ఫ్లాష్ బ్యాక్ @ 50

‘బంగారుగాజులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమ్మారెడ్డి కృష్ణమూర్తి, కమ్యూనిస్టు పార్టీలో, ప్రజానాట్య మండలిలో క్రియాశీలక పాత్ర పోషించారు. సారధి స్టూడియోలో ఒక దశాబ్దంపైగా వారు రూపొందించిన చిత్రాలకు చీఫ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఆ తరువాత స్వయంగా చిత్ర నిర్మాతగా మారి, రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై పలు చిత్రాలు రూపొందించారు.
విశ్వకవి రవీంద్రుని పట్ల గల అభిమానంతో వారు రచించిన ‘గీతాంజలి’లోని ఓ గీత మకుటాన్ని ‘విశ్వవిజ్ఞాన చంద్రికలు వెలయుచోట, నిర్భయముగా స్వేచ్ఛాగీతి నిలుపుచోట, మానవుడు పరిపూర్ణుడై మలయుచోట, మాతృదేశమా అచటచే మనగదమ్మా’అని రచయిత నార్ల చిరంజీవిచే తర్జుమా చేయించి, దీనిని మోనోగ్రాఫ్‌పై బ్యాక్‌గ్రౌండ్‌గా, మాధవపెద్ది సత్యంచే పాడించి, విన్పించారు. చేతిలో పనిముట్టు ధరించిన కార్మికుని చిత్రం, ఈ చరణం, రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ ప్రత్యేకతగా నిలిచాయి. రవీంద్రుని వారి పేరునే నిర్మాణ సంస్థకు పెట్టడం, నిర్మాతగారి అభిమానానికి మరో నిదర్శనం. ‘లక్షాధికారి’, ‘జమిందారు’ చిత్రాల తరువాత 1968లో వీరు నిర్మించిన చిత్రం ‘బంగారు గాజులు’.
ముందుగా ఈ చిత్రానికి తమ చిత్రాలకు అంతకుముందు దర్శకత్వం వహించిన వి.మధుసూధనరావుగారినే నిర్ణయించుకోగా వారికి వీలుపడకపోవటంతో, అక్కినేని వారి సూచనతో, అక్కినేని నటించిన ‘గోవుల గోపన్న’ చిత్ర దర్శకులు అయిన సి.ఎస్.రావును, ఈ చిత్ర దర్శకత్వానికి ఎన్నుకున్నారు. అలాగే కథానాయికగా కృష్ణకుమారిని నిర్ణయించుకోగా, ఆమెకూడా ఇతర చిత్రాలతో బిజీగా వుండడంతో అక్కినేనితో జంటగా ‘గోవుల గోపన్న’లో నటించిన ‘్భరతి’ని కథానాయికగా బుక్ చేసారు.
‘బంగారుగాజులు’ చిత్రానికి కథ- రాజశ్రీ, సినిమా అనుసరణ- తమ్మారెడ్డి కృష్ణమూర్తి, మాటలు- పినిశెట్టి, కూర్పు- అక్కినేని సంజీవి, కళ- జి.వి.సుబ్బారావు, నృత్యం-కె.ఎస్.రెడ్డి, సంగీతం- టి.చలపతిరావు, స్టంట్స్- రాఘవులు, ఫొటోగ్రఫీ- కమల్‌ఘోష్, టి.డి.బాబు, దర్శకత్వం- సి.ఎస్.రావు, నిర్మాత- తమ్మారెడ్డి కృష్ణమూర్తి.
కోటిపల్లిలో రామూ (ఎ.ఎన్.ఆర్) రాధ (విజయనిర్మల) అన్నాచెల్లెళ్లు అన్యోన్యంగా జీవిస్తుంటారు. రాముకు చెల్లెలంటే పంచప్రాణాలు. ఆ వూరి రైసుమిల్లు యజమాని రావూజి (నాగభూషణం) అతని అనుచరుడు దాసు (జగ్గారావు), రామూ ఆ మిల్లులో లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. రావూజి స్మగ్లింగ్, అక్రమ వ్యాపారాలు చేస్తూ పైకి మంచి వానిలా నటిస్తుంటాడు. వ్యసనపరుడైన రావూజి ఒకనాడు రాము వూరిలో లేని సమయంలో రాధను బలవంతం చేస్తాడు. అతన్నించి తప్పించుకున్న రాధ ఓ నదిలో దూకుతుంది. చెల్లెలికోసం వెదుకుతూ వచ్చిన రామూపై, అంతకుముందు తాము చంపిన సేఠ్‌జీ హత్యను రామూ పైకి నెట్టి, రావూజీ మరణించినట్టు రామూను దోషిగా చిత్రీకరిస్తారు. చెల్లెలుకోసం వెదకుచూ రామూ హైద్రాబాద్ చేరి అక్కడ భూషయ్య (రేలంగి)వద్ద కారు డ్రైవర్‌గా చేరి, అంతకుముందు పరిచయంకల అవతారం (పద్మనాభం) ఇంట ఆశ్రయం పొందుతాడు. అక్కడ అతని చెల్లెలు శారద (్భరతి) అతని తల్లి శాంతమ్మ (హేమలత) అతన్ని ఆదరిస్తారు. శారద, రామూను ప్రేమిస్తుంది. రవిగా, చలామణి అవుతున్న రామూ ఒకనాడు ఓ నృత్య ప్రదర్శనవద్ద తలకు గాయమైన రాధ (విజయనిర్మల)ను చూసి, తన రక్తమిచ్చి కాపాడుతాడు. ఆమె పోలీస్ ఆఫీసర్ చంద్రశేఖర్ (కాంతారావు) భర్త అని, ఆమె తండ్రి రామదాసు (గుమ్మడి) అని చెప్పినా నమ్మక ఆమె తన చెల్లెలుగా భావిస్తుంటాడు. రాధ కూడా అతన్ని అన్నగా ఆదరిస్తుంది. ఒకనాడు ప్రకాష్‌గా వేషం మార్చిన, రావూజీ, రాధ, రాములను చూసి, రవే, రామూ అని పోలీసులకు తెలియచేసి, రామూను అరెస్ట్ చేయిస్తాడు. ఒంటరిగా చిక్కిన రాధను బంధిస్తాడు. ఈ సంగతి తెలిసిన రామూ, అవతారం, శారదల సాయంతో జైలునించి తప్పించుకుని, రావూజీ డెన్ చేరి, వాళ్ళ గాంగ్‌తో పోరాడి రాధను విడిపించటం, ఈలోపు అక్కడకు వచ్చిన పోలీసులు, చంద్రశేఖర్, రావూజీని అరెస్ట్‌చేయటం,. మరో రాధను తీసికొని వచ్చిన రామదాసు, ఇద్దరూ రాధలు కవల పిల్లలని, తాను ఒకరిని పెంచుకున్నానని నిజం చెప్పటం, చెల్లెళ్ళిద్దరకూ, రామూ, బంగారుగాజుల తొడగడం, శారద, రామూల వివాహంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో రేలంగి భార్య కాంతంగా సూర్యాకాంతం, వారి కుమార్తె నవనీతంగా గీతాంజలి, కాంతారావు సోదరి దుర్గగా రాధాకుమారి నటించారు.
అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్‌తో కూడిన బెంగాలీ చిత్రం ‘నీలాకాస్ కే నీచే’ బేస్‌గా, అంతకుముందు వచ్చిన అన్నా, చెల్లెళ్ళ బంధంతో రూపొందిన చిత్రంకంటె, కొంత వెరైటీగా రూపొందిన చిత్రం ‘బంగారుగాజులు’. ఈ చిత్రాన్ని దర్శకులు సి.ఎస్.రావు కొంత సున్నితంగా, కొన్ని అలరించేలా సన్నివేశాలు తీర్చిదిద్ది ఆకట్టుకున్నారు. దేవుడిని పూజిస్తున్న చెల్లెలు, మొహం చూసి గాని నిద్రలేవని అన్నయ్య, తనకు మంచి బట్టలు లేకపోయినా, చెల్లెలు మంచి చీరలు కట్టి, కలకల లాడని అన్న కోరిక, దానికి ప్రతిగా ‘అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి’ అని చెల్లెలు పాటలో చెప్పటం దాని చిత్రీకరణ, ఒకే తీగకు రెండు పూలను, తులసికోటలో దివ్వెలను సింబాలిక్‌గా చూపటం. (రచన-నారాయణరెడ్డి, వీరే పాటకు రెండు, మూడు వరుసలు చూపించటం, దాన్ని సంగీత దర్శకులు చలపతిరావుగారు ఇంప్రోవైజ్ చేసి ట్యూన్ తయారుచేయటం- సుశీల గానంతో జనరంజకంగా చక్కని చిత్రీకరణ- విశేషం) పెళ్ళికోసం ఆమె బంగారుగాజులు, చేతులు చూపి అడగటం, అప్పుడు ‘చెల్లాయి పెళ్ళి కూతురాయెనే’ పాటలో హీరో ఊహలో ఆమె పెళ్ళికూతురవటం, అత్తారింటికి వెళ్ళటం చూపటం, నిజంగా ఈ చెల్లి రాధకు పెళ్ళి చిత్రంలో జరగదు కనుక ఓ పాటలో దాని చిత్రీకరణ అందంగా సాగటం, మెచ్చదగిన అంశం. ఇక బంగారుగాజులు పోగొట్టుకోవటం, తిరిగి మరో రాధకు బంగారుగాజులకోసం ఎంతో శ్రమకోర్చి టాక్సీ నడిపి, గాజులు కొని అవి ఆమెకు ఇవ్వలేకపోవటం, ఆమె భర్తచే తిరస్కృతి, తన్నులు తినటం, ఎంతసేపు చెల్లెలు పట్ల అభిమానంతో, తనను ప్రేమించిన యువతిని నిర్లక్ష్యం చేయటం దానికి భారతి, స్పందన ఎ.ఎన్.ఆర్. ప్రతిస్పందన ఎంతో సహజంగా చూపారు. ఇక సినిమాటిక్‌గా, క్లయిమాక్స్‌లో హీరో, విలన్ డెన్‌లో మారువేషం, పాట, విలన్‌తో, అనుచరుడితో హీరో పోరాటం, మిగిలిన రౌడీలతో భారతి, పద్మనాభం తమాషా దెబ్బతీయటం. ఇలా, ముఖ్య సన్నివేశాలు భావయుక్తంగాను, సూర్యాకాంతం, రేలంగి, గీతాంజలి, పద్మనాభం సన్నివేశాలు కొంత హాస్యరసంగా, రక్తికట్టేలా చిత్రీకరించి మెప్పించారు.
అక్కినేని నాగేశ్వరరావు, కథానాయకుడిగా, భావుకతతో కూడిన ప్రతి సన్నివేశాన్ని ఎంతో హృద్యంగా నటించి, అలరించారు. తమాషా సన్నివేశాలలో పద్మనాభం, ఇతరులతో అంతే సరదాగా, చలాకీగా, రొమాన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత లేని ఈ చిత్రంలోని చక్కని ప్రణయ గీతం ‘‘విన్నవించుకోనా’’లో సున్నితమైన భావాలను చరణాలకు తగ్గట్టు అభినయించారు.
ఇక చెల్లెలుగా విజయనిర్మల మొదట చిలిపిగా, ఆ తరువాత రెండో రాధగా నిండుతనంతో కూడిన నటనతో మెప్పించారు. ఓ ప్రేయసిగా భారతి, పాత్రోచితమైన నటన చూపగా, మిగిలిన పాత్రధారులు, తమ పాత్రల పరిధిమేరకు నటించారు. (సినీ నటి అంజలిదేవిగారి ఇల్లు ఈ చిత్రంలో షూటింగ్‌కు ఉపయోగించి’ ఆమెకు తొలుత కృతజ్ఞతలు తెలిపారు).
ఈ చిత్ర గీతాలు
‘అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి’(పి.సుశీల- సినారె), ‘చెల్లాయి పెళ్ళికూతురాయెను’ (ఘంటసాల- సి.నా.రె), సి.నా.రె మరో గీతం ‘వేగలేక ఉన్నానురా మావా’ (ఎల్.ఆర్.ఈశ్వరి- ఘంటసాల బృందం), భారతిపై చిత్రీకరించిన సి.నా.రె మరో గీతం ‘జాగిరి జాగిరి జక్కలమామా’ (ఎల్.ఆర్.ఈశ్వరి), గీతాంజలి, పద్మనాభంలపై చిత్రీకరించిన గీతం ‘అఆలు వస్తే కాని’ (బి.వసంత), మాధవపెద్ది- కొసరాజు రచన) ‘సోనారే, సోనారే హిందీ గీతం వరుసలో భారతి, స్నేహితులపై మైసూరు కృష్ణరాజ్‌సాగర్ డామ్, బృందావన్ గార్డెన్స్‌లో చిత్రీకరించిన గీతం ‘‘వలపు ఏమిటి, ఏమిటి’’ (పి.సుశీల బృందం- రచన ఆరుద్ర), ఇక ఎఎన్‌ఆర్, భారతిలపై చిత్రీకరించిన ప్రణయ గీతం. ‘విన్నవించుకోనా చిన్ని కోరికా ఇన్నాళ్ళు’ (ఘంటసాల, పి.సుశీల- దాశరథి రచన), అలరించాయి. టి.చలపతిరావుగారి సంగీతంతో పాటలు సాగాయి.
‘బంగారు గాజులు’ చిత్రం ఆర్థికంగా విజయం సాధించటమేకాక, ఉత్తమ కథకుడుగా, ఉత్తమ తృతీయ చిత్రంగా 2 నంది అవార్డ్స్ పొందింది. (రెండు నంది అవార్డ్స్) ఉత్తమ కథ (తృతీయ బహుమతి, ఉత్తమ చిత్రం- తృతీయ బహుమతి) 1968వ సం. 2 కాంస్య నందులు).
ఈ చిత్రాన్ని తమిళంలో డి.యోగానంద్ దర్శకత్వంలో ‘తంగైక్కకాగా’ జూపిటర్ మూవీస్‌వారు నిర్మించారు. వి.సి.గుహనాథన్ కథ, ఎం.ఎస్.విశ్వనాథం సంగీతం, కన్నదాస్ గీతాలు వ్రాసారు ప్రముఖ నటుడు శివాజీ గణేషన్, వెనె్నరాడై నిర్మల, లక్ష్మి, నాగేష్, ప్రధాన పాత్రలు పోషించారు.

- ఎస్.వి.రామారావు -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి