Others

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షోడశోపచార పూజ:
ఉత్సవాలు ఎన్నిచేసినా అన్నిటికీ పునాది వంటిది షోడశోపచార పూజ. ఇది అన్ని పూజలకు సమానంగా వుండే పునాది. మిగిలిన ఉత్సవాలు చేతనైనా కాకపోయినా ప్రతివారూ ఈ షోడశోపచార పూజా విధానం నేర్చుకోవాలి.
షోడశ అంటే 16; 16 రకాల సేవలు మనం దేవతలకు అర్పిస్తున్నాం గనుక, దీని పేరు షోడశోపచార పూజ. దేవత మన ఎదురుగుండా ప్రత్యక్షంగా వుండదు. మరి మనం ఉపచారాలు ఎలా చేస్తాము?
ఎదురుగా ప్రత్యక్షంగా దేవత కనిపించదు గాని, ఆ దేవత ప్రతినిధిగా విగ్రహం వుంటుంది. ఈ విగ్రహాన్ని చూసి, మన భావనలో ఆ దేవతను రూపుకట్టించుకోవటం నేర్చుకోవాలి. ఇలా రూపుకట్టిన దేవతకు భావనలోనే ప్రత్యక్షంగా సేవలు సమర్పించాలి. ఇది మానసిక ప్రక్రియ. ఈ ప్రక్రియకు సహకారం చేసేదే బహిరంగంగా మనం చేసే పూజ.
మనస్సును ఏకాగ్రంచేసే ప్రక్రియలో పూజకు ప్రముఖస్థానం వుంది. ఈ విధానంలో, ఒక అందమైన మంటపంలో సుందరమైన దేవతామూర్తిని వుంచి పూజ చేస్తాం. కనుక మనస్సు ప్రేమతోనూ, సంతోషంతోనూ ఏకాగ్రం అవుతుంది.
ఏ వస్తువు మీద ఏకాగ్రవౌతుందో దానియొక్క లక్షణాలను పొందటం మనస్సుయొక్క స్వభావం. మనస్సు భగవంతుడి మీద ఏకాగ్రమైతే అది భగవంతుడే ఐపోతుంది. అదే మన చివరి లక్ష్యం.
పెద్దపెద్ద ఆలయాలు, ఉత్సవాలు మొదలైనవన్నీ దీనికోసమే ఏర్పాటైనాయి. ఎన్నిచేసినా, చేసేవారు పూజ అంటే పూలు చల్లటం కాదని, మనస్సులో భావన చేయటమే పూజ అని అర్థం చేసుకోవాలి. పూజలో ఉపయోగపడే మంత్రాలు, శ్లోకాలు మొదలైనవన్నీ ఈ భావనాశక్తిని పెంచటంకోసం ఏర్పరచినవే.
కాని మనది పరిగెత్తే కాలం. ఎవరికీ విశ్రాంతి లేదు. మంత్రాలను అర్థం చేసుకోవటం కష్టం. అందువల్ల పూజే కష్టమని భావించి వదిలేస్తున్నాం. ఇది పొరపాటు. పూజ అన్నా, 16 ఉపచారాలన్నా రోజూ మనింట్లో మనం చేసుకునే పనులే గాని కొత్తవి కాదు. ఈ విషయం మీకు అవగతమయ్యేందుకోసం ఒక్కొక్క ఉపచారానికీ గల భావాన్ని వివరించుకొందాం.
ఉపచారాలు:
1. ధ్యానం, ఆవాహనం- అంటే పిలుపు. మన ఇంటికి ఎవరైనా గొప్పవారు రావాలనుకుంటే, ముందు వారిని సగౌరవంగా పిలుస్తాం. అదే ఆవాహనం. ఇలా ఆహ్వానించేటప్పుడు వారి సుగుణాలను మనం గుర్తుచేసుకొంటాం. ఇదే ధ్యానం. రెండూ కలిపి ఒకటే ఉపచారం.
2. ఆసనం-ఇంటికి వచ్చిన వారిని ఆదరంగా మంచి కుర్చీలో కూర్చోమని కోరతాం. ఇదే ఆసన సమర్పణ.
