Others

‘మావోయిస్టు ప్రాంత’ యువతకు సాంత్వన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాల్లో నైపుణ్యం గల విద్యార్థులను సమీకరించి, వారికి మరింత మెరుగైన విజ్ఞానాన్ని అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెంగళూరులోని విశే్వశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం (వి.టి.యు.) ఇందుకోసం నడుం బిగించింది. ‘రెడ్ కారిడార్’గా మావోయిస్టులు పిలుచుకునే ప్రాంతంలోని, తూర్పు భారతంలోని సాంకేతిక విశ్వవిద్యాలయాలకు విటియు ‘మెంటార్’గా వ్యవహరిస్తోంది. సాంకేతిక విద్యాప్రమాణాలు మెరుగుపరిచేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కేంద్రం ఈ ‘చర్య’కు పూనుకుంది.
బిహార్‌లోని ఆర్యభట్ట నాలెడ్జి యూనివర్సిటీ, లలిత్ నారాయణ్ మిధుల వర్శి టీ, ఒడిశాలోని బిజూ పట్నాయక్ విశ్వవిద్యాలయం, ఝార్ఖండ్‌లోని వినోభా భావే విశ్వవిద్యాలయానికి చెందిన సాంకేతిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు బెంగళూరులోని విటియు ఆచార్యులు మెరుగైన, మేలైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం కోసం ప్రపంచ బ్యాంకు ఆర్థికసాయం అందనున్నది. కేవలం ఆయా విశ్వవిద్యాలయాల విద్యార్థులకే గాక వారి అధ్యాపకులకు, ప్రొఫెసర్లకు సైతం అనుభవజ్ఞులైన విటియు ఆచార్యులు వర్తమాన పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక జ్ఞానాన్ని అందించనున్నారు. ఈ నాణ్యమైన ఉన్నత సాంకేతిక విద్య మావోయిస్టు ప్రభావిత ప్రాంత యువతకు, విద్యార్థులకు ఎంతో సాంత్వన కలిగిస్తుంది. జ్ఞానపరంగా మేలు చేకూరుస్తుంది.
కాగా, మావోయిస్టు (నక్సల్స్) ప్రభావిత జిల్లాల జాబితా నుంచి 44 జిల్లాలను తొలగించినట్టు కేంద్ర హోం మంత్రిత్వశాఖ పేర్కొన్నది. ఇందులో తెలంగాణ నుంచి గతంలో చేర్చిన జిల్లాలనే ఎక్కువగా తొలగించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి మూడు జిల్లాల చొప్పున ఆ జాబితా నుంచి తీసేశారు. బిహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆరు జిల్లాల చొప్పున ఆ జాబితా నుంచి తొలగించారు. అతి కీలకమైన ఛత్తీస్‌గఢ్ నుంచి సర్గుజా, కొరియా, జష్‌పుర్ జిల్లాలను ఆ కీలకమైన జాబితా నుంచి తీసివేయడం విశేషం. అంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కుంచించుకపోతున్నదని దీన్నిబట్టి అర్థమవుతోంది. ఒక వార్తాపత్రిక కథనం ప్రకారం దండకారణ్యంలో ‘గ్రీన్ హంట్’ జోరును భద్రతా బలగాలు పెంచడంతో మావోయిస్టుల్లో అంతర్మథనం మొదలైందని తెలుస్తోంది. సైనిక బలగాలు అడవుల్లో జల్లెడ పడుతుండటంతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని సమాచారం. ఈ గడ్డు పరిస్థితి నుంచి బయటపడేందుకు మార్గాలను మావోయిస్టులు వెతుకుతున్నారని వినికిడి.
ఓవైపు భద్రతా బలగాల గాలింపు, మరోవైపు జ్ఞానపరంగా సాంకేతిక విద్యకోసం బలమైన అడుగులు వేస్తూ మావోయిస్టుల ప్రభావాన్ని బాగా తగ్గించేందుకు కృషి జరుగుతోంది. ఒడిశాలోని ‘కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ’ ఇప్పటికే నూతన పరిజ్ఞానాన్ని విద్యార్థులకు బోధించే పనిలో నిమగ్నమైంది. ఈ కృషిని ద్విగుణీకృతం చేసేందుకు బెంగళూరులోని విటియు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎక్కువమంది విద్యార్థులు, అధ్యాపకులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
‘పంచశీల’పై చైనా కపట ప్రేమ..
మావోయిస్టులు అభిమానించే చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఏ) ఇటీవల టిబెట్‌లో భారీఎత్తున కవాతు (డ్రిల్లు) నిర్వహించింది. పోరు సమయంలో దళాల సంసిద్ధత- పౌరుల సహకారం ఇతర అంశాల సమన్వయాన్ని పరీక్షించుకునేందుకుగాను ఈ కవాతు జరిపినట్టు తెలుస్తోంది. హిమాలయ ప్రాంతంలో పట్టుబిగించేందుకు టిబెట్, భారత భూభాగంలోనూ కవ్వింపుచర్యలకు చైనా చాలాకాలంగా పాల్పడుతున్నది. డోక్లాంలో ఏర్పడిన ఉద్రిక్తపరిస్థితుల అనంతరం నిర్వహించిన ఈ కవాతుతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. స్థానిక సంస్థలు, ప్రజలు, అధికార సంస్థల అప్రమత్తతను పరిశీలించేందుకు ఈ డ్రిల్లు జరిపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర సమయంలో సమకూరే సరకుల సరఫరా, రహదారి భద్రత, ఇతర ‘లాజిస్టిక్స్’సంగతిని అంచనావేసేందుకు చైనా సైన్యం పూనుకుందని దీనివల్ల అర్థమవుతోంది. శాంతి, సామరస్యం, సహజీవనంపై ఒకప్పుడు చైనా పేర్కొన్న ‘పంచశీల’ ఇప్పుడు గాలిలో కలిసింది, కపట ప్రేమను కనబరుస్తోంది. ఇదీ దేశీయంగా, అంతర్జాతీయంగా మావోయిస్టుల ‘మర్యాద.’
కృత్రిమ మేధ..
మావోయిస్టుల, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఏ) వ్యవహారం ఎలా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ‘కృత్రిమ మేధ’ ప్రకంపనలు సృష్టిస్తోంది. కృత్రిమ మేధ (ఏఐ) విసిరే సవాళ్లు, కల్పించే అవకాశాల గూర్చి మన దేశంలో కీలకమైన ‘నీతి ఆయోగ్’ వ్యూహాత్మకమైన ఓ అధికార పత్రాన్ని రూపొందించింది. వర్తమాన సాంకేతిక పరిజ్ఞానంపై అటు ప్రభుత్వం, ఇటు విధాన రూపకర్తలు ప్రత్యేక దృష్టిని సారించారు. దేశ పురోభివృద్ధిలో ఈ వర్తమాన ‘ఏఐ’ని ఎలా ఒడిసిపట్టాలో పలువురు మేధోమథనం చేస్తున్నారు. వివిధ స్థాయిల్లో ఈ పరిజ్ఞానం అందించే మేలిమిని అందిపుచ్చుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.
డేటాను, సెన్సర్లను ఉపయోగించి యంత్రాల సామర్థ్యం పెంచే అవకాశాలను శోధిస్తున్నారు. మిషన్ లెర్నింగ్ సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు ఉపకరించనున్నది. అలాగే కృత్రిమ మేధ ద్వారా వ్యాధులను నిర్ధారణ చేసే వీలుంది కాబట్టి ఆ రంగంలో ఆ పరిజ్ఞానాన్ని గరిష్టంగా ఉపయోగించుకునే ఆలోచనలు చేస్తున్నారు. ఈ అద్భుత, వర్తమాన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడానికి జిడిపిలో 15 శాతం ఖర్చు కాగలదని అంచనా. 2035 సంవత్సరం వరకు అమలు జరిగేలా ఈ ప్రణాళికలు రచిస్తున్నారు. వర్తమాన ఈ పరిజ్ఞానం ఏ రంగంలో ఎక్కువగా అవసరముందో అందులోనే అక్కడే ఎక్కువ నిధులు ఖర్చుచేయనున్నారు.
వ్యవసాయం, సాగులో దీన్ని గరిష్టంగా ఉపయోగించనున్నారు. ఇప్పటికే కర్నాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలలో ఈ మెలకువలను ఉపయోగించి మంచి ఫలితాలను రాబట్టారు. ప్రజారోగ్యం, వైద్య నైపుణ్యం రంగాల్లోనూ ఈ ఆధునిక విజ్ఞానం ఎంతో సాయపడనున్నదని గుర్తించారు. ముఖ్యంగా దేశంలో ‘ఏఐ’ని ప్రోత్సహించాలని ‘నీతి ఆయోగ్’ పత్రం పేర్కొన్నది. దేశంలో మానవ వనరుల నైపుణ్యాలను వృద్ధి పరిచేందుకిది కీలకమని ఆ పత్రం వెల్లడించింది.
ఇప్పటికే అమెరికా, చైనా, జపాన్ లాంటి దేశాలు ఈ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిన విషయాన్ని ఆ పత్రం పేర్కొన్నది. పరిశోధన-అనువర్తితం విషయాల్లోనూ ఆ దేశాలు ముందున్నాయి. భారతదేశం ఈ విషయంలో వెనకబడితే చాలా ప్రమాదమని కూడా హెచ్చరించింది. ‘ఏఐ’ని అందిపుచ్చుకునే అవకాశాలు దేశంలో దండిగా ఉండటమేగాక ప్రపంచానికి 40 శాతం మేర సేవలు అందించే సామర్థ్యం మన యువశక్తివద్ద ఉందని గుర్తించింది. వాస్తవానికిది మరో సాంకేతిక విప్లవంగా ‘నీతి ఆయోగ్’ పరిగణించింది. ‘ఏఐ’లో అగ్రభాగాన నిలిచిన రాష్ట్రాలైన కర్నాటక, తెలంగాణ ఈ విప్లవానికి నాయకత్వం వహిస్తే మేలైన ఫలితాలు అందుకునే అవకాశాలున్నాయని నిపుణులు భావన. చైనా సైన్యం దూకుడుకు, భారతదేశ మావోల వైఖరిని ‘నీతి ఆయోగ్’ ముందు చూపునకుగల వ్యత్యాసమేమిటో ఇట్టే తేటతెల్లమవుతోంది. ఏది వర్తమాన సమాజానికి, పురోభివృద్ధికి, మానవాళి సంక్షేమానికి- సౌభాగ్యానికి ఉపకరిస్తుందో ఎవరికివారే ఒక అంచనాకు రావచ్చు. ఏ అంశానికి మద్దతు పలకాలో ఎవరికివారే ఓ నిర్ధారణకు రావొచ్చు! నీతి ఆయోగ్ నిజాయితీ పత్రాన్ని స్వాగతిద్దాం!!

-వుప్పల నరసింహం 99857 81799