రివ్యూ

కళ్యాణం..కమనీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది*** శ్రీనివాస కళ్యాణం
***
తారాగణం:
నితిన్, రాశీఖన్నా
నందితా శే్వత, పూనమ్‌కౌర్
ప్రకాష్‌రాజ్, సితార, జయసుధ
రాజేంద్రప్రసాద్, ఆమని
సీనియర్ నరేష్, సత్యం రాజేష్
ప్రవీణ్, రచ్చరవి తదితరులు.

సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి
సంగీతం: మిక్కీ జె. మేయర్
ఎడిటర్: మధు
నిర్మాణం: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్
సమర్పణ: శ్రీమతి అనిత
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్-లక్ష్మణ్
రచన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
సతీష్ వేగేశ్న
***
ఆచారాలు, కట్టుబాట్లు, పెళ్లి తంతు మనం ఇదివరకే చాలా సినిమాల్లో తనివితీరా చూశాం. పెళ్లి అనేది జీవితంలో వచ్చే ఓ మధురమైన జ్ఞాపకం. అందుకే అలాంటి కథలతో వచ్చే చిత్రాలను తిలకించి మనసారా ఆస్వాదించాం, ఆశీర్వదించాం. కుటుంబ నేపథ్యాన్ని ఎంచుకుని ప్రేక్షకుల్ని కదిలించే సినిమాలకు ఎప్పుడూ ఆదరణ వుంటుందనేది నాడు, నేడూ వెండితెర సాక్షిగా రుజువవుతూనే వుంది. కథల ఎంపికలో నిర్మాత ‘దిల్’ రాజుకు ఓ ప్రత్యేక ముద్ర వుంది. కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తాగల నిర్మాతగా ఆయనకు పేరుంది. ఈ విషయంలో ఆయన శైలియే వేరు. గత సంవత్సరం దర్శకుడు సతీష్ వేగేశ్నతో కలిసి ‘శతమానంభవతి’ అంటూ బాక్సాఫీస్‌ని కొల్లగొట్టి భారీ విజయంతో పాటు, కుటుంబ ప్రేక్షకుల అభిమానాన్ని విశేషంగా చూరగొన్నాడు. తాజాగా అదే దర్శకుడితో మరోసారి కనువిందైన ప్రయాణం చేసి ప్రేక్షకులకు ఓ అందమైన జ్ఞాపకాన్ని నెమరేసుకునేలా చేశాడు. ఆ జ్ఞాపకమే ‘శ్రీనివాస కళ్యాణం’. గత చిత్రం ‘శతమానంభవతి’లో కుటుంబ బంధాలు, ప్రేమల విలువలు చాటి చెప్పిన దర్శకుడు ఈసారి తెలుగింట సాంప్రదాయాలు, పెళ్లి విలువలు నేటి తరానికి కళ్లకు కట్టేలా పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. పెళ్లి అనేది ఓ ఈవెంట్‌లా మారిపోతున్న ఈ రోజుల్లో, పెళ్లి బంధు మిత్రులతో కలిసి జరుపుకునే ఓ గొప్ప పండుగ.. ఓ చెదిరిపోని అందమైన జ్ఞాపకంగా తీర్చిదిద్దే ప్రయత్నమే ఇది. గత చిత్రంలో పండుగ విశిష్టతను తెలియజేసిన దర్శకుడు, ఈసారి పెళ్లి ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. దానికి కుటుంబ నేపథ్యాన్ని మిళతం చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే దిశగా అడుగులు వేశాడు. మన సాంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పచ్చటి పందిళ్ళు, నుదుట బాసికాలు, కళ్యాణతిలకాలు, పిండివంటలు, సన్నాయిమేళాలు, అరుంధతి దర్శనం.. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. ఇవన్నీ దర్శకుడు ఈ చిత్రంలో కళకు కట్టే విధంగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక పరిశ్రమలోకి హీరోగా అడుగుపెడుతూనే వరుస మాస్ కథలతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేశాడు యువ హీరో నితిన్. ‘ఇష్క్’తో తన పంథాను మార్చుకున్నాడు. గత చిత్రం ‘చల్ మోహన్‌రంగా’ ఊహించినంత సంతృప్తిని ఇవ్వలేకపోయినా హీరోగా హ్యాపినే మిగిల్చింది. ఎలాగైనా నితిన్ అంటే ఏమిటో నిరూపించుకునే కసితోనే అడుగులు వేశాడు. ఈ అడుగులకు దర్శకుడు, నిర్మాత తోడయ్యాడు. మరి అతడి లక్ష్యం నెరవేరిందా? వరుసగా విజయాలను అందుకుంటున్న దిల్‌రాజుకు, అంతే ఊపుమీదున్న సతీష్ వేగేశ్నకు ఈ ‘శ్రీనివాస కళ్యాణం’ ఎలాంటి అనుభూతిని మిగిల్చింది? ఈ ఇద్దరు చేసిన శ్రీనివాసుడి కళ్యాణం కమనీయంగా జరిగిందా? కళ్యాణానికి వచ్చిన అతిథులకు ఎలాంటి విందు భోజనం లభించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
శ్రీనివాస్ (నితిన్) సాంప్రదాయాలు, విలువలు, కట్టుబాట్లకు పెద్దపీట వేసే కుటుంబం నుంచి వచ్చిన యువకుడు. పెళ్లి సాంప్రదాయాలంటే అతడికి ఎంతో ఇష్టం, గౌరవం. నాయనమ్మ (జయసుధ)కు ఇష్టమొచ్చే రీతిలో నడుచుకోవాలన్న లక్ష్యంతో ఉంటాడు. తన పెళ్లిని నానమ్మకు నచ్చే విధంగా ఒక వేడుకలా జరుపుకోవాలనుకుంటాడు. నాయనమ్మ కూడా తన మనవడి పెళ్లిని గొప్ప ఉత్సవంలా చూడాలనుకుంటుంది. ఉమ్మడి కుటుబంలో పెరగడంవల్ల శ్రీనివాస్‌కు బంధాలు.. అనుబంధాలు.. తెలుగు సాంప్రదాయాలు, పెళ్లి విలువ నానమ్మ ద్వారా తెలుసుకుంటాడు. చిన్నప్పటినుంచి నానమ్మ చెప్పిన మాటలు విని పెరుగుతాడు. చండీఘర్‌లో ఆర్కిటెక్ట్‌గా కాలం గడిపే శ్రీనివాస్‌కు అక్కడి కాఫీ డేలో పనిచేస్తున్న శ్రీ (రాశీఖన్నా) పరిచయమవుతుంది. ఆమె ఆర్‌కె గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన ఆర్కే (ప్రకాష్‌రాజ్) కూతురు. ప్రతి నిమిషాన్నీ డబ్బుతో కొలిచే వ్యక్తి ఆర్కే. వ్యాపారమే పరమావధిగా భావిస్తాడు. సాంప్రదాయాలకన్నా బిజినెస్‌కే ఎక్కువ విలువ ఇస్తాడు. అలాంటి వ్యక్తి కూతురి ప్రేమలో పడతాడు శ్రీనివాస్. అంత గొప్ప బిజినెస్ కూతురు అని అతడికి తెలియదు. సాంప్రదాయాలకు విలువనిచ్చే శ్రీనివాస్ కుటుంబం.. బిజినెస్‌కే ప్రాముఖ్యం ఇచ్చే శ్రీ తండ్రి.. ఇలా వీరిద్దరి మధ్య కూతురి ప్రేమకు విలువ ఇచ్చాడా? కళ్యాణం కమనీయంగా జరిగిందా? ఈ తంతు జరగడానికి ఎలాంటి షరతులు విధించాడు? ప్రేమా.. పెళ్లి లాంటి విషయాలను కూడా బిజినెస్‌లా డీల్ చేసే ఆర్కే, శ్రీనివాస్-శ్రీల పెళ్లికి అంగీకరించాడా? శ్రీను తన నానమ్మ కోరుకున్నట్లుగా వారం రోజులపాటు పెళ్లి వేడుకకు అందర్నీ ఒప్పించగలిగాడా? ఇంతకు ఇది జరగడానికి ఆర్కే, శ్రీనివాస్‌తో చేసుకున్న అగ్రిమెంట్ ఏంటి? చివరకు అది ఎలాంటి దారిని చూపించింది అన్నదే కథ.
ఈ కళ్యాణం సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే జరిగింది. దర్శకుడు మనల్ని ఒక్కసారిగా ఎక్కడికో.. ఎన్నో ఏళ్ల వెనక్కి తీసుకెళ్లాడు. ‘శతమానంభవతి’తో ఇంటిల్లిపాదినీ థియేటర్‌లో కూర్చోబెట్టిన ఆయన, ఈ చిత్రంలో పండగ విశిష్టతను తెలియజేస్తూ ఆకట్టుకున్నాడు. ఆర్కే, శ్రీనివాస్ క్యారెక్టర్లను సమాంతరంగా నడిపిస్తూ వాళ్ల అభిరుచులకు, అభిప్రాయాలకు, పెళ్లికి వాళ్లు ఇచ్చే విలువలకు కథను నడిపిన విధానం భేష్. ఈ విధానంలో దర్శకుడు కొత్తదనం చూపించాడు. ప్రథమార్థంలో హీరో క్యారెక్టర్‌ను చూపిస్తూ సరదా సన్నివేశాలతో హీరోయిన్ ప్రేమను ముడిపెట్టాడు. ద్వితీయార్థం పూర్తిగా పల్లెటూరి నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. పెళ్లి ఇంట జరిగే తంతును కళ్లారా వీక్షించేట్టు చేశాడు. ఈ ప్రయాణంలో ఎమోషన్స్‌కు పెద్దపీట వేశాడు. అయితే ఫస్ట్ఫాలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగా అనిపించినా సెకెండాఫ్‌లో పెళ్లి పనులు మొదలైన తర్వాత కథనం నెమ్మదించింది. కాస్త బోర్ కొట్టిస్తుంది. పెళ్లింట్లో కామెడీ, ఎమోషన్స్ మరింతగా పండించే వీలున్నా దర్శకుడు దాన్ని సరైన విధంగా ఉపయోగించుకోలేదనిపించింది. అయితే దర్శకుడు