డైలీ సీరియల్

పచ్చబొట్టు-6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలోచిస్తూనే మెట్లు దిగి బైక్ ఎక్కినవాడు ‘విద్యాలయ స్కూలు’ ముందు ఆగాడు.
అప్పటికే అందరూ వచ్చేసారు. నిన్న ఈ స్కూలు ముందునుంచీ వెళ్ళేప్పుడు తన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఇక్కడకు ఇలా రావాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఇదంతా ఒక్కక్షణం. డ్యూటీలో పడిపోయాడు.
యాజమాన్యం ఒకవైపు జరిగింది, తమకు తెలిసింది చెబుతూనే ఉంది. పనులు ఒకవైపు జరిగిపోతున్నాయి. మున్సిపాలిటీ స్కావెంజర్స్ శవాన్ని బయటికి తీశారు.
అప్పటిదాకా ఉన్న జనాన్ని దూరంగా వెళ్ళమనటం, చాక్‌పీస్‌తో శవం చుట్టూ మార్కు వెయ్యటం, ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీయడం, ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వాళ్ళ పనిని వారు చేసేసుకుంటున్నారు. చూసేవాళ్ళకు అది కొత్తగానీ మాకిది మామూలే అన్నట్లుంది వారి ప్రవర్తన.
అనే్వష్ శవాన్ని పరిశీలించాడు. ఉరేసి చంపేసి కొందరు బావిలో పారేస్తారు. అలాంటి గుర్తులేవీ గొంతు దగ్గిర కనిపించటం లేదు. అక్కడక్కడ చిన్న గాయాలు ఉన్నాయి. అన్నీ పరీక్షించిన తర్వాత వారికి అనిపించింది అది రేప్ కేసని. 174 సిఆర్‌పి సెక్షన్ క్రింద కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ తతంగం అయ్యాక శవ పంచనామా ప్రారంభించాడు.
ఒక ప్రక్క ఆ పాప తల్లిదండ్రులు, బంధుమిత్రులు నీళ్లు నిండిన కళ్ళతో నిలబడి ఉన్నారు. రాత్రంతా తమ ‘జ్యోతి‘ రాలేదని వెతికి వెతికి వేసారి నీరుగారిపోయారు. నిలబడే శక్తి కూడా లేని తమకు చేరిన వార్త. తమ జ్యోతి ఆరిపోయిందని. అసలిదంతా ఎలా జరిగింది? రాత్రినుంచీ కనిపించలేదంటే ఎక్కడో ఉంటుందనుకున్న తమకు ఇలా బిడ్డ చనిపోయి కనిపించటమే పెద్ద షాక్.
అలాంటి సమయంలో నోట మాట రావటంలేదు. వచ్చేది దుఃఖం. ఏడుపు తన్నుకొని వస్తోంది. మగవారు మనసులో విలపిస్తుంటే ఆడవాళ్ళు బయటపడిపోతున్నారు.
పెద్దమనుషులుతో, రక్తసంబంధీకులతో మాట్లాడి తమకు కావాల్సిన సమాచారం రాబట్టుకొని 24 ఫారాన్ని నింపుతున్నారు. పదిహేను కాలమ్ అందులో ముఖ్యమైనది, కీలకమైనది. దానితోనే కేసు బలపడుతుంది. అందులో అత్యాచారం క్రింద కేసు నోటుచేసుకున్నారు. ఫారమ్ మొత్తం నింపాక ఆ ఆరుగురిని వెళ్ళవచ్చని పంపేశారు.
అక్కడ అన్ని కార్యక్రమాలు ముగిసాక శవాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
రెండు గంటల తర్వాత డాక్టర్ వచ్చి సర్ట్ఫికెట్ తీసుకొని పాప శవాన్ని వాళ్ల తల్లిదండ్రులకు అప్పగించారు. తాము అపురూపంగా పెంచుకున్న చిన్నారి తల్లిని ఈ విధంగా ఇంటికి తీసుకువెళ్లాల్సి వస్తుందని తలవని వారి హృదయాలు కుమిలిపోతున్నాయి. విషయం అందించిన ప్యూన్‌మీదే కేసు వేశారు. కెమికల్ టెస్టు రిపోర్ట్స్ వచ్చాక, కోర్టులో కేసు వేస్తారు. అతను పదిహేను రోజులకొకసారి వచ్చి కనబడాలని చెప్పారు. ఇంతకీ అతను దోషా, నిర్దోషా? ఈ అఘాయిత్యం ఎవరు చేసారో తెలియదు. ఎలా జరిగిందో భగవంతుడికే తెలియాలి. ఈ కేసు ఎప్పటికి తేలేను? గెలిచినా తమ జ్యోతి తమకిక దొరకదుగా! తప్పుచేసినవాడిని శిక్షించామని ఆత్మసంతృప్తి తప్ప. ఇలా ఎంతమంది మొగ్గల్లా రాలిపోతున్నారో? ఈ అన్యాయాన్ని అరికట్టేవాళ్ళే లేరా? ఆక్రోశిస్తున్నాయి వారి కన్న హృదయాలు.
కాలమే సమాధానం చెప్పాలి.
****
అక్కడ ప్యూన్ ‘పరమానందం’ మాత్రం అన్యాయంగా తనమీద కేసు బనాయించారని, తనకే పాపం తెలియదని గగ్గోలు పెడుతున్నాడు.
తనే ఈ పని చేస్తే అందరికీ బావిలో శవాన్ని తనే ఎందుకు చూపిస్తాడు? అదే ప్రశ్న అందరి దగ్గిరా మొరపెట్టుకుంటున్నాడు.
‘‘నిర్దోషికి శిక్షపడే ప్రశే్న లేదు. మా దర్యాప్తులో నిజానిజాలు నిగ్గుతేలుతాయి, వేచి చూడండి’’.
అందరికీ అనే్వష్ సమాధానం అదే!
యాజమాన్యం మాత్రం కృంగిపోతున్నారు. స్కూలు పెట్టినప్పటినుంచీ ఒక చిన్న రిమార్కు కూడా లేకుండా ప్రశంసల మీద ప్రశంసలు పొంది ఎంతో ఘనకీర్తి సాధిస్తున్న తరుణంలో ఈ సంఘటన జరగటం ఏం చెయ్యాలో, ఏం చెప్పాలో తోచని పరిస్థితులలో పడేసింది. ఎవరైనా తమ ఎదుగుదలను అరికట్టాలని ఈ పన్నాగం పన్నారా అన్న ఆలోచన కూడా వాళ్ళకు రాకపోలేదు.
ఈ రోజుల్లో తాము ఎలా ఎదగాలన్న విషయాన్ని పక్కనపెట్టి అవతలవాడ్ని ఎలా పడగొట్టాలి అన్నదానికి ప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళే ఎక్కువ. అలాంటి దుష్ట ఆలోచనలు ఉన్న శత్రువులు ఎవరా అని ఆలోచనల్లో పడుతున్నారు.
ఎంత శోచనీయం?
సమాజం రోజురోజుకూ కృళ్ళిపోతోంది. దీన్ని ప్రక్షాళన చేసేది ఎవరు? ఎవరికోసమో ఎందుకు ఎదురుచూడాలి? మనల్ని మనమే సంస్కరించుకుంటే పోదా? అహ! అంత సంస్కారమే ఉంటే ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి?
బుద్ధులు బరదల్లో ఎందుకు పొర్లాడుతాయి?
****
జ్యోతి తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యం మీద కూడా కేసువేసారు. తమ పాప చావుకి వారే బాధ్యత వహించాలని పట్టుబట్టారు. అనుమానితుడిగా ప్యూన్‌ని అరెస్టుచేసినా ఇద్దరూ తామెవ్వరూ దీనికి బాధ్యులుకారని ఎవరికివారే వాపోతున్నారు.
ఇన్‌వెస్టిగేషన్ ప్రారంభమయింది.
క్లాసులో జ్యోతి ఎవరితో ఇంటికి వెళుతుందో వాళ్ళని కలిసి ప్రశ్నించటం మొదలుపెట్టాడు అనే్వష్.
‘‘ఆరోజు ఏం జరిగిందో వివరంగా చెప్పండమ్మా?’’
‘మామూలుగానే స్కూలు వదిలారు సార్. మేమంతా ఒకే వీధిలో ఉంటాం కాబట్టి కలిస్తే వెళ్తాం. ఇంటికి స్కూలు దగ్గిరే కాబట్టి నడిచేవెళ్తాం. మా సందు దగ్గరకు వచ్చేసాక జ్యోతి ‘‘అరె! స్కూల్లో, క్యారేజీ మరిచిపోయాను. అది చెబితే అమ్మ తిడుతుంది. రేపటికి ‘క్యారేజీ’కూడా కావాలిగా. వెళ్ళి తెచ్చుకుంటాను’’ అంది.
‘‘సరే! మేమూ తోడు వస్తామన్నాం.’’
కానీ అదే మళ్ళీ ‘వద్దు. నా ఒక్కదానివల్లా మీ అందరి ఇళ్ళలో ఆలస్యంగా వచ్చారని తిట్టించుకోవడం ఎందుకు? నేను వెళ్ళి వస్తానుగా అని వెళ్ళిందండి’’
‘‘అంతే! మాకు తెలిసింది.’’
ముగ్గురిని విడివిడిగా పిలిచి అడిగినా ఒకే సమాధానం వచ్చింది.
‘ఇల్లు మీకు దగ్గరేనన్నారుగా అసలు ఈ క్యారేజీలు ఎందుకు?’’ ప్రశ్నించాడు. అనే్వష్ సూటిగా వాళ్ళ కళ్ళలోకి చూస్తూ.
కాస్త బెదురుగా చూసారు పిల్లలు.
అప్పుడు అనే్వషణ తనను తాను కాస్త సర్దుకొని ‘‘సరదాగా కలిసి తిందామని తెచ్చుకుంటున్నారా?’’ అని అడిగాడు.
‘‘అవును సార్! ఇంటికి వెళ్ళి తినటం. వెంటనే బయలుదేరి రావటం కన్నా ఇక్కడ స్నేహితులమంతా ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తినటం బాగుందని’’ కాస్త ధైర్యం తెచ్చుకొని చెప్పారు.
‘‘ఇంకా ఏమన్నా చెప్పాల్సింది ఉందా?’’
‘‘ఒక గంట తర్వాత జ్యోతీవాళ్ళ అమ్మగారు మా ఇంటికి వచ్చి ‘జ్యోతి రాలేదేమిటని అడిగారు.’’
‘‘క్యారేజీ తెచ్చుకుంటానని వెళ్ళిందిగా. ఇంకా రాకపోవటమేమిటని మేమే అడిగాం. అది వెళ్ళికూడా చాలాసేపయిందని చెప్పాం! అప్పుడు ఆంటీ కంగారుగా ఇంటికివెళ్ళి అంకుల్‌కి ఫోన్‌చేసి పిలిపించారు. ఇద్దరూ స్కూలుకి వెళ్ళారట. అప్పటికే స్కూలు గేటుకి తాళం వేసి ఉందట.
*
-సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206