డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పనులన్నీ సంకేతంగా పనిచేసే మన మనస్సులో ఆయా పనులు ఆ చైతన్యమూర్తికి జరుగుతూ వుండాలి. మనస్సులోంచి చైతన్యమూర్తి తొలిగిపోతే బహిరంగ పూజ కేవలం నాటకవౌతుంది. అయినప్పటికీ అత్యంత ప్రాథమిక దశలో వున్నవారు రుూ బహిరంగ ప్రక్రియను మొండిగా కొనసాగించినట్లైతే వారికి మానసిక భావన క్రమక్రమంగా అందుకుంటుంది.
ఎవరైతే మానసిక పూజ స్థాయిలో వున్నారో వారికి సమయాసమయాలు లేవు. ఇది నిరంతరం సాగవలసిన ప్రకియ అని మొదటే చెప్పుకొన్నాం గదా! నిరంతరం సాగకపోయినా కుదిరినప్పుడల్లా దీనిని సాగించటం ఉత్తమ విధి.
బహిరంగ పూజ దశలో వున్నవారు మాత్రం పూజకు సమయాసమయాలు పాటించటం అవసరం. ప్రాతఃకాలంలోనూ, మధ్యాహ్నకాలంలోనూ, సాయం సంధ్యాకాలంలోనూ పూజ చేయటం మంచిది. అపరాహ్ణకాలంలో, అర్థరాత్రి కాలంలో పూజ ప్రశస్తం కాదు. సర్వ సమయాలలోను, అహోరాత్ర ప్రక్రియగా పూజలు చేసేటప్పుడు ఈ నియమం వర్తించదు. మహాక్షేత్రాలలో కూడా ఆ క్షేత్ర సంప్రదాయాలనుబట్టి పూజా సమయాలలో కొన్ని మార్పులు వుంటాయి.
మొత్తంమీద సామాన్యుల విషయం మాట్లాడుకుంటే పగలు భోజనం కాక ముందు పూజచేసుకోవటం విధిగా పెట్టుకోవటం మంచిది.
కలశపూజ:
సందేహం: కలశపూజ అంటే ఏమిటి? కలశపూజ అవసరమా? కలశపూజ విధానం ఏమిటి?
సమాధానం:- పరిమితంలోంచి అనంతత్వంలోకి ప్రయాణం చేయటమే మన ఆధ్యాత్మిక సాధనాలన్నిటికీ పరమార్థం. ఈ శరీరమే నేననుకొనే భక్తుడు ప్రపంచమంతా వ్యాపించివున్న పరమాత్మ తానే అని అనుభవించాలి. అదే సాధనలకు చరమలక్ష్యం. అందుకే మనం ఏ సాధనచేసినా అల్పంలోనుంచి, అనల్పాన్ని అందుకునే దారులను రాచబాటలుగా వేసి వుంచారు పెద్దలు. అందుకే కలశపూజ ఒక మంచి నిదర్శనం.
ఏ పూజ చేసినా, పూజకు నీళ్ళు కావాలి. పూలు, అక్షింతలు వగైరా అక్కరలేదా?
కావాలి. కానీ మనిషి జీవనానికి నీరే ప్రాణాధారమైనట్లు మనిషి చేసే అర్చనకు కూడా నీరే ప్రాణాధారం. అందుకే పూజకు ముందుగా ఒక పాత్రలో నీరు తీసుకొని ఈ నీటినే ఈ పూజకు వినియోగిస్తామని సంకల్పిస్తాడు భక్తుడు. ఏ నీటికి? ఈ చిన్న చెంబుడు నీటిని మాత్రమేనా?
ఎదురుగా మనం అర్పించబోతున్నది 14 లోకాలను వ్యాపించి వున్న విశ్వమూర్తిని. ఆయన అర్చనకు ఈ చిన్న చెంబునీళ్లు ఎలా చాలుతాయి?
ఎదురుగా చిన్న విగ్రహముంది. దానిలో అనంతమైన పరమాత్మను సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతలను భావన చేస్తాం. ఈ భావనచేత పరిమితమైన ఆ పాత్ర అపరిమితమైన మహాజల రాశిగా భావనా ప్రపంచంలో రూపొందుతుంది. అప్పుడది ఆ విశ్వమూర్తియొక్క అర్చనకు అర్హవౌతుంది. అందుకే కలశపూజలోని ప్రధాన మంత్రం ఇలా చెబుతోంది.
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రీతః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రీతాః
గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి
నర్మదే సింధుకావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు.
ఈ పాత్రకు అడుగున బ్రహ్మ, మధ్యలో రుద్రుడు, పైన విష్ణువు వున్నాడు. మధ్యలో సప్తమాత్రుకలున్నాయి. దీని కడుపులో సముద్రాలన్నీ వున్నాయి. గంగా, యమున, కృష్ణా, గోదావరీ, సరస్వతీ, నర్మదా, సింధుకావేరి నదులారా! మీరు ఈ పాత్రలో ప్రవేశించండి- అని ఈ మంత్రానికి తాత్పర్యం.
ఇంత మహత్తర భావనతో జరిగే విషయం గనుక కలశపూజ ఆ పూజలకు తప్పనిసరిగా అంగవౌతోంది. విధానపరంగా చేస్తే యిది చాలా తేలిక ప్రక్రియ.
ఆచమనం చేసిన పాత్ర కాక వేరొక పాత్రలో పూజకోసం ఉపయోగించే నీళ్ళను తీసుకోవాలి. ఆ పాత్రకు గంధము, కుంకుమ అలంకరించాలి. ఇది గౌరవానికి సూచన, ఆ పాత్రలో కొద్దిగా పూలు, అక్షింతలు వేయాలి. ఇది పాత్రలోని దేవతలకు అర్చన. ఆ తరువాత ఆ పాత్రపై కుడి చేతిని మూతగా వుంచి పైన చెప్పిన మంత్రం చెప్పాలి. ఇది భక్తుడిలోని చైతన్యశక్తి నీళ్లలోనికి ప్రసరించి, ఆ నీళ్ళ విశాల జల ప్రపంచంగ మారటానికి సంకేతం. ఇదే కలశపూజ, ఈ పూజ అయిన తరువాత పువ్వుతోగానీ, తమలపాకుతోగానీ, ఆ పాత్రలోని నీటిని కొద్దిగా బయటకు తీసి ఆ నీళ్ళను పూజాద్రవ్యాల మీద పూజించబోయే దేవుడిమీద, పూజించే భక్తులమీద చల్లుకోవాలి. ఇది గొప్ప సంకేతం. మంత్రం ద్వారా ఇప్పుడే విశ్వవ్యాపిత్వాన్ని చెందిన ఆ జలం మూడిటిపై సమంగా చల్లుతున్నాడు గనుక ఆయా ద్రవ్యాలకు పవిత్రత్వం కలగటం ఒక సూచన, ఆ మూడు విశ్వచైతన్య స్వరూపాలే అని మనస్సుకు అందించడం మరో సూచన.
ఇలా కలశపూజలో విశ్వచైతన్య దృష్టి స్థిరపడుతోంది గనుక మనం కలశపూజను తప్పక ఆచరించాలి. ఇంకావుంది...

‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం,
పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్,
దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.

ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట,
విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి