కథ

కులకాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ
=====================

‘డాడీ! నేను ఒకమ్మాయిని ఇష్టపడ్డాను. ఆమె డిగ్రీలో నా క్లాస్‌మేట్. పేరు తేజస్వి. ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ ఏ ఉపోద్ఘాతం లేకుండా కార్తీక్ తండ్రితో సూటిగా చెప్పేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు రాజేశ్వరరావు.
‘అదేంట్రా! ఇంత హఠాత్తుగా! వాళ్లు ఎవరో ఏమిటో తెలీకుండా ఎలా?’ అని బాధపడింది కార్తీక్ తల్లి లలితాంబ.
‘సరే! వాళ్ల వివరాలివ్వు’ అన్నాడు రాజేశ్వరరావు గంభీరంగా.
‘మీరేంటండీ! వాడేదో అంటే వెంటనే ఒప్పుకుంటున్నట్లు వివరాలు అడుగుతారూ?’ అంది లలితాంబ అయోమయంగా.
‘వివరాలడిగానే కానీ, ఒప్పుకున్నానన్నానా?’ అన్నాడాయన చిరాగ్గా.
నిజానికి తేజస్వి, కార్తీక్‌ల కులాలు వేరు. అయినా గానీ, ఇద్దరూ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యాక పెళ్లి సంగతి చూద్దామని ఊరుకున్నారు. అంతదాకా ఇంట్లో కూడా చెప్పలేదు. వాళ్లు అనుకున్నట్టు, ఇద్దరూ మంచి కంపెనీల్లో ఉద్యోగస్తులయ్యాక ముందుగా కార్తీక్ ఇంట్లో చెప్పాడు తమ సంగతి. ఇంట్లో ఒప్పుకుంటారా లేదా అన్నది అతని కనుమానమే.
కార్తీక్ ఇచ్చిన వివరాలతో తేజస్వి కుటుంబం గురించి జాగ్రత్తగా ఆరా తీశాడు రాజేశ్వరరావు. ఆ తర్వాత కార్తీక్ అనుకున్నట్లే, తేజస్విది వేరేకులం, పైగా ఆమె తల్లిదండ్రులు కూడా కులాంతర వివాహితులవడం వల్ల ఇంట్లో ప్రతిఘటన ఎదురైంది.
‘మనింటికొచ్చే అమ్మాయి గుణం ఎలాంటిదో ముఖ్యమా, ఆమె కులం ముఖ్యమా?’ అని మొదలెట్టాడు కార్తీక్ వాదన.
‘కావచ్చు! కానీ, నీకో చెల్లెలుంది. దానికి సంబంధాలు చూసేటప్పుడు ఈ విషయం అడ్డంకి అవుతుంది. అందరూ మన అంత విశాల హృదయులు కలిగేవారుండరు. దానికి సంబంధాలు కుదరక, దాని జీవితం అస్తవ్యస్తం కావడానికి మేమొప్పుకోము. కోరికోరి ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోవద్దు’ అని అన్నది లలితాంబ, హితవు చెపుతున్నట్టు.
‘సరే! చెల్లి పెళ్లయ్యాకే చేసుకుంటాను. అప్పుడేంటి అభ్యంతరం?’ అన్నాడు కార్తీక్.
‘అప్పుడైనా, దానికి వచ్చే భర్త, అత్తమామల మనస్తత్వాలబట్టి దాని భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. తీరా నీ పెళ్లి తేజస్వితో అయ్యాక, వాళ్లు నీ చెల్లిపై ఆంక్షలు పెట్టి, మాతో కూడా రాకపోకలు తెంచుకుంటే? అప్పటి సంగతేంటి? అయినా ఎందుకిన్ని అవస్థలు కొని తెచ్చుకోవడం! నువ్వు ఒక్కసారి పునరాలోచించుకుంటే నీకూ, మాకూ మంచిది. నిర్ణయించుకునే ముందు, మా గురించి కూడా బాగా ఆలోచించుకో. నీ పెళ్లి నీ ఆనందానికి కాకుండా, మేమంతా కూడా ఆ ఆనందంలో పాలుపంచుకోవాలనుకోవడం తప్పుకాదు కదా!’ ఆవేదనగా అంది లలితాంబ.
‘మీ ఆనందానికొచ్చిన ఇబ్బందేముంటుందమ్మా. పోనీ చెల్లి పెళ్లి కుదరడానికి ముందే తనని చూడ్డానికొచ్చిన వాళ్లతో నా సంగతి చెబుదాం. వాళ్లు అందుకిష్టపడితే సమస్యే ఉండదు కదా!’ అన్నాడు కార్తీక్.
‘బాగుందిరా నువ్వు చెప్పింది. ఇలా అయితే ఇక దానికి సంబంధాలు కుదిరినట్టే. అయినా నీ ప్రేమ పెళ్లికి దాని పెళ్లికి ముడిపెడతావేం? అవన్నీ జరిగే పనులు కావు. మన వాళ్లలో నీకు నచ్చి, నువ్వు మెచ్చిన అమ్మాయినే చేసుకుందువుగాని. ఇంక నీ ప్రేమ ప్రసక్తి తీసుకురాకు’ మొదట్లో ప్రశాంతంగా మాట్లాడినా, ఈసారి కాస్త కోపంగానే చెప్పింది లలితాంబ.
‘కులాంతర వివాహాలు చేసుకుంటే అదేదో నేరం, ఘోరం అన్నట్టు ఎందుకనుకుంటారు మీరు? ఎంతమంది ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుని హాయిగా లేరు?’ తానూ కాస్త స్వరం పెంచాడు కార్తీక్.
అంతవరకు ఊరుకున్న రాజేశ్వరరావు, ‘కులాంతర వివాహాలు చేసుకున్న వారందరూ కష్టాలు పడుతున్నారని నేననను. కానీ రిస్క్ తీసుకోవడం మంచిదా? నీకూ, మాకూ అందరికీ నచ్చిన అమ్మాయితో, అందరి అంగీకారంతో ఆనందంగా చేసుకోవడం వేరు. నీ ఒక్కడి ఇష్టం మేరకు పెళ్లి చేసుకోవడం వేరు. తరవాతైనా, ఆ అమ్మాయి మనసులో మా పట్ల, మా మనసుల్లో ఆ అమ్మాయి పట్ల ఒక రకమైన అయిష్టతాభావం ముల్లులా గుచ్చుకుంటూంటే ఎవరం సంతోషంగా ఉండలేము కదా?’ అని అన్నాడు శాంతంగా, తన మనసులో కోపాన్ని, ఆవేదనని బయటకి తెలియనివ్వకుండా.
‘ఇవన్నీ మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారు డాడీ! ఆ అమ్మాయి మీతో హాయిగా కలిసిపోతుంది. మీకు తగ్గట్టుగానే ఉంటుంది. నాకా నమ్మకముంది. అయినా ఈ గ్లోబలైజేషన్ యుగంలో కూడా ఇంకా కులాలు మతాలు అంటూ కూర్చుంటే ఎలా డాడీ?’ అన్నాడు కార్తీక్ అసహనంగా.
‘ఏం గ్లోబలైజేషన్‌రా! ఎక్కడుంది? ఏదో ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం అంతా ఇంట్లో కూర్చుని చుట్టేసి, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేసినంత మాఅతాన, మల్టీనేషనల్ కంపెనీలు తమ ఉద్యోగుల్ని ప్రపంచ దేశాలకి పంపిస్తుంటే అదే గ్లోబలైజేషనా? మరి మీ గ్లోబలైజేషన్‌లో కుల మతాలు అంతరించి పోలేదేం? అవి పోవు. ఎందుకంటే మన దేశంలో ‘సెక్యులర్ దేశం’ పేరిట అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నవి కులమతాలే. అసలు రాజకీయ నాయకులే ఓట్ల కోసం ఏవో శుష్క వాగ్దానాలతో కులాల మధ్య కార్చిచ్చు పెడుతున్నారు. అక్కడ్నుండి గొడవలు, నిరసనలు, బంద్‌లు, నిరాహారదీక్షలు. ఆ కులనాడు, ఈ కులగర్జన, ఫలానా కులగాండ్రింపు, ఇంకో కుల మహాకూటమి.. తెల్లారిలేస్తే, కులాల రిజర్వేషన్లతో దుమారం, కులం పేరుతో దూషించారని కేసులు ఇవన్నీ కులాల పేరిట ప్రజల మధ్య చిచ్చుకాక మరేమిటి? వీటివల్ల మామూలుగా ప్రజల్లో తమతమ స్నేహితులు, సహోద్యోగుల మధ్య గతంలో కానరాని కుల ప్రస్తావన కొత్తగా తలెత్తుతోంది. అంతవరకు అరమరికల్లేని స్నేహాల్లో ఒకరకమైన విరోధం, అభిప్రాయ భేదాలు తలెత్తుతున్నాయి. విదేశాల్లో మన తెలుగువాళ్ల మధ్య కూడా కులాల వారీ సంఘాలు, ఇక్కడి కులగొడవలకి మద్దతుగా అక్కడ కూడా కులాలవారీగా నిరసనలు, ధర్నాలు, ఆఖరికి బ్రిటన్‌లో కూడా ‘బ్రెగ్జిట్’ పేరిట, ఇప్పుడు ట్రంప్ వచ్చాక అమెరికాలో కూడా, మేము మా వాళ్లు అన్న మనస్తత్వం వొంటబట్టింది. రేసిజం పేరిట దాడులు, హత్యలు ఎక్కువైపోయాయి.’ ఆవేశంగా చెప్తున్న తండ్రి మాటలకి అసహనంగా అడ్డు పడ్డాడు కార్తీక్.
‘అబ్బా! డాడీ.. బోడిగుండుకు మోకాలికీ ముడి అన్నట్టు నేనా అమ్మాయిని చేసుకుంటానంటే మీరేంటి రాజకీయాలు మాట్లాడతారు? మీరన్న ఆ కులాల గొడవ మా పెళ్లికి ఏం అడ్డు? మా జీవనానికేం అడ్డు?’
‘ఎందుకుండదు అడ్డు? వెంటనే కాకపోయినా, స్లోపాయిజన్‌లా క్రమేపీ అసంతృప్తి రాజుకుంటుంది. మన దేశ సంప్రదాయం ప్రకారం కులాంతర వివాహాల్లో అయినా, భర్త కులమే ప్రాముఖ్యం వహిస్తుంది. అతడిది నిమ్న కులమైనా అగ్రకులమైనా, ఇంకేదైనా.. వాళ్ల పిల్లల స్కూళ్లల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో, ఇతరత్రా అన్నిచోట్లా, భర్త కులమే రాస్తారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య ఇగో తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ ఇగోలు పెరగడానికి ప్రస్తుత కుల పోరాటాలు ఆజ్యం పోస్తున్నాయి. ఇది భవిష్యత్‌లో కులాంతర వివాహాలు చేసుకునే వారిపైనా దుష్ప్రభావం చూపుతుంది. ఏదో సందర్భంలో మా కులం గొప్పదంటే, మాదే గొప్పదనే వాదనలు ఆ దంపతుల మధ్య లేనిపోని చికాకులు తెచ్చి పెడతాయి. కులాల ప్రాముఖ్యత ఇంకా ఉంది కనుకే పేపర్లలో, టీవీల్లో, వెబ్‌సైట్లలో కులాలవారీగా వివాహ పరిచయవేదికలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. పైగా ఈ మధ్య ‘సంపన్న కుటుంబాల వివాహవేదిక’ అంటూ టీవీల్లో బాగా ప్రచారం చేస్తున్నారు. దాంట్లోని అంతర్గత అర్థం మీమీ కులాల్లోని సంపన్నులు సంపన్నులనే చేసుకోండి అనేగా! అందుకే ఏ కులం వాళ్లు ఆ కులం వాళ్లలోనే సంబంధాలు చూసుకుంటున్నారు’ కోపం దాచుకోలేక గట్టిగా కేకలేసినట్టు మాట్లాడాడు రాజేశ్వరరావు.
‘డాడీ! ఏదో సభలో స్పీచ్ ఇచ్చినట్టు ప్రభుత్వాలని.. టీవీలని తిడుతూ.. నా పెళ్లికి సంబంధం లేని విషయాలు చెప్తున్నారు’ అన్నాడు కార్తీక్ మీది పసలేని వాదన అన్నట్టుగా.
‘సంబంధం ఉండే చెప్తున్నానురా. ఏ కులం వాళ్లు ఆ కులం వాళ్ల పిల్లల్నే చేసుకోవడానికి ఇంకో ముఖ్య కారణం ఏమిటో తెలుసా నీకు? మీకిప్పుడు చాదస్తం అనిపించినా, పూర్వం పెళ్లి సంబంధం చూసేటప్పుడు అటేడు తరాలు, ఇటేడు తరాలు చూడాలని అన్న దాంట్లో అర్థం లేకపోలేదు. తమ కులంలో పిల్లలైతే బంధువర్గం ద్వారా ఆ కుటుంబ సామాజిక, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు సులువుగా తెలుసుకోవచ్చు. ఆ అమ్మాయి లేదా అబ్బాయి మనస్తత్వం ఎటువంటిది, జాతకరీత్యా వాళ్లకి నప్పుతుందా వంటివి చూస్తారు. జాతకాలకన్నా ఈ కాలం మనస్తత్వాలు చాలా ముఖ్యం. జాతకాలు నప్పాయని చేసినా, మనస్తత్వాలు నప్పక విడిపోతున్న వాళ్లెందరో? ఇంకో ముఖ్యమైనది ఆరోగ్య సమస్య! కొన్ని కుటుంబాల్లో జెనెటిక్‌గా వచ్చే కొన్నికొన్ని రుగ్మతలు పుట్టబోయే పిల్లలకి వచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది పరిశీలించుకుంటారు. ఇవేవీ మీ ప్రేమ పెళ్లిళ్లలో తెలుసుకునే అవకాశం ఉండదు. దైనందిన జీవితంలో మీమీ ప్రవర్తనలు, టెంపర్‌మెంట్, ఎవరి ఆహారపు ఆచార వ్యవహారాల అలవాట్లు వంటివి కాలక్రమేణా వైవాహిక జీవితంలో ప్రభావం చూపుతాయి. ఇలాంటి జాగ్రత్తలు చూసుకునే మరీ పెళ్లికి ఒప్పుకుంటారు పెద్దవాళ్లు. ఈ ప్రేమ, కులాంతర పెళ్లిళ్లు తరతరాలుగా వివాదాల్లో ఉంటున్నవే. కానీ ఇప్పుడు సమాజంలో కులాల కార్చిచ్చు ఎక్కువగా ఉంది. ఇప్పుడది వ్యక్తిగత కులాంతర వివాహ వ్యవస్థని కూడా అజమాయిషీ చేసే స్థితికి చేరింది. ఇప్పుడు పక్కనున్న వాడు ఏ కులస్తుడో తెలుసుకుని మరీ, జాగ్రత్తగా మాట్లాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నువ్వు మమ్మల్ని కాదని పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఒకట్రెండు రోజులు ‘ఆదర్శ వివాహం చేసుకున్న కార్తీక్!’ అని నీ ఫ్రెండ్స్ పొగుడుతారు. టీవీ, పేపర్లకిస్తారు. ఆ తర్వాత నీ మంచి చెడ్డల్లో వాళ్లెవరు మళ్లీ వచ్చి కలుగజేసుకోరు. అన్నిటికీ మేమే అంటే, మేమో లేక ఆ అమ్మాయి తల్లిదండ్రులో రావాల్సిందే. అందుకని నువ్వు ప్రశాంతంగా ఆలోచించుకో. చిన్నపిల్లాడివేం కాదు కదా, నేనన్న వాటిలో సాధక బాధకాలు ఏమిటో తెలుసుకో’ అన్నాడు రాజేశ్వరరావు, కాస్త అనునయంగా.
