సబ్ ఫీచర్

సినీ భీష్ముడు రాఘవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సినీ నిర్మాత అంటే నాలా వుండాలి. ఖర్చుల విషయంలో, తారలకు పారితోషికం ఇవ్వడంలో ఖచ్చితంగా వుండాలి. నిర్మాణ వ్యయం అదుపు తప్పకుండా, ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఇప్పటివాళ్ళకి నిర్మాత అంటే అర్ధమే తెలియదు’’ అని సినిమా నిర్మాణంపై అవగాహన లేకుండా సినిమాలు తీస్తున్న నిర్మాతలకు చురకలు వేస్తాడు సినిమా భీష్ముడు కె.రాఘవ.
సెంచరీ కొట్టి నాటౌట్‌గా నిలిచే మనుషులు అరుదుగా వుంటారు. సంపూర్ణ ఆరోగ్యంతో వందేళ్ళు దాటి జీవించే మనిషిని చూడ్డం ఇంకా అరుదు. ‘‘నాకు ఏ చెడు అలవాట్లు లేవు. ఆఖరికి కాఫీ, టీలు కూడా ముట్టను. మజ్జిగ మాత్రమే తాగుతాను’’అని తన ఆరోగ్య రహస్యం గుట్టువిప్పాడు. రేసులు, పేకాట, మద్యం వంటి వ్యసనాలకు బానిసలై ఆర్థికంగా దిగజారి, ఆరోగ్యం పాడైపోయి రోగాలతో అర్ధాంతరంగా చనిపోయిన ఎందరో సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు తక్కువేమీ కాదు. ఇప్పుడు డ్రగ్స్ మత్తులో తూలుతున్న వాళ్ళనీ చూస్తున్నాం. వ్యసనపరులై పోవడానికి ఎన్నో అవకాశాలు నిత్యం చుట్టుముట్టే సినిమా రంగంలో ఏ వ్యసనానికీ బానిస కాకుండా వందేళ్ళు నిలబడిన ధీరుడు కె.రాఘవ. ఆయనకు ఆయనే సాటి. భవిష్యత్తులో అటువంటి సినీ నిర్మాతను చూడలేం.
‘‘నా కళ్ళముందే సినీ పరిశ్రమ మూకీ సినిమాలనుంచి ఎదిగింది. సంవత్సరానికి ఒకటి, రెండు సినిమాలు తీసే స్థాయినుంచి ఇప్పుడు ఏటా వెయ్యి సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతోంది ఇండియన్ సినిమా!’’అని ఎంతో గర్వంగా చెబుతాడు రాఘవ.
కోటిపల్లిలో ఏడేళ్ళ వయసున్నప్పుడు చదువుకోవడం లేదని నాన్న కొడితే, కోపం వచ్చి ఇంట్లో వుండనని పారిపోయి రైలెక్కి కలకత్తా చేరాడు. మూకీ చిత్రాలు కలకత్తాలోనే తయారయ్యేవి.
ఈస్టిండియా కంపెనీ, చమ్రియా టాకీస్‌ల అధినేత మోతీలాల్ చమ్రియా కంపెనీలో బాయ్‌గా చేరాడు. సినిమా అక్కడ అ.ఆలు నేర్చుకుంటున్న దశలో షూటింగ్స్‌లో ట్రాలీలు లాగాడు, సినీ తారలకు టీ, కాఫీలు అందించాడు. కడుపు నింపుకోవడానికి నానాపనులు చేశాడు. ఒకసారి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అదృష్టం తరుముకొచ్చి మృత్యుంజయుడై నిలబడ్డాడు. పాము నోట్లో పడకుండా జీవితంలో ఎవరెస్ట్‌శిఖరం ఎత్తుకు ఎదిగాడు. సినీ పరిశ్రమ మరిచిపోలేని మహామనిషయ్యాడు. మూకీల యుగం అంతరించి టాకీల నిర్మాణం మొదలవడంతో కలకత్తానుంచి మద్రాస్‌కి చేరాడు. మీర్జాపురం రాజావారి శోభనాచలం స్టూడియోలో చేరాడు. ‘‘మద్రాస్ సెంట్రల్ స్టేషన్లో ఎన్.టి.రామారావుని రిసీవ్ చేసుకుని మీర్జాపురం రాజాగారి ఆఫీసుకి తీసుకెళ్ళింది నేనే.’’అంటాడు గర్వంగా.
తర్వాత ఎన్టీరామారావు హీరోగా చేసిన పాతాళభైరవి, రాజుపేద చిత్రాలకు స్టంట్ మాష్టర్‌గా రాఘవ పనిచేశారు. ఆయన స్కూలు, కాలేజీ, యూనివర్సిటీల్లో చదువుకోలేదు. లోకాన్ని చదివారు. ‘‘నేను ఏడు భాషలు మాట్లాడతా!’’అంటారు. అదే ఆయన జీవితంలో మేలి మలుపు. ఆయన జెమినీ స్టూడియోలో పనిచేసేటప్పుడు ఎమ్.జి.ఎమ్ స్టూడియోవాళ్ళు ఇండియాలో ఇంగ్లీష్ సినిమా తీస్తున్నప్పుడు బహుభాషలు మాట్లాడే మనిషి అవసరమయ్యాడు. ఆ మనిషి రాఘవే! ఆయనే్న అదృష్టం వరించింది. ‘్భవానీ జంక్షన్’ ఇంగ్లీషు చిత్రం తీస్తున్నప్పుడు రాఘవ కార్యదక్షత జెమినీ వాసన్‌ని ఆవిష్కరించింది. ఎమ్.జి.ఎమ్.వారి ‘టార్జాన్ గోస్ టు ఇండియా’ చిత్రానికి రాఘవని రికమండ్ చేశాడు వాసన్. ఈ సినిమా నిర్మాణం ఇండియాతోపాటు, రోమ్‌లో గూడా జరిగింది. ఎమ్.జి.ఎమ్.వారు రాఘవకు పెద్దమొత్తం పారితోషికంగా ఇచ్చారు. రాఘవ శివాజీ గణేశన్ కంపెనీలోకూడా పనిచేశాడు. సినిమాలలోకి రాకముందు కె.బాలచందర్ నాటకాలు ప్రదర్శించేవారు. మేజర్ చంద్రకాంత్ నాటకాన్ని ప్రదర్శిస్తూ ఆ నాటకానికి శివాజీ గణేశన్‌ని తీసుకురావలసిందిగా రాఘవను అభ్యర్థించాడు బాలచందర్. రాఘవ ప్రోద్బలంతో శివాజీ గణేశన్ ఆ నాటకం చూసి దాని హక్కులు రాఘవ పేరుతో కొన్నాడు. హిందీవారికి ఆ కథ నచ్చి రాఘవ దగ్గర హక్కులుకొన్నారు. లాభం తను వుంచుకుని పెట్టుబడి పెట్టిన శివాజీకి అసలు డబ్బు ఇచ్చేశాడు. నాగేశ్వరరావు, సావిత్రిలకు తమిళంలో వున్న క్రేజ్‌ని దృష్టిలో వుంచుకుని ‘పరివర్తన’ తెలుగు చిత్రం తమిళంలోకి డబ్ చేశాడు రాఘవ. అందులో లాభం వచ్చింది. యన్.యన్.్భట్, ఏ.కామ్రేశ్వరరావు కలిసి మేజర్ చంద్రకాంత్‌ని నిర్మించాలనుకున్నారు. కథ హక్కుదారులైన రాఘవను పార్టనర్‌గా కలుపుకున్నారు. అదే సుఖ దుఃఖాలు. 1967లో విడుదలైంది. ఐ.ఎన్.మూర్తి డైరెక్టర్. తర్వాతి ఫల్గుణా పిక్చర్స్ స్థాపించి ఏ.కామ్రేశ్వరరావు పార్టనర్‌గా జగత్ కిలాడీలు నిర్మించాడు. ఐ.ఎన్.మూర్తి దర్శకత్వంలో 1969లో విడుదలైంది. తర్వాత జగత్ జెట్టీలు, జగత్ కంత్రీలు నిర్మించారు. జగత్ జెట్టీలు నిర్మాణంలో వున్నప్పుడు రాఘవతో అభిప్రాయ భేదాలు వచ్చి డైరెక్టర్ కె.వి.నందనరావు సినిమా నుంచి తప్పుకుంటానన్నాడు. యస్.వి.రంగారావుకి కె.వి.నందనరావు బాగా ఆప్తుడు, అత్యంత సన్నిహితుడు. సినిమా పూర్తి చెయ్యకుండా వెళ్ళవద్దన్నాడు రంగారావు. సినిమా పూర్తి చేశాడు నందనరావు. రంగారావు మాటకు అంత విలువ ఇచ్చాడు. జగత్ జట్టీలు సినిమాకు దాసరి నారాయణరావు అసోసియేట్ డైరెక్టర్. తర్వాత ఆయన రాఘవకు సన్నిహితుడయ్యాడు. ఆయన చెప్పిన ‘తాత మనవడు’ కథ రాఘవకు నచ్చింది. దాసరి నారాయణరావు ‘తాతమనవడు’తో డైరెక్టర్ అయ్యాడు. రాఘవ స్వంతంగా ప్రతాప్ ఆర్ట్ పిక్చర్స్ బేనర్ స్థాపించి తాతామనవడు నిర్మించాడు. ఘన విజయం సాధించి సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎన్నిక చేసి రజత పతకం ఇచ్చారు. తర్వాత నిర్మించిన ‘సంసారం సాగరం’ కూడా తృతీయ ఉత్తమ చిత్రంగా కాంశ్య పతకం సాధించింది. తూర్పుపడమర, చదువుసంస్కారం, అంతులేని వింతకథ, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి వంటి తెలుగు చిత్రాలేకాక హిందీలో ‘ఇత్నీ సీ బాత్’ తమిళంలో ‘మైనర్ మా పిళ్ళె’ అనే చిత్రాలు తీశారు. 27 చిత్రాలు నిర్మించాడు రాఘవ. దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, కొమ్మినేని కృష్ణమూర్తి, రాజశ్రీ, మోహన్‌దాసు, ఆదిత్య, గుహనాథన్‌లను దర్శకులుగా పరిచయం చేశాడు రాఘవ. రచయిత గొల్లపూడి మారుతీరావుని ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ చిత్రంద్వారా నటుడిగా పరిచయం చేశాడు. 1930 నుండి మూకీలనుండి టాకీలు, సినిమాకు వేల బడ్జెట్ నుంచి కోట్ల బడ్జెట్ వరకు ఎదుగుదలను కళ్ళారా చూసిన రాఘవ జీవిత చరిత్ర ఎందుకనో ఎవరూ రాయడానికి పూనుకోలేదు. ఆయన జీవిత చరిత్ర భావితరాలకు మార్గదర్శకంగా, గైడ్‌గా ఉపయోగపడేది. రెండువేలు పారితోషికం అడిగిన నటులకు ‘వెయ్యి మాత్రమే ఇస్తాను.’ అనేవాడు. తర్వాత రెండువేలు ఇచ్చేవాడు. ‘‘ఎందుకు అలా? ముందే అతను అడిగిన రెండువేలు ఇస్తానంటే సరిపోయేది గదా?’’అని అడిగితే, ‘‘మీకు మనిషి మనస్థత్వం తెలీదు. వెయ్యి వస్తాయని పనిచేసిన వాడికి, అనూహ్యంగా రెండువేలు వస్తే ఎంతో సంతోషిస్తాడు. అంతేగాని ముందే అడిగినంత ఇస్తే ఆ మనిషికి తృప్తి వుండదు’’ అంటాడు రాఘవ. కోటిపల్లి రాఘవకి 102 ఏళ్ళు నిండిన సందర్భంలో సీనియర్ సిటిజన్ సమాఖ్య, కూకటిపల్లి, వడ్డేపల్లి కమలమ్మ సీనియర్ సిటిజన్స్ భవనంలో ఘనంగా సన్మానం చేశారు. 37 మంది రచయితల కథాసంకలనం ‘మా అమ్మానాన్న కథలు’ ఆయనకు అంకితం యిచ్చి గౌరవించారు తెలుగు కథరచయితల వేదిక. 15-3-2015న జరిగిన ఈ సభకు కోడి రామకృష్ణ ఆత్మీయ అతిథిగా హాజరై రాఘవ గురించి ప్రసంగించారు.
( 31-7-2018న కీర్తిశేషులైన రాఘవగారికి ఇదే మా నివాళి)
*

- వాణిశ్రీ