తూర్పుగోదావరి

అధికారుల తీరుపై ఆగ్రహించిన గ్రామస్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐ పోలవరం, జూలై 16: ఐ పోలవరం మండలం పశువుల్లంక - సలాదివారిపాలెం రేవు దాటింపులో అధికారుల నిర్లక్ష్యంపై లంక గ్రామాల ప్రజలు, ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. శనివారం జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన చిన్నారుల కుటుంబాలను పరామర్శించేందుకు, పనులపై వెళ్ళేవారు సోమవారం వందల సంఖ్యలో పశువుల్లంక రేవు వద్దకు చేరుకున్నారు. అయితే గోదావరి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో పంటిని నిలిపివేశారు. అంతేకాకుండా ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత నాటు పడవలను నిలిపివేసి వంతెన నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకున్న పంటునే తాత్కాలికంగా తిప్పుతున్నారు. దీంతో ఆ పంటు రోజుకు రెండు లేదా మూడు దాటింపులు మాత్రమే చేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం వాతావరణం అనుకూలించడంతో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వందలాది మంది పశువుల్లంక చేరుకున్నారు. అయితే ఉదయం 10.00 గంటలకు వచ్చిన ప్రజలు 12.30 గంటల వరకు సలాది వారి పాలెం చేరుకునేందుకు నది ఒడ్డునే నిరీక్షించారు. ఎంతకీ రేవు దాటించకపోవడంతో అక్కడకు చేరుకున్నవారంతా అధికారుల నిర్లక్ష్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన టెంట్‌ను కూల్చేసి కుర్చీలను విరగగొట్టారు. విషయం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుకు తెలియడంతో ఆయన ఫోన్‌లో అక్కడ విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే రాకపోకలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో 1.00 గంట సమయంలో ప్రయాణికులను సలాదివారిపాలెం వైపు దాటించడంతో ఆందోళనకారులు శాంతించారు. అయితే అప్పటికే అక్కడ పంటుకోసం ఎదురుచూస్తున్న మాజీ ఎంపీ ఏజేవీ బుచ్చిమహేశ్వరరావు కూడా అధికారుల తీరును తప్పుబడుతూ విషయాన్ని జిల్లా కలెక్టర్, హోం మంత్రి రాజప్పకు ఫోన్‌లో వివరించారు. తక్షణమే సురక్షితమైన ప్రయాణానికి ఏర్పాటు చేయాలని బుచ్చిమహేశ్వరరావు హోం మంత్రి రాజప్పకు విజ్ఞప్తి చేశారు.

గాలింపు చర్యల్లో నిమగ్నమైన అధికార యంత్రాంగం
- అత్యాధునిక పరికరాలతో గాలింపు
అమలాపురం, జూలై 16: ఐ పోలవరం మండలం పశువుల్లంక పడవ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను సోమవారం మరింత ముమ్మరం చేశారు. గల్లంతైన వారి ఆచూకీని తెలుసుకునేందుకు సోమవారం నేవీ హెలీకాప్టర్, డ్రోన్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే గాలింపు మరింత ముమ్మరం చేసినట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. గాలింపు చర్యలు నిర్వహించేందుకు 20 బృందాలను ఏర్పాటు చేశారు. వారిలో ఒక బృందం హెలీకాప్టర్ ద్వారా నదీతీరంలో గాలింపు నిర్వహించారు. సోమవారం ఉదయం నుండి యానాం బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన బేస్ క్యాంప్ వద్ద కలెక్టర్, జిల్లా ఎస్పీ విశాల్ గున్నీలు గాలింపు చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ఆదివారం రాత్రి కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. మొత్తం 15 బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొన్నాయన్నారు. గల్లంతైన వారిలో గెళ్ళ నాగమణి మృతదేహం ఆదివారం రాత్రి లభ్యం కాగా ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. మరో చిన్నారి మృతదేహం సోమవారం సాయంత్రం భైరవపాలెం వద్ద లభించినట్టు కలెక్టర్ చెప్పారు. అయితే ఆ చిన్నారిని తల్లిదండ్రులు గుర్తించాల్సి ఉందన్నారు. మిగిలిన 5 మృతదేహాల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఏపీఎస్‌పీఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్, నేవీ బృందాలు నిర్విరామంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ఒక నేవీ హెలికాప్టర్ ద్వారా కూడా సోమవారం గాలింపు చర్యలు నిర్వహించామన్నారు. మృతదేహాలు గాలింపులకు సంబంధించి పాండిచ్చేరి ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. వరద తాకిడి దృష్ట్యా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో కూడా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వరదలు కారణంగా ఏర్పడే విపత్తులను ఏదుర్కోవడానికి ఆయా ప్రాంత ఆర్డీవోలు, డీఎస్పీలు అప్రమత్తంగా ఉండి పరిస్థితులను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడుతూ పడవ ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం పోలీసు యంత్రాంగం అంతా నిమగ్నమై ఉందన్నారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు గోదావరి నదీ ప్రాంతాన్ని కవర్ చేసేందుకు డ్రోన్‌లు తీసుకువచ్చి వాటి సహాయంతో కూడా గాలింపు చర్యలు చేపట్టామన్నారు. వారి వెంట డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, డీఎంఅండ్ హెచ్‌వో ప్రసన్నకుమార్, డీఆర్‌డీఏ పీడీ మధుసూదనరావు, ఏపీఎస్‌పీ కమాండెంట్ జే కోటేశ్వరరావు తదితరులున్నారు.