3. పాద్యం- వచ్చిన పెద్దమనిషికి కాళ్లు కడుక్కునేందుకు నీళ్ళు అందిస్తాం. (శీతల దేశాలలో ఈ అలవాటు ఉండకపోవచ్చు. కాని కాళ్ళలోనూ, చేతులలోనూ, నాడీ మండలాలు పరిసమాప్తమవుతాయి. కనుక, వాటిని శుభ్రం చేసుకోవటానికి యోగప్రక్రియలో చాలా ప్రాముఖ్యం వుంది. అందుకే ఈ ప్రక్రియలు పూజలోకి చేరాయి) ఇదే పాద్య సమర్పణ.
4. అర్ఘ్యం- చేతులను కడుగుకునేందుకు నీళ్ళు అందించటమే అర్ఘ్య సమర్పణ.
5. ఆచమనం- వచ్చిన మనిషి ప్రశాంతుడవటానికి ఆచమనం చేయటం ఋషి సంప్రదాయం. ఆచమనం అంటే మూడుసార్లు గుక్కెడుగుక్కెడు నీళ్ళు త్రాగటం. దీనివల్ల గొంతులోనూ, నోటిలోనూ గల కండరాలు మెత్తబడి మనిషియొక్క వాక్కు మృదువుగా వస్తుంది. వచ్చిన పెద్దమనుషులు ఆచమనం చేయటం ఈనాడు సామాన్య కుటుంబాలలో మనకు కనిపించికపోయినా, ఋషి సంప్రదాయాలలో వుండేవారు మాత్రం ఇప్పటికీ దీనిని ఆచరిస్తూనే వున్నారు.
6. మధుపర్కం- వచ్చిన పెద్దమనిషికి మొదట ఏదైనా పానీయం అందిస్తాం. తేనె కలసిన పానీయమే మధుపర్కం.
7. స్నానం- తరువాత ఆ పెద్దమనిషికి స్నానానికి ఏర్పాటుచేస్తాం. దేవతకు మనమే స్వయంగా స్నానం చేయిస్తాం. ఇక్కడ వున్నది దేవతామూర్తి గనుక వరుసగా పాలూ, పెరుగూ, నెయ్యి, తేనె, పంచదార, కొబ్బరి నీళ్లు, మంచినీళ్ళు వీటితో స్నానం జరుగుతుంది. కుదరకపోతే వట్టి నీళ్ళతోనే.
8. వస్త్రం, ఉపవీతం- స్నానం తరువాత కట్టుకోవటానికి కొత్త బట్టలు మనమే అందిస్తాం. తరువాత పైన కప్పుకునే ఉత్తరీయం కూడా అందిస్తాం. పశ్చిమ దేశాలలో పై ఉత్తరీయం లేకపోయినా టై వున్నది. ఇదే ఉపవీతం.
9. గంధం- తరువాత ఆ పెద్దమనిషికి సుగంధ ద్రవ్యాలందిస్తాం. నుదుట చందనము, కుంకుమ, ధరించటం వైజ్ఞానికంగా చాలా అవసరమని భారతీయులకు తెలుసుగనుక సుగంధ ద్రవ్యాలలో గంధానికి ముఖ్య స్థానమిచ్చారు.
10. పుష్పాలు- ఈరోజులలో స్ర్తిలు మాత్రమే పుష్పాలు అలంకారంగా ధరిస్తున్నారు. పురాతన కాలంలో పురుషులు కూడా అలాగే ధరించేవారు. పుష్ప సమర్పణ అందువల్లనే పూజలోని ఉపచారాలలోకి చేరింది. ఉపాసనాపరంగా పుష్పమనేది మన హృదయానికి సంకేతం గనుక, పూజించే దేవతయొక్క వివిధ గుణాలను వర్ణించే పేర్లను ఉచ్చరిస్తే, పువ్వులను దేవతకు సమర్పించే విధానం ఏర్పాటయింది. ఇదే అష్టోత్తర శతనామ పూజ, సహస్ర నామ పూజలుగా విస్తరించింది.
*
ఇంకావుంది...
*
‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.
*
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి