శిప్ర వాక్యం

మూలాల్ని విస్మరిస్తే మూల్యం తప్పదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చరిత్ర అబద్ధం చెప్పదు. కానీ, చరిత్రకారులు తమ అజ్ఞానం వల్లనో, అవసరాల దృష్ట్యానో చరిత్రకు రకరకాల వక్ర వ్యాఖ్యానాలు చేసుకోవచ్చు. దాదాపు వందేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన చరిత్రను ఈతరం విద్యార్థులు మరిచిపోయి ఉండవచ్చు. కానీ చరిత్రను విస్మరించేవారు చరిత్రహీనులవుతారు.
1940వ దశకంలో కృష్ణా జిల్లాలోని ఒక కుగ్రామంలో నందమూరి తారక రామారావు జన్మించారు. గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కళాశాలలో బీఏ చదివిన రోజుల్లోనే ఆయనకు నాటకాలపై వ్యామోహం ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం వదిలిపెట్టి, 1948లో మద్రాసుకు ఆయన వెళ్ళారు. అక్కడ ‘మనదేశం’ సినిమాలో పోలీసు కానిస్టేబుల్ వేషం వచ్చింది. ఆ రోజుల్లో చిత్తూరు నాగయ్య, సిహెచ్.నారాయణరావు వంటివారు హీరోలుగా తెలుగు తెరను ఏలుతున్నారు. వారిమధ్య మరొకరికి అవకాశం లేదు. అలాంటి స్థితిలో 1950 ప్రాంతంలో పల్లెటూరి పిల్ల అనే సినిమాలో ఎన్టీఆర్‌కు మంచి వేషం వచ్చింది. దాంతో ఆయన హీరోగా స్థిరపడడం మొదలుపెట్టారు.
రామారావుతోపాటు మరో ఇద్దరు ప్రముఖులు మద్రాసు చేరారు. వారిలో ఒకరు కొంగర జగ్గయ్య. రెండవ వ్యక్తి గుమ్మడి వెంకటేశ్వరరావు. వీరిద్దరూ మంచి రాజకీయ చైతన్యం కలవారు. సోషలిస్టు పార్టీలో చిన్న చిన్న ఉద్యమాలు కూడా నడిపారు. జగ్గయ్యకు విజయవాడలో రంగస్థల అనుభవం కూడా వుంది. మద్రాసు వెళ్లిన తరువాత ఆయన ఆలిండియా రేడియోలో అనౌన్సర్‌గా పనిచేశారు. ‘ఆకాశవాణి’లో వార్తలు చదవడం మొదలుపెట్టాక కొంగర జగ్గయ్య ‘కంచుకంఠం’ 1950లో వినపడుతూ వుండేది. సినీరంగంలోకి వచ్చాక జగ్గయ్య, గుమ్మడి రాజకీయాలు గురించి ముచ్చటించుకోవడం ఎన్టీఆర్‌కు నచ్చలేదు. ‘మనం ఇక్కడికి వచ్చింది భుక్తికోసం. కళారంగంలో సేవ చేయడం కోసం. దానిమీద ఏకాగ్ర దృష్టితో పనిచేయాలే తప్ప చిల్లర విషయాలపై విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు’ అని జగ్గయ్య, గుమ్మడిలను ఎన్టీఆర్ మందలించేవారు. చూస్తుండగానే రామారావువిశ్వరూపం తెలుగు వెండితెరను ఆక్రమించుకుంది. రామచంద్ర కాశ్యప, రామశర్మ, నాగయ్య, సిహెచ్.నారాయణరావు వంటి ఆనాటి హీరోలంతా ఆయన ముందు నిలబడలేక తెరమరుగైనారు. ఎన్టీఆర్‌కు సినీరంగంలో వున్నప్పుడు కళ తప్ప అన్య విషయాలు ఇష్టం ఉండేవి కావు. తెల్లవారు జామున లేచి స్టూడియోకి వస్తే రాత్రి పది గంటలైనా షూటింగ్ ముగిసేది కాదు. సుమారు అరవై ఏళ్ల వయసు వచ్చే నాటికి తాను నటించిన చిత్రాలు బాగా ఆడడం లేదని తెలిసి ఆయన బాధపడ్డారు. సినీరంగానికి స్వస్తిచెప్పే ముందు ఆయన నటించిన ‘శ్రీమద్విరాటపర్వం’ వంటి సినిమాలు జనాదరణ పొందలేదు. ‘ఇక ఈ ఫీల్డ్ నుంచి విరమించడం మంచిది’ అని ఆయన బహిరంగంగానే అన్నారు.
ఆ సమయంలో ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశించినా, కాంగ్రెస్ వాళ్లు పట్టించుకోలేదు. ఆ తరువాత నెల్లూరులో ఒక కీలక సంఘటన జరిగింది. సన్మానసభలో పాల్గొనేందుకు ఆయన మద్రాసు నుంచి కారులో నెల్లూరు చేరుకున్నారు. నెల్లూరులో ఆయన బస చేసిన గెస్ట్‌హౌస్‌లో కాంగ్రెస్ నాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్నారు. ‘ముఖానికి రంగు వేసుకొనే ఈయనకు నా బాత్‌రూమ్‌లోకి దూరడానికి ఎంత ధైర్యం?’ అని నేదురుమల్లి పెద్దగా అరిచాడట! మానధనుడైన ఎన్టీఆర్ చెవిలో ఆ మాటలు పడ్డాయి. దాంతో ఆయన ఖిన్నుడైనాడు. భోజనం చేయలేదు. సాయంత్రం సభ ఏదోరకంగా జరిగిపోయింది. మద్రాసు చేరుకున్నాక తన ఆంతరంగికులను కొందరిని పిలిచి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. అదే తెలుగుదేశం పార్టీకి మొదటి పునాది.
ఎన్టీఆర్ ఓ చాణిక్య శపథం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ వుండకూడదని, తెలుగువారి ఆత్మాభిమానం ప్రపంచానికి తెలిసేటట్లు చేయాలన్న ఆయన శపథం మేరకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. వివిధ రంగాలకు చెందిన కొందరు సన్నిహితులతో చర్చించి, సరికొత్త రాజకీయ చైతన్యానికి తెరఎత్తారు. ఆయన అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హరికృష్ణ వంటివారు మొదట్లో ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. తొమ్మిది నెలల్లోనే ఆ పార్టీ తన విశ్వరూపాన్ని చూపింది. కాంగ్రెస్ పార్టీని పెకిలించివేసింది. ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఆంధ్రా రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైంది.
ఎన్టీఆర్ అల్లుడైన నారా చంద్రబా బు తిరుపతిలో చదువుకుని, ఆ తర్వాత కాంగ్రెస్‌లో పనిచేశారు. తొలుత ఆయన కాంగ్రెస్ సంస్కృతిని కొంత జీర్ణించుకున్నారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు తెదేపాలో చేరారు. ఈ ఇద్దరి నేతృత్వంలో తేదేపా ఒక అజేయ మహాశక్తిగా మారింది.
తనను కాదని ఏపీలో మరో రాజకీయ శక్తి ఎదగడం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సహించలేకపోయింది. ఏవిధంగానైనా సరే ఎన్టీఆర్‌ను రాజకీయంగా పతనం చేయాలని వ్యూహరచన చేసింది. అపుడు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా రాంలాల్ ఉండేవారు. తెదేపా సర్కారులో మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావును, గవర్నర్ రాంలాల్‌ను ఢిల్లీకి పిలిపించి, ఎన్టీఆర్‌ను గద్దె దించేందుకు వ్యూహాన్ని అమలు చేయాలని ఇందిరమ్మ చెప్పింది. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్టు రాంలాల్ ప్రకటించి నాదెండ్లకు సీఎం పగ్గాలు దక్కేలా కథ నడిపాడు. అంతటితో రాజకీయంగా ఎన్టీఆర్ చరిత్ర ముగిసిందని అంతా భావించారు. అయితే కనీ వినీ ఎరగని రీతిలో తెలుగు ప్రజలు ఉవ్వెత్తున ఎగసిపడ్డారు. ఆ తరువాత 30 రోజులకు ఇందిరాగాంధీ ప్రజాభీష్టానికి తలవంచి రామారావును మళ్లీ ముఖ్యమంత్రిని చేసింది. ఇది గత చరిత్ర. ఇపుడు ఎవరూ విస్మరిస్తే మారిపోజాలదు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగానే తెదేపాలో మరో సంక్షోభం నెలకొంది. ఆయన లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నాక పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. ఆమె ఆధిపత్యాన్ని సహించని కొందరు నేతలు బహిరంగంగానే ఎదురు తిరిగారు. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం కోసం తపన పడ్డారు. సోషలిస్టు భావాలు కలిగిన ఎన్టీఆర్‌ను ఉభయ కమ్యూనిస్టు పార్టీలు వదిలిపెట్టి చంద్రబాబు పంచన చేరాయి. పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని చంద్రబాబు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో చంద్రబాబు క్యాంపు రాజకీయాలు నిర్వహించారు. ఆ హోటల్ ముందు ఎన్టీఆర్ దీనంగా నిలబడి ఎమ్మెల్యేలను బయటికి రావాల్సిందిగా అభ్యర్థించినా ఫలితం దక్కలేదు. ఇలా ఎన్టీఆర్ స్థాపించిన తెదేపా జెండా మీదనే చంద్రబాబు అధికారంలో కొనసాగుతున్నారు. సమర్ధుడైన చంద్రబాబుకు ప్రజల నాడి తెలుసు. ఎన్టీఆర్ మరణించాక చంద్రబాబు తెదేపాకు ఏకైక నాయకుడిగా మిగిలిపోయారు. అప్పటివరకూ కీలక పాత్ర పోషించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటివారు తెరుమరుగైనారు.
ఇటీవలి రాజకీయ చరిత్ర అందరికీ తెలిసిందే. తన అస్తిత్వానికి సవాలుగా వైఎస్ జగన్ రావడంతో ఇపుడు చంద్రబాబు ‘ఏపీకి ప్రత్యేక హోదా’ నినాదంతో కొత్త ఉద్యమాన్ని చేపట్టారు. ప్రధాని మోదీపైన, భాజపాపైన యుద్ధం ప్రకటించారు. ఏపీలో దాదాపు అంతరించిపోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రాణప్రతిష్ఠ చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకు తెదేపా సిద్ధమవుతోందన్న వార్తలు జోరందుకుంటున్నాయి. రాష్ట్ర విభజనతో ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్‌ను కాపాడేందుకు ఇపుడు బాబు ప్రయత్నిస్తే గనుక- అది న్యాయమేనా? ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందా? ఒక చారిత్రక అవసరాన్ని తీర్చడానికి తెదేపా ఆవిర్భవించింది. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు, తెదేపా మూలసూత్రాలకు విరుద్ధంగా ఆ పార్టీని నడిపిస్తే తెలుగువాళ్లకు బాధాకరమా? కాదా? తెలుగుదేశం ఒక రాజకీయపార్టీ కాదు, అది తెలుగువారి చైతన్య ప్రభంజనం. ఆంధ్రుల ఆత్మాభిమాన శ్రోతస్విని. దానిని సోనియా గాంధీ పాదాల ముందు పెట్టే అధికారం ఎవరికీ లేదు.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్