డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11. ధూపం- ధూపమంటే సుగంధంగల పొగ. వచ్చిన పెద్దమనిషికి పొగ చూపటమేమిటి అనే సందేహం కలుగవచ్చు. కానీ ఆయుర్వేద విధానంలో స్నానానంతరం కొన్ని ప్రత్యేక ద్రవ్యాల ధూపాలని వంటికి పట్టించుకోవటం కేశాలకూ, ముఖ వర్చస్సుకు, ఊపిరితిత్తులకూ కూడా చాలా అవసరం గనుక, ధూప సమర్పణ ఒక పూజా ప్రక్రియగా ఏర్పడింది. భారతదేశంలో గ్రామాలలో యిప్పటికీ స్ర్తిలు, ముఖ్యంగా బాలింతరాళ్లు, స్నానానంతరం ధూప సేవనం చేయటం ఆచారంలో వుంది.
12. దీపం- ఇంటికి వచ్చిన పెద్దమనుషులకు ప్రత్యేకంగా వేరే దీపాలను చూపే ఆచారం ఇప్పుడు లేదు. కానీ ఇక్కడ ఈ దేవత జ్యోతి స్వరూపుడు అనే భావన వృద్ధిపొందేందుకై దీప సమర్పణ ఏర్పాటుచేయబడింది. ఇక్కడ సమర్పించే దీపం చిన్నదిగా వుంటుంది. పూజ చివరిలో పెద్ద దీప సమర్పణ వేరే వస్తుంది. ఇంతవరకూ ఆ దేవతయొక్క సౌందర్యాన్ని మనం మిక్కిలి ప్రీతిగా చూస్తూ వున్నాం గనక, మన దృష్టిదోషం ఆయనకు తగలరాదు అనే భావన కూడా ఆ దీప సమర్పణలో వుంది.
13. నైవేద్యం- అంటే రకరకాల ఆహార పదార్థాలు సమర్పించటం. ఇది అన్నిచోట్లా వున్నది.
14. తాంబూలం- ఆయుర్వేదం ప్రకారం భోజనానంతరం తాంబూలం సేవనం సహజ ఆరోగ్యానికి ఎంతో అవసరం. యతులు, బ్రహ్మచారులూ తప్ప, గృహస్థులు భోజనానంతరం తాంబూలం సేవించటం భారతదేశంలో ఇప్పటికీ పలుచోట్ల అలవాటుగా వుంది. అందుకే ఇది పూజోపచారాలలోకి ప్రవేశించింది.
15. హారతి- పూజ చివరికి వస్తోంది. మనం దేవతను అఖండ జ్యోతిస్సుగా గుర్తించకపోతే మన పూజలకు పరిపూర్ణత లేదు. అందుకే పెద్ద దీప జ్యోతిని దేవతకు చూపిస్తూ, ఈ జ్యోతివి నువ్వే అని మనం భావన చెయ్యాలి. అదే కర్పూర హారతి సేవ.
16. మంత్రపుష్పం, ప్రదక్షిణం- జ్యోతిగా చూసిన దేవతను పరతత్త్వంగా వర్ణించే మంత్రాలను చెప్పి, పుష్పాలను సమర్పించటం మంత్రపుష్పం. అన్నిదిక్కులా నీవే వున్నావు అని భావిస్తూ ఆ దేవత చుట్టూ గాని, తన చుట్టూ తానుగానీ తిరగటం ప్రదక్షిణం. ఇంటికి వచ్చిన పెద్దమనిషి చుట్టూ మనం తిరగటంకానీ, ఆయన వెంటబడి ఆయనకు కావలసిన సౌకర్యాలు చూస్తాం. ఇదికూడా ఒక రకమైన ప్రదక్షిణమే. పూజలోని ప్రదక్షిణం లౌకిక స్థాయినిదాటి ఆధ్యాత్మిక స్థాయిని అందుకుంటుంది.
ఇవే పూజలోని 16 ఉపచారాలు. వీటిలో ఒకటి రెండు ఉపచారాలకు ఆధ్యాత్మిక సంకేతాలున్నా, మిగిలినవన్నీ మనం ఇళ్ళలో ప్రియమైన అతిథులకు చేసుకునే సేవలే. కనుక వీటిని భావనచేయటం కష్టం అనరాదు.
మీరంతా భావనాబలాన్ని పెంచుకోవాలనే దృష్టితో పూజాతత్త్వాన్ని మీకు తేలికైన మాటలలో అందిస్తూ వున్నాం. దీనిలో ఇంకా గంభీరమైన సాంకేతిక అర్థాలు వున్నమాట వాస్తవమే కాని, మన నిత్యసాధనకు ఇది సరిపోతుంది.
నాగపూజ
సందేహం:నాగపూజ, నాగుల చవితినాడు పుట్టలో పాలు పోయటం సమంజసమేనా? పుట్ట కళ్ళు అంటే ఏమిటి? చాలామంది సంతాన ప్రాప్తికి పాములను పూజిస్తారెందుకు? జాతకరీత్యా కొందరికి కళ్యాణ యోగానికి, సంతాన యోగానికి నాగదోషం అడ్డుపడుతున్నమాట నిజమేనా? పాములు పాలు త్రాగుతాయా? కొందరు నాగచతుర్థినాడు గ్రుడ్లు కూడా సమర్పిస్తారు. సర్పాలు కోడిగ్రుడ్లు తింటాయా?
సమాధానం: ప్రకృతి శక్తులు విశేషంగా ఆవిష్కారం పొందే సందర్భం ఎక్కడ వున్నా సరే, దాన్ని దైవ దృష్టితో చూడటం భారతీయ ఆత్మకు సహజ లక్షణం. ఆ ప్రకృతి శక్తి ఆవిష్కార సందర్భం ప్రాణుల రూపంలో ఉండవచ్చు. నదుల రూపంలో ఉండవచ్చు. వృక్షాల రూపంలో ఉండవచ్చు. పంచభూతాల రూపంలో ఉండవచ్చు. ఇంకా అనేక రూపాలలో ఉండవచ్చు. రూపం ఏదైనా భారతీయులకు చిక్కు లేదు. వారికి కావలసిందల్లా, అక్కడ ఆవిష్కారవౌతున్న ప్రకృతి శక్తి. భారతదేశంలోని ‘నాగపూజ’ ఇందుకు ప్రబల నిదర్శనం.
నాగపూజ ఆ సేతు హిమాచలమే కాకుండా జపాన్, పర్షియా, ఆఫ్రికా, అమెరికా, స్వీడన్ వంటి అనేక విదేశాలలో కూడా వుంది. ప్రపంచంలో అనేక చోట్ల సర్పాలకు సంబంధించిన వింత కథలు మనకు వినిపిస్తూ వుంటాయి.
గ్రీకు దేశంలోని ‘నేపాలోనియా’ ద్వీపంలో రెండు చర్చిలున్నాయి. అక్కడ ప్రతి ఏటా ఆగస్టు 6 నుంచి 15 వరకు రకరకాల విష సర్పాలు అక్కడి కొండలోని తమ నివాసాల నుంచి బయటకువచ్చి చర్చిలవైపు వెడుతూ వుంటాయి. ఆ నాగులను చూడటానికి అనేక దేశాల నుంచి యాత్రికులు వస్తారు. ఆ పాములు ఇంతవరకూ ఎవరినీ కరిచిన సందర్భం లేదు.
మహారాష్టల్రోని ‘బత్తీశశిరాశ’ అనే తాలూకాలో సజీవ సర్పాలకు పూజ చేస్తారు. నాగపంచమి రోజున ఆ సర్పాలను ఊరేగిస్తారు. ఆ రోజు పాములను మెడలో వేసుకుంటారు. ఇక్కడ కూడా పాము కాటు సంఘటన ఇంతవరకూ జరుగలేదు.
ఇలాంటి వింత సంఘటనలు వుండగా, ప్రపంచంలోని చాలా మతాలలో పాములకు, దేవతలకు దగ్గర సంబంధం కనిపిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో శివుడు ‘నాగభూషణుడు’, విష్ణువు ‘శేషతల్పసాయి’, గణపతి ‘నాగయజ్ఞోపవీతుడు’, కుమారస్వామి ‘నాగస్వరూపుడు’. ఇలా నాగ సంబంధమున్న దేవతలు ఎందరో వున్నారు.
ఇంకావుంది...

‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం,
పుస్తకం లభించు స్థలం: ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్,
దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.

ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట,
విజయవాడ - 520 004. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి