క్రైమ్ కథ

మళ్లీ రేపు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది ఆ సంవత్సరంలోని అతి చలి రోజు. లెఫ్టినెంట్ బర్టన్ గ్లవ్స్‌ని ఇంటి దగ్గరే మర్చిపోయాడు. పార్కింగ్ లాట్ లోంచి పెట్రోల్ కార్‌ని బయటకి పోనిస్తూంటే, స్టీరింగ్ వీల్ చాలా చల్లగా తగలడంతో తన షిఫ్ట్ మొత్తం గ్లవ్స్ లేకుండా డ్రైవ్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. కారు ఫెర్రీస్ స్ట్రీట్‌లోకి మళ్లగానే అక్కడ అనేక చిన్న దుకాణాల సముదాయం కనిపించింది. బర్టన్ బీట్లో, అంతేకాక ఆ ఊరి మొత్తానికి అది నేరమయమైన ప్రదేశం. అక్కడి చిన్న వ్యాపారస్థుల రక్షణ తన ప్రత్యేక బాధ్యత అని బర్టన్ భావిస్తూంటాడు. తన పద్ధతిలో అతను వారిని ఓ కంట కనిపెడుతూంటాడు.
***
ఫెర్రీ లిక్కర్ స్టోర్ యజమాని మారినో పక్కనే ఉన్న బ్రౌన్స్ మెన్స్‌వేర్ దుకాణం యజమాని బ్రౌన్ దగ్గరకి వెళ్లి ముచ్చటిస్తున్నాడు. తలుపు తెరుచుకుని లోపలకి వచ్చిన బర్టన్‌ని చూసి బ్రౌన్ విష్ చేశాడు.
‘ఆఫీసర్ బర్టన్! గుడ్ మార్నింగ్!’
‘మిస్టర్ బ్రౌన్! మిస్టర్ మారినో, మీ ఇద్దరికీ గుడ్ మార్నింగ్’
‘మీకేం కావాలి?’ బ్రౌన్ మర్యాదగా అడిగాడు.
‘ఇంట్లో గ్లవ్స్ మర్చిపోయాను. అవి లేకుండా రోజు గడవడం కష్టం’
‘ఐతే ఏ గ్లవ్స్ కావాలో చూసుకోండి’
బర్టన్‌ని బ్రౌన్ గ్లవ్స్ ఉన్న కౌంటర్ దగ్గరికి తీసుకెళ్తూంటే లిక్కర్ స్టోర్ యజమాని మారినో వాళ్లని నిశ్శబ్దంగా గమనించాడు.
బ్రౌన్ ఓ గ్లవ్స్ జతని అందుకుని చూపిస్తూ చెప్పాడు.
‘ఇవి చక్కటి డ్రైవింగ్ గ్లవ్స్. మీకు సరిపోతాయేమో చూడండి’
‘సరిపోయాయి’ వాటిని తొడుక్కుని చూసి బర్టన్ చెప్పాడు.
‘ఐతే తీసుకోండి’
లెఫ్టినెంట్ బర్టన్ ఇద్దరికీ గుడ్‌బై చెప్పి, ఈల వేసుకుంటూ బయటకి నడిచాడు. తన దగ్గరకి వచ్చిన బ్రౌన్‌ని మారినో అడిగాడు.
‘అతను డబ్బు చెల్లించలేదు?’
‘అది నీకు సంబంధం లేని విషయం’ బ్రౌన్ ఖండించాడు.
‘నిజానికి నాకు సంబంధం ఉంది. డబ్బు చెల్లించకుండా నువ్వు అతనికి ఏదైనా ఇస్తే ఇతర దుకాణాల్లో కూడా అతను అదే పని చేస్తాడు. నిజానికి నా దగ్గర అతని పప్పులు ఉడకలేదు. వాడో దొంగ’
‘నువ్వు లిక్కర్ దుకాణం ఆరంభించి ఎంత కాలమైంది?’
‘దాదాపు సంవత్సరం. ఐతే?’
‘అంటే నీకు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు పరిచయం. నేను కనీసం డజను మందిని చూశాను. వారిలో కొందరు కళ్లు కప్పి దొంగిలిస్తారు. పట్టుకుని ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తే వాళ్లు ఫైన్స్ రాస్తారు. కొందరు నిజాయితీపరులు డబ్బు చెల్లించి కొంటారు. కాబట్టి నేను సుదీర్ఘానుభవంతో చెప్తున్నాను. బర్టన్ మంచి పోలీస్ ఆఫీసర్.’
‘అదెలా? ఇప్పుడే డబ్బివ్వకుండా గ్లవ్స్‌ని తీసుకెళ్లాడు కదా?’
‘డబ్బు చెల్లించకపోవడం నిజమే. నేనే అతనికి వాటిని ఇచ్చాను. నేను డబ్బడిగి ఉంటే వాటిని వెనక్కి ఇచ్చేసేవాడు. నీ దుకాంలో కూడా ఇదే కదా జరిగింది?’
‘అవును. కాని...’
‘నీ వీపు అతని వైపు తిరిగి ఉన్నప్పుడు నువ్వు అతన్ని నమ్మచ్చు. నీకు చెప్పకుండా ఏదీ తీసుకోడు. నువ్వు బహుమతి అని చెప్పి ఇచ్చినా తీసుకోడు. తీసుకున్న వస్తువుకి డబ్బు చెల్లించడం మర్చిపోతూంటాడు. అందరిలాగే, నాలా బర్టన్ కూడా కొద్దిగా అవినీతిపరుడు’ బ్రౌన్ నవ్వి చెప్పాడు.
‘నేను అవినీతిపరుడ్ని కాదు...’
‘నువ్వు చెల్లించే టేక్సుల మాటేమిటి? నీ అకౌంట్స్‌ని ఆడిట్ చేయడానికి నువ్వు సిద్ధమేనా?’
మారినో బదులు చెప్పలేదు.
‘నీ దుకాణంలో ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు దొంగలు పడ్డారు?’ బ్రౌన్ అడిగాడు.
‘ఒక్కసారే. దుకాణంలో నా సహాయకుడు మాత్రమే ఉన్నప్పుడు. అదృష్టవశాత్తు ఎవరికీ హాని జరగలేదు’
‘ఇంకో దొంగతనానికి ఇప్పటికే ఆలస్యమైందనే చెప్తాను. బర్టన్ మన జూరిస్‌డిక్షన్‌లోకి రాకమునుపు ఎక్కువ దొంగతనలు జరిగేవి. అతను వచ్చాక బాగా తగ్గాయి. గత పదేళ్లలో అవి తగ్గడం ఇదే మొదటిసారి. ఏ దొంగతనాన్ని అతను వదిలిపెట్టడు. నా కారు దొంగిలించిన కుర్రాళ్లని వెదికి వెంటనే పట్టుకున్నాడు. కోర్ట్‌లో కేసుని ఎంత బాగా చెప్పాడంటే ప్రాసిక్యూటర్ నన్ను కోర్ట్‌కి రమ్మని పిలవలేదు. దాంతో నాకు కోర్ట్‌లో ఓ రోజు వృధా కాలేదు.’
‘ఐనా అతను అవినీతిపరుడే’ మారినో పట్టుదలగా చెప్పాడు.
‘సరే. అతనిలో లోపం ఉందని ఒప్పుకుందాం. ఎలాంటి లోపాలు లేని మంచి మనిషిని నేను ఇటీవలి కాలంలో కలవలేదు. అలాంటి పోలీస్ ఆఫీసర్ మనకి వచ్చేదాకా తన పనిని చక్కగా చేసే కొద్దిగా అవినీతిపరుడితో నేను రాజీ పడతాను. చుట్టుపక్కల దుకాణాల యజమానులు కూడా నా మాటలతో తప్పక ఏకీభవిస్తారు’
‘నువ్వు చెప్పేది ఆశ్చర్యంగా ఉంది బ్రౌన్! రక్షణ పేరుతో జరిగే ఇది అవినీతి అనుకోవా?’
‘అనుకుంటాను. గతంలో అలాంటి రక్షణ ఇచ్చే ఓ పోలీస్‌ని చూశాను. అతనికి, ఇతనికి గల తేడా నాకు తెలుసు. మనల్ని బాధించకుండా మనం బర్టన్‌కి ఎదురు చెల్లించడం లేదు. మనల్ని బాధించే వారి నించి అదనపు రక్షణ ఇవ్వడానికి చెల్లిస్తున్నాం. అది రక్షణ పేరుతో చేసే అవినీతి అని నువ్వు అనుకుంటే మనం ఆర్మీకి, ఎయిర్‌ఫోర్స్‌కి చెల్లించే టేక్స్‌లని ఏమని పిలుస్తావు?’
ఆ మాటలతో ఏకీభవించని మారినో తన దుకాణంలోకి వౌనంగా నడిచాడు.
***
లెఫ్టినెంట్ బర్టన్ తన పహారా ఏరియాలోని మరోవైపు ఓ రెస్ట్‌రెంట్‌లో లంచ్ చేస్తూంటే అతని ఆలోచనలన్నీ ఫెర్రీ స్ట్రీట్ మీదకే మళ్లాయి. ఆ సాయంత్రం అతను తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి డిన్నర్ తీసుకోబోతున్నాడు. ఆ సందర్భంగా ఓ ఖరీదైన వైన్ సీసా అతనికి అవసరం. దురదృష్టవశాత్తు అతని బీట్‌లో మారినో నడిపే ఫెర్రీ లిక్కర్ షాప్‌లోనే అది దొరుకుతుంది. మారినో సహకరించడు. తనకి సహకరించని వారి మీద ఒత్తిడి తీసుకురాకపోవడం బర్టన్ ఆదర్శం. అదే సమయంలో వైన్ సీసాని కొనడం కూడా కుదరదు. అతను దీర్ఘంగా నిట్టూర్చాడు.
***
ఆ రాత్రి దుకాణం మూసే ముందు మారినో తన అసిస్టెంట్‌ని ఇంటికి పంపించేశాడు. దుకాణం వెనక గదిలో కిటికీ తలుపులు మూస్తున్న అతనికి తలుపు కట్టిన గంట, ఎవరో దాన్ని తెరవడంతో వినిపించింది. వెంటనే ముందు గదిలోకి వచ్చాడు.
పదహారు - పదిహేడేళ్ల ఇద్దరు టీనేజర్లు కనిపించారు. వారు దొంగలనే అనుమానం అతనిలో కలిగింది. ఎందుకంటే ఆ వయసు వారికి లిక్కర్ అమ్మరు కాబట్టి దుకాణంలోకి రారు.
‘ఏం కావాలి?’ మారినో ప్రశ్నించాడు.
వారిలోని పొడుగు వాడు గోడ మీద ఫ్రేమ్‌లోని కొటేషన్ని చదివాడు.
‘మరోసారి రండి’
తర్వాత మారినో వైపు తిరిగాడు. అతని చేతిలో రివాల్వర్ ప్రత్యక్షమైంది.
‘గల్లా పెట్టెని తెరు తాతా!’ ఆజ్ఞాపించాడు.
తెల్ల టోపీలోని రెండో వాడు అప్పటికే కౌంటర్ వెనక ఉన్న తన వైపు రావడం మారినో గమనించాడు.
‘పిచ్చి పనేం చేయక’ వాడు హెచ్చరించాడు.
మారినో ఓ గుటక వేసి రెండు చేతులనీ పైకెత్తాడు.
‘వెకన్కి వెళ్దాం పద’ పొడుగు వాడు గట్టిగా చెప్పాడు.
మారినో కాళ్లు నేలకి అంటుకుపోయినట్లుగా కదల్లేదు. అతి ప్రయత్నం మీద అతను వెనక గది గుమ్మం దాటాడు. వెనకే వచ్చిన పొడుగు వాడు మళ్లీ ఆజ్ఞాపించాడు.