రచయితగా మంచి మార్కులే కొట్టేశాడు. పెళ్లి మంత్రాల్లోని అంతరార్థం చెప్పే డైలాగ్స్‌తో పాటు ‘వద్దనుకుంటూ వెళ్లిపోతే అనుబంధాలు.. వదులుకుంటూ వెళ్లిపోతే సాంప్రదాయాలు మిగలవ్’ లాంటి డైలాగ్స్ అలరిస్తాయి. సాంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ వుంటుంది. దర్శకుడు పెళ్లి నేపథ్యంలో రాసుకున్న కథ ఈ సినిమాకు ప్రధాన బలం. పెళ్లిని, ఆ వాతావరణాన్ని ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా చూపిస్తూ, బాంధవ్యాలను, బంధువులమధ్య అనుబంధాలను తెలియజేశాడు. శ్రీనివాస్‌గా నితిన్ తన పెర్‌ఫార్మెన్స్‌తో విశేషంగా ఆకట్టుకున్నాడు. అతడికి ఇలాంటి క్యారెక్టర్ లభించడం అదృష్టమే. హీరోలా కనిపించకుండా క్యారెక్టర్‌లానే ఒదిగిపోయాడు. కుటుంబ బంధాలు సాంప్రదాయాల విలువలు తెలిసిన కుర్రాడిగా బరువైన పాత్రలో మెప్పించాడు. లవర్‌బాయ్ ఇమేజ్ చెడిపోకుండా ఎమోషన్స్‌లోనూ ఇరగదీశాడు. లుక్స్ పరంగా తన గత చిత్రాల్లోకంటే ఇందులో మెరుగుగా ఉన్నాడు. బరువైన భావోద్వేగ సన్నివేశాల్లో కూడా ఎంతో మెచ్యూరిటీ కనిపించింది. శ్రీ పాత్రలో కనిపించిన రాశీఖన్నా లుక్స్‌పరంగా చూడటానికి చక్కగా వుంది. అందం, అభినయంతో ఆకట్టుకుని క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది. ఇక శ్రీనివాస్ మరదలు పద్మావతి (నందితా శే్వత)కు చక్కటి క్యారెక్టర్ లభించింది. చిత్రంలో ప్రాధాన్యమున్న పాత్ర ఇది. అల్లరి అమ్మాయిగా ప్రథమార్థంలో అలరించిన నందిత ద్వితీయార్థంలో ఎమోషనల్ సీన్స్‌లో చక్కటి అభినయాన్ని ప్రదర్శించి మంచి మార్కుల్ని కొట్టేసింది. గొప్ప పేరున్న బిజినెస్‌మాన్ ఆర్కేగా ప్రకాష్‌రాజ్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఆ పాత్ర ప్రవర్తించే తీరు వినోదాన్ని పంచితే, అందులో పరివర్తన ఈ కథకు ఎమోషన్‌ను జోడించింది. మిలియనీర్‌గా ఈ పాత్రను సునాయాసంగా చేశాడు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టినపిండే. ముఖ్యంగా క్లైమాక్స్‌లో నితిన్-ప్రకాష్‌రాజ్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో కొంచెం లెంగ్త్ ఎక్కువైనట్లు అనిపిస్తుంది. జయసుధ, రాజేంద్రప్రసాద్, ఆమని, సితార, సీనియర్ నరేష్, సత్యం రాజేష్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను, హరితేజ, విద్యుల్లేఖ రామన్, రచ్చరవి.. ఇలా వీళ్లందరివీ సహాయ పాత్రలే అయినప్పటికీ ఎప్పటిలాగానే తమ నటనతో మెప్పించారు. సాంకేతిక విషయానికొస్తే.. మిక్కీ జే మేయర్ సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. పాటలు వింటుంటే పాత ట్యూనే్ల గుర్తొస్తాయి. ‘కళ్యాణం.. వైభోగం..’ పాట మాత్రం ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఎడిటింగ్, నిర్మాణ విలువలు ఉన్నాయి. సమీర్‌రెడ్డి కెమెరా కొత్త లుక్‌ని కళ్లముందు ఆవిష్కరించి ప్రెష్‌నెస్‌ని తీసుకొచ్చింది. మధు ఎడిటింగ్ ఓకె.
మొత్తంమీద సతీష్ వేగేశ్న రచయితగా, దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశాడు. అయితే ద్వితీయార్థంలో ప్రారంభమయ్యే పెళ్లి పనులు అలాగే చివరి వరకూ సాగి ప్రేక్షకుడికి కాస్త బోర్ ఫీలయ్యేలా చేస్తాయి. అయినప్పటికీ బంధాలు, బంధుత్వాలమధ్య దూరాన్ని చెరిపేస్తూ శ్రీనివాసుడి కళ్యాణాన్ని కమనీయంగానే మలిచాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. మొత్తం మీద ఇది అందరూ చూడతగ్గ కళ్యాణమే!

-రతన్