ఈ వారం స్పెషల్

రాతిగోడల వెనకాల జ్ఞాపకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

***కరెన్సీ నోటు అనగానే బోసినవ్వుల బాపూజీ, జాతీయ చిహ్నమైన మూడు సింహాలు, దానిపై ముద్రించిన పదిహేను భాషలు, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా2పేరు వంటివి.. అందరికీ గుర్తొస్తాయి. కానీ ఆ నోటు చెల్లుబాటు అవ్వాలంటే మాత్రం దానిపై ఒకరి సంతకం తప్పనిసరి! వారే రిజర్వు బ్యాంకు గవర్నర్. కేవలం కరెన్సీ నోట్లపై సంతకాలే కాదు, అత్యంత క్లిష్టమైన, కష్టమైన ఆర్థిక పరమైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనాలి. లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నవౌతుంది. దేశానికి అత్యున్నత బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాని విధివిధానాలు సరిగ్గా సాగేలా చూసే బాధ్యత మాత్రం ఆర్‌బీఐ గవర్నర్‌దే. ఆర్థిక మాంద్యం నివారించడం, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడం వంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునేది కూడా ఆయనే. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఫారిన్ ఎక్స్ఛేంజ్‌లో నగదు మార్పిడిని కూడా ఆర్‌బీఐ గవర్నరే రూపొందించాలి. ప్రతి సంవత్సరం అవసరమైనప్పుడు మూలధనాన్ని ముద్రించడంతోపాటు పెట్టుబడుల దగ్గర నుంచి రుణాల వరకు ఉండాల్సిన వడ్డీరేట్లను నిర్ణయించే అధికారాలు ఆర్‌బిఐ గవర్నరుకు మాత్రమే ఉంటాయి. ప్రభుత్వం తరపున జరిగే ప్రతి చెల్లింపునకు జవాబుదారీగా ఉంటూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక లావాదేవీల్లో ఆయనే అనుసంధానకర్తగా ఉంటాడు. ప్రభుత్వాల నుంచి వచ్చే అనేక రకాల ఒత్తిడులను తట్టుకుంటూ, మరో పక్క సామాన్య ప్రజల ప్రయోజనాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా 3బాలెన్స్2 చేయాల్సిన బాధ్యత కూడా ఆర్‌బీఐ గవర్నర్‌దే. ఇలాంటి అత్యున్నతమైన, అతి కష్టమైన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి పదవీ విరమణ చేసిన ఆర్‌బీఐ 21వ గవర్నర్, 3పద్మవిభూషణ్2 డా. వై.వి. రెడ్డి(యాగా వేణుగోపాలరెడ్డి), 22వ గవర్నర్ దువ్వూరి సుబ్బారావులు తెలుగుజాతి ముద్దుబిడ్డలు.
సామాన్యుని మేలునే తన జీవనసాఫల్యంగా మలచుకున్న ఆర్థికవేత్తలైన వీరిరువురూ రెండు పుస్తకాలను రాశారు. వై.వి. రెడ్డి తెలుగు పాఠకులను దృష్టిలో ఉంచుకుని ‘నా జ్ఞాపకాలు’ పేరుతో చక్కని తెలుగు నుడికారాలతో, సంభాషణలతో పుస్తకాన్ని సిద్ధం చేయించారు. దువ్వూరి సుబ్బారావు ఆంగ్లంలో ‘హూ మూవ్డ్ మై ఇంటరెస్ట్ రేట్? ’2అనే పేరుతో పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఈ పుస్తకం తెలుగులో కూడా వచ్చింది. వై.వి. రెడ్డి జన్మదినం ఆగస్టు 17, దువ్వూరి సుబ్బారావు జన్మదినం ఆగస్టు 11. ఇలా వీరిద్దరి జన్మదినం ఆగస్టులోనే అవడంతో వారు రాసిన పుస్తక సమీక్షలు ఈ వారం పాఠకుల కోసం...
=============================================

తెలుగువారి భాగ్యం కొద్దీ ఇప్పటికి కొన్ని ప్రముఖ ప్రచురణ సంస్థలు ఉన్నాయి. అవి అసాధారణ స్థాయిలో ఉండే పుస్తకాలను ప్రచురించడానికి సాహసిస్తున్నవి. కాబట్టి సాధారణంగా ఆంగ్లంలో లేని, అందుబాటులో ఉండని ఒక స్థాయి పుస్తకాలు కూడా తెలుగులో వస్తున్నవి. అలా గత సంవత్సరం ఒక ఆరు నెలల వ్యవధిలో ఒకే ప్రచురణ సంస్థ ద్వారా తెలుగువారైన ఇరువురు రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ల అనుభవాలు మన పరిశీలనకు లభించాయి. అందుకు ప్రచురణకర్తలైన ఎమెస్కో వారిని, గ్రంథకర్తలైన శ్రీయుతులు యాగా వేణుగోపాలరెడ్డి (వై.వి.రెడ్డి అంటే తేలిగ్గా గుర్తిస్తారేమో!)ని, దువ్వూరి సుబ్బారావును మనం తప్పక అభినందించాలి.
ఈ పుస్తకాలను ఒకసారి చదివేసి, ఆనందించటం అయిపోయిన తర్వాత, ఆ ఇరువురి అనుభవాలలోని వ్యత్యాసాలను, విశేషతలను గుర్తించే ప్రత్యేకమైన దృష్టితో చదివేవారికి ఎంతగానో ఆసక్తిదాయకమైన, విజ్ఞానదాయకమైన విషయాలు గోచరిస్తాయి. శ్రీ యాగా వేణుగోపాలరెడ్డి తన చిన్ననాటి ముచ్చట్లతో మొదలుపెట్టి నల్లగొండ జిల్లా కలెక్టరుగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్లానింగ్ కార్యదర్శిగా, కేంద్ర ఆర్థిక శాఖలో జాయింట్ సెక్రటరీగా, రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నరుగా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, రిజర్వు బ్యాంకు గవర్నరుగా, 14వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా తన అనుభవాలనన్నింటినీ స్పృశిస్తూ రాగా (పుస్తకం పేరు: నా జ్ఞాపకాలు - సామాన్యుని మేలునే తన జీవన సాఫల్యంగా మలుచుకున్న ఆర్థికవేత్త ఆత్మకథ) శ్రీ దువ్వూరి సుబ్బారావు ‘రిజర్వు బ్యాంకు రాతిగోడల వెనకాల.. సంక్షోభకాలంలో ఆర్‌బిఐ గవర్నరుగా అయిదేళ్లు’ అన్న పుస్తకంలో- తాను రిజర్వు బ్యాంకు గవర్నరుగా ఉన్న కాలంలోని అనుభవాలను వివరించడానికే పరిమితమయ్యారు. రిజర్వు బ్యాంకు పని ఏమిటి? దాని విధి విధానాలు ఎలాంటివి? అని వివరించే ప్రయత్నమూ చేశారు.
వై.వి.రెడ్డిగారు 1996 సెప్టెంబరు నుండి 2002 జూలై వరకు రిజర్వు బ్యాంకులో డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నారు. ఒక సంవత్సరం పాటు ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉండి 2003 జూలై రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా అయిదేళ్ళ పదవీ కాలంతో నియమితులయ్యారు. 2008 జూలైలో వారి తర్వాత దువ్వూరి సుబ్బారావు మూడేళ్ళ పదవీకాలంతో గవర్నర్‌గా నియమితులై, 2011లో మరో రెండేళ్ళపాటు పదవీకాలం పొడిగింపబడి 2013 జూలై పదవీ నివృతులైనారు. ఈ విధంగా సుమారుగా 15 సం.ల అనుభవాలు పాఠకులకు అందుబాటులోకి వచ్చాయి.
యా.వే.రెడ్డి రిజర్వు బ్యాంకులో డిప్యూటీ గవర్నరుగా చేరిన సమయంలో గవర్నరు డా సి.రంగరాజన్ (ఈయన ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా బాధ్యత వహించారు). ‘‘నా అదృష్టం కొద్దీ మనదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ తీవ్రమైన సంఘటనలు చోటుచేసుకున్న సమయం అది. అవి మన దేశాన్ని అతలాకుతలం చెయ్యకుండా రక్షించడంలో ఆర్‌బిఐ పాత్ర చాలా గొప్పది. అసలు అన్ని విపత్కర పరిస్థితులు ఉన్నాయని కూడా సామాన్య పౌరులకు తెలియదంటే, ఆర్‌బిఐ ఎంత బాగా పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు మనదేశంలో ఆర్థిక సంక్షోభం ఇంకా తగ్గుముఖం పడుతూ ఉండగానే 1997 జూలైలో ఆసియా సంక్షోభం విరుచుకుపడింది. 1998లో రష్యాలో రూబుల్ సంక్షోభం వచ్చిపడింది. రష్యా ప్రభుత్వం, అక్కడి రిజర్వు బ్యాంకు రూబుల్ విలువను తగ్గించాయి. ఫలితంగా అప్పులు తీర్చలేక విఫలమయ్యాయి. దానితో అప్పులిచ్చేవారిలో భయం మొదలై, ఇండియా సహా అనేక దేశాల్లో తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవటం మొదలుపెట్టారు. ఆ ఏడాదే, పోఖ్రాన్‌లో మనం అణుపరీక్షలు జరిపినందుకు నిరసనగా అమెరికా మనమీద ఆంక్షలు విధించింది. తర్వాత 1999లో మనదేశంలో కార్గిల్ యుద్ధం వచ్చిపడింది. బ్రెజిల్ కరెన్సీ సంక్షోభం వచ్చింది. ఇవన్నీ మన దేశాన్ని పెద్దగా ప్రభావితం చేయలేదంటే- దానికి రంగరాజన్ హయాంలోనూ, బిమల్ జలాన్ కాలంలోనూ తీసుకున్న గట్టి చర్యలే కారణమని చెప్పొచ్చు.. ఆ సమయంలో డిప్యూటీ గవర్నరుగా ఉండటంవల్ల అనేక కీలక నిర్ణయాల్లో నేను భాగస్వామిని కాగలిగాను’’ (218-19 పుటలు)
‘‘1997 నాటి ఏన్యువల్ క్రెడిట్ పాలసీని 5న ప్రకటించాలనుకున్నారు. ఆ సమాచారం బ్యాంకులకు తెలుసు. పబ్లిక్‌కూ తెలుసు. ఈలోగా సీతారాం కేసరి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది. ప్రభుత్వం ఉంటుందో, ఉండదో తెలియని డోలాయమాన పరిస్థితిలో పడిపోయింది. పాలసీ ప్రకటన వాయిదా వేద్దామనుకున్నారు గవర్నర్ రంగరాజన్. అది వద్దని నేను ఆయనకు సూచించాను.. ఇదే మంచి అదునుగా దీర్ఘకాలంలో మేలు చేసే మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నది నా వాదన. దానే్న కాస్త సరదాగా ‘సర్, స్వాతంత్య్రం ఎవరూ ఇవ్వరు. మనం దాన్ని తీసుకోవాలంతే’ అన్నాను గవర్నరుతో. అప్పటిదాకా అటూ ఇటూ ఊగిసలాడుతున్న ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. వాయిదా వేయకుండా అనుకున్న తేదీనే పాలసీ ప్రకటించేశారు. ‘బిగ్ బ్యాంగ్’ థియరీగా అది చరిత్రలో నిలిచిపోయింది.
అనేక నిర్ణయాల్లో తాను కీలక పాత్ర వహించడం జరిగిందని శ్రీ యా.వే. రెడ్డి పైన పేర్కొన్నదానికి ఇలాంటి చాలా అంశాలు తార్కాణాలుగా మనకు ఈ పుస్తకంలో కనబడుతాయి.
‘‘1997 ఆగస్టు మొదట్లో- పారెక్స్ (విదేశీ మారక ద్రవ్యంతో ముడిపడిన ఎగుమతి- దిగుమతి వ్యాపారాల) మార్కెట్లలో రూపాయి విలువ ఎక్కువగా ఉందనే భావన కలిగింది ఆర్‌బిఐ వర్గాలకు. సులువైన మాటల్లో చెప్పాలంటే- ఒక డాలర్‌కు మారుగా అవసరమైన రూపాయల సంఖ్య తక్కువగా ఉండటం. ఎగుమతులు తగ్గిపోతాయి. దిగుమతులు పెరుగుతాయి. అది అలాగే కొనసాగితే.. చివరికది ఏదో ఒకనాడు రూపాయి పతనానికి కారణమవుతోంది. అదే జరిగితే ఆ నష్టాన్ని మాటల్లో చెప్పలేం! దాన్ని ముందుగా ఊహించే, రూపాయి విలువను సరిచెయ్యడానికి నడుం బిగించింది ఆర్‌బిఐ.. ఒక దేశం తన కరెన్సీ విలువను తానే తగ్గించడం అనేది ప్రపంచంలో అదే తొలిసారేమో! అటువంటి పనికి ఒడిగట్టిన నన్నొక దుర్మార్గుడిలాగా చూడటం మొదలుపెట్టారు అందరూ. దేశ ఆర్థిక క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నా విధి నేను నిర్వర్తించానన్న భావనతో పుట్టినరోజు చేసుకుందామని హైదరాబాద్ వచ్చేశాను.. రూపాయి విలువ కరెక్షన్ చాలా వేగంగా మొదలైంది. రూపాయి విలువ అంత త్వరగా క్షీణించటం ప్రభుత్వానికి (అప్పటి ప్రధాని ఐ.కె.గుజ్రాల్) అంతగా రుచించలేదు. దానికి నేనే బాధ్యుణ్ణి అన్నట్లుగా చూడటం మొదలెట్టారు అందరూ! విలువ పడిపోతున్న వేగాన్ని నియంత్రించమని ఆర్థిక మంత్రి చిదరంబరం సలహా ఇచ్చారు. నా అభిప్రాయాలకది విరుద్ధం.. నేను గట్టిగా వాదించాను. చిదంబరం- ‘వేణూ! ఇది క్లిష్టమైన విషయం. ఒక్క కోణంలోంచే దీన్ని చూడకూడదు. మార్కెట్లు బెంబేలెత్తకుండా చూసుకోవాలి మనం’ అన్నారు. అలాగే చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆసియా ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని సునామీలా తాకింది. దానికి ముందుగానే ‘మేం రూపాయి విలువని బలవంతంగా తగ్గించడంవలన ఆ సంక్షోభం మన దేశాన్ని అంతగా ఇబ్బంది పెట్టలేదు.. పూర్వం గవర్నరుగా పనిచేసిన తారాపోర్ రాసిన మాటలు నాకెప్పటికీ గుర్తుంటాయి. ‘‘్భరతదేశం ఆర్థిక చరిత్రను గనక ఎవరైనా క్షుణ్ణంగా రాస్తే, డాక్టర్ వేణుగోపాలరెడ్డిని భారత ఆర్థిక వ్యవస్థ రక్షకుడిగా గుర్తిస్తారు’’ అని రాశారాయన. రూపాయి మారకపు విలువను తగ్గించిన రాక్షసుడినా? ఆసియా సంక్షోభం దెబ్బతియ్యకుండా కాపాడిన రక్షకుడినా? ఇవ్వాల్టికీ చర్చనీయమే’’ (పుటలు 232-34)
ఇంత విస్తృతమైన ఉటంకింపు ఇవ్వటం ఎందుకంటే ప్రతి సమస్యనూ ప్రభుత్వమూ, రిజర్వు బ్యాంకూ ఒకే తీరున చూడవు. రిజర్వు బ్యాంకు పనితీరును, నిర్ణయాలను తన ఆలోచనల కనుగుణంగా ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం కోరుకోవటం సహజం. అయినా స్వతంత్రంగా వ్యవహరించగల్గినవారే, క్లిష్ట సమయంలో దేశాన్ని ఆదుకున్నవారుగా గుర్తింపబడతారు.
***
1998లో జరిగిన ఎన్నికల తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా పదవీ స్వీకారం చేశారు. బడ్జెట్‌ను సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశపెట్టటమనే సంప్రదాయాన్ని త్రోసిపుచ్చి, మన కాలమానం ప్రకారం, మనకు అనుకూలమైన సమయంలో ఉదయానే్న బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత యశ్వంత్ సిన్హాదే.. రియల్ ఇంటరెస్ట్ రేటును తగ్గించటం, టెలీ కమ్యూనికేషన్స్‌ను నిర్బంధాలనుంచి విడుదల చెయ్యడం, నేషనల్ హైవేస్ అథారిటీకి నిధులివ్వడం, పెట్రోలియం పరిశ్రమను డీరెగ్యులేట్ చెయ్యడం వంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారాయన. అటు బ్యూరోక్రాట్‌గానూ (ఈయన 1960 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్), ఇటు రాజకీయ నాయకుడిగానూ రెండు విధాలా అనుభవమున్న యశ్వంత్ సిన్హా పనితీరు ఇరువర్గాలవారికీ సమ్మతంగా ఉండేది. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలమీద మంచి అవగాహనతోపాటు సంక్షోభ సమయంలో (చంద్రశేఖర్ మంత్రివర్గంలో) ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవమూ ఉండటంతో ఆర్థిక సంస్కరణల ప్రాముఖ్యాన్ని చాలా ముందుగానే గుర్తించారాయన. అందువల్ల రిజర్వు బ్యాంకు గవర్నరుగా బిమల్ జలాన్ తీసుకునే నిర్ణయాలకు ఆయన సహకారాన్నిచ్చేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే, తాను గవర్నరుగా ఉన్నపుడు విత్తమంత్రిగా యశ్వంత్ సిన్హా ఉండటం బిమల్ జలాన్ అదృష్టం. ఫెరాను మార్చి ఫెమా చట్టం తీసుకొచ్చినపుడు ఆర్థిక మంత్రి ఇచ్చిన మద్దతు అపూర్వం. (పుటలు 243-44)
2002 యశ్వంత్ సిన్హా స్థానంలో ఆర్థిక మంత్రిగా జశ్వంత్ సింగ్ వచ్చారు. యా.వే.రెడ్డి వాషింగ్టన్‌లోని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
సెప్టెంబరు 2002లో ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ ఫండ్ బ్యాంక్ వార్షిక సమావేశానికి వాషింగ్టన్ డీసీ వచ్చారు. ఆయన హఠాత్తుగా ఒక ప్రశ్న అడిగారు. మన ప్రభుత్వం విదేశాల్లో డాలర్లలో సావరిన్ బాండ్లను విడుదల చేసి, వాళ్ళనుండి డబ్బు సేకరించవచ్చు కదా, అది అభివృద్ధికి ఉపయోగపడుతుంది. వాటికి చాలా డిమాండ్ ఉన్నట్లనిపిస్తోంది..’ అని. ఆ తరహా బాండ్లను జారీ చెయ్యడంలోని మంచి చెడులను ఆయనకు వివరించాను. రెవెన్యూ అకౌంటు లోటులో ఉన్నపుడు అవి జారీ చేస్తే ఎదురయ్యే పరిణామాలను వివరంగా చెప్పాను. ఆయన జాగ్రత్తగా విన్నారు. అటు తర్వాత నేను ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ఆయన్ని కలిసి ఐఎమ్‌ఎఫ్‌కు సంబంధించిన వ్యవహారాలను క్లుప్తంగా చెప్పేవాణ్ణి. సబ్జెక్టుపై అదే శ్రద్ధ, నా పట్ల అదే గౌరవాదరాలతో వ్యవహరించే వాడాయన.
2003 ఏప్రియల్లో ఇండియాకి వచ్చినపుడు ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా వెళ్లి కలిశాను. ‘రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ పదవి త్వరలో ఖాళీ కావొచ్చు. దానికి మీరైతే బాగుంటుందని పరిశీలిస్తున్నాం’ అన్నారాయన సూటిగా! ఆశ్చర్యపోవడం నా వంతయింది. ‘సర్, ఐఎమ్‌ఎఫ్‌లో నాకింగా సర్వీసుంది. నేనక్కడికి వెళ్లింది కూడా కొద్ది నెలల కిందటే. అక్కడుంటమే నాకిష్టం. ఆర్‌బిఐ గవర్నర్‌గా నా పేరు పరిశీలించకపోతేనే మంచిదేమోనండి. ఏదైనా ప్రభుత్వ ఆజ్ఞలను శిరసావహిస్తాను..’ అన్నాను నేను.
ఒక నెల రోజుల తర్వాత నేను భూటానో, బంగ్లాదేశో వెళుతూ ఢిల్లీలో ఆగాను. సంప్రదాయం ప్రకారం నా ప్రయాణం గురించి మినిస్ట్రీకి సమాచారమిచ్చి ఉండటం వల్ల ప్రొటోకాల్ ప్రకారం ఎయిర్‌పోర్టుకు మినిస్ట్రీ నుంచి ఒక అధికారి వచ్చారు. ‘ఆర్థిక మంత్రి మిమ్మల్ని కలవమన్నారు’ అంటూ వార్త తీసుకొచ్చాడాయన. నేను వెళ్లి జశ్వంత్‌సింగ్‌ను కలిశాను.
‘డాక్టర్ రెడ్డి... రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఖాళీ గురించి నేనింతకుముందు మీతో మాట్లాడాను. నేను ఉప ప్రధాని, ప్రధానులిద్దరితోనూ మాట్లాడాను. తర్వాతి గవర్నర్ మీరే కావాలని మేమంతా అనుకొంటున్నాం’ అన్నారాయన సూటిగా! ‘మీకు ఇబ్బందని మాకు తెలుసు. కానీ దీనికి మీరే అర్హులని కూడా మాకు తెలుసు. అందువల్ల మీరు వెంటనే వచ్చి చేరాలి. బాధ్యతలు ఎప్పుడు అప్పగిస్తారో అది జలాన్ చెబుతారు..’ అన్నారు. ‘నా పట్ల మీరు చూపిస్తున్న నమ్మకానికి కృతజ్ఞుణ్ణి. మీ ఆదేశాలను పాటిస్తాను’.. అన్నాను.. ‘లేదు, ఇది ఆదేశం కాదు, ఆహ్వానం. మన రిజర్వు బ్యాంకు గవర్నరుగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం’ అన్నారు. ఆ మాటకు నా సంతోషాన్ని వ్యక్తపరుస్తూనే.. ‘నియమించిన గవర్నర్‌ను ఐదేళ్ల వరకూ ఉండనిచ్చినపుడే గవర్నర్ పట్ల ప్రభుత్వ నమ్మకాన్ని బాహాటంగా తెలియజెప్పినట్టవుతుంది’ అన్నాను. ఆయన అడిగిన మీదట మరింత వివరంగా చెప్పాను. ‘ఈ మధ్యనంతా గవర్నర్లకు మూడేళ్ల పదవీకాలమే ఇస్తున్నారు. ఆ తర్వాత దాన్ని ఏడాడో, రెండేళ్లో పొడిగిస్తున్నారు’ అని. ‘డాక్టర్ రెడ్డి, మీరు చెప్పింది సబబే.. అలాగే జరుగుతుంది’ అన్నారు జశ్వంత్ సింగ్ (పుటలు 256-57, 258-60).
‘‘2003 సెప్టెంబరు 6న నేను ఆర్‌బిఐలో 21వ గవర్నరుగా అడుగుపెట్టాను.. గవర్నరుగా చేరిన వెంటనే ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిశాను. ఆప్యాయంగా మాట్లాడుతూ ‘వేణూ, మనం ఎట్టి పరిస్థతులలోనూ ఐఎంఎఫ్ సాయం అడగకూడదు..’ అన్నారు. గ్యారెంటీగా అలాంటి పరిస్థితి రానివ్వను సర్’ అని నేను చెప్పాను. (పుటలు 263, 268-69)
ఇక్కడ పాఠకులకు ఒక పెద్ద సందేహం కలుగుతుంది. డాక్టర్ య.వే.రెడ్డి రిజర్వు గవర్నరుగా చేరిన వెంటనే ప్రధానమంత్రిని కలుస్తున్నాననుకొని కలిసింది ఎవరిని? అటల్ బిహారీ వాజ్‌పేయినా? మన్మోహన్‌సింగ్‌నా? మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది 2004 మేలో గదా! ఇంత పెద్ద పొరపాటు ఈ పుస్తకంలో ఎలా చోటుచేసుకుంది?
‘‘నేను గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే ‘మీ ఆబ్జెక్టివ్ ఏమిటి?’ అడిగారు కొందరు పాత్రికేయులు. ‘్భరత ఆర్థిక వ్యవస్థను భారత ప్రభుత్వం నుంచి రక్షించాలి’, అదే నా లక్ష్యం’ అన్నాను. ఉన్న గణాంకాలు (డేటా) విశ్వసనీయమైనవి కావు. డేటాను పలుమార్లు రివైజ్ చేస్తుంటారు. అది పెద్ద సమస్య. దాన్ని దృష్టిలో పెట్టుకుని, ఓ జర్నలిస్టుతో ‘మన దేశానికి గణాంకాలు, ఆర్థిక విషయాల్లో భవిష్యత్తే కాదు, గతమూ అయోమయమే’ అన్నాను. ఆ మాటను తర్వాత చాలామంది, చాలాసార్లు కోట్ చేశారు! (పుట 270)
‘‘నిలకడగా ఉన్న ఆర్థిక వ్యవస్థను నాకు అందించారు జలాన్. నేను గవర్నరైన సమయానికల్లా ప్రపంచీకరణ, సరళీకరణలవైపు వేసిన తొలి అడుగులు తమ ప్రభావాన్ని చూపెట్టడం మొదలయ్యింది. ఆ నేపథ్యంలో నా ముందు మూడు కొత్త సవాళ్లుండేవి.
ఓవర్ హీటింగ్ అండ్ సైక్లికల్ పాలసీ- ఇది మనకు చాలా కొత్త. ఎందుకంటే గతంలో అంతటి వృద్ధిని మనం ఎన్నడూ చూడలేదు. అందువల్ల అందరూ ఊపుమీద ఉండేవారు. అదే అదనుగా అంతర్జాతీయంగా మార్కెట్లన్నిటినీ అనుసంధానించాలనే ప్రతిపాదనలు ఊపందుకున్నాయి. నేను దానికి వ్యతిరేకం. రెండోది భారీ ఎత్తున కేపటిల్ ఇన్‌ఫ్లో అనేది పూర్వం ఎప్పుడూ జరగలేదు. విదేశీ మారకద్రవ్య విషయంలో లోటుతో ఇబ్బంది పడటమే మనకు తెలుసుగాని, డబ్బు ప్రవాహంలా వచ్చిపడుతుంటే, ఏం చెయ్యాలో అనుభవంలేదు మనకు.. మూడోది- దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచటం తక్షణ కర్తవ్యం... కాపిటల్ అకౌంట్లోకి సొమ్ము రాకపోకలు పెరిగాయి. అందువల్ల ఫైనాన్షియల్ మార్కెట్లను స్థిరంగా ఉంచడమూ, వాటిని నియంత్రించడమూ ముఖ్యమే..
అంతర్జాతీయంగా అన్నివిధాలా అనుకూల పరిస్థితులున్నాయి గనుక ఒకింత రిస్క్ తీసుకుని ముందుకు వెళితే మనం ఇంకా చాలా అభివృద్ధి సాధించేవాళ్లమని, కానీ దానికి నేనంత ఉత్సాహం చూపలేదని, రిస్క్ విషయంలో మరీ సంప్రదాయకంగా నడుచుకున్నాననీ విమర్శకులు అంటారు. నాది చాదస్తం అనుకున్నా పర్లేదనుకున్నా. ఎందుకంటే, రిస్క్‌వల్ల నష్టపోతే ఆ భారం సామాన్యులమీదే పడుతుంది. పేదలు, సామాన్యులు ఆర్థిక నష్టాన్ని భరించలేరు.. (పుటలు 270-71)
2003 సెప్టెంబరులో ఒకనాటి ఉదయం.. ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ నాతో అర్జెంట్‌గా మాట్లాడాలనుకున్నారని తెలిసింది. ఏడున్నర గంటల ప్రాంతంలో ఫోను చేశాను. ‘గవర్నరుగారూ, ప్రవాసుల డిపాజిట్లను స్వీకరించడం ఆపేయమన్నారట మీరు, ఏమిటది? చాలామంది ఆందోళన చెందుతున్నారు, నాకు ఫోన్లు చేస్తున్నారు’ అంటూ అడిగారాయన. ఆ ముందు రోజు సాయంత్రం రిజర్వు బ్యాంకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రవాసులు నిర్వహిస్తున్న ఓవర్సీస్ కార్పొరేట్ బాడీస్ (ఓసీబీ) నుంచి ఇకపై దేశంలోకి నిధులు రావటానికి వీల్లేదని స్పష్టం చేశాం. ఇప్పటికి ఉన్న నిధులు ఎప్పుడైనా వాళ్లు వెనక్కి తీసుకోవచ్చని చెప్పాం. అయితే ఈ నోటిఫికేషన్ ప్రవాస భారతీయులు వ్యక్తిగతంగా పెట్టే పెట్టుబడులకు వర్తించదు. ఇవన్నీ ఆయనకు కూలంకషంగా చెబుతూ... ‘వాటిలోకి పెట్టుబడులు పెడుతున్నదెవరో, లాభాలు పొందుతున్నదెవరో మనకు ఇదమిత్థంగా తెలియదు. అవి కొందరికి నల్లధనాన్ని దేశం నుంచి బయటకు తరలించడానికి, మళ్లీ తీసుకురావడానికీ ఉపయోగపడుతున్నాయి. స్మగ్లర్ల ప్రమేయం చాలా ఎక్కువ. ఆ డబ్బు ఎవరిదో ఏమిటో మనకేమీ తెలియదు’.. అని విశదీకరించాను. ‘సర్, నన్ను నమ్మండి. నెమ్మదిగా మంచి పెట్టుబడులు వస్తాయి. దానికి నాదీ పూచీ. మనం కొంచెం ఓపిక పట్టాలంతే..’ అని నచ్చచెప్పాను. ‘గవర్నర్‌గారూ, నాకు మీ పట్ల విశ్వాసముంది. కానీ గాబరాపడుతున్న ఈ పెద్దమనుషులందరికీ ఏం చెప్పమంటారు? అడిగారాయన. ‘సర్, నేను మీకు చెప్పిందే, మీరు వాళ్లకు చెప్పండి. ఆ మాటతో మంచి పెట్టుబడులు ముందుకొస్తాయి. ఇక స్టాక్ మార్కెట్ల ప్రభావం (కూలిపోవటం) తాత్కాలికం, అంతే’ అన్నాను. రిజర్వు బ్యాంకు తీసుకున్న చారిత్రక నిర్ణయాల్లో అదొకటి. దాని ఫలితంగా ఓసీబీలు మూతబడ్డాయి..’’ (పుటలు 272-74)
***
‘‘నేను గవర్నరుగా చేరి ఇంకా ఎంతోకాలం కాలేదు. ‘మన ఆర్థిక భద్రత కోసం విదేశీ మారకద్రవ్యం నిల్వలను పెంచుకోవాలి. వంద బిలియన్ డాలర్లు మన దగ్గరుండేదెప్పుడు?’ అని అడిగారు ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ ఒక రోజున. ‘మీకెప్పుడు కావాలి!’ అడిగానే్నను ఏ మాత్రం తడుముకోకుండా. ‘మార్చికల్లా..’ దానికన్నా చాలాముందే మనం ఆ సంఖ్యను చేరుకుంటాం. ఒకసారి చేరుకోగానే నేను మీకు తెలియజేస్తాను. అపుడు మీరు ప్రకటించవచ్చు’ అన్నానే్నను. అన్నట్టుగానే 2004 ఫిబ్రవరికల్లా ఆ లక్ష్యాన్ని చేరుకున్నాం, ఆయన బహిరంగ ప్రకటన చేశారు..’
రిజర్వు బ్యాంకు గవర్నరుగా యా.వే.రెడ్డి, ఆర్థిక శాఖా మంత్రిగా జశ్వంత్ సింగ్ చెట్టాపట్టాల్ వేసుకున్న స్నేహితుల మాదిరిగా ఒకరిపట్ల ఒకరు గౌరవంతో, పరస్పర సహకారంతో, సమన్వయంతో వ్యవహరించిన అనేక ఘట్టాలు, సందర్భాలు ఈ పుస్తకంలో చోటుచేసుకున్నాయి. అవి చదివిన తర్వాత భాజపా ప్రభుత్వంలోకి వచ్చినపుడు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న సంస్థలను బలహీనపరిచేందుకు యత్నిస్తూ ఉంటుందని జరుగుతున్న ప్రచారం ఎంతగా సత్యదూరమైనదో మనకు అవగతవౌతుంది.
