మెయిన్ ఫీచర్

సాహితీ శిఖరం షేక్స్‌పియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొంతమంది పుట్టుకతోనే గొప్పవారవుతారు. మరికొందరు నిరంతర కృషిచేసి మహానుభావులవుతారు. ఇంకొంతమంది అనుకోని పరిస్థితుల్లో అదృష్టం కలిసివచ్చి గొప్పవారవుతారు. ఇందులో రెండో కోవకు చెందిన మహానుభావుడు విలియం షేక్స్‌పియర్. ఆంగ్ల నాటక, కవితా ప్రక్రియల్లో అతనికి అతనే సాటి. ఆంగ్లంలో రచనలు చేసినప్పటికీ అనేక ప్రపంచ భాషల్లోకి అనువాదమయ్యాయి. అంచేతనే విశ్వసాహితీ సామ్రాజ్య సార్వభౌమునిగా ఎనలేని కీర్తి, ప్రతిష్ఠలను సముపార్జించారు. రచనలు చేసి నాలుగున్నర శతాబ్దాలు గడిచినా అవన్నీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. కొందరు మహానుభావులు కేవలం వారి జయంతి, వర్ధంతుల రోజునే మనకు గుర్తుకువస్తారు. అయితే షేక్స్‌పియర్ సదా స్మరణీయుడు. సంస్కృత భాషలో కాళిదాసులా ఆయన వనె్నకెక్కారు.
షేక్స్‌పియర్ ఆంగ్లంలో మొత్తం 37 నాటకాలు, 154 భావ ప్రణయ గీతాలు రాశారు. అవన్నీ సుప్రసిద్ధమైనవే కావడం విశేషం. ఆయన రాసిన నాటకాల్లో మోదాంతమైనవి ఉన్నా, విషాదాంత నాటకాలే అధికం. ప్రపంచంలో ఎన్ని ప్రవర్తులు గల వారున్నారో అన్నిరకాల పాత్రలను సృష్టించారు. నిజ జీవితంలో ఆ పాత్రల స్వభావాలున్నవారు మనకు తారసపడుతుంటారు. ప్రపంచంలోని సింహభాగం విశ్వవిద్యాలయాల్లో ఆంగ్ల పాఠ్యప్రణాళికల్లో ఆయన రచనలను నిర్దేశించారు. ఆయన ఏ విశ్వవిద్యాలయంలో కూడా చదువుకోలేదు. అంతటి మహానుభావుడైనందునే షేక్స్‌పియర్ జయంతి, వర్ధంతి (ఒకేరోజు)నాడు ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుకోవాలని 1995లో యునెస్కో అన్ని దేశాలను కోరింది. అప్పటినుంచి ఈ దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్ 23న జరుపుకుంటున్నారు. ఆంగ్ల భాషా దినోత్సవాన్ని కూడా ఇదే రోజున నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఈ వేడుకలను ఆయా దేశాల్లో జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన పూర్వోత్తరాల్లోకి వెళితే.... లండన్‌కు 120 కి.మీ. దూరంలో ఉన్న ఎవాన్ అనే పల్లెలో 1504 ఏప్రిల్ 23న జన్మించారు. అతి సామాన్యులకు అందుబాటులో ఉండే గ్రామర్ స్కూల్లో కొంతకాలం చదివాడు. ఆర్థిక పరిస్థితులవల్ల చదువుకు స్వస్తిచెప్పాడు. అయితే ప్రపంచం అనే బడిలో ఆయన అధ్యయనం చేసిన పాఠాలు అపారం. పచ్చిక బయళ్ళూ, సెలయేటి గలగలలు, అందమైన ఎవాన్ నది, మిత్రులు, సహచరులు అతని గురువులని చెప్పుకోవచ్చు. ఉపాధి కోసం లండన్ చేరాడు. అక్కడ ఓ చిన్న ఉద్యోగంలో చేరాడు. గుర్రాలకు కాపలా ఉండే ఉద్యోగం. నాడు నాటక ప్రదర్శనలకు ప్రభువులు రథాలు, గుర్రాలపై వెళ్లేవారు. వారి గుర్రాలు ఎటూ పోకుండా నాటక ప్రదర్శన పూర్తయ్యేవరకు కాపలా కాయడమే షేక్స్‌పియర్ ఉద్యోగం. గుర్రాల మీద వచ్చిపోయే సంపన్నుల ప్రవర్తన, హావభావాలను నిశితంగా పరిశీలించేవాడు, ఈ ప్రదర్శనలకు పేదలు, మధ్యతరగతి ప్రజలు వచ్చేవారు. పేదలు, పేదరికాన్ని గమనంలోకి తీసుకొనేవాడు. ఆరోజుల్లో మహిళలు నాటక రంగంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదు. స్ర్తి పాత్రలను కూడా పురుషులే పోషించేవారు. ఓ నాటక సమాజంవారు మహిళ పాత్ర పోషించే వ్యక్తికోసం వెదుకుతున్నారు. నూనూగు మీసాలతో ఉన్న షేక్స్‌పియర్ అంద చందాలు వారికి నచ్చాయి. మహిళ పాత్రను పోషించడానికి షేక్స్‌పియర్ అతికష్టంమీద అంగీకరించాడు. దీంతో ఆయన నట జీవితం ప్రారంభమైంది. రంగస్థల నటుల నటన, హావభావాలు, సంభాషణల తీరు, ప్రేక్షకుల ప్రతిస్పందనను ఆమూలాగ్రం పరిశీలించేవాడు. నట జీవితానికి బదులుగా రచనలు చేయాలన్న బలీయమైన ఆకాంక్ష ఆయన మదిలో మెదిలింది. తొలుత ‘సానెట్స్’ 154 ప్రణయ గీతాలను రాశాడు. అయితే ఆనాటి కాలంలో నాటక సాహిత్యానికి మంచి ఆదరణ ఉన్నట్టు గమనించాడు. ఐరోపా చరిత్ర పుస్తకం ‘హాలిన్‌షెడ్ క్రానికల్’ చదివి సమ్మోహితుడైన షేక్స్‌పియర్ తొలుత చారిత్రక నాటకాలను రాశాడు. అలా వచ్చినవే హెన్రీ ద ఫోర్త్ 1, 2, 3; రిచర్డ్-2. ఆ తరువాత సాంఘిక నాటకాలు రాయడానికి శ్రీకారంచుట్టి సఫలీకృతుడయ్యాడు. గ్రీకు నాటక సాహిత్యాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయడం ఆయనకెంతో ఉపకరించింది.
ఆ తరువాత కింగ్‌జాన్, కామెడీ ఆఫ్ ఎర్రర్స్ వంటి నాటకాలు రాశారు. పరిణితి చెందిన తరువాత మర్చెంట్ ఆఫ్ వెనీస్, యాజ్ యు లైక్ ఇట్, టెల్త్‌నైట్ ఆర్ వాట్ యు విల్ వంటి ప్రమోదాంత నాటకాలు రాశారు. ఆ తరువాత జూలియస్ సీజర్, ఒథెల్లో, రోమియో-జూలియట్, క్లియోపాత్ర, మాక్బెత్, కింగ్‌వీర్ వంటి విషాదాంత నాటకాలు ఆయన కలంనుంచి వెలువడ్డాయి. చరమ దశలో- టెంపెస్ట్, వింటర్స్‌టేల్, సింబలీన్ - వంటి విషాద మిశ్రీత ప్రమోదాంత నాటకాలు రాశారు. తన నాటకాలు జీవితానికి వ్యాఖ్యానాలుగా నిలవాలనే లక్ష్యంతో సింబలీన్, టెంపెస్ట్, వింటర్స్‌టేల్ వంటి నాటకాలు రాసినట్టు స్పష్టమవుతోంది. ఏ నాటకాన్ని పరిశీలించినా ఆయన రాసిన సంభాషణలు అద్భుతంగా ఉంటాయి. ఉదాహరణకు జూలియస్ సీజర్ నాటకంలో జూలియస్ సీజర్ హత్య జరిగిన ముందురోజు రాత్రి అతని భార్య కల్ఫూర్నియా పీడకల కన్నది. ‘సీజర్‌ను హత్యచేస్తున్నారు’ అని మూడుసార్లు అరిచింది. ‘అపశకునాలు అందరికీ వర్తిస్తాయి. నా ఒక్కరికే కాదు’ అన్నాడు సీజర్. ‘గొప్పవాళ్ళు మరణిస్తే ఆకాశం మండిపోతుంది’ అంది సీజర్ భార్య. ‘పిరికిపందలు మరణానికి ముందే అనేకసార్లు చస్తారు. వీరులు మరణాన్ని ఒక్కసారి చవిచూస్తారు’ అంటాడు సీజర్. సెనేట్‌కు వెళ్ళొద్దని తన భార్య ప్రార్థించినా వినిపించుకోలేదు సీజర్. చివరకు ఆమె కల నిజమైంది. సీజర్ సెనేట్ సమావేశానికి వెళ్తాడు. అక్కడే హత్యకు గురవుతాడు. సీజర్ అంత్యక్రియలవద్ద అతని మిత్రుడు ఆంటోనీ ఇచ్చిన ఉపన్యాసం ఆంగ్ల సాహిత్య చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుంది.
ఇక షేక్స్‌పియర్ రాసిన ప్రణయ గీతాలన్నీ రసరమ్య గీతాలే. ఊహా సుందరిని ఉద్దేశించి ‘నియంతలు పతనమవుతారు, కాంస్య విగ్రహాలు మట్టిలో కలుస్తాయి. కాని నీవు నా కవిత్వంలో శాశ్వతంగా ఉంటావు’ అని షేక్స్‌పియర్ అంటాడు. కాలాన్నీ జయించే శక్తి కవిత్వానికి ఉంటుందని పేర్కొంటాడు. విశేషమేమిటంటే షేక్స్‌పియర్ రచనలలో దేశభక్తి, మానవతావాదం, శాంతికాముకత, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సౌందర్య మీమాంస కన్పిస్తాయి. 16వ శతాబ్దంనుంచి ఆయన సాహిత్యం మన్ననలను పొందుతూనే ఉంది. ఈ సువిశాల ప్రపంచంలో మానవ జీవితం ఎంతో విచిత్రమైంది. అపరిమితమైన జీవితానుభవం, అనన్య సామాన్యమైన క్రాంతిదర్శనం ఒక వ్యక్తిలో సమకూరడం ఎంతో అరుదైన విషయం. మహాకవులు, యుగకర్తలు ఎన్నో వందల ఏళ్ళకు ఒకరు జన్మిస్తుంటారు. సాహితీవేత్తలలో ఎవరెస్టు శిఖరం అంత ఎత్తయినవాడు షేక్స్‌పియర్. ఇందుకు ఆయన రాసిన నాటక సాహిత్యం నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మనిషి జీవితం పూర్తిగా దుఃఖం లేదా సంతోషం కాదని గ్రహించాడు. మనుషుల మధ్య ప్రేమ, స్నేహం, నమ్మకం, అపనమ్మకం, వంచన, కోపం, క్రౌర్యం మిళితమై ఉంటాయని అనుభవంలో తెలుసుకున్నాడు. వీటినే తన నాటక రచనలో ఇతివృత్తాలుగా ఉపయోగించాడు. అంచేతనే ఆయన రాసిన నాటకాలన్నీ సూర్య, చంద్రాదులున్నంతవరకు శాశ్వతంగా నిలిచిపోతాయి.
షేక్స్‌పియర్ ప్రఖ్యాత నాటకకర్తగానే కాకుండా మహాకవిగా కూడా విశ్వసాహిత్యం కీర్తించింది. మరో ప్రత్యేకత ఏమిటంటే ఆయన నాటకాలను చదివినప్పుడు ఆయన పాత్రల స్థితిలో మనం వుంటే మనంకూడా వాళ్లవలెనే ప్రవర్తించక తప్పదనే భావం కలుగుతుంది. మానవ ప్రతిపాదితమైన వేదాంతంకంటే మానవత్వమే ఉన్నతమైందని ఆయన రచనలు పేర్కొంటాయి. వాస్తవ మానవ ప్రకృతిని పునాదిగా చేసుకొని రాసిన నాటకాలు, ప్రణయ గీతాలు హృదయ ఫలకాలపై చెరగని ముద్రవేస్తాయనేది అక్షర సత్యం. 52 వసంతాలు జీవించి తన పుట్టినరోజునాడే 1616 ఏప్రిల్ 23న ఈ సుందర ప్రపంచాన్ని వీడి వెళ్ళాడు.

- వాండ్రంగి కొండలరావు, 9490528730