అంతర్జాతీయం

సిరియాలో పేలుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీరుట్, ఆగస్టు 12: సిరియా వాయువ్య ప్రాంతంలో తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న నగరంలో జరిగిన పేలుళ్లలో 39 మంది పౌరులు మరణించారు. మృతుల్లో 12 మంది పిల్లలు ఉన్నారు. టర్కీ సరిహద్దుల్లో ఉన్న ఇడిబ్ ప్రావిన్స్‌లో శర్మద్ అనే నగరంలో ఈ పేలుళ్లు జరిగాయి. పేలుళ్ల ధాటికి రెండు భవనాలు కుప్పకూలాయి. భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ భవనాల్లోనే పేలుళ్లు సంభవించాయని సిరియా మానవ హక్కుల పర్యవేక్షణ గ్రూప్ నిర్వాహకుడు రమీ అబ్దుల్ రెహమాన్ పేర్కొన్నారు. నివాసభవనాల్లోని ఆయుధాల డిపోలో ఈ పేలుళ్లు సంభవించాయని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. పేలుళ్లకు కారణం తెలియాల్సి ఉందన్నారు. హయత్ తహ్రీర్ ఆల్ షామ్ అనే గ్రూపుకు చెందిన సంస్థకు చెందిన సభ్యులు ఎక్కువ మంది మృతుల్లో ఉన్నట్లు భావిస్తున్నారు. సిరియా మాజీ ఆల్ ఖైదా సంస్థకు చెందిన జీహాదీలు ఈ దారుణానికి ఒడిగట్టారని సిరియా ప్రభుత్వవర్గాలు తెలిపాయి. మృతుల్లో మహిళలు, పిల్లలు ఎక్కువ మంది ఉండడంతో ఆ ప్రాంతం రోదనలతో దద్దరిల్లింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఇంతవరకు ఐదుగురిని సజీవంగా రక్షించారు. ఈ ప్రాంతంలో జీహాదీ ఉగ్రవాదుల్లో స్లీపర్ సెల్స్ కదలికలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. కాగా గత శుక్రవారం ఖాన్ షెక్రూన్ ప్రాంతంలో జరిగిన బాంబుదాడుల్లో 12 మంది పౌరులు మరణించారు. ప్రభుత్వ సైనిక బలగాలు ఇడిబ్ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేసింది. హెలికాప్టర్లు, విమానాల ద్వారా ప్రభుత్వ సైనిక బలగాలు కరపత్రాలను వెదజల్లాయి. తిరుగుబాటుదారులు లొంగిపోయాలంటూ కరపత్రాల్లో హెచ్చరించారు. ఈ ప్రావిన్స్‌లో 2.5 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వీరి జీవితాలతో ఆడుకోవద్దని, జీహాదీలు లొంగిపోవాలని సిరియా సైనిక బలగాలు కరపత్రాల్లో పేర్కొన్నాయి. 2011లో సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 3.50 లక్షల మంది ప్రజలు మరణించారు. లక్షలాది మంది ప్రజలు నిర్వాసితులయ్యారు.

చిత్రం..పేలుళ్లలో ధ్వంసమైన భవనం