***
ఇక 2004 మే 22న ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చిన డా. మన్‌మోహన్‌సింగ్, చిదంబరంగార్లతో యా.వే.రెడ్డిగారి అనుభవాలెలా ఉన్నాయో చూద్దాం.
‘‘... వాణిజ్య ఆర్థిక మంత్రిగా అపారమైన అనుభవమున్నా, చిదంబరం వ్యక్తిగతంగా ఆడంబరాల్లేని మనిషి. ఆయన అధికారిక నివాసంలో ఆయనే స్వయంగా ఫోన్ తీసుకుంటారు! మంత్రిగా ఆయన చాలా సీనియర్. నేను బ్యూరోక్రసీలో ఒక్కో మెట్టే ఎదుగుతూ వచ్చినవాణ్ణి. అయినా అటువంటి భేదాలేం పెట్టుకోకుండా సమానంగా వ్యవహరించేవాడాయన. మేం ఒకరి అభిప్రాయాలకు మరొకరం విలువనిచ్చేవాళ్లం. ఏవైనా విభేదాలుంటే వాటిని నిర్మొహమాటంగా వ్యక్తపరచుకునేవాళ్లం. కనీసం నెలకోసారి నార్త్ బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో సమావేశమయ్యేవాళ్లం మేమిద్దరం. సుమారు గంట- గంటన్నరపాటు ఏకాంతంగా చర్చించునేవాళ్లం.
ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కూ నాకూ మధ్య ఉండే పరిచయమూ, అనుబంధమూ అరుదైనవి. ఎన్నో ఏళ్లపాటు (1977 నుంచి) మేం కలిసి పని చేశాం గనుక ఆయనకు నా విశే్లషణశక్తి పట్ల విశ్వాసం, నిర్ణయాలపట్ల నమ్మకమూ ఉండేవి. వాటిని ఆయన బాహాటంగా ప్రదర్శించేవారు కూడా. ఆయన ఆదేశం ప్రకారం, ఢిల్లీ వెళ్లినపుడల్లా ఆయనకు సమయం ఉంటే తప్పక కలిసేవాణ్ణి. జాతీయ అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలను వివరించేవాణ్ణి. మేమిలా కలుస్తున్నట్లు చిదంబరానికి ఎప్పటికప్పుడు చెప్పేవాణ్ణి. ‘ప్రధానమంత్రికి మీ సమావేశాలంటే ఇష్టమని నాకు తెలుసు. రాజకీయాల రంధి లేకుండా, ఆర్థిక విషయాలమీద మాట్లాడుకోవటం ఆయన మనస్సుకెంతో శాంతినిస్తుందనుకుంటా..’ అనేవారు ఆయన నవ్వుతూ.
... ఇద్దరు వ్యక్తులమధ్య ఎంత అన్యోన్యత ఉన్నా, కొన్నిసార్లు కీచులాటలు తప్పవు కదా. నాకూ చిదంబరానికీ కూడా అంతే. కొన్ని అంశాల్లో ఎంత ఏకాభిప్రాయం ఉండేదో, మరికొన్నిటిలో అంతగా అభిప్రాయభేదాలు ప్రస్ఫుటమయ్యేవి.. మేమిద్దరం కలిసి పనిచేసిన ఎన్నో విషయాలు మంచి ఫలితాలనిచ్చాయి.. గతంలో లేని ఎన్నో విధానపరమైన మార్పులు తీసికొని రావటంలో మా జోడీ సఫలమైంది..
నేను గవర్నరుగా పగ్గాలు చేపట్టేనాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి అయోమయంగా ఉంది.. 2003-04 బడ్జెట్‌లోనే నాటి ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ ప్రైవేట్ బ్యాంకుల్లో 74 శాతం వరకూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తామంటూ ప్రకటన చేశారు. ఎన్ని షేర్లున్నా ఓటింగ్ హక్కు మాత్రం 10 శాతం షేర్లకే- అన్న నిబంధననూ తొలగిస్తామని ఆయన చెప్పేశారు.. ఈ ప్రక్రియను నేను తీవ్రంగా వ్యతిరేకించాను. ఆ బిల్లు ఆలస్యమయ్యేలా అడ్డుకున్నాను. ఎన్నికల తర్వాత యుపిఏ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. చిదంబరం ఆర్థిక మంత్రి అయ్యారు. అప్పుడు ఆ అంశాన్ని మళ్లీ తెరమీదకు తీసుకొచ్చారు. ఆయనకు నా అభిప్రాయాన్ని వివరంగా చెప్పాను...
దానికి ఆయన ‘అన్ని రాజకీయ పక్షాలూ ఈ ప్రతిపాదనను అంగీకరించి రంగం సిద్ధం చేశాయి. మీరెందుకు వద్దంటున్నారు? డాక్టర్ రెడ్డీ, అంతర్జాతీయ ఆర్థిక వర్గాలకు మనం ఇచ్చిన మాట ఇది. ఇపుడు దానిని ఏ ప్రాతిపదికన వ్యతిరేకిస్తాం? ఆర్‌బిఐ గవర్నరు మారిన, ప్రతిసారీ మన వాగ్దానాలను సవరించుకుంటూ ఉంటామా?..’ అన్నారు చిదంబరం. (యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉండగా చిదంబరంగారే అంతర్జాతీయ ఆర్థిక వర్గాలకు అలాంటి వాగ్దానం చేశారని అర్థం చేసుకోవాలేమో- వ్యాసకర్త) కొంత వాగ్వివాదం తర్వాత- ‘సర్, దేశ ప్రధాని, ఆర్థిక మంత్రులు.. ఒక విషయం దేశానికి మేలు చేస్తుందని బలంగా నమ్మినపుడు అది జరగవలసిందే. నేను దీని గురించి మరోమారు ఆలోచిస్తాను’ అని అక్కణ్ణించి వచ్చేశాను.
ముంబై వెళ్లాక క్షుణ్ణంగా ఆలోచించుకున్నాను. చివరకు ఆర్థిక వ్యవహారాల సెక్రటరీగా పనిచేస్తున్న డాక్టర్ రాకేశ్ మోహన్‌కు ఫోన్ చేశాను. ‘‘దేశ ప్రయోజనాల దృష్ట్యా చూసినపుడు ఈ నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకోవడం సరికాదు. అయితే ప్రభుత్వం చెయ్యాలనుకున్నపుడు చెయ్యాల్సిందే. అలాగని ఒక గవర్నరుగా నేను దాన్ని మనస్ఫూర్తిగా అమలు చెయ్యలేను.. ఏదో అనారోగ్యం వంక పెట్టి ఆస్పత్రిలో చేరుతాను, కొద్దిరోజులలో పదవినుండి తప్పుకుంటాను. ఆ తర్వాత కొత్త గవర్నరును నియమించుకోవచ్చు. వాళ్లనుకున్నట్టు చేసుకోవచ్చు. అంతే తప్ప, రానున్న దుష్పరిణమాలను అంచనా వేయగల్గిన ఆర్థిక నిపుణుడిగా- మన బ్యాంకింగ్ వ్యవస్థలోకి విదేశ యాజమాన్యాలు రావడాన్ని అంగీకరించలేను’ అని స్పష్టంగా చెప్పాను. నా మాటను ఆర్థిక మంత్రికి తెలియజెయ్యమన్నాను.
ఆ తర్వాత కొద్ది రోజులకు హైదరాబాద్‌లో ఏదో ఫంక్షన్‌లో ఉన్నాను. నా సెల్ మోగింది. చేస్తున్నది చిదంబరం. ‘వేణూ, విదేశీ పెట్టుబడుల విషయంలో మీ అభిప్రాయాలను పరిగణించాం. కానీ వెనక్కి పోలేం. ఇపుడు ఒక పాలసీ స్టేట్‌మెంట్ ఇస్తాం. మన వ్యవస్థ దెబ్బతినకుండా, ఈ లక్ష్యాన్ని ఎలా సాధించాలో ఒక రోడ్ మ్యాప్ మీరే తయారుచేసి ఇవ్వండి. ఇది మాత్రం చాలా ఖచ్చితంగా ఉండాలి అన్నారు. నేను ఊపిరి పీల్చుకున్నాను. ఆయన కోరినట్లుగానే ఒక రోడ్ మ్యాప్ తయారుచేసి సమర్పించాం. దానిని ఆసాంతం చదివి మర్నాడుదయం నాకు ఫోన్ చేశారాయన. ఏవో కొన్ని మార్పులు చెప్పి, ఫోన్లోనే తన అనుమతిని ఇచ్చేశారు.. 2005 బడ్జెట్ ప్రసంగంలో అధికారికంగా ఆయన ఆ పాలసీని ప్రకటించారు.
కొద్దివారాల తర్వాత ఏదో సమావేశంలో మేమిద్దరం కలిశాం. ‘రోడ్ మ్యాప్‌కు అంత ఎక్కువ టైమ్ ఎందుకు పెట్టారు?’ అంటూ అడిగారాయన కుతూహలంగా. ‘సర్, మన బ్యాంకింగ్ వ్యవస్థను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తెరిచిపెట్టిన ఘనత నా తర్వాత వచ్చే గవర్నర్‌కు చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నాను నవ్వుతూ.
ఒక్క విషయమై ఇంత సుదీర్ఘంగా ఉటంకించమెందుకంటే, సాధారణ పాఠకులకు కూడా కొన్ని విషయాలు అర్థం కావాలన్న ఆరాటంతోనే. అటు ప్రభుత్వంమీద, ఇటు ఉన్నతాధికారుల మీద రకరకాల ఒత్తిడులు ఉంటాయి. తమకు తోచినట్లుగానో, ఇష్టారాజ్యంగా వ్యవహరించటం ఎవరికీ కుదరదు. సర్దుబాట్లు అనివార్యంగా ఉంటాయి. ప్రభుత్వం ఒక విధాన ప్రకటన చేసిన తర్వాత కూడా అది ఆ విధంగానే వెంటనే జరిగిపోతుందని అనుకోకూడదు. కాగా ఒక విషయాన్ని గురించి నచ్చచెప్పడానికి ఒక్కొక్కరితో ఒక్కొక్క ప్రత్యేకమైన పద్ధతిని అనుసరించవలసి వస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వాలలోని ఆర్థిక మంత్రులు ఒక విషయాన్ని అంగీకరించడానికి ముందు ఎంతెంత కథ నడిచిందో పై ఉదాహరణలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యా.వే.రెడ్డిగారు గుదిగుచ్చి యిచ్చిన మరికొన్ని సందర్భాల ఉదాహరణలు ఉన్నా, వాటన్నింటినీ ఇక్కడ ప్రస్తావించటానికి స్థలాభావం అడ్డువస్తున్నది. చిదంబరంగారితో తన అనుభవాల పరంపరకు ముక్తాయింపుగా యా.వే.రెడ్డి వ్రాసిన ఒక పేరాను మాత్రమే ఉటంకిస్తాను.
‘‘ఆర్థిక సంస్కరణల విషయంలో నేను ధైర్యంగా, ఉత్సాహంగా అడుగు ముందుకు వెయ్యనని ఆయనకు నాపట్ల కినుక ఉండేది. ఒక దశలో చిదంబరంలో అసహనం పతాక స్థాయికి చేరింది. ‘నా విదేశీ పర్యటనలన్నింటినీ క్యాన్సిల్ చేసుకొంటున్నాను. మీ దేశంలో సంస్కరణలు ఇంత నత్తనడక నడుస్తున్నాయేమిటని ఇతరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాను. మొహం చూపించలేకపోతున్నాను’’ అన్నారు.
***
రోజురోజుకీ రూపాయి విదేశీ మారకం విలువ ఎందుకు మారుతూ ఉంటుంది, ఆ విలువ ఎక్కువైనపుడు, తక్కువైనపుడు రిజర్వు బ్యాంకు ఎలా స్పందిస్తుంది, నష్టనివారణ చర్యలను ఏ విధంగా తీసుకొంటుంది, మధ్య మధ్యన బ్యాంకుల వడ్డీ రేట్లను ఎందుకు సవరిస్తుంటారు, అలా సవరించేముందు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకొంటారు, రైతుల రుణాలను మాఫీ చేయదలిస్తే ఆ భారం ఎవరిపై వేయాలి- బ్యాంకుల మీదనా (మదుపరులపైనా) లేక ప్రభుత్వంపైనా? (పన్ను చెల్లించే వారిపైన)- ఇలాంటి అనేక విషయాలపై లోచూపును అందించే ఈ పుస్తకం అవశ్య పఠనీయమైనది.
***
శ్రీ యాగా వేణుగోపాలరెడ్డి తర్వాత రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా పనిచేసిన శ్రీ దువ్వూరి సుబ్బారావు అనుభవాల అవలోకనంలోకి వెళ్ళే ముందు ఒక మాట చెప్పుకోవాలి. యా.వే.రెడ్డి తెలుగు పాఠకులను దృష్టిలో పెట్టుకొని తెలుగులోనే పుస్తకాన్ని సిద్ధం చేయించారు. కాబట్టి భాష చక్కని తెలుగు నుడికారాలతోను, సంభాషణల రూపంలోనూ, ఒక కథలాగా నడిచిపోతుంది. కాగా దువ్వూరి సుబ్బారావు తన గ్రంథాన్ని ‘హూ మూవ్డ్ మై ఇంటరెస్ట్ రేట్?’ అనే పేరుతో ఆంగ్లంలో వ్రాశారు. ఆ పుస్తకాన్ని త్వరగా తెలుగులోకి తీసుకురావాలన్న ఆరాటంతో ముగ్గురితో మూడు భాగాలు అనువదింపజేశారు. విషయం చాలావరకు టెక్నికల్‌గా ఉంటుంది. ఈ పుస్తకంలో భాషా సౌకుమార్యాల కోసం వెదికినవారు నిరాశ చెందుతారు. ఆ రోజులలో ఏమి జరిగిందో, ఎలా జరిగిందో, దువ్వూరి సుబ్బారావుగారి పాత్ర ఎలా ఉండిందో తెలుసుకొనడానికే ఈ పుస్తకం (రిజర్వు రాతి గోడల వెనకాల..) చదవాలి. అయితే కథనంలో బిగి వున్నందున వదలకుండా చివరివరకూ చదివించే గుణం ఈ పుస్తకంలో వుంది.
2009 సెప్టెంబరులో సుబ్బారావు రిజర్వు బ్యాంకు గవర్నరుగా నియమితులయ్యారు. ‘రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా నియామకం నా కెరీర్‌లో అత్యంత అనూహ్యంగా వచ్చిన మలుపు. అయితే, ఈ కొత్త పోస్టులో చేరడానికి భౌతికంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా సంసిద్ధమవటానికి నాకున్న వ్యవధి కేవలం రెండు రోజులు. ఆ మర్నాడు ప్రొద్దునే్న ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కలిశాను. ఎంతో బాధ్యతాయుతమైన, ఉన్నతమైన పోస్టుకి నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు చెప్పాను. ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ని కూడా కలిశాను. నేను ఊహించినట్లుగానే ఆయన నా పట్ల తనకున్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సెంట్రల్ బ్యాంకు, కేంద్ర ప్రభుత్వమూ సంయుక్తంగా అధిగమించాల్సిన సవాళ్ళను గురించి మా సంభాషణ నడిచింది. ప్రోత్సాహకరంగా ఇంకో మాట కూడా అన్నారు.
‘సుబ్బారావు, ఆర్థిక కార్యదర్శిగా ఎంతో ప్రతిభావంతంగా పనిచేసి, ఇపుడు నువ్వు రిజర్వు బ్యాంకు గవర్నరుగా వెళుతున్నావు. స్థూల ఆర్థిక పరిస్థితి గురించి రిజర్వు బ్యాంకు అంచనాలు, ఆలోచనలు తెలుసుకోవడం నాకెంతో అవసరం. మీకు ఎంత వీలయితే అంత తరచుగా నాకు ఆ విషయాలు తెలుపుతూ ఉండండి. ఎన్ని పనుల్లో ఉన్నా, నేను మీతో మీటింగ్‌కి వీలు చూసుకుంటాను’. ఇవ్వాళ నేను వెనక్కి తిరిగి చూస్తే, ప్రధానమంత్రి నాకు ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదు.. నేను చర్చించే ప్రతి విషయంలోనూ ఆయన మనసు పెట్టి పాల్గొనేవారు.
రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా నా నియామకం విషయంలో ఒక విచిత్రం జరిగింది. గవర్నర్‌గా నియమింపబడడానికి ఏణ్ణర్ధం క్రితం ఫైనాన్స్ శాఖ కార్యదర్శిగా నా పేరు పరిశీలనలోకి వచ్చినపుడు ఆర్థిక మంత్రి చిదంబరంకి నేను అస్సలు తెలియదు. అలాంటి సమయంలో నన్ను తప్పకుండా తీసుకోవచ్చని చిదంబరంని ప్రోత్సహించిన వ్యక్తి మన్మోహన్ సింగ్. ఆయన 1990 దశకంలో పి.వి. మంత్రివర్గంలో ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నపుడు, అదే శాఖలో జాయింట్ సెక్రటరీగా ఉన్న నా పనితీరుని దగ్గర్నుంచి చూసిన వ్యక్తి.. ‘సరే, ఇపుడు రిజర్వు బ్యాంకు గవర్నరుగా నా పేరు పరిశీలనలోకి వచ్చినపుడు ‘ఈ పోస్టుకి సుబ్బారావు సరైన వ్యక్తి’ అంటూ మన్మోహన్‌సింగ్‌కి నచ్చజెప్పడం చిదంబరం వంతైంది’. (పుటలు 41, 42)
***
‘‘2008 సెప్టెంబరు 5న నేను గవర్నరుగా బాధ్యతలు స్వీకరించేనాటికి రిజర్వు బ్యాంకు ముందున్న అతి పెద్ద సమస్య ఉధృతమైన ద్రవ్యోల్బణం.. ప్రపంచ ద్రవ్య సంక్షోభాన్ని ముందుగానే సూచించే ప్రకంపనలు మరుసటి వారంలోనే ప్రారంభమయ్యాయి. చివరికి సెప్టెంబర్ 16న అతి పెద్ద ద్రవ్య వ్యాపార సంస్థ లెహ్‌మ్యాన్ బ్రదర్స్ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఆ దివాళాతో విశ్వవ్యాప్తంగా విత్తరంగం మృత్యుముఖంలోకి చేరుకొన్నట్లయింది. నాకు తాపీగా నా బాధ్యతలు, పని నేర్చుకునే అవకాశం లేకుండా పోయింది. నాకొక గొప్ప అగ్నిపరీక్ష. అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు రిజర్వు బ్యాంకు చాలా చురుగ్గా, తన యావచ్ఛక్తినీ ఉపయోగించి రంగంలోకి దూకింది. ఈ విషయంలో బ్యాంకు సీనియర్ మేనేజ్‌మెంట్ ప్రదర్శించిన నైపుణ్యం, పరిస్థితి తీవ్రతను గుర్తించిన వాళ్ల పరిణతి, అందుకు తగినట్లుగా వ్యవహరించిన చాకచక్యం నన్ను అబ్బురపరిచాయి.. ఇలాంటి సంక్షోభం ఉత్పన్నమైనపుడు ద్రవ్య వ్యాపార రంగంలో ఎక్కడెక్కడ వత్తిళ్లు ఉత్పన్నవౌతాయో, మా ప్రాధాన్యతాక్రమం ఎలా మార్చుకుంటూ, వ్యూహాత్మకంగా ఎలా అడుగులు వెయ్యాలో నాకు సూచించారు. వెంటనే మేం ఒక పత్రికా ప్రకటన జారీ చేశాం. ‘అంతర్జాతీయ విత్తరంగంలో సంభవిస్తున్న పరిణామాలను రిజర్వు బ్యాంకు అప్రమత్తతతో, నిశితంగా గమనిస్తోంది.. భారతీయ ఫైనాన్షియల్ మార్కెట్లమీద ఈ అంతర్జాతీయ సంక్షోభ పరిణామల ప్రభావం దారి తప్పకుండా చూసే పనిలో ఉన్నాం’.
రిజర్వు బ్యాంకు శరవేగంతో పావులు కదిపింది. 1.అవసరమైన చోట్లకి నగదు నిల్వల్ని సరఫరా చేయడం, 2.విదేశీ మారక ద్రవ్యం చలామణిలో కొరత
లేకుండా చేయటం 3.ఋణసదుపాయాల కల్పన నిరాటంకంగా సాగిపోయేలా, వృద్ధి రేటు వేగం కుంటుపడకుండా సాగిపోయేలా ఒక విధానాన్ని తక్షణం అమల్లోకి తేవటం. (ఇంకా చాలా చర్యలు తీసికొన్నట్లుగా వివరించారు. ఒక పుస్తక పరిచయ వ్యాసంలో వాటినన్నింటినీ పేర్కొనటం కుదరదు గనుక వదిలేయక తప్పటంలేదు)
లెహ్‌మ్యాన్ కంపెనీ కుప్పకూలిన ఓ నెల రోజుల తర్వాత 2008 అక్టోబర్ 20న మొట్టమొదటిసారిగా వడ్డీరేట్లని తగ్గిస్తున్నట్లుగా నేను ప్రకటించాను. వాణిజ్య బ్యాంకులు రిజర్వు బ్యాంకు నుంచి తీసుకునే ఋణాలమీద మేం వసూలు చేసే వడ్డీ రేటు (రెపోరేటు) 9 శాతంనుంచి 8 శాతానికి తగ్గించాను. ఇది చాలా కీలకమైన నిర్ణయం. ఎందుకంటే అప్పటికి రెండు మాసాలముందే జూన్ నెలలో అప్పటి గవర్నర్ వై.వి.రెడ్డి పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నిరోధించటం కోసం ఈ రెపోరేటు పెంచారు.. నేనొచ్చి చేసిన ఘనకార్యం(!). దాన్ని తగ్గించటం.. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంకన్నా ద్రవ్య స్థిరత్వాన్ని సాధించటం అత్యవసరం అని ఆలోచించాను.
...2008 చివరి త్రైమాసిక కాలం ముగిసేనాటికి కూడా అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. వివిధ దేశాలలో బ్యాంకులో తమ తమ సేవింగ్స్ ఖాతాల్ని, డిపాజిట్లని ఎత్తివేయాలన్న ఆదుర్దాతో ఆయా బ్యాంకుల ముందు ఖాతాదారులు బారులుతీరి నిలబడుతున్నారు. అలాంటి గడ్డుకాలంలో మా ఆందోళనను విపరీతంగా పెంచేసిన ఒక భయంకరమైన ఘటన జరిగింది. అదే 2008 నవంబరు 26న ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడి. ముంబై నగరం తాత్కాలికంగా మూతబడింది. కానీ రిజర్వు బ్యాంకులో మా కార్యకలాపాలు స్తంభించలేదు. తాజ్‌మహల్ హోటల్ నుంచి ఆకాశానికి ఎగబాకుతున్న దట్టమైన పొగలు కనిపిస్తున్నాయి. అలాంటి స్థితిలో ఏ సిబ్బంది అయినా తాను, తన కుటుంబం గురించే ఆలోచించటం సహజం. కానీ.. మా అధికారుల బృందమంతా ఇకపై రాగల పరిణామాలు, వాటి నెదుర్కోవలసిన విధానాల గురించే మేధోమథనం చేస్తూ ఉన్నారు. మా ఆదుర్దా అంతా ఎక్కడ మళ్లీ కొత్త పుకార్లు ఫైనాన్స్ మార్కెట్లలో వ్యాపిస్తాయేమోననే.. మా అదృష్టం ఏమిటంటే, ఉగ్రవాదుల దాడి జరిగిన మర్నాడే అంటే నవంబరు 27న మేం రెండు భారీ చెల్లింపులు, సెటిల్‌మెంట్ల సిస్టమ్స్‌ని పునరుద్ధరించగలిగాం. అవి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టిజిఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (ఎన్‌ఇఎఫ్‌టి), బ్యాంకులో అంతర్జాతీయ నగదు బదలాయింపులు, జాతీయ నగదు బదలాయింపులూ ఇంటర్నెట్ ద్వారా జరగాలంటే ఈ సిస్టమ్స్ పనిచేసి తీరాలి.
ఆర్థిక మంత్రి చిదంబరం ఆ రెండు రోజులూ నాకు పదే పదే ఫోను చేసేవారు. ఏమైంది? మార్కెట్లు మళ్లీ తెరుచుకున్నాయా? నగదు లావాదేవీల సిస్టమ్స్ అన్నీ పనిచేస్తున్నాయా? మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఆయన తపన అంతా ఒక్కటే. ఉగ్రవాదులుగానీ, మరొక ఉపద్రవంగాని, అలాంటివాటికి లొంగిపోయే, లేదా క్రుంగిపోయే స్థితిలో ఇండియా లేదు అని ప్రపంచానికి తెలియాలి. 48 గంటల్లోగా ప్రభుత్వ సెక్యూరిటీస్ మార్కెట్, విదేశీ మారక ద్రవ్య విభాగం, నగదు స్టాక్ మార్కెట్‌లు, బ్యాంకుల క్లియరింగ్ కేంద్రాలు అన్నీ యధాతథ స్థితికి వచ్చి పని చేయనారంభించాయి. చిదంబరం వత్తిడి వల్లనే మేం అత్యంత వేగంగా, అతి శ్రద్ధగా ఆ పని చేయగలిగాం.
డిసెంబరు 2008 నాటికి నేను అధికారిక వడ్డీ రేటుని 9 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేశాను. ఈ వడ్డీ రేటు 9 శాతానికి పెరగడానికి అయిదేళ్లు పట్టింది. దాన్ని కేవలం మూడు నెలల్లో నేను మళ్లీ క్రిందికి దింపేశాను. దాంతో ‘చీటికి మాటికి వడ్డీ రేట్లు తగ్గించే గవర్నర్’గా ముద్రపడిపోయాను.
సంక్షోభకాలంలో ప్రధానమంత్రి నాతో చాలాసార్లు ముఖాముఖీ చర్చలు జరిపేవారు. అందుకోసం ప్రధానమంత్రి కార్యాలయం నా వీలు ప్రకారమే సమావేశాలు ఏర్పాటుచేసేది. వాటిలో విత్త శాఖా మంత్రి, ఆర్థిక సలహా మండలి చైర్మన్ రంగరాజన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు మాంటెక్ సింగ్ ఆహ్లూవాలియా కూడా పాల్గొనేవారు.. ఈ సంక్షోభం నుంచి మన దేశాన్ని కాపాడాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి, ఎంత ఉధృతంగా చెయ్యాలి అన్న విషయాలపై చిదంబరానికి, నాకూ అభిప్రాయ భేదాలు వస్తూనే ఉన్నాయి. ఆయన ఈ సమావేశంలో నన్ను గుచ్చి గుచ్చి అడిగేవారు. ‘్ఫలానా చర్యలు తీసుకుంటారా? ఎప్పటిలోగా? తేదీలు చెప్పండి..’ నేను ఎప్పటికప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నానో చెప్పేవాణ్ణి. ఏ దిశగా అడుగులు వేస్తున్నానో చెప్పేవాణ్ణి. అంతకుమించి నిర్దిష్టంగా ఏదీ చెప్పడానికి ఇష్టపడేవాడిని కాదు.. ‘మిగిలిన దేశాలు అన్నీ ఉరుకులు పరుగులమీద చర్యలు తీసుకుంటున్నాయంటే అది వాళ్ల పరిస్థితులను బట్టి. మనం కూడా మన దేశ పరిస్థితులని చూసుకుని, ముందడుగు వెయ్యాలి తప్ప అందరూ చేస్తున్నారని కాదు’ అని నా వాదన. అంతే మా మధ్య సంబంధాలు ఎడమొహం, పెడమొహంగానే సాగాయి.
2008 నవంబరు చివర్లో ఒక ముఖ్యమైన సమావేశం ప్రధానమంత్రి సమక్షంలో జరిగింది. అందులో డజనుమంది కేంద్ర మంత్రులు, కార్యదర్శులు కూడా పాల్గొన్నారు. నన్ను కూడా పిలిచారు. ఆ సమావేశంలో చర్చించాల్సిన సమావేశం ‘ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది?’ అప్పటికి చిదంబరం ఆర్థిక శాఖా మంత్రి కాదు. ముంబైలో తాజ్ హోటల్‌మీద జరిగిన దాడి నేపథ్యంలో ఆయన్ని హోమ్ శాఖకు మార్చారు. అయితే ఆర్థిక శాఖామంత్రిగా ఉన్న అనుభవం దృష్ట్యా ఆయన్ని కూడా ఈ మీటింగ్‌కి ఆహ్వానించారు. అక్కడున్న మంత్రులందరికీ నన్ను చూడగానే ‘గొప్ప గొప్ప’ ఆలోచనలు వచ్చాయి. ‘‘ఇప్పుడెలాగూ సంక్షోభం వచ్చింది కదా! ఇప్పుడైనా మన పథకాలమీద మీ పరిమితుల్ని ఎత్తేయవచ్చు కదా సుబ్బారావుగారూ!’’ ఇదీ వాళ్ల సలహా సారాంశం. వాళ్లు ఉదహరించిన రంగాలకీ, పథకాల్లో చాలావాటికి ఈ సంక్షోభంతో సంబంధమే లేదు. కానీ వాళ్లు కోరుతున్నదేమిటి? సంక్షోభం ముసుగులో ఇంతకాలం రిజర్వు బ్యాంకు పరిమితుల్ని విధిస్తూ, అడ్డం పడుతూ వచ్చిన పథకాల విషయంలో పరిమితులన్నీ సడలించేయాలి! నాకు నవ్వొచ్చింది. బాధ కలిగింది. మంత్రులు, నా సహచర అధికారులు చేసిన అభ్యర్థనలన్నింటినీ సున్నితంగా తిరస్కరించాను. ప్రధానమంత్రి ఎదురుగుండా వత్తిడి చేస్తే, నేను ‘నో’ చెప్పలేను అని వాళ్లు అనుకొని ఉండవచ్చు. కానీ ఈ దేశపు సెంట్రల్ బ్యాంకు వ్యవస్థమీద ప్రజలకున్న విశ్వాసానికి నేను జవాబుదారీ అని నేను అనుకొంటున్నాను. అయినప్పటికీ రిజర్వు బ్యాంకు ఏం చేయగలదో, ఏం చేయలేదో వాళ్లకి పూర్తిగా తెలీదు.. ఆ సమావేశం ఆ రోజు రాత్రి 10 గంటలు దాటాకా ముగిసింది. ప్రధానమంత్రి వెళ్లబోతున్నారు. అందరం లేచి నిలబడ్డాం.
ప్రధానమంత్రి వెళ్తూ వెళ్తూ నా దగ్గరికి వచ్చి, నా భుజం తట్టి (ప్రశంస!) వెళ్లిపోయారు. మెల్లగా అందరం మాట్లాడుకుంటూ బయటికొస్తున్నాం. ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ వినీ మహాజన్ నాతో అంటోంది- ‘అరె, ఎంత ఆశ్చర్యం! ఈ ప్రధానమంత్రి ఇలా ఎప్పుడూ ఎవరి దగ్గరకూ వచ్చి వెన్ను తట్టడం జరగలేదు. అసలు ఆయన స్వభావానికే విరుద్ధంగా ఉంది ఇది..!’ నాకు అర్థమైంది. ఆయన నేను పడుతున్న ఇబ్బందికి నొచ్చుకున్నారు. అదే సమయంలో..నా దృఢత్వాన్ని మెచ్చుకున్నారు. ప్రధానమంత్రి అలా చేయటం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’’. (పుటలు 45, 46, 48, 49, 53- 55, 56-59)
ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే, అన్నం ఎంతగా ఉడికిందో తెలుస్తుందంటారు. పైన పేర్కొన్న సందర్భంలోని అనుభవాలను గమనిస్తే, సుబ్బారావుగారు ఆ అయిదేళ్లు ఎన్ని యాతనలు పడ్డారో మనం గ్రహించుకోవచ్చు.
2009 సెప్టెంబరు వచ్చేసరికి ఆర్‌బిఐలో నా మొదటి ఏడాది కాలాన్ని మీడియా నిశితంగా బేరీజు వేస్తూ ‘‘ఈ గవర్నర్ ఎంతటి పరిణతి, విశ్వాసం నిండిన నాయకత్వాన్ని అందించారంటే, అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో రిజర్వు బ్యాంకు సాహసోపేతంగా, సృజనాత్మకంగా, నిశ్శబ్దంగా పనిచేసుకుపోయింది. ఎంతో అనిశ్చిత స్థితిలో కూడా ఈ గవర్నర్ రిజర్వు బ్యాంకు పనితీరులో స్పష్టతని, పారదర్శకతని తీసుకువచ్చారు..’’
నాకు చాలా ఊరట కలిగించిన విషయం ఏమిటంటే- అంతకుముందు రోజుల్లో ‘రిజర్వు బ్యాంకుని తీసుకెళ్లి సర్కార్‌కి ధారాదత్తం చేసిన గవర్నర్’ అంటూ దుమ్మెత్తిపోసిన వ్యాఖ్యాతలే. ‘ఈ గవర్నర్‌కి పనీ, ఫలితం మాత్రమే ముఖ్యం. ఎలాంటి వత్తిళ్లకీ లొంగే మనిషి కాదు.. రిజర్వు బ్యాంకుని సంక్షోభ కాలంలో నిశ్చలమైన దృఢచిత్తంతో, అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించిన తీరు అద్భుతం..’ అని తమ వ్యాసాల్లో విశే్లషించారు’’. (పుటలు 63-64)
2009 సంవత్సరం సగం గడిచేసరికి ఈ ప్రపంచ ద్రవ్య సంక్షోభ ప్రభావం నుంచి భారతదేశం కోలుకుంది. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. కారణం- ద్రవ్యోల్బణం.
‘‘రెండు సంవత్సరాలపాటు నా మెదడు తినేసిన ఈ ద్రవ్యోల్బణం కథ చాలా నాటకీయంగా నడిచింది. టోకు ధరల సూచీ గణాంకాల ప్రకారం 2009లో కొన్ని మాసాలపాటు ఈ ద్రవ్యోల్బణం మన వ్యవస్థకి ప్రతికూలంగా సాగింది. ప్రతి ద్రవ్యోల్బణం (డిఫ్లేషన్)లో ధరలు బాగా పడిపోవడం కూడా హానికరమే. కానీ అలాంటి సందర్భం భారతదేశానికి ఎప్పుడూ రాలేదు. వాస్తవం ఏమిటంటే ధరల పెరుగుదలలాగానే ధరల పతనం కూడా వృద్ధి రేటు వేగానికి ఆటంకం కలిగిస్తుంది. అందుకే ఈ ధరల పతనంతో భారతదేశం భయంకరమైన ఆర్థిక మాంద్యంలో పడిపోతోందని వ్యాఖ్యానించారు. ఇది తప్పుడు భాష్యం, ఇదేమీ ఉద్యోగాలు భారీగా ఊడిపోయి ఏర్పడిన ప్రతి ద్రవ్యోల్బణం కాదు. విశ్వవిపణిలో ముడి పదార్థాల ధరలు పడిపోవడంవల్ల ఏర్పడిన మేలైన ప్రతి ద్రవ్యోల్బణం, తరువాత కాలంలో ధరలు పెరిగాయి. ప్రతి ద్రవ్యోల్బణం క్షీణించింది. అయితే 2009-11 కాలంలో ద్రవ్యోల్బణం 9-10 శాతం దగ్గర నిల్చిపోయింది. 2010-12 మూడు సంవత్సరాల కాలంలో టోకు ధరల సూచీ ప్రకారం నమోదైన సగటు ద్రవ్యోల్బణం 8.7 శాతం. అంతకుముందు దశాబ్దకాలం (2001-10)లో ఈ ద్రవ్యోల్బణం 5.4 శాతమే. కానీ 2010-12 కాలంలో అది బాగా పెరిగిపోయింది.
నేనిప్పుడు బల్లగుద్ది చెప్పగలను. ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్న కాలంలో సాధించే వృద్ధి రేటు ఏదైనా అస్థిరమే. నిదానంగా నిలకడగా సాగే ద్రవ్యోల్బణం మాత్రమే సుస్థిరమైన వృద్ధి రేటుకి దోహదపడుతుంది.
నేను ప్రధానమంత్రిని కలిసిన ప్రతిసారీ ఆయన ఇదే ప్రశ్న వేస్తుండేవాడు. ‘ద్రవ్యోల్బణం ఎందుకు అదుపుకావడంలేదు సుబ్బారావు?’ అని. నేను చెప్పేవాణ్ణి- ‘సర్ ద్రవ్యోల్బణం ఒక సమస్య. నిజమే. కాని ఇది మన విజయానికి సంకేతం.. ప్రభుత్వం అమలు చేస్త్తున్న కొన్ని ప్రయోజనాత్మక పథకాలకు తలమానికం లాంటిది ఈ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చట్టం. ఈ పథకంవల్ల కూలీలకు వేతనాలు బాగా పెరిగాయి. దానికి తగినట్లు ఆ రంగంలో ఉత్పాదకత పెరగాలి కదా? పెరగలేదు. సబ్సిడీ పథకాలను విస్తరించారు. సేవలలో (డెలివరీ సిస్టమ్) నాణ్యత పెంచారు.. ఇలాంటి చర్యలవల్ల గ్రామీణ ప్రజల ఆదాయం బాగా పెరిగింది. దాంతో వివిధ ఉత్పత్తుల వినియోగం బాగా పెరిగింది. అంటే వాటికి డిమాండు ఉధృతమైంది. డిమాండుకి తగినట్లు ఉత్పత్తి జరగాలి కదా! అది జరగలేదు. దాంతో ధరలకు రెక్కలు వచ్చాయి..’
కానీ ప్రభుత్వం ఏమంటుందంటే, ‘మేమేమీ ఉచితంగా ప్రజల్ని పోషించటం లేదే’ అని కావచ్చు. కానీ ఉపాధి కల్పన, పెన్షన్‌లు వంటి పథకాలు సంక్షేమ రంగంలో ప్రభుత్వ విజయానికి సంకేతాలు. అవే మరో వైపు మన వైఫల్యానికి కారణం అవుతున్నాయి. ఇది ఎలా ఉంటుందంటే, అప్పుతెచ్చి అయినా సరే, మన స్తోమతకి మించి ఖర్చుపెట్టినట్లుగా ఉంటుంది. అప్పు తేవటానికి మార్కెట్‌లో లభించే మొత్తం నిధులకీ ఒక పరిమితి ఉంది. ప్రభుత్వం ఎంత ఎక్కువ అప్పు చేస్తుందో, ప్రైవేట్ రంగానికి అంతగా ఆ నిధుల లభ్యత తగ్గుతుంది. అలాంటి సమయంలో ప్రైవేట్ రంగం తెచ్చి పెట్టుబడులు పెట్టకపోతే సరుకుకోసం, సేవలకోసం పెరిగే డిమాండ్‌ని తట్టుకోవటానికి అవసరమైన ఉత్పాదకత సామర్థ్యాన్ని మన ఆర్థిక వ్యవస్థలో పెంచలేకపోతున్నాం. ఇందులో కొంచెం ఊరట కలిగించే విషయం ఏమిటంటే, ప్రభుత్వం తీసుకొచ్చిన నిధుల్ని శాశ్వతమైన వౌలిక వసతుల కల్పనమీద ఖర్చుపెడుతూ ఉంటే, ఆర్థిక వ్యవస్థకి అవసరమైన ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచుకోగల్గుతాం. కాని జరుగుతున్నదేమిటి? వేలాది కోట్ల రూపాయలు నేరుగా వినియోగంమీదే ఖర్చుపెడుతున్నారు. అందుకే ధరలు పెరిగిపోతున్నాయి’. ఇదంతా ప్రధానమంత్రికి వివరించాను. ఇంత చెబితేనేగానీ ద్రవ్యోల్బణ సానుకూల, ప్రతికూల లక్షణాలను నిష్పక్షపాతంగా ఆయన ముందుంచలేను.
నేనిప్పుడు మీకు ‘బహిరంగ రహస్యం’ ఒకటి చెప్పాలి. ప్రధానమంత్రి మన్‌మోహన్‌సింగ్ గొప్ప ఆర్థికవేత్త కదా! ఆయనకి ఇవన్నీ తెలియవా? నాకన్నా బాగా తెలుసు. ఆయన ఆర్థిక శాస్తవ్రేత్తగా నాతో ఏకీభవించారు. కానీ ఒక రాజకీయ నాయకుడిగా తన నిస్సహాయతని వ్యక్తం చేసేవారు- ఒక చిన్న పొడి నవ్వుతో- (పుటలు 74-79)
దీనిపై ఇంకా వివరణ ఇవ్వవలసిన అవసరం లేదు గదా!
***
‘2010 మధ్యలో నేనొక కొత్త నిర్ణయం తీసుకున్నాను. దాని ప్రకారం ద్రవ్య విధానంపై త్రైమాసిక సమీక్ష స్థానంలో ప్రతినెలన్నరకోసారి సమీక్ష జరగాలి. అంటే అంతకుముందు ఏడాదికి నాలుగుసార్లు జరిగే ఈ ద్రవ్య విధాన సమీక్ష ఇకపై ఎనిమిది సార్లు జరగాలి.. దీనివల్ల ప్రభుత్వం జారీ చేసే గణాంకాలకు వెంట వెంటనే స్పందించటం, అనూహ్యమైన పరిణామాల్ని కూడా అర్థవంతంగా ఎదుర్కోవటం మాకు సాధ్యపడింది.. ముఖ్యంగా వడ్డీ రేటు విషయంలో 13 సార్లు పెంచుతూ, 10 సార్లు తగ్గిస్తూ- మొత్తం 23 సార్లు సవరించాను. అలా చేసి ‘అతి చురుగ్గా వ్యవహరించిన’ గవర్నర్ అనిపించుకున్నాను.. 2008-09 నాటి ద్రవ్య సంక్షోభ సమయంలో వడ్డీ రేటును అమాంతం తగ్గించాను (డిసెంబర్ 2008 నాటికి నేను అధికారిక వడ్డీ రేటుని 9 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేశారు. ఈ వడ్డీ రేటు పెరగడానికి అయిదేళ్లు పట్టింది. దాన్ని కేవలం మూడు నెలల్లో నేను మళ్లీ క్రిందికి దింపేశాను). ఆ తరువాత రెండు సంవత్సరాల్లో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం మళ్లీ పెంచేశాను. 2012లో ద్రవ్యోల్బణం మా లక్ష్యంకన్నా క్రిందకి పతనమైనపుడు మళ్లీ వడ్డీ రేటు తగ్గించేశాను. 2013లో రూపాయి విలువని బలోపేతం చేయడం కోసం పెంచేశాను. తప్పటడుగుల్లోనే పెద్ద ముందడుగు వేశాను! సంక్షోభాలూ, ద్రవ్యోల్బణ ఉత్థాన పతనాలూ నాకు ఇలా- ‘చీటికి మాటికి వడ్డీ రేట్లు సవరించే గవర్నర్’ అన్న ఘనత తీసుకువచ్చాయి.. ఇలాంటి ఘనత రిజర్వు బ్యాంకులో భవిష్యత్‌లో ఏ గవర్నర్‌కీ రాకుండా ఉంటే మంచిది’’ (పుటలు 91-92)
పై మాటలను బట్టి ఆ సమయంలో దేశంలోని ఆర్థిక పరిస్థితి ఎంతటి గడ్డు సమస్యలను ఎదుర్కొందో అర్థమవుతుంది కదా!
***
‘‘ఆగస్టు 9, 2011 ఉదయం 11.00 గంటలు.. గవర్నర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ సుశోభన్ సిన్హా నా గదిలోకి వచ్చాడు. ‘నేనిప్పుడే టీవీ స్క్రోలింగ్‌లో ‘సుబ్బారావు పదవీకాలం మరో రెండు సంవత్సరాల పొడిగింపు’ అని వార్త చూశాను సార్’ అన్నాడు. సరే, నా ఆఫీసులో టీవీ ఆన్ చేసి ఆ వార్త నేనూ చూశాను. కానీ ఎందుకో నమ్మకం కుదరలేదు.. నిజంగా తీర్మానం జరిగి ఉంటే, ఫైనాన్స్ మినిస్టర్‌గాని, కనీసం ఆయన ఆఫీసులో మరొకరుగాని ముందుగా చెప్పకుండా ఉంటారా? నాకు చెప్పకముందే ఇలా బహిరంగంగా ప్రకటించేస్తారా?
నమ్మబుద్ధి కాలేదు.. మరొక పావుగంటలో (ప్రధానమంత్రి ప్రధాన కార్యదర్శి) నాయర్ ఫోన్ చేశారు. ప్రధానమంత్రి తరఫునా, ఆయన తరఫునా శుభాకాంక్షలు చెప్పారు.
మీడియా వాళ్లకి కావలసినంత మసాలా దొరికింది. ఎందుకంటే నా పునర్నియామకం గురించిన వార్త ఫైనాన్స్ మినిష్టర్ కార్యాలయం నుంచి కాకుండా, ముందుగా ప్రధానమంత్రి వెబ్‌సైట్‌లో వెలువడింది. ఈ విషయంలో ప్రధానికీ, ఫైనాన్స్ మినిస్టర్‌కీ ఏవన్నా మనస్పర్థలు ఉన్నాయా అని అనుమానించేందుకు ఈ మాత్రం వార్త చాలు గదా! మామూలుగా తన మంత్రివర్గ సహచరుల బాధ్యతల్లో చొరవ తీసుకుని జోక్యం చేసుకోకుండా ఉండే మన్‌మోహన్‌సింగ్ గారు తన సహజ వౌనాన్ని వీడి సుబ్బారావుకి ఇంకో రెండేళ్లు పదవీ కాలాన్నిచ్చే విషయంలో ఎందుకిలా చేసినట్లు? అంటే ప్రణబ్ ముఖర్జీకి నా పదవీకాలం పొడిగించటం ఇష్టం లేదా? తెరవెనుక జరిగిన విషయాలు నాకు తెలియవు కానీ, ఒకవేళ ఫైనాన్స్ మినిష్టర్ వద్దంటున్నా ప్రధానమంత్రి పట్టుబట్టారా అన్న గట్టి సందేహం మాత్రం నా మనస్సులో వుండిపోయింది. (పుటలు 190-192)
***
‘‘సెప్టెంబర్ 2009లో ఐఎంఎఫ్‌కి డబ్బు కొరత వచ్చింది. ఆ కొరత పూడ్చుకోవటానికి ఐఎంఎఫ్ తన దగ్గరున్న బంగారంలో 403.3 టన్నులు అమ్మబోతున్నామని ప్రకటించింది. అమ్మదలుచుకున్న బంగారమంతా బజార్లో అమ్మేముందు ప్రపంచంలో ప్రభుత్వాలకీ, సెంట్రల్ బ్యాంకులకీ ఒక ఆఫర్ ఇచ్చింది. మీరేమన్నా బంగారం కొనాలనుకుంటే ముందు చెప్పండి. ముందు మీ బేరం చూసి, అప్పుడే మార్కెట్‌లోకి వెళతామని. ఈ పథకం ద్వారా అప్పుడు చలామణి అవుతున్న మార్కెట్ రేటులో బంగారం కొనడానికి మూడు నెలలు గడువు ఇచ్చింది.
ఐఎంఎఫ్ అమ్ముతున్న ఈ బంగారం కొనాలా వద్దా అన్న విషయంమీద రిజర్వు బ్యాంకులో తర్జన భర్జనలు చాలానే నడిచాయి. అటువంటి సందర్భంలో అంత పెద్ద మొత్తంలో అలా బంగారం కొనడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. భద్రతతోపాటు, పోటీవల్ల వచ్చే సమస్యలు బోలెడు. ఎంతకి కొన్నాం దగ్గరనుంచి, చెల్లింపుకీ కొనడానికీ మధ్య ఎంత వ్యవధి ఉంది దాకా ఒప్పందంలోని నిబంధనలన్నీ రహస్యంగా ఉంచాలి. ఏ కొంచెం పొక్కినా మార్కెట్ తలక్రిందులవుతుంది. బంగారం కొనడానికి ఇదేమో అక్షరాలా ‘సువర్ణావకాశం’ కానీ నాకా అనుభవం తక్కువ. కొన్న తర్వాత ధర అటూ ఇటూ అయితే వచ్చే దూషణ భూషణలకీ సిద్ధంగా ఉండాలి. అన్నింటికీ తెగించి, కొందామన్నా, ఎంత బంగారం కొనాలి అన్నది ఒక సమస్య. పోనీ ఎవరన్నా నిపుణుల సలహా తీసుకుందామా అంటే, ఈ విషయం చాలా రహస్యంగా ఉంచాలాయె. బయటకు పొక్కితే పెద్ద గందరగోళం అవుతుంది. రిజర్వు బ్యాంకుకి దక్కేది కేవలం అపకీర్తే.
సరే, చాలా కిందామీదాపడి ఒక 200 టన్నులు కొనడానికి తెగించాం. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంకులో కూడా అతి గుప్తంగా ఉంచాం. నలుగురయిదుగురు పెద్ద అధికార్లకి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఇక బయటివాళ్ల విషయానికి వస్తే కేవలం ప్రధానమంత్రికీ, ఫైనాన్స్ మినిష్టర్‌కీ మాత్రమే చెప్పాను. అదీ ఫోన్‌లో కాదు, వాళ్లిద్దరినీ ఆ తరువాత ముఖాముఖీ కలిసినపుడు...
మొత్తానికి ఈ వ్యవహారం అతి గోప్యంగా నడిచింది. భారతీయ రిజర్వు బ్యాంకు బంగారం కొన్న రీతిని చూసి ‘ఇతర దేశాల ముఖాలు కందిపోయాయి’ అని ఫైనాన్షియల్ టైమ్స్ వంటి అంతర్జాతీయ వార్తాపత్రికలు వర్ణించాయి. పొగిడాయి. ఇంతకుముందెన్నడూ ఇంత భారీ మొత్తంలో బంగారం కొనుగోలు లావాదేవీ మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా జరగలేదు. 1991 ఆర్థిక సంక్షోభంలో పూట గడవడానికి బంగారం తాకట్టు పెట్టి అప్పు చేసిన దేశం ఇపుడు మిగిలిన దేశాలని తలదన్ని అమాంతంగా 200 టన్నుల బంగారం కొనడం భారతదేశం ఆర్థికంగా ఎంత ఎదిగిందనడానికి, ఆ దేశ ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని అంతర్జాతయంగా చాలామంది నిపుణులు ప్రశంసించారు. (పుటలు 207-08)
సుబ్బారావుగారు ఎనె్నన్నో అనుభవాలను, వాటి నేపథ్యంతో సహా విపులంగా వివరించారు. మరి టెక్నికల్ కాని, సాధారణ పాఠకులకు అర్థమయ్యే విషయాలలో కొన్నింటిని మాత్రమే ఎంచుకొని ఉదహరించాను. ఇటువంటి సాహసి, సమర్థుడు రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా ఉండబట్టి గదా అనేక కష్టాలతో నిండిన కాలాన్ని దాటుకొని దేశం నిలబడగలిగిందన్న ప్రశంసతో కూడిన భావం పాఠకులకు సహజంగా కలుగుతుంది. దానితోపాటుగా ఎన్డీయే ప్రభుత్వ కాలంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని వంద బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని కూడబెట్టి, భద్రపరచి, దేశ ఆర్థిక వ్యవస్థను ఒక కొలిక్కి తెచ్చి వుండకపోతే, 200 టన్నుల బంగారం కొనడానికి సాహసించే స్థితి ఏర్పడి ఉండేదా అన్న సందేహమూ తలెత్తుతుంది. ఇంతటి సమర్థులైన ఇరువురు తెలుగువారు గవర్నర్లుగా ఉన్న సమయంలో రాజకీయ అవినీతిని దరికి రానీయని భాజపా- ఎన్డీయే పాలన ఉండి ఉన్నట్లయితే ఈపాటికి దేశం ఇంకెంత అభివృద్ధి చెంది ఉండేదో కదా అన్న అభిప్రాయమూ కలుగుతుంది.
ఏది ఏమైనా ఈ రెండు పుస్తకాలను చదివినపుడు- ఉపయుక్తమైన మంచి పుస్తకాలను చదివినామని, మన జ్ఞానాన్ని పెంపొందించుకున్నామని సంతృప్తి తప్పనిసరిగా కలుగుతుంది. తక్కువ ఖరీదులో, మనకు ఈ పుస్తకాలను అందుబాటులో ఉంచిన ఎమెస్కోవారిని అభినందించాలని అనుకుంటాం. మరో ముద్రణ వెలువరించే సమయంలోనైనా యా.వే.రెడ్డిగారి ‘నా జ్ఞాపకాలు’ పుస్తకంలో 268లో దొర్లిన తప్పును సవరింపజేస్తారని, దువ్వూరి సుబ్బారావుగారి పుస్తకంలో 30, 37 పుటల్లో తప్పుగా ముద్రించిన తేదీలను సరిదిద్దుతారనీ ఆశిస్తాను.

* పుస్తకాలు లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.

* ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643
*

--డాక్టర్ విజయసారథి - 9493173187