ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘జమిలి’తో దేశానికి మేలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ ప్రయోజనాల దృష్ట్యా జమిలి ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలూ మద్దతు ఇవ్వడం ఉత్తమం. రాజకీయ ప్రయోజనాల కంటే దేశ శ్రేయస్సు, జనం మేలు ముఖ్యమనే వాస్తవాన్ని ముఖ్యంగా విపక్ష పార్టీలు అర్థం చేసుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ జమిలి ఎన్నికలకు పట్టుపడుతున్నారు కాబట్టి వ్యతిరేకించాలని విపక్షాలు ఆలోచించడం తగదు. వృథా ఖర్చును నియంత్రించాలన్నా, అభివృద్ధి పథకాలు నిరాటంకంగా అమలు జరగాలన్నా లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలి. తరచూ ఎన్నికలు జరగడంతో అభివృద్థి పథకాల అమలుపై ప్రభుత్వాలు సరైన రీతిలో దృష్టి సారించడం లేదు. ఎన్నికల నిబంధనలు ఎక్కువ కాలం అమలులో ఉంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఆటంకం ఏర్పడుతుంది.
జమిలి ఎన్నికలతో ప్రజాధనాన్ని పొదుపు చేయవచ్చుననేది అత్యంత కీలక అంశం. దీనికంటే పార్లమెంటును సజావుగా జరిపించుకోవటం అనేది ఎంతో ముఖ్యం. దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరగడంతో, ఆ ప్రభావం పార్లమెంటు పనితీరుపై పడుతోంది. ప్రస్తుత పదహారవ లోక్‌సభ పనితీరును పరిశీలిస్తే ఈ విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 2014 మేలో లోక్‌సభతో పాటు ఏపీ, తెలంగాణ, సిక్కిం,ఒడిశా శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. అదే ఏడాది అక్టోబర్‌లో హర్యానా, మహారాష్ట్ర, డిసెంబర్‌లో జమ్మూ కశ్మీర్, ఝార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. 2015 ఫిబ్రవరిలో ఢిల్లీ, నవంబర్‌లో బిహార్ ఎన్నికలు జరిగాయి. 2016లో మేలో అస్సాం, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ శాసన సభలకు, 2017 మార్చిలో గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించారు. గత ఏడాది డిసెంబర్‌లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది మార్చిలో కర్నాటక, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర అసెంబ్లీలకు పోలింగ్ జరిగింది. ఈ ఏడాది చివరిలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ లెక్కన ప్రతి ఏడాది నాలుగైదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా కొన్ని నెలల పాటు రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఎన్నికలు జరిగే చోట రెండు, మూడు నెలల పాటు అభివృద్ధి పథకాల ఊసే ఉండదు. ఎన్నికల ‘కోడ్’ వల్ల ఎలాంటి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వీలుండదు.
అసెంబ్లీ ఎన్నికల ప్రభావం పార్లమెంటు సమావేశాలపై తీవ్రంగా పడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్లమెంటు సమావేశాలు ఉంటే లేనిపోని గందరగోళం చోటుచేసుకుంటోంది. అధికార పక్షాన్ని దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు పార్లమెంటు సమయాన్ని బలి తీసుకుంటున్నాయి. పార్లమెంటును స్తంభింపజేస్తూ ప్రభుత్వాన్ని దెబ్బ తీసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విపరిణామాలను అడ్డుకోవడంలో పాలకపక్షం విఫలమవుతోంది. గత ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్లమెంటు ఉభయ సభలు ఎలా స్తంభించిపోయాయో అందరికీ తెలిసిందే. అధికారంలో ఉన్న పార్టీ తాము సాధించిన విజయాలను పార్లమెంటులో చెప్పుకోవటం ద్వారా ఓటర్ల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తుంటే, విపక్షాలు ఉభయ సభలను స్తంభింపజేయటం ద్వారా ప్రభుత్వాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీల ఎన్నికల రాజకీయాలకు అటు పార్లమెంటు, ఇటు ప్రజా సంక్షేమం ప్రశ్నార్థకమవుతున్నాయి.
