క్రైమ్ కథ

వీలునామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేల్కోం, డేవిడ్ మిత్రులు. లాయర్లు. లాయర్ ప్రాక్టీస్‌లో భాగస్వాములు కూడా. ఆ ఉదయం డేవిడ్ ఆఫీస్‌కి వచ్చాక ది టైమ్స్ దిన పత్రికని చదివాడు. తర్వాత తన భాగస్వామి మేల్కోంని గట్టిగా అడిగాడు.
‘ఏంబ్రోస్ స్వెండర్ మన క్లైంట్ కదూ?’
‘అవును. ఆ వింత మనిషే కదా? ఏం?’ మేల్కోం ప్రశ్నించాడు.
‘అతను మరణించాడనే వార్త వచ్చింది. కొంతకాలం హాస్పిటల్లో అనారోగ్యంతో ధైర్యంగా పోరాడాక నిన్న మరణించాడు. అతని గౌరవార్థం పూలగుత్తులు పంపకుండా, వాటిని పంపదలుచుకున్న వారు ఇంపీరియల్ వార్ విడోస్ కమిషన్‌కి ఆ డబ్బుని పంపమని వారి కుటుంబ సభ్యులు ప్రకటన ఇచ్చారు.’
మేల్కోం కొన్ని క్షణాలు ఆలోచించి చెప్పాడు.
‘అతని విల్లు మన దగ్గర భద్రపరిచాడు. మరణానంతరం తన కుటుంబ సభ్యులకి దాన్ని చదివి వినిపించమని కోరాడు.’
‘నాకు అది గుర్తుంది. ఆరు వారాల క్రితం అనుకుంటా అతను హాస్పిటల్లో చేరబోయే ముందు ఇక్కడికి వచ్చి, విల్లు రాయించి సంతకం చేసి వెళ్లాడు.’
మేల్కోం వెంటనే లేచి క్లైంట్స్ వీలునామాలని ఉంచే సేఫ్ లాకర్ని తెరిచి, ఏంబ్రోస్ స్వెండర్ అని రాసి ఉన్న దళసరి గోధుమ రంగు కవర్ని వెదికి తీశాడు. దాన్ని చింపి అందులోంచి విల్లున్న మరో కవర్ని తీసి, దానికి దారం కట్టి లక్క సీల్ వేసిన కవర్ని బయటకి తీశాడు. అందులోంచి మరో చిన్న తెల్ల కవర్ కూడా బయటకి వచ్చింది. దాని మీద ‘దీన్ని నా విల్లుతోపాటు ఉంచి, నా మరణానంతరం తర్వాతే తెరవాలి. -ఏ.ఎస్.’ అని టైప్ చేసి ఉంది.
‘ఈ కవర్ని నేను చూసిన గుర్తు లేదు. నీకు తెలుసా?’ మేల్కోం అడిగాడు.
డేవిడ్ కూడా దాన్ని పరిశీలించి చూసి తల అడ్డంగా ఊపాడు. డేవిడ్ ఓ కత్తెరతో ఆ చిన్న తెల్ల కవర్ని చింపి, అందులోంచి ఓ లేత పసుపురంగు కాగితాన్ని తీసి చదివి చెప్పాడు.
‘ఓ మైగాడ్! నేను నమ్మలేను’
‘ఏమిటది?’ మేల్కోం వెంటనే ప్రశ్నించాడు.
డేవిడ్ వౌనంగా అందించిన ఆ ఉత్తరాన్ని చదివాడు. అది టైప్ చేసి ఉంది. కింద సంతకం బదులు ఏంబ్రోస్ స్వెండర్ అనే పేరు టైప్ చేసి ఉంది.
‘ఇది జోకై ఉండచ్చా?’ దాన్ని చదివాక మేల్కోం అడిగాడు.
‘కావచ్చు. స్వెండర్ ఇలాంటి జోకులు చాలా వేస్తాడని విన్నాం. ఇది జోకైతే తెలివైన పని దీన్ని చింపేయడం.’
‘గుడ్ హెవెన్స్! మనం అతని విల్లుని అమలుపరిచే అధికారిగా ఆ పని చేయకూడదు. కాని ఇది నిజమైతే?’
‘అలాంటప్పుడు దీన్ని పోలీసులకి చూపించాలి. ఇంకా ఆ కేస్‌ని మూసేయలేదని ఈ మధ్యనే పేపర్లో చదివాను’ డేవిడ్ చెప్పాడు.
‘్థరీసా స్టేన్లీ విషపు మనిషి. నేను ఆమె తల మీద బాది చంపినందుకు నాకు పశ్చాత్తాపం, విచారం రేవు. దీన్ని నా విల్లుతో ఉంచడానికి కారణం మరో అమాయకుడ్ని చట్టం శిక్షించకూడదని. ఆమెకి చాలామంది శత్రువులు ఉన్నారు. ఒకవేళ పోలీసులు దీన్ని నమ్మకపోతే పంది చర్మం గ్లవ్ శవం పక్కన దొరికిందేమో వారిని అడగండి.’
‘కాని ఓ క్లైంట్‌కి చెందిన విషయాలు అతని లేదా అతని కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా మనం పరాయి వాళ్లకి చెప్పకూడదు’ మేల్కోం మరోసారి ఆ ఉత్తరాన్ని చదివి చెప్పాడు.
ఆ ఇద్దరు లాయర్లూ ఆ విషయం మీద తర్జనభర్జన పడుతూంటే ఫోన్ మోగింది. మేల్కోం రిసీవర్ ఎత్తాడు.
‘హలో మిస్టర్ మేల్కోం. నేను ఏంబ్రోస్ స్వెండర్ని; ఇప్పుడే ది టైమ్స్‌ని చదివాను. పోయిన ఏంబ్రోస్ స్వెండర్ నా కజిన్. మా ఇద్దరి పేర్లూ ఒకటే. నేను హాస్పిటల్ నించి డిశ్చార్జ్ అయ్యాక మిమ్మల్ని కలుస్తాను. ఒకటి, రెండు ముఖ్యమైన విషయాలు మీతో చర్చించాలి. గుడ్‌బై’
ఏంబ్రోస్ చెప్పింది మేల్కోం తన పార్ట్‌నర్‌కి చెప్పాక మళ్లీ చెప్పాడు.
‘ఐతే దీన్ని తిరిగి కవర్లో ఉంచేద్దాం. మనకి ఇచ్చిన సూచన తను మరణించేదాకా దీన్ని తెరవద్దని’
‘మనం చట్టాన్ని కాపాడే వృత్తిలో ఉన్నాం’ డేవిడ్ చెప్పాడు.
‘కావచ్చు. కాని ఈ సమాచారం మనకి నియమానికి విరుద్ధంగా తెలిసింది. అతను జీవించి ఉండగా అతని కవర్ని తెరిచే హక్కు మనకి లేదు’
‘మన క్లైంట్ పట్ల మనకి ఎంత బాధ్యత ఉందో న్యాయం, ప్రజల పట్ల కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి మన బాధ్యత క్లైంట్ వైపే కాదు. ఓ నేరానికి చెందిన ముఖ్య సమాచారం మనకి తెలిసీ, పోలీసుల నించి దాచి పెట్టడమంటే మనం ఆ నేరంలో సహచరులమైనట్లే. పోలీసులు ఎవరైనా అమాయకుల్ని అరెస్ట్ చేశాక ఈ ఉత్తరాన్ని పోలీసులకి ఇస్తే అప్పుడు వాళ్లు దీన్ని మనమే సృష్టించామని అనుమానిస్తారు. ఎందుకంటే దీని మీద సంతకం లేదు’ డేవిడ్ చెప్పాడు.
‘టైపింగ్ అంటే స్ఫురిస్తోంది. ఈ ఉత్తరాన్ని ఇదే ఆఫీస్‌లో టైప్ చేసినట్లున్నారు. విల్లు గురించి చర్చించడానికి వచ్చినప్పుడు స్వెండర్ ఖాళీగా ఉన్న టైపింగ్ అసిస్టెంట్ గదిలో కొద్దిసేపు వేచి ఉన్నాడు. అప్పుడు దీన్ని టైప్ చేసి ఉండవచ్చు’
డేవిడ్ ఆ ఉత్తరాన్ని మరోసారి చదివి చెప్పాడు.
‘నువ్వు చెప్పింది నిజం అనుకుంటా. ఇది క్రీం రంగు దళసరి కాగితం. మన దగ్గర దీని స్టాక్ ఉంది. ఇంత దళసరి కాగితం వాడుతూంటే కార్బన్ కాపీలో అక్షరాలు సరిగ్గా పడటం లేదని టైపిస్ట్ ఫిర్యాదు చేసింది కూడా.
వాళ్లిద్దరూ ఆ విషయం మీద ఏం చేయాలా అని కాసేపు చర్చించుకుని ఓ నిర్ణయానికి వచ్చారు.
* * *
థెరీసా హత్యని తనే చేసాననే ఆ ఒప్పుకోలు టైప్డ్ పత్రాన్ని చదివిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మేల్కోంని కొద్దిగా నివ్వెరపోతూ అడిగాడు.
‘దీన్ని ఎవరు రాసారు?’
‘సారీ! అది మీకు నేను చెప్పకూడదు’
‘ఇది మీ చేతికి ఎలా వచ్చింది?’
‘అదీ నేను మీకు చెప్పకూడదు. అది కాన్ఫిడెన్షియల్’
‘కాని మీరు ఎవరికైనా, ఎప్పుడైనా ఇది చెప్పి తీరాలి. కాబట్టి ఇప్పుడే నాకు చెప్పచ్చుగా?’ సూపరింటెండెంట్ కోరాడు.
‘లాయర్‌కి, అతని క్లైంట్‌కి మధ్య గల సమాచారం ఇది. కాబట్టి కాన్ఫిడెన్షియల్’
‘లాయర్, క్లైంట్ మధ్యే కావచ్చు. కాని ఇది హత్య కేసుకి సంబంధించింది. చట్టానికి నిజాలు చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది’
‘ఈ విషయం లా సొసైటీకి రాసి వారి సలహా ప్రకారం చేస్తాను’
‘సరే. మరి ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లు? మీరు ఇక వెళ్లచ్చు’ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అసహనంగా చెప్పాడు.
* * *
మళ్లీ లాయర్లు ఇద్దరూ ఆ విషయం మీద చర్చించుకున్నారు.
‘మనం అతని పేరు చెప్తే పోలీసులు హాస్పిటల్‌కి వెళ్లి ఏంబ్రోస్ స్వెండర్ని ఈ విషయం మీద ప్రశ్నిస్తే అతను హృద్రోగి కాబట్టి మరణించచ్చు కూడా’ మేల్కోం చెప్పాడు.
‘కాని అది అతని తప్పే. ఆ పిచ్చి ఉత్తరాన్ని రాసి తన మీదకి తెచ్చుకున్నాడు.’
‘మనం ఆ ఉత్తరం అతను జీవించి ఉండగా ఎందుకు తెరిచామని ఏంబ్రోస్ అడిగితే? హతురాలు థెరీసా హై క్లాస్ వేశ్య. ఫోన్ ద్వారా అపాయింట్‌మెంట్స్ ఇచ్చేది. వేశ్యగానే కాక బ్లాక్‌మెయిల్ ద్వారా కూడా ఆమె సంపాదించేది. ఆమె కస్టమర్స్ అంతా గౌరవనీయమైన పౌరులని పత్రికల్లో రాశారు. ఆ ఉత్తరం గురించి చెప్పింది నువ్వు కాబట్టి పోలీసులు నిన్ను కూడా హంతకుడిగా భావించి ప్రశ్నించచ్చు. హత్య జరిగిన రోజు ఆ సమయంలో నీ ఎలిబీని చెక్ చేస్తారు. అర్ధరాత్రి ఒంటరిగా ఇంట్లో నిద్రించే నీకు ఎలిబీ ఉండదు. ఇదంతా పత్రికల్లోకి ఎక్కుతుంది. నువ్వు పోలీసుస్టేషన్ నించి బయలుదేరగానే సూపరింటెండెంట్ నాకు ఫోన్ చేసి తను వస్తున్నానని, తనకి సహకరించమని చెప్పాడు’ డేవిడ్ చెప్పాడు.
మేల్కోం మొహం మాడిపోయింది.
‘వాళ్లు రుజువు చేయలేరు కాని పరువు పోతుంది’ గొణిగాడు.
* * *
‘అలాగా? మీ ఇద్దరిలో ఎవరు ఆ విల్లున్న కవర్ని తెరిచింది? మీరా? మీ భాగస్వామా?’ సూపరింటెండెంట్ మార్కర్ ప్రశ్నించాడు.
‘నేనే తెరిచాను’ మేల్కోం చెప్పాడు.
‘ఎలాంటి కవరది?’
‘దళసరి మనీలా కవర్. క్లైంట్ల ముఖ్యమైన కాగితాలు, విల్లులు వాటిల్లో ఉంచి, వాటిని ఐరన్ సేఫ్‌లో భద్రపరుస్తాం’
‘క్లైంట్స్ విల్లులే కాక ఇలాంటి ఉత్తరాలు కూడా ఇస్తూంటారా?’
‘ఆ. విల్లు ఎప్పుడూ ఎవరి సమక్షంలో ఏ ప్రదేశంలో చదవాలి లాంటి సూచనలు గల వేరే కవర్లు ఇస్తూంటారు’
‘సరే. అతని కవర్ని చూపించండి. దాని మీద వేలిముద్రలని, ఈ ఉత్తరం మీది వేలిముద్రలని పోల్చి చూస్తాం.’
డేవిడ్ లేచి, ఐరన్ సేప్ తెరచి ‘ఏంబ్రోస్ స్వెండర్ విల్’ అని రాసిన కవర్ని తెచ్చి సూపరింటెండెంట్ మార్కర్‌కి ఇచ్చాడు. ఆయన దాన్ని తెరిచి లోపల నించి సీల్డ్ విల్ కవర్ని తీసాడు. ‘ఇంకేవో ఉన్నాయి’ చెప్పి, ఆయన అందులోని అరడజను చిన్న తెల్ల కవర్లని కూడా బయటకి తీశాడు.
‘ఇవి కూడా ఏంబ్రోస్‌కి సంబంధించినవేగా?’
‘అవును. కాని...’
మేల్కోంని మాట్లాడద్దు అన్నట్లుగా డేవిడ్ సైగ చేశాడు.
‘వీటిల్లోని వేలిముద్రలు అతనివి మాత్రమే ఉండాలి’ చెప్పి సూపరింటెండెంట్ జేబులోంచి గ్లవ్స్ తీసి తొడుక్కుని ఓ కవర్ని చింపి చదివాడు. అతని మొహంలో ఆశ్చర్యం కనిపించింది. వెంటనే అన్ని కవర్లని చింపి వాటిలోని ఉత్తరాలని బయటకి తీసాడు. అదే రంగు కాగితం. అవన్నీ అదే టైప్‌రైటర్ని ఉపయోగించి టైప్ చేసిన ఉత్తరాలు. ‘నా విల్లుతోపాటు ఉంచి నా మరణానంతరం చదవాలి’ అని ప్రతీ కవర్ మీదా టైప్ చేసి ఉంది.
‘నేనే జాక్ ది రిప్పర్ అని పోలీసు సూపరింటెండెంట్‌కి తెలియచేయండి. ఏ. ఎస్’
‘జాన్ ఎఫ్ కెన్నడీని కాల్చి చంపింది నేనే. ఆ తుపాకీ స్మిత్‌సోనియన్ మ్యూజియంలోని గది నంబర్ పధ్నాలుగులో ఉంది. -ఏ. ఎస్.’
‘మరో రెండు రహస్యాలు ఛేదించబడ్డాయి’ డేవిడ్ నవ్వుతూ చెప్పాడు.
‘మీ క్లైంట్ స్వెండర్ పిచ్చివాడో, మేథావో అయి ఉండాలి’
‘కాదు. ప్రాక్టికల్ జోకర్. తను మరణించాక అందర్నీ నవ్వించాలి అని అనుకున్నట్లున్నాడు’ డేవిడ్ చెప్పాడు.
‘కాని ఆ గ్లవ్ గురించి.. ఏమో? మా సిబ్బందిలో ఎవరో, ఎవరికో చెప్పి, వాళ్లు ఇంకెవరికో చెప్పి.. ఆ వేశ్య కేస్ పరిష్కరించబడిందని సంతోషించాను. హత్య కేసుల్లో మేము చివరి దాకా పరిశోధించాలి’ బాధగా చెప్పి సూపరింటెండెంట్ బయటకి నడిచాడు.
‘నిన్న ఆ కవర్లో ఆ ఒక్క ఉత్తరం తప్ప ఇన్ని లేవు. నన్ను రక్షించినందుకు థాంక్స్’ మేల్కోం తన భాగస్వామితో కృతజ్ఞతగా చెప్పాడు.
‘అలాంటి మరి కొన్ని ఉత్తరాలని టైప్ చేసి ఆ సీల్డ్ కవర్లో ఉంచాలన్న నా ఆలోచన పారింది. థెరీసా నిన్ను బ్లాక్‌మెయిల్ చేసేదని నువ్వామెని చంపేసావన్నమాట’
‘అవును. ఆ బ్లాక్‌మెయిలింగ్‌ని తట్టుకోలేక ఆ రోజు చంపేసాను. ఆమె కేసు అపరిష్కృతంగా ఉన్నంత కాలం నాకు ప్రమాదమని, స్వెండర్ మరణించాడని చదవగానే ఆలోచన వచ్చి ఆ ఉత్తరాన్ని అతని కవర్లో ఉంచి మళ్లీ సీల్ చేస్తాను. నువ్వా కవర్ తెరిచి చదువుతావని నాకు తెలుసు. ఆ హత్యానేరం అతని మీదకి వెళ్లి అంతటితో కేస్ మూసేస్తారని అనుకున్నాను’
తనని కూడా థెరీసా బ్లాక్‌మెయిల్ చేసేదని, ఆ కోపంతోనే మేల్కోంని రక్షించానన్న అసలు రహస్యం మాత్రం డేవిడ్ మిత్రుడికి చెప్పలేదు.
--------------------------------------------------
(మైఖేల్ గిల్బర్ట్ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి