సబ్ ఫీచర్

విచిత్రమైన ప్రతీకారం (ప్రపంచ సినిమా : దక్షిణ కొరియా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఓల్డ్‌బాయ్’ - 2003

దర్శకుడు పార్క్ చాన్ - వుక్ తీసిన ‘ఓల్డ్‌బాయ్’ అనే దక్షిణ కొరియా చిత్రం 2004లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొని గ్రాండ్ పిక్స్ అవార్డును గెలుచుకుని అందర్నీ దిగ్భ్రాంతపరిచింది. అంతేకాదు, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్ళను, ప్రముఖ సినీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఆసియా-పసిఫిక్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకులకుగాను, అస్టిన్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్‌లో ఉత్తమ విదేశీ చిత్రంగా, బాంకాక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకుడిగాను, బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఆడియన్స్ అవార్డును- ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటికిగాను బ్లూ డ్రాగన్ ఫిలిం అవార్డులను అందుకున్నారు. ఇవేకాకుండా బ్రిటీష్ ఇండిపెండెంట్ ఫిలిం అవార్డులను, డైరెక్టర్స్ కట్ అవార్డును, గోల్డెన్ ట్రయిలర్ అవార్డును, గ్రాండ్ బెల్ అవార్డ్సును, హాంగ్‌కాంగ్ ఫిలిం అవార్డ్సును, కొరియన్ ఫిలిం అవార్డ్సును- సిట్‌జెస్ ఫిలిం ఫెస్టివల్, స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులను కూడా అందుకున్నారు. బెస్ట్ క్లాసిక్‌గా పేర్కొన్న ఈ చిత్రంలో ఏముందో చూద్దాం.
‘ఓల్డ్‌బాయ్’ చిత్రంలో, 1988లో దే-సూ అనే వ్యాపారవేత్త బాగా తాగి అల్లరి చేసినందుకు పోలీసులు అరెస్టు చేస్తారు. దాంతో అతను కూతురి నాలుగో జన్మదిన వేడుకలకు అందుకోలేకపోతాడు. జువాన్ అనే మిత్రుడొచ్చి పోలీసు స్టేషన్ నుండి విడిపించి, వాళ్ల ఇంటికి ఫోన్ చేస్తుండగా, దే-సూ కిడ్నాప్ చేయబడతాడు. మేల్కొన్న దే-సూ తనొక హోటల్ రూంలో బందీగా ఉన్నానని గుర్తిస్తాడు. తలుపు కింద వున్న అరలోంచి అతనికి ఆహారం అందుతుంటుంది. టీవీ చూస్తుండగా అతని భార్య హత్య చేయబడిందనీ, అతనే ప్రధాన నిందితుడని పోలీసులు వెతుకుతున్నారని తెలుస్తుంది. తనను ఎవరు, ఎందుకు బంధించారో తెలియదు. రాత్రి కాగానే గదిలోకి విడువబడిన వాయువులవల్ల దే-సూ క్రమంగా నిద్రలోకి జారుకుంటాడు. నిద్రలో వున్నవేళ ఆ గదిని శుభ్రం చేయడంతోపాటు దే-సూ బట్టలు మార్చి, అతను తనను తాను గాయపరుచుకుంటే, బాండేజీలు కట్టి వెళ్లిపోతుంటారు. తనను బంధించిన వారిమీద ఎప్పటికైనా ప్రతీకారం తీర్చుకోవడానికి షాడో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ, ఆ గదిలోంచి తప్పించుకోవడానికి సొరంగం తవ్వుతుంటాడు.
2003లో అనగా 15 ఏళ్ళ ఖైదు తర్వాత తాను తవ్విన సొరంగంలోంచి బయటపడే ప్రయత్నంలో వుండగా ఎవరో మత్తు మందిచ్చి, హిప్నటైజ్ చేసి, సూటు బూటు తొడిగి, చివరి అంతస్తుమీది ఆవరణలో విడిచిపెడతారు. పరిసరాలను గమనించిన దే--సూ రోడ్డుమీదికి వచ్చి రౌడీ మూకలతో తలపడి తన పోరాట నైపుణ్యాన్ని పరీక్షించుకుంటాడు. ఎవరో బిచ్చగాడు వచ్చి సెల్‌ఫోన్, మనీపర్స్ ఇచ్చి వెళ్లిపోతాడు. తనను బంధించిన వ్యక్తి నుండి ఫోన్ రాగా, తనను ఎందుకు బందించారని అడగ్గా కారణం చెప్పడు. సరికదా సుషీ రెస్టారెంట్‌కు వెళ్లమంటాడు. అక్కడు వెళ్లిన దే-సూకి, మిడో అనే వంటగత్తె (చెఫ్)తో పరిచయం అవుతుంది. అక్కడ స్పృహ కోల్పోయిన దే-సూను మిడో తన ఫ్లాట్‌కు తీసుకువస్తుంది. దే-సూ కోలుకున్న తర్వాత తనను బంధించిన జైలు ఎక్కడుందో, తన కూతురు ఏమయిందో అనే్వషిస్తాడు. తన కూతుర్ని ఎవరో స్వీడిష్ దంపతులు దత్తత తీసుకున్నారని తెలిసి, వాళ్ల గురించి వెతికి విఫలమవుతాడు. మిడోతో కలిసి దే-సూ అన్నీ రెస్టారెంట్లను వెతుకుతూ జైల్లో తనకు ఆహారం సరఫరా చేసిన హోటల్‌ను గుర్తించి, డెలివరీ బాయ్‌ను వెంబడించి ఆ జైలు వునికి తెలుసుకుంటాడు. చట్ట వ్యతిరేకంగా తమ శత్రువులను బంధించడానికి ఏర్పాటుచేసుకున్న ప్రైవేట్ జైలు అది. దే-సూ ఆ జైలు ఆఫీసులోకి ప్రవేశించి, వార్డెన్‌ను ఎంతగా హింసించినా, తనను బంధింపజేసిన వ్యక్తి ఎవరో అతనికి కూడా తెలియదని, అతిగా మాట్లాడినందుకుగాను తాను బంధీగా ఉన్నానని తెలుసుకుంటాడు. జైల్లోంచి బయటకు వస్తూ, అతడ్ని ఎదిరించిన జైలు గార్డులందర్నీ ఓడించి బయటపడతాడు.
దే-సూను బంధించిన వ్యక్తి, అత్యంత ధనవంతుడైన వూ-జిన్, దే-సూకు ఒక హెచ్చరిక పంపిస్తాడు. దే-సూను ఎందుకు బంధించారో అయిదు రోజుల లోపల తెలుసుకుంటే, తను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానంటాడు. కనుక్కోలేకపోతే తాను మిడోను చంపివేస్తానంటాడు. అక్కడ దే-సూ, మిడోలు పరస్పరం ఆకర్షితులై, శారీరకంగా కూడా ఏకమవుతారు. అంతలో పాత మిత్రుడు జువాన్ వచ్చి వూ-జిన్ గురించిన ముఖ్య సమాచారం అందజేస్తాడు. వూ-జిన్ తన సోదరిని చంపివేశాడని, ఈ విషయం అతడ్ని రహస్యంగా వెంబడించి తెలుసుకున్నానంటాడు. అపుడు దే-సూకు గతం జ్ఞాపకం వస్తుంది. దే-సూ, వూ-జిన్ ఇద్దరూ ఒకే హైస్కూల్ విద్యార్థులు. ఒక రోజు వూ-జిన్ తన స్వంత సోదరితో శృంగార కార్యక్రమాల్లో వుండగా చూసిన దే-సూ ఆ విషయం స్కూల్లో అందరితో చెప్పగా, ఆ అవమానం భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. తన ప్రియాతి ప్రియమైన సోదరి చనిపోవడంతో, దానికి కారకుడైన దే-సూ మీద పగ తీర్చుకోవడానికి అతడ్ని వెతికి పట్టుకుని బందీగా ఉంచుతాడు. ప్రస్తుతానికి వస్తే, వూ-జిన్ తన వునికి తెలియజేసిన జైలు వార్డెన్ చేతిని నరికి, దానిని దే-సూకు హెచ్చరికగా పంపిస్తాడు. ఇంకోవైపు, వార్డెన్ ముఠా, దే-సూను వెంటాడుతుంటుంది. దాంతో విసిగిపోయిన దే-సూ, మిడోను వదిలి తనొక్కడే వూ-జిన్‌ను ఎదుర్కోవడానికి బయలుదేరుతాడు.
వూ-జిన్ పెంట్ హౌస్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన దే-సూకు ఒక భయంకరమైన సత్యం తెలుస్తుంది. తన కూతురును స్వీడిష్ దంపతులు దత్తత తీసుకుంటున్నట్లు చూపించినా అది నిజం కాదనీ, ఆమెను వూ-జిన్ జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా పెంచాడనీ, ఆమెను రెస్టారెంట్‌లో చెఫ్‌గా నిమించాడనీ, దే-సూను, మిడోను ఇద్దర్నీ హిప్నటైజ్ చేసి వాళ్ళను ప్రేమలో పడేలా చేశాడనీ, తను పొందిన బాధను, అవమానాన్ని దే-సూ కూడా పొందాలని ఇదంతా చేశానని చెబుతాడు. ఆగ్రహించిన దే-సూ, వూ-జిన్ మీదకుదూకడంతో అతని బాడీగార్డ్ చావబాదుతారు. తిరగబడిన దే-సూ బాడీగార్డ్‌ను గాయపరచడంతో, అది చూడలేక వూ-జిన్ స్వయంగా తన బాడీగార్డ్‌ను కాల్చివేస్తాడు. అపుడు వూ-జిన్, జైలు వార్డెన్ ఇప్పటికీ తన కోసం పనిచేస్తున్నాడనీ, అతని కొత్త జైలులో మిడో బందీగా వున్నదనీ, నేను ఫోన్ చేసిన వెంటనే అసలు రహస్యం ఆమెకు చెప్పడానికి వేచి వున్నాడని చెబుతాడు. తను తండ్రిననే రహస్యం మిడోకు తెలియజెప్పవద్దనీ, తను అతని సోదరికి చేసిన అవమానానికి క్షమాపణలు చెప్పుకుంటూ, అతని క్షమాభిక్షను అర్థిస్తూ, అతనికి విశ్వసనీయమైన కుక్కలా పడి వుంటాననీ, కుక్కలా ప్రవర్తించి అతని విశ్వాసం చూరగొనడానికి ప్రయత్నించి విఫలమవుతాడు. వూ-జిన్ నవ్వుకుంటాడే తప్ప సంతృప్తి చెందలేదని గ్రహించిన దే-సూ ప్రాయశ్చితంగా తన నాలుకను కోసుకుని చూపిస్తాడు. సంతృప్తి చెందిన వూ-జిన్ జైలు వార్డెన్‌కు ఫోన్ చేసి, ఆ నిజాన్ని చెప్పవద్దంటాడు. లిఫ్ట్‌లో ఎక్కిన వూజిన్ తన సోదరి ఆత్మహత్య సంఘటనలు జ్ఞప్తికిరాగా, పిస్తోల్ కణతకు గురిపెట్టుకుని కాల్చుకుని చనిపోతాడు. అక్కడినుండి బయటపడిన దే-సూ హిప్నాటిస్టును కలుసుకుని, మిడో తన కూతురు అనే విషయాన్ని తన బుర్రలోంచి చెరిపివేయమని కోరుతాడు. అప్పుడే ఆమెతో కొత్త జీవితాన్ని గడపగలుగుతానని భావిస్తాడు.
ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దడంలో దర్శకుడి కృషి ప్రశంసనీయం. ఎంత క్లాసికల్‌గా తీసిన చిత్రం నిండా వున్న మితిమీరిన హింస, శృంగారాలు మనకు వెగటు పుట్టిస్తాయి. ఇందులో హీరో సుత్తి పట్టుకొని శత్రువులను ఎదుర్కోవడానికి బయలుదేరుతాడు. రహస్యాలను చెప్పించడానికి పటకారుతో పళ్ళను ఒక్కొక్కటి పీకివేయడం లాంటి చిత్రహింసలను ఒళ్ళు జలదరించేలా చిత్రీకరించారు. అందుకే కాబోలు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ అధ్యక్షుడిగా వున్న క్వెంటినో టారంటినో (అత్యంత హింసాత్మక దృశ్యాలతో కూడిన సినిమాలు తీసే దర్శకుడు) ఈ సినిమాను చూసి విపరీతంగా మెచ్చుకున్నాడు.
గ్రీకు పురాణాల ఆధారంగా ఈ కథను తయారుచేసుకున్నాననీ, ముఖ్యంగా గ్రీకు పురాణాలలోని ఈడిపస్ పాత్ర ఆధారంగా ఓల్డ్‌బాయ్ పాత్రను రూపొందించుకున్నానని దర్శకుడు పార్క్ చాన్ - వుక్ తెలియజేశారు. కానీ దే-సూ, వూ-జిన్ రెండు పాత్రలను ఈడిపస్‌ను దృష్టిలో ఉంచుకొని తీశారని విమర్శకుల అభిప్రాయం. నిజాన్ని భరించలేని ఈడిపస్ తన కళ్ళను పొడుచుకొని గుడ్డివాడవుతాడు. ఈ చిత్రంలో దే-సూ తన నాలుకను కత్తిరించుకుంటాడు. వూ-జిన్ అతని సోదరితో శృంగార కార్యక్రమాలు గ్రీకు దేవతలలోనుండి ముఖ్యంగా జ్యూస్ మరియూ హెరాలనుండి ప్రేరణ పొంది తీసినవి. ఆ దృశ్యాలను కన్నంలోంచి చూసిన దే-సూ, గ్రీకు దేవత ఈధర్‌ను జ్ఞాపకం తెస్తాడు. గ్రీకు దేవతలు పై లోకాల నుండి లేదా మానవులకు అందని ఎత్తులో వుండి, వీరి కార్యక్రమాలను గమనించేవారు. అలాగే ఈ సినిమాలో వూ-జిన్ ఎవరికీ తెలియకుండా ఉండి అందరి పనులను గమనించడం, పర్యవేక్షించడం చేస్తుంటాడు. ప్రధాన పాత్రలను హిప్నటైజ్ చేసి ప్రేమలో ఉంచడానికి హిప్నటిస్టు చేసిన ప్రయత్నాలు - గ్రీకులలో పారిస్, హెలెన్‌లమధ్య ప్రేమ చిగురించడానికి, గ్రీకుల ప్రేమదేవత అఫ్రొడైట్ నిర్వహించిన పాత్ర జ్ఞాపకం వస్తుంది.
కుటుంబ సభ్యులమధ్య లైంగిక సంబంధాలను ఎత్తివేసి కొన్ని మార్పులతో, సన్నివేశాలను మక్కీకి మక్కీగా దించేసి ‘ఓల్డ్‌బాయ్’ సినిమాను హిందీలో సంజయ్‌దత్ హీరోగా ‘జిందా’ అనే పేరుతో తీశారు. ఒక క్లాస్ చిత్రాన్ని కాపీ కొట్టి మనవాళ్ళు దాన్ని ఎంత పేలవంగా, నీరసంగా తీస్తారో ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు. కాపీరైటు ఉల్లంఘనల కింద తూర్పు దేశాల పంపిణీదారులు కోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు. కాని చర్యలు తీసుకోలేదు. బహుశా తెరవెనుక సర్దుబాట్లు జరిగి వుండవచ్చని ఒక అనుమానం. ‘ఓల్డ్‌బాయ్’ సినిమాను 2008లో స్టీఫెన్ స్పెల్‌బర్గ్, విల్ స్మిత్‌ను హీరోగా పెట్టి హాలీవుడ్‌లో సినిమా తీద్దామనుకున్నారు. కాని కాపీరేట్ల గొడవలతో విరమించుకున్నారు. తర్వాత ఇదే పాజెక్టును చేపట్టిన అమెరికన్ దర్శకుడు స్పైక్ లీ, జోష్ బ్రోలిన్‌ను హీరోగా పెట్టి సినిమాను తీశారు. విచిత్రమేమిటంటే, ‘జిందా’తోపాటు హాలీవుడ్ ‘ఓల్డ్‌బాయ్’ కూడా అట్టర్ ఫ్లాప్ కావడం ఆశ్చర్యం. ఆసక్తి వున్నవారు ఓల్డ్‌బాయ్ సినిమా తాలూకు హిందీ డబ్బింగ్, తెలుగు డబ్బింగ్‌లను నెట్‌లో చూసి ఆనందించవచ్చు.

-కె.పి.అశోక్‌కుమార్