మన పార్లమెంటరీ వ్యవస్థలో 2014 లోక్‌సభ ఎన్నికలు అత్యంత ఖరీదైనవి. ఆ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేసిన మొత్తం ఖర్చు దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు! గత లోక్‌సభ ఎన్నికల తరువాత ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కూడా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు భారీగా నిధులను వెచ్చించాయి. సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ, ప్రచారం వంటి అంశాల్లో ఖర్చు కొంత తక్కువే అయినా, ఆంధ్రప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో ఈ ఖర్చు భారీగానే ఉంటుంది. చిన్న రాష్ట్రాల్లో ఈ ఖర్చు వెయ్యి కోట్లుంటే కొన్ని పెద్ద రాష్ట్రాల్లో ఇది రెండు,మూడు వేల కోట్లు ఉంటోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు అధికారికంగా చేసే ఖర్చు మాత్రమే లెక్కల్లోకి వస్తోంది. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తెరవెనక చేసే ఖర్చును అంచనా వేయటం చాలా కష్టం. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చే వివరాలు కాకిలెక్కలు అనేది జగమెరిగిన సత్యం. అనధికారికంగా చేసే ఖర్చు గురించి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎప్పుడూ వెల్లడించరు. కొందరు గెలిచిన, ఓడిన అభ్యర్థులు అప్పుడప్పుడు తమ అనధికార ఖర్చు గురించి విలేకరులతో చెప్పుకుని బాధపడే సంఘటనలు సైతం ఉంటాయి. ఎన్నికల ప్రచారం కంటే ఓటర్లకు పంచిన డబ్బు వివరాలు వింటే ఎవరికైనా బుర్ర తిరిగిపోతుంది. అందుకే ఎన్నికల్లో గెలిచి, చట్టసభల్లోకి అడుగు పెడుతున్న ప్రజా ప్రతినిధులు జన సంక్షేమాన్ని పక్కన పెట్టి తమకు ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో నేతల అవినీతికి అంతనేది లేకుండాపోతోంది.
కొందరు ముఖ్యమంత్రులు ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు జరిపే లావాదేవీలన్నీ ఎన్నికల ఖర్చును దృష్టిలో ఉంచుకొని చేసినవే. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, పెద్దపెద్ద ప్రాజెక్టుల పనులను ఎంపిక చేసిన కాంట్రాక్టర్లు, సంస్థలకు కేటాయించడం వెనక ఉన్న అసలు రహస్యం- ఎన్నికల ఖర్చును కూడబెట్టటమే. తరచూ జరిగే ఎన్నికల కారణంగా అవినీతి, అక్రమాలు అదుపు తప్పాయి. ‘ఎన్నికలు- ప్రలోభాలు-అధికారం-సంపాదన’ అనేది ఒక విషవలయంగా మారింది. ఎన్నికల్లో గెలుపు కోసం పెద్దఎత్తున డబ్బు ఖర్చు చేయటం, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఖర్చును రాబట్టుకోవడం, రాబోయే ఎన్నికలకు నిధుల సమీకరణ అనేది ఒక అరాచక వ్యవస్థగా మారింది. తరచూ ఎన్నికలు జరగడంతో అభివృద్ధి పథకాలు కుంటుపడటంతోపాటు అవినీతికి అంతనేది లేకుండాపోతోంది. అధికార యంత్రాంగం దాదాపు స్తంభించిపోతుంది. ఎన్నికలకు ఐదారు నెలల ముందు నుండే అధికార యంత్రాంగం, సంక్షేమ కార్యక్రమాలు స్తంభించిపోవడం ఆనవాయితీగా మారింది. కొత్త పాలకుల అభీష్టమేమిటనేది తెలుసుకునే ప్రయత్నంలో అధికార యంత్రాంగం సైతం అభివృద్ధి పథకాల అమలును నిలిపివేస్తోంది. ఎన్నికలకు ముందు, తరువాత దళారీలు ఆడింది ఆట, పాడింది పాటగా కొనసాగుతోంది. ఎన్నికల సంస్కరణలో భాగంగా లోక్‌సభ, శాసనసభల ఎన్నికలను ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకోవటం ద్వారా ఖర్చు, అవినీతిని తగ్గించవచ్చు. దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమానికి సంబంధించిన అన్ని పథకాలు, కార్యక్రమాలు సజావుగా జరిగిపోయేందుకు అవకాశం కలుగుతుంది. జమిలి ఎన్నికలకు రెండు, మూడు నెలల సమయం పట్టినా మిగతా నాలుగున్నర సంవత్సరాల సమయాన్ని దేశం కోసం వెచ్చించే పరిస్థితులు నెలకొంటాయి.

--కె.కైలాష్ 98115 73262