‘ఏమో డాడీ! ఇంతలా కాలం మారిపోయినా, ఇంకా మీరు మనం, మన వాళ్లు అని ఆలోచించడం నాకు నచ్చలేదు’ అన్నాడు కార్తీక్ అయిష్టంగా.
‘అవును. కాలం మారిపోయింది. ఇది మీ కాలం. అందుకే ఈనాటి సినిమాలు కూడా ప్రేమ, పెళ్లి కుదిరిన అమ్మాయిని పెళ్లిపీటల మీంచి లేపుకుని వెళ్లడం వంటి అంశాలపైనే తీస్తున్నారు. అవే మీకు మాస్టర్ గైడ్స్ అయిపోయాయి. వాటిల్లో తెలివిగా వాళ్లు కుల ప్రస్తావన తీసుకురారు. తెచ్చినా, ఎలా ముగించాలో తెలీక, అమ్మాయి పెళ్లి పందిట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నట్లు చూపిస్తారు. అలా పీటల మీద ఆగిపోయిన పెళ్లి తాలూకు అవతల వారి పరిస్థితి ఏమిటన్నది ఒక్క సినిమాలో కూడా చూపరు. అలాగే అలా పెళ్లి చేసుకున్న జంట వివాహానంతర జీవితం ఏమిటన్నది కూడా సినిమాగా చూపరు. ఎందుకంటే జీవితంలో సంఘర్షణలని సినిమాగా చూసి, పరిష్కారం చూపడం వాళ్ల వల్ల అయే పని కాదు కనుక. వాటినే మీరు ఆదర్శంగా తీసుకుని అలాంటి నిర్ణయాలే తీసుకుంటారు. సినిమా వేరు, జీవితం వేరు. మీ వరకు కుల వ్యవస్థ పెళ్లికి మాత్రం అడ్డుకాదు, కాకూడదు. కానీ బయట ప్రపంచంలో కులంతోనే అన్నీ. ఒక ప్రభుత్వోద్యోగానికి అప్లై చేస్తే కులాల వారీగా ఖాళీలు, ఫీజుల్లో రాయితీలు, అర్హత పరీక్షల్లో మార్కుల రాయితీలు. ఇవి ప్రైవేటు ఉద్యోగాల్లో, కార్పొరేట్ ఉద్యోగాల్లో ఉండవు. ఎందుకంటే వాళ్లకి సమర్థులే కావాలి. అసలు ఈ ప్రభుత్వాలని ఈ రిజర్వేషన్లు ఎత్తివేసి, అన్ని కులాల వారిని సమానంగా చూడమను. అప్పుడు సమాజంలో పెళ్లిళ్లు కూడా కుల మత రహితంగా జరుగుతాయి. ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ అది జరిగే పని కాదు. ఎందుకంటే మన దేశం మొత్తం కుల మత ప్రాతిపదికనే నడుస్తోంది. రాజకీయ లబ్ధి పొందుతోంది. దాన్నుంచి బయటపడటం అసాధ్యం. సరే.. అదంతా ఎందుకు గానీ, మీరు మీ వర్తమానం గురించే ఆలోచిస్తారు. మేం మీ వర్తమానం, భవిష్యత్ గురించి కూడా ఆలోచిస్తాం. మీ సినిమాల భాషలోనే చెప్పాలంటే ఏదో సినిమాలో అన్నట్టు ‘పెళ్లంటే ఇద్దరు మనుషుల కలయిక కాదు. రెండు కుటుంబాల కలయిక కూడా.’ అందర్నీ ఎదిరించి పెళ్లి చేసుకుని, ఎవరి గురించి ఆలోచించకుండా మీ మట్టుకు మీరే హాయిగా ఉండగలరా? ఏ సంతోషమైనా, కష్టమైనా మీ ఇద్దరే పంచుకోగలరా? మాకు ఇష్టం లేనట్టే, అవతల ఆ అమ్మాయి తల్లిదండ్రులకి కూడా ఇష్టం లేకపోవచ్చు. అప్పుడు మీరు కేవలం మీ ఇద్దరుగానే ఉంటారు. ఎంత కాదనుకుని వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నా, మీకు మా జ్ఞాపకాలు, మాకు మీ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. అశాంతికి గురి చేస్తాయి. కోరి ఇదంతా తెచ్చుకోవడం అవసరమా? ఆలోచించు. ఆపైన నీ ఇష్టం. ఇంతకన్నా నేను చెప్పేదేమీ లేదు’ అని తన నిర్ణయాన్ని చెప్పకనే చెప్పినట్టు ముగించాడు రాజేశ్వరరావు.
* * *
‘ఇదీ తేజస్వి సంగతి. నేనేం చేయాలో నాకేం తెలీడంలేదు. మీ ఇంట్లో చెప్పావా? ఏమన్నారు?’ ఇంట్లో జరిగినదంతా చెప్పి అడిగాడు కార్తీక్, తేజస్విని ఆ సాయంత్రం.
‘చెప్పాను కార్తీక్. కానీ మా పేరెంట్స్ కూడా మన పెళ్లికి అంతగా మొగ్గు చూపలేదు. ఎందుకంటే మా అమ్మనాన్నలది లవ్‌మేరేజి కదా. అప్పట్లోనే అందర్నీ ఎదిరించి పెళ్లి చేసుకుని చాలా ఏళ్లు అందరికీ దూరంగా బ్రతికారు. ఒక మూడేళ్లై క్రమేపీ అంతా కలిశారు. ఇప్పటికైనా మీ ఇంట్లో ఒప్పుకుంటే తమకి సంతోషమే అన్నారు. వాళ్ల కోరిక ఒక్కటే! తమలాగా నేనూ పెళ్లయ్యాక పెద్దలకి దూరంగా ఉండడం ఇష్టం లేదు. అందువల్ల బలవంతంగా మీ వాళ్లని ఒప్పించో, బెదిరించో ఈ పెళ్లి చేసుకోవడం నాకూ ఇష్టంలేదు. మీ పేరెంట్స్‌ది మూర్ఖత్వమా, చాదస్తమా, సంప్రదాయమా, భయమా అన్నది ఇప్పుడప్రస్తుతం. ఈ పెళ్లి జరక్కపోతే మనం ఏదో అయిపోతాం, ఒకళ్లని విడిచి ఒకళ్లు ఉండలేం అన్నంత తీవ్ర మానసిక స్థితిలో మనమేమీ లేం. లెట్స్ లివ్ జస్ట్ లైక్ ఫ్రెండ్స్. మనకు అనుకూలమైన వ్యక్తులు దొరికితే వివాహాలు చేసుకుందాం. ఎవరమైనా అందరితో ఆనందంగా, హాయిగా ఉండాలని కోరుకోవడంలోనే నిజమైన ప్రేమ, అభిమానం ఉంటాయి. కొన్నాళ్లు మనకి బాధ ఉండొచ్చు కానీ, కాలం దాన్ని మాన్పుతుంది’ అని చెప్పింది తేజస్వి.
చాలాసేపు వౌనంగా ఉండిపోయారిద్దరూ. ఆమె మనసులో బాధ ఆమె కళ్లల్లో కనిపిస్తున్నా, పెద్దలపట్ల ఆమెకున్న గౌరవానికి, మంచితనానికి అభినందనలు తెలిపాడు కార్తీక్, తానూ ఆమె తీసుకున్న నిర్ణయానికే వచ్చి.

-- శ్రీమతి పి.విద్యావతి. 9491335133/ 9490244344