రామాయణం... మీరే డిటెక్టివ్

రామాయణం....90

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగానది పొడవునా విడిది చేసి ఉన్న ఆ సేనని చూడగానే గుహుడు తక్షణం తన బంధువులతో చెప్పాడు.
‘‘ఇటువైపు సముద్రంలా విశాలమైన గొప్ప సైన్యం కనిపిస్తోంది. వాళ్ళు ఎంతదూరం దాకా ఉన్నారో నా ఊహకి అందటం లేదు. దుర్భుద్ధితో భరతుడే స్వయంగా వచ్చినట్లున్నాడు. కైకేయి కొడుకైన ఈ భరతుడు ఇక్కడి పల్లె వాళ్ళని బంధించడానికి వచ్చాడా? లేక మనల్ని చంపడానికి వచ్చాడా? లేదా చాలా కష్టమైన దశరధుడి రాజ్యాన్ని స్వాధీనం చేసుకునే ఉద్దేశ్యంతో, అడవికి వెళ్ళిన రాముడ్ని చంపడానికి వచ్చాడా? రాముడు నాకు ప్రభువు. అందువల్ల రాముడి ప్రయోజనం కాపాడటం కోసం సిద్ధంగా గంగాతీర ప్రాంతంలో నిలిచి ఉండండి. మాంసం, దుంపలు, పళ్ళని తింటూ, నదిని రక్షిస్తున్న సమస్త పల్లె వాళ్ళు తమ సైన్యంతో గంగానది సమీపంలో నిలిచి ఉండాలి. ఒక్కో పడవలో కవచాలు ధరించిన ఐదు వందల మంది చేపలు పట్టే యువకులు చొప్పున వంద పడవల్లో సిద్ధంగా ఉండాలి. రాముడి విషయంలో భరతుడు దుర్మార్గపు ఆలోచనలు చేయడం లేదని తెలిసాకే ఈ సైన్యం సుఖంగా గంగానదిని దాటుతుంది.’’ చెప్పి చేపలు, మాంసం, తేనెలని భరతుడికి కానుకగా తీసుకువెళ్ళాడు.
శూరుడు, వినయంగా ప్రవర్తించడం తెలిసిన సుమంత్రుడు వస్తున్న గుహుడ్ని చూసి భరతుడితో వినయంగా చెప్పాడు.
‘‘తన బంధువులతో కలిసి వచ్చే ఈ గుహుడు దండకారణ్యం అంతా తెలిసినవాడు. నేర్పుగలవాడు. పెద్దవాడు. రాముడికి మిత్రుడు కూడా. అందువల్ల నిషాద రాజైన ఈ గుహుడికి దర్శనం ఇవ్వు. ఇతనికి రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో తప్పక తెలిసి ఉంటుంది.’’
భరతుడు సుమంతుడి శుభకరమైన మాటలు విని ‘వెంటనే గుహుడ్ని నా దగ్గరకు తీసుకురండి’ అని చెప్పాడు. గుహుడు తన బంధువర్గంతో భరతుడి దగ్గరకు వెళ్ళి వినయంగా చెప్పాడు.
‘‘ ఈ ప్రదేశం నీ ఇంటి వెనక ఉన్న ఉద్యానవనం లాంటిది. మేము నీకు లొంగి ఉన్నవాళ్ళం. ఇది నీ సేవకుడి ఇల్లు. ఇక్కడ యథేచ్ఛగా నివశించమని కోరుతున్నాం. ఇక్కడ దుంపలు, పళ్ళు, బోయవాళ్ళు తెచ్చిన అనేక రకాల పచ్చి, ఎండు మాంసాలు ఉన్నాయి. నీ సైన్యమంతా చక్కగా తిని ఈ రాత్రి ఇక్కడే విడిది చేస్తారని అనుకుంటున్నాను. అనేక పదార్థాలతో మేము చేసే ఆతిథ్యాన్ని అందుకుని నువ్వు నీ సేనతో రేపు వెళ్ళచ్చు.’’
(అయోధ్య కాండ 84వ సర్గ)
బుద్ధిశాలైన భరతుడు ఆ మాటలు విని బోయరాజైన గుహుడితో తెలివిగా ఇలా చెప్పాడు.
‘‘మా అన్నగారి మిత్రుడివైన గుహుడా! ఇంత సేనకి ఒక్కడివే ఆతిథ్యం ఇవ్వాలని కోరుకుంటున్నావు. నీ కోరిక ఎంత గొప్పది! నీళ్ళతో నిండిన ఈ గంగాతీర ప్రాంతం ప్రవేశించడానికి కుదరనిది. దాటడానికి కష్టమైంది. రాముడు ఎక్కడ ఉన్నాడో చెప్పు.’’
బుద్ధిమంతుడైన భరతుడి మాటలు విన్న, అడవుల్లో తిరిగే గుహుడు చేతులు జోడించి చెప్పాడు.
‘‘కీర్తి గల రాజకుమారా! విల్లంబులని ధరించిన ఈ పల్లె వాళ్ళు అప్రమత్తులై నీ వెనకే వస్తారు. నేను కూడా వస్తాను. నువ్వు శ్రమపడకుండా పనులు చేయగల రాముడికి కీడు తలపెట్టి అక్కడికి వెళ్ళడం లేదు కదా? నీ విశాల సైన్యాన్ని చూశాక నాకా అనుమానం వచ్చింది.’’
ఆకాశంలా నిర్మలుడైన భరతుడు గుహుడికి మృదువుగా జవాబు చెప్పాడు.
‘‘రాముడి విషయంలో అపచారం తలపెట్టే చెడ్డకాలం ఎప్పుడూ రాకుండుగాక! నా పెద్దన్న రాముడు నాకు తండి లాంటివాడు. అడవిలో నివశించే ఆ రాముడ్ని వెనక్కి తీసుకురావడానికై వెళ్తున్నాను. గుహుడా! నువ్వు మరోలా ఆలోచించక. నిజమే చెప్తున్నాను.’’
గుహుడు భరతుడి మాటలు విని సంతోషించి, వికసించిన మొహంతో మళ్ళీ చెప్పాడు.
‘‘అప్రయత్నం గా లభించిన రాజ్యాన్ని కూడా విడిచిపెట్టాలని నువ్వు కోరుకుంటున్నావు. నాకీ లోకంలో నీలాంటివాడు ఎవడూ కనపడటం లేదు. కష్టాల్లో ఉన్న రాముడ్ని తిరిగి వెనక్కి తీసుకురావాలని కోరుకునే నీ కీర్తి శాశ్వతంగా లోకాల్లో వ్యాపిస్తుంది.’’
గుహుడు ఇలా భరతుడితో మాట్లాడుతుండగానే సూర్యాస్థమయమై రాత్రి వచ్చింది. భరతుడు సైన్య విడిది అవసరాలని గమనించి, గుహుడి సేవలకి సంతోషిస్తూ పడుకున్నాడు. శతృఘు్నడు కూడా నిద్రించాడు. మహాత్ముడు, ధర్మదృష్టి గల భరతుడికి రాముడి గురించిన చింత కలిగింది. అడవి కాలిపోయినప్పుడు ఎండిన చెట్టులో దాగి ఉండే నిప్పు దాన్ని కాల్చేసినట్లు భరతుడిలోని దుఃఖాగ్ని అతన్ని లోలోపల కాల్చేస్తూ బాధ పెట్టింది. సూర్యకిరణాలతో వేడెక్కిన హిమవత్ పర్వతం నించి మంచు కారినట్లు శోకాగ్ని వల్ల పుట్టిన చెమట అతని అన్ని అవయవాల నుంచీ కారుతోంది. కొండంత దుఃఖం భరతుడ్ని ఆక్రమించింది. ఏదో ఆలోచనలే ఆ కొండలోని కఠినమైన శిలలు. నిట్టూర్పులే ధాతువులు. దైన్యమే వృక్షసముదాయం. శోకం, ఆయాసం, మనస్థాపం అనేవి దాని శిఖరాలు. మోహం అనంతమైన జంతుసముదాయం. సంతాపమే దానిపైన ఉండే ఔషధులు, వెదురు కర్రలు. అప్పుడు మానవ శ్రేష్ఠుడైన భరతుడు దుఃఖంతో నిట్టూరుస్తూ ఏం చేయాలో తోచక గొప్ప ఆపదలో చిక్కుకుని తన గుంపులోని ఎద్దులతో బాధింపబడ్డ ఎద్దులాగా మనశ్శాంతిని పొందలేకపోయాడు.
మహానుభావుడైన ఆ భరతుడు రాముడి గురించే ఆలోచిస్తూ పరివారంతో కలిసి ఉన్న గుహుడి దగ్గరకి వెళ్ళాడు. అప్పుడు దుఃఖించే గుహుడు భరతుడ్ని అన్నగారి విషయంలో మళ్ళీ ఓదార్చాడు.
‘‘ఇవాళ మూడు సర్గలు చెప్పాను. మిగిలిన కథని రేపు విందురుగాని.’’ హరిదాసు చెప్పాడు.
(అయోధ్యకాండ 85వ సర్గ)
ఆశే్లష హరికథని తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి తల్లికి వినిపించాడు. శారదాంబ మొత్తం విని చెప్పింది.
‘‘ఆయన చెప్పిన దాంట్లో ఐదు తప్పులు ఉన్నాయి. అవేమిటో తెలుసా?’’
‘‘తెలీదు.’’ ఆశే్లష చెప్పాడు.
‘‘అవేమిటో చెప్తా విను.’’
*
మీకో ప్రశ్న:
========
లక్ష్మణుడి సంతానం ఎవరు?

-మల్లాది వెంకట కృష్ణమూర్తి