ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయ పార్టీలు ప్రధాన పాత్ర నిర్వహించే పరిస్థితులు నెలకొంటున్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ రాజకీయ ప్రాధాన్యత తగ్గుముఖం పట్టటంతో ప్రాంతీయ పార్టీలు 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నాయి. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కర్నాటక ముఖ్యమంత్రి డి.కుమారస్వామి, మాజీ కేంద్ర మంత్రి, ఎస్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్, సీపీఎం, డీఎంకే తదితర పార్టీలు 2019 లోక్‌సభ ఎన్నికలను పూర్తి స్థాయిలో ప్రభావితం చేయనున్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆశించిన స్థాయిలో పుంజుకోకుండా వరుస ఓటములతో ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోవటంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. కాంగ్రెస్ నిర్వీర్యం కావటం వలన ఏర్పడుతున్న ఖాళీని భర్తీ చేసే శక్తిగా ఎదిగేందుకు ప్రాంతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో ఈ పార్టీలు అత్యంత కీలక పాత్ర నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, కర్నాటక తదితర ఏడెనిమిది రాష్ట్రాల్లో ఈ పార్టీలు మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మహాకూటమి జాతీయ స్థాయిలో ఏర్పడకపోయినా ఆయా రాష్ట్రాల వారీగా సీట్ల సర్దుబాటు చేసుకోవటం ద్వారా బీజేపీని నిలువరించే పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రాంతీయ పార్టీలు లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒక కూటమిగా ఏర్పడకపోయినా ఎన్నికల అనంతరం ఒక గొడుగు కిందికి రావటం ఖాయమని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించటం గమనార్హం. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్టా జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేయటం సాధ్యం కావటం లేదు, అందుకే వీరు ఆయా రాష్ట్రాల స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రెండు, మూడు ప్రాంతీయ పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ తన ప్రాధాన్యతను కోల్పోతుంటే ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు 2019 లోక్‌సభ ఎన్నికల్లో కీలక పాత్ర నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఉత్తర ప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు కనుమరుగై ప్రాంతీయ పార్టీలు ప్రధాన పాత్ర నిర్వహించనున్నాయి. దేశంలోని అతి పెద్ద రాష్ట్రం కావటంతోపాటు ఎనభై మంది లోక్‌సభ సభ్యులను పార్లమెంటుకు పంపిస్తున్న ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, బీఎస్పీ ఆర్.ఎల్.డీలు సీట్ల సర్దుబాటుకు రంగం సిద్ధమైంది. మొత్తం ఎనభై లోక్‌సభ సీట్ల నుండి నలభై నుండి నలభై ఐదు సీట్లను బీఎస్పీకి ఇచ్చేందుకు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అంగీకరించటం గమనార్హం. బీఎస్పీ, ఎస్పీ, అజిత్ సింగ్ నాయకత్వంలోని ఆర్‌జేడీ సీట్ల సర్దుబాటు జరిగితే ఈ కూటమి మెజారిటీ సీట్లు గెలుచుకోవటం ఖాయం. బీఎస్పీ, ఎస్పీ, ఆర్.ఎల్.డీలు గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్, కైరానా లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో తమ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవటం ద్వారా తమ బల ప్రదర్శన జరిపారు. ఈ మూడు పార్టీలు వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే విధమైన ఫలితాలను సాధిస్తారనే మాట వినిపిస్తోంది. దేశంలోని అతి పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. ఎస్పీ, బీఎస్పీ, ఆర్.ఎల్.డీ మహాకూటమి కాంగ్రెస్‌కు కేవలం ఆరు లోక్‌సభ సీట్లు ఇవ్వజూపటం ఆ పార్టీ ప్రాధాన్యత ఏమిటనేది స్పష్టం చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీలతో సీట్ల సర్దుబాటుకు చర్చలు జరిపే పరిస్థితిలో లేదు. గత ఎన్నికల్లో 80 నుండి 72 సీట్లు గెలుచుకున్న బీజేపీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇరవై, ఇరవై ఐదు కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే పరిస్థితిలో లేదనే మాట వినిపిస్తోంది. ఎస్పీ, బీఎస్పీ, సీట్ల సర్దుబాటు చేసుకుంటే తమ పరిస్థితి అధోగతేనని బీజేపీ ఎంపీలు బాహాటంగా చెప్పుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ బలంగా ఉన్నా ఎస్పీ, బీఎస్పీ, మద్దతు లేకపోతే మెజారిటీ సీట్లు గెలిచే పరిస్థితి కనిపించటం లేదు. బిహార్‌లో ఆర్.జె.డీ, వామపక్షాలు సీట్ల సర్దుబాటు చేసుకుంటే మహారాష్టల్రో కాంగ్రెస్, ఎన్‌సీపీ వాపపక్షాలు ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. శివసేన కూడా వీరితో చేతులు కలిపినా ఆశ్చర్యపోకూడదు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడులో డీ.ఎం.కే-కాంగ్రెస్ కీలక పాత్ర నిర్వహించనున్నాయి. అయితే కేంద్రంలో ఇలా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు ఎక్కువ కాలం అధికారం కొనసాగించలేకపోయాయి. భిన్న సిద్ధాంతాల పార్టీలు ఒక కూటమిగా ఏర్పడటం వలన ఈ ప్రభుత్వాలు అంతర్గత కుమ్ములాటలు, సిద్ధాంతపరమైన విభేదాల మూలంగా కుప్పకూలాయి.
గతంలో కూడా జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేయటంతో పాటు అధికారంలోకి వచ్చిన పలు సంఘటనలున్నాయి. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన అనంతరం 1977లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఓడించేందుకు భారతీయ లోక్‌దళ్, కాంగ్రెస్ (ఓ), భారతీయ జనసంఘ్, సోషలిస్ట్ పార్టీలు జనతా పార్టీగా ఏర్పడి అధికారంలోకి వచ్చినా మూడు సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉండగలిగింది. ప్రధాన మంత్రి పదవి చేపట్టిన మొరార్జీదేశాయ్, చౌదరి చరణ్‌సింగ్ మొండివైఖరి, అంతర్గత కుమ్ములాటలు, సిద్ధాంతపరమైన విభేదాల మూలంగా జనతా పార్టీ ప్రభుత్వం కుప్పకూలింది. ఎక్కువ కాలం అధికారంలో ఉండలేకపోవటం విదితమే. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావు అధ్యక్షుడు, వీపీ సింగ్ కన్వీనర్‌గా ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కూడా 1989 నుండి 1991 వరకు మాత్రమే అధికారంలో ఉండగలిగింది. జనతాదళ్ నాయకత్వంలో తెలుగుదేశం, డీఎంకే, అస్సాం గణపరిషత్, భారత సోషలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు సభ్యులుగా ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో వీపీసింగ్, చంద్రశేఖర్ ప్రధాన మంత్రి పదవులు చేపట్టారు. 1996-1998 మధ్య జరిగిన యునైటెడ్ ఫ్రంట్ ప్రయోగం కూడా ఇలాంటిదే. జనతాదళ్, సమాజ్‌వాది పార్టీ, డీఎంకే, తెలుగుదేశం, ఏజీపీ తివారీ కాంగ్రెస్, నాలుగు వాపక్షాలు, తమిళ మానిల కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, ఎంజీపీ తదితర పార్టీల కూటమిగా ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ఫ్రభుత్వంలో దేవెగౌడ, ఐ.కే.గుజ్రాల్ ప్రధాన మంత్రి పదవులు చేపట్టారు. బైటి నుండి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి ప్రధాన మంత్రి పదవి ఆశ మూలంగా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కుప్పకూలింది.
2008లో ఎనిమిది ప్రాంతీయ పార్టీలతో కూడిన ఒక కూటమి ఏర్పడినా అది ఎక్కువ కాలం నిలవలేదు. యూపీఏ, ఎన్.డీ.ఏలో లేని ఎనిమిది పార్టీలు, అఖిల భారత అన్నా ద్రావిడ మునే్నత్ర కజగం, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్, బీఎస్పీ, బీజేడీ, సీపీఐ, సీపీఎం లోకదళ్, జేడీ (ఎస్), జనతాదళ్ (ఎస్), జార్కండ్ వికాస్ మోర్చా, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఈ కూటమిని ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్, బీజేపీ అనుసరిస్తున్న ధనిక అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ఏర్పడిన యునైటెడ్ నేషనల్ గ్రోగ్రెస్సివ్ అలయన్స్ కొన్ని నెలలకే విచ్ఛిన్నమై 2019లో తృతీయ ఫ్రంట్ పేరుతో మరోసారి ప్రజల ముందుకు వచ్చినా నిలదొక్కుకోలేకపోయింది. చెప్పొచ్చేదేమిటంటే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ సీట్లు గెలుచుకుంటే జాతీయ స్థాయిలో అస్థిర రాజకీయ పరిస్థితులు నెలకొనటం ఖాయం.

-కె.కైలాష్ 98115 73262