‘గోడవైపు తిరిగి నిలబడు’
ఆ చిన్న గది అంతా లిక్కర్ అట్టపెట్టెలతో నిండిపోయి ఎక్కువ చోటు లేదు. తెల్ల టోపీ గల్లా పెట్టెని తెరిచే శబ్దం విన్నాడు. ఇంకో దొంగ వెనక తలుపు తెరచి లోపలికి చూడటంతో లోపలకి చల్లగాలి ప్రవేశించింది.
‘అంతా సరేనా?’ బయట నించి వాడి కంఠం మెల్లిగా వినిపించింది.
‘అంతా ఓ.కె’ పొడుగు వాడు చెప్పాడు.
‘త్వరగా కానీ. నేను ఇక్కడ చలిలో గడ్డ కట్టుకుపోతున్నాను.’
తలుపు మూసుకుంది. ‘కాపలా మనిషి అని మారినో అనుకున్నాడు. వాళ్లు పథకం ప్రకారమే వచ్చారు. వాళ్ల పథకంలో తన గతేమిటి? తను సాక్షి కాబట్టి రివాల్వర్‌తో కాల్చి చంపచ్చు. పోలీసులు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు అనే ఆలోచన అతనికి కలిగింది.
***
బర్టన్ షిఫ్ట్ చివరికి చేరుకున్నాడు. ఆఖరి సారి పహారా ముగించుకుని ఫెర్రీ రోడ్లోంచి పోలీసుస్టేషన్‌కి వెళ్తూంటే, అతనికి లిక్కర్ స్టోర్ వెనక ఉన్న సందులో వొంటరిగా నిలబడ్డ కుర్రాడు కనిపించాడు. ఎవరైనా ఈ చలిలో అక్కడ ఎందుకు ఉంటాడు? అతను తన పోలీస్ కార్‌ని వెనక్కి తిప్పడానికి వేగం తగ్గించాడు. కాని మనసు మార్చుకుని ఆపలేదు.
***
తెల్ల టోపీ ఆ రోజు అమ్మకాల డబ్బుని తీసుకుని వెనక గదిలోకి వచ్చి అడిగాడు.
‘ఇంతేనా?’
పొడుగు వాడు ఆ డబ్బుని చూసి కోపంగా అడిగాడు.
‘మిగిలిన డబ్బు ఎక్కడుంది తాతా?’
మారినో ఓ గుటక వేసి జవాబు చెప్పాడు.
‘ఈ రోజు పెద్దగా అమ్మకాలు లేవు’
‘నీ దగ్గర ఇంకా డబ్బుండాలి’
తెల్ల టోపీ వెనకాల బల్ల సొరుగులని తెరచి అందులోవి నేల మీదికి కుమ్మరించసాగాడు. పొడుగు వాడు మారినో జేబులు వెదికి పర్స్‌ని బయటకి తీశాడు.
దుకాణం వీధి తలుపు తెరుచుకున్నట్లుగా గంట మోగింది. పొడుగు వాడు తెల్లటోపీతో గొణిగాడు.
‘వెళ్లి చూడు’
వాడు రహస్యంగా చూస్తూంటే గట్టిగా వినిపించింది.
‘మిస్టర్ మారినో’
‘పోలీస్ ఆఫీసర్’ తెల్ల టోపీ గుసగుసగా చెప్పాడు.
వెంటనే పొడుగు వాడు మారినో ఛాతీకి రివాల్వర్‌ని గుచ్చి చెప్పాడు.
‘బయటకి వెళ్లి అతనికి ఏం కావాలో చూడు. వెంటనే పంపించు. లేదా నిన్ను, అతన్ని కూడా చంపడం ఖాయం.’
మారినో దీర్ఘంగా నిట్టూర్చి బయటకి నడిచాడు. తన పక్కనే కౌంటర్ వెనక మూడు అడుగుల దూరంలో మోకాళ్ల మీద కూర్చున్న తెల్ల టోపీ వంక ఓసారి చూసి అడిగాడు.
‘హలో ఆఫీసర్ బర్టన్. మీకేం కావాలి?’
