశంలో డీసీ చైర్మన్ నిక్కంటి విజయ భాస్కరరావు, నిడమర్రు సర్పంచ్ బస్వాని బంగార్రాజు, బొర్రా ఏడుకొండలు, రావూరి తాతాజీ తదితరులు పాల్గొన్నారు.

రహదారి పనులు ముమ్మరం చేయాలి

బంటుమిల్లి, మే 22: పెడన నియోజకవర్గంలో జరుగుతున్న జాతీయ రహదారి 216 పనులను ముమ్మరం చేయాలని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ కోరారు. మంగళవారం మల్లేశ్వరం ఇరిగేషన్ బంగ్లాలో బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు, నీటి సంఘాల ప్రతినిధులు, జాతీయ రహదారి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా రహదారి నిర్మాణ పనులను ముమ్మరం చేయాలన్నారు. రహదారి పనుల్లో మంచినీటి పైపు లైన్లు, బంటుమిల్లి మెయిన్ కెనాల్‌పై పనులు సక్రమంగా జరగటం లేదని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విస్తరణలో సేకరించిన భూములకు నష్టపరిహారం ఇవ్వటంలో జాప్యం జరుగుతుందని విమర్శించారు. జూన్ మొదటి వారానికి జాతీయ రహదారిపై ఉన్న మంచినీటి పైపులైన్లు, బంటుమిల్లి మెయిన్ కెనాల్‌పై జరుగుతున్న పనులను పూర్తి చేస్తామని జాతీయ రహదారి విస్తరణ అధికారులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయినా నష్టపరిహారం ఇంత వరకు ఇవ్వలేదని బాధిత రైతులు వాపోయారు. ఈ సమావేశంలో జాతీయ రహదారి పీఆర్‌ఓ మురళీకృష్ణ, ఎఇ అశోక్ కుమార్, పిఎల్ బసవేశ్వరరావు, ఇరిగేషన్ డీఇ పి సూర్యభరత్, ఎఇ రాజ్యలక్ష్మి, సుజాత, తూర్పుకృష్ణ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ బడుగు వెంకటేశ్వరరావు, కృత్తివెన్ను ఎంపీపీ వలవల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.