బర్టన్ షెల్ఫ్‌ల్లోని సీసాల వంక చూస్తూ చెప్పాడు.
‘నేనో మంచి రెడ్ వైన్ కోసం చూస్తున్నాను. ఏది మంచిదో చెప్తారా?’
‘నిజం చెప్పాలంటే నాకు ఒంట్లో బాగాలేదు. మూసేయబోతున్నాను. మీరు దయచేసి రేపు వస్తారా?’
‘ఒక్క నిమిషం మించి తీసుకోను’
మారినో చొక్కా వెనక భాగం చెమటతో తడుస్తోంది. చేతులు వణక్కుండా కౌంటర్ అంచుని పట్టుకున్నాడు. కిటికీ లోంచి గాలి తగలకుండా కాలర్ పైకెత్తి నడిచి వెళ్లే యువతి బూట్ల చప్పుడుని, ఎక్కడో రెండుసార్లు మోగిన కార్ హార్న్‌ని మారినో విన్నాడు. బయటి ప్రపంచం ఎప్పటిలాగే ఉంది. తనకి మాత్రం కొన్ని అడుగుల వెనక నించి రివాల్వర్ గురి పెట్టబడి ఉంది.
‘ఇది మంచి బ్రాండేనా?’ బర్టన్ పై షెల్ఫ్‌ల్లోని ఓ సీసాని చూపిస్తూ అడిగాడు.
‘పేరు?’ మారినో అడిగాడు.
‘ఇక్కడ నించి కనపడటం లేదు. దయచేసి వచ్చి మీరే చూస్తారా?’
‘నేను బాగా అలసిపోయాను..’
‘వెళ్లు.. వెళ్లి వాడిని వదిలించుకో’ పొడుగు వాడి కంఠం గుసగుసగా వినిపించింది.
మరోసారి మారినో కాళ్లు కదలడానికి ఇబ్బంది పడ్డాయి. నెమ్మదిగా తెల్ల టోపీ పక్క నించి బర్టన్ వైపు నడిచాడు.
‘మీకు ఏ సీసా...’
అకస్మాత్తుగా బర్టన్ మారినో ఛాతీ మీద రెండు చేతులని వేసి గట్టిగా తోయడంతో నేలకూలాడు. ‘తను ఉచితంగా సీసా ఇవ్వడు కాబట్టి ఇతను తనని కొట్టబోతున్నాడు. ఓ పక్క తనని దొంగలు దోచుకుంటూంటే మరో పక్క పోలీస్ తన మీద దాడి చేస్తున్నాడు’ అన్న ఆలోచనకి అతనికి అంత కష్టంలోనూ నవ్వొచ్చింది.
‘కదలకు’ బర్టన్ అరిచాడు.
తనని కాల్చబోతున్నాడని మారినో అతని చేతిలోని రివాల్వర్‌ని చూసి భయపడ్డాడు. కాని ఆ రివాల్వర్ కౌంటర్ వైపు గురి పెట్టబడిందని గ్రహించాడు. ఐతే ఆ శబ్దం మారినోకి వినపడలేదు. కారణం అతనికి స్పృహ తప్పింది.
***
మారినోకి స్పృహ వచ్చేసరికి దుకాణం నిండా పోలీసులు. బర్టన్ అతని మీదకి వంగి చూస్తూ అడిగాడు.
‘ఇప్పుడు బానే ఉందా మిస్టర్ మారినో?’
‘బావుంది’ అతను చిన్నగా మూలిగి బర్టన్ చేతిని అందుకుని లేచి నిలబడ్డాడు.
‘మిమ్మల్ని తోసినందుకు సారీ. మీకు గుండు తగలకూడదని ఆ పని చేసాను’
మారినో అర్థమైందన్నట్లుగా తలూపి అడిగాడు.
‘దొంగలేరీ? వెనక తలుపు లోంచి పారిపోయారా?’
‘అవును. తలుపులోంచి సరిగ్గా బయట ఆగి ఉన్న స్క్వేడ్ కార్లోకి. మనం మాట్లాడేప్పుడు రెండుసార్లు కార్ హార్న్ మోగడం విన్నారా? దానర్థం బయట కాపలా వాడిని తాము పట్టుకున్నామని. తర్వాత వాళ్లని మీ నించి దూరంగా వెనక్కి పంపించాను’ బర్టన్ నవ్వి చెప్పాడు.
‘అద్భుతం. కాని ఇక్కడ దొంగతనం జరుగుతోందని మీకు ఎలా తెలిసింది?’
‘నేను కార్లో వెళ్తూ వెనక సందులోని కాపలా వాడిని చూసాను. అనుమానం కలిగి పరిశోధించాలని దాదాపు ఆగిపోయాను. ఒకవేళ మీరు కష్టంలో ఉండచ్చనుకుని మరి కొంతమంది పోలీసులని రమ్మని వైర్‌లెస్‌లో కోరాక లోపలికి వచ్చాను’
లోపలకి వచ్చిన, కొద్ది ఎక్కువ వయసు గల పోలీస్ ఆఫీసర్ బర్టన్ భుజం మీద తట్టి అభినందిస్తూ చెప్పాడు.
‘సమర్థుడివి బర్టన్. ఓ గుండు కూడా పేలకుండా ముగ్గురు దొంగలని రెడ్‌హేండెడ్‌గా పట్టుకున్నావు’
ఆ తర్వాత అతను మారినో వైపు తిరిగి చెప్పాడు.
‘మిస్టర్ మారినో. నేను లెఫ్టినెంట్ ఫ్లెచర్ని. మీరు రికవర్ అవగానే మీ నించి మాకో స్టేట్‌మెంట్ కావాలి’
మారినో తల ఊపాడు. తన దుకాణం ముందు నిలబడ్డ కొందరు పౌరులని కిటికీలోంచి చూసాడు. వారిలో ముందు నిలబడ్డ వ్యక్తి పక్క దుకాణం యజమాని బ్రౌన్. అతను తోటి వాళ్లతో ఏదో చెప్తూ బర్టన్ వంక వేలితో చూపిస్తున్నాడు. ఓ పోలీస్ లోపలి రావడానికి తలుపు తెరిస్తే బ్రౌన్ చెప్తున్న మాటలు లోపలకి వచ్చాయి.
‘..గ్లవ్స్ తొడుక్కున్నతనే ఆఫీసర్ బర్టన్. వాటిని ఇవాళ ఉదయమే నా దుకాణంలో కొన్నాడు.’
అది మారినోకి ఏదో గుర్తు చేసింది. వెంటనే అతను వైన్ షెల్ఫ్ దగ్గరికి వెళ్లి ఓ సీసాని ఎంపిక చేసి ఫ్లెచర్‌తో మాట్లాడే బర్టన్‌కి ఇస్తూ చెప్పాడు.
‘ఇది మా దుకాణంలోని అతి ఖరీదైన రెడ్ వైన్. ఆఫీసర్. దయచేసి దీన్ని నా కానుకగా స్వీకరించండి.’
బర్టన్ మర్యాదగా నవ్వి, తల అడ్డంగా ఊపి చెప్పాడు.
‘్థంక్ యు. కాని పోలీస్ శాఖలోని ఎవరూ కానుకలు తీసుకోడానికి అనుమతి లేదు. బహుశా రేపంతా మామూలయ్యాక నేను మళ్లీ వచ్చి ఈ సీసాని కొంటాను.’
‘అతను కానుకగా దేన్నీ స్వీకరించడు. తను కొన్న దానికి డబ్బు చెల్లించడం మాత్రమే మర్చిపోతుంటాడు’ అని బ్రౌన్ చెప్పిన మాటలు మారినోకి గుర్తొచ్చాయి.
‘తప్పకుండా. రేపు వచ్చి కొనండి. ఆ సైన్ బోర్డ్‌లోలా మళ్లీ రేపు రండి’ మారినో తలూపి చెప్పాడు.
-------------------------------------------
(రాబర్ట్ లాప్రెస్టీ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి