Others

బ్యాగు భారం తగ్గదా..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా కరీంబాద్ గ్రామంలో పది కిలోల స్కూలు బ్యాగు మోస్తూ మూడవ అంతస్థులో క్లాస్‌రూమ్ ముందు సొమ్మసిల్లిపడిపోయి అనంతరం ప్రాణాలలు విడిచిన పధ్నాలుగేళ్ల ఆదిత్య మునిరాజ్ ఉదంతం పిల్లలలో స్కూలు బ్యాగుల బరువులు తెస్తున్న చెడు ప్రభావం గురించి చర్చ తిరిగి ప్రారంభించింది. ఒకప్పుడు విద్యాభ్యాసం అంటే ఆట, పాటలతో ఎలాంటి ఒత్తిళ్ళు లేకుండా ఆనందంగా సాగే ప్రక్రియ. తెలివితేటలతో పాటు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కూడా జరిగి విద్యాభ్యాసం పూర్తయ్యేనాటికి మానసికంగా, శారీరకంగా దృఢంగా అయ్యి జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు యువత సంసిద్ధులయ్యేవారు. మరి నేటి విద్యా విధానం కార్పొరేట్ చదువుల పుణ్యమా అని ఒత్తిళ్లమయంగా మారింది. విద్యాబోధనను వ్యాపారంగా మార్చేసిన విద్యా సంస్థలు కూడా మానసికంగా, శారీరకంగా బరువైన చదువే మంచిదన్న ప్రచారం కల్పిస్తుండగా, తమ పిల్లల ఉజ్జ్వల భవిష్యత్తును కాంక్షించే తల్లిదండ్రులు కూడా ఈ ప్రచార మాయలో పడిపోతున్నారు. ఈ క్రమంలో యుకెజి నుండి విద్యార్థులపై స్కూలు బ్యాగుల బరువు వారి జీవితాలకు శాపంగా పరిణమిస్తోంది.
దాదాపుగా మూడు దశాబ్దాల క్రితం ఐదేళ్ల వయసు వచ్చిన తరువాత మాత్రమే పిల్లల్ని స్కూళ్లలో చేర్చేవారు. అప్పటికి పిల్లలు విద్యాభ్యాసం కోసం శారీరకంగా, మానసికంగా సంసిద్ధులౌతారన్నది అందరి నమ్మిక. అయితే రాను రాను ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ నశించడం, తల్లిదండ్రులు ఇరువురు ఉద్యోగాలు చేయడం, సమాజంలో నెలకొన్న స్వార్థపూరిత వాతావరణం లాంటి కారణాలవలన రెండేళ్లకే స్కూలులో వేసి చేతులు దులుపుకునే పద్ధతి ప్రారంభమయ్యింది. మొదటిరోజునుండీ పుస్తకాలు, టిఫిన్ బాక్సు, మంచినీటి బాటిళ్లతో స్కూలు బ్యాగులను వారితో మోయిస్తున్నారు. కూలివాడిలా బరువులు ఎత్తడంతోనే చదువు ప్రారంభం అవుతోంది. ఇది క్లాసులతో ఒక్కొక్కమెట్టు ఎక్కుతూ ఇంటర్మీడియెట్‌కు వచ్చేటప్పటికి పది పనె్నండు కిలోల బరువును భుజాలతో మోసే పరిస్థితికి చేరుతోంది.
ఈ బ్యాగుల బరువు వలన పిల్లలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మితిమీరిన స్కూలు వేళలు, మానసిక శారీరక ఉల్లాసానికి అవకాశం లేని బట్టీయం చదువులు వారిని యంత్రాలుగా మార్చేస్తున్నా అటు ప్రభుత్వం, మేధావులు ఇటు తల్లిదండ్రులుగాని నిర్లక్ష్యవైఖరి అవలంభించడం ఆ చిన్నారుల పాలిట శాపంగా మారుతోంది. విద్యాభ్యాసం అనేది బాల బాలికలకు ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, జిజ్ఞాసను కలిగించేదిగా వుండాలే తప్ప అదొక భారంగా, శిక్షగా వుండకూడదని నాటి జాతిపిత నుండి నేటి అబ్దుల్ కలాం వరకు ఉద్ఘాటిస్తున్నా అవేం ప్రభుత్వాల చెవులకు ఎక్కడంలేదు. పిల్లల చదువుల పేరిట మానసిక, స్కూలు బ్యాగుల పేరిట శారీరక భారం తప్పడంలేదు. స్కూళ్ళు జైళ్లులా, చదువు శిక్షగా మారుతోంది. బాలల విలువైన బాల్యం ఒత్తిళ్లు, శ్రమ, యాంత్రిక జీవితంతో మోడుబారిపోతోంది.
దాదాపుగా రెండు దశాబ్దాల నుండి విద్యావేత్తలు, మేధావులు వైద్య నిపుణులు, సామాజిక కార్యకర్తలు స్కూలు బ్యాగు బరువు తెచ్చే దుష్ప్రభావం గురించి ఆందోళన చేస్తూనే ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2006లో కేంద్ర ప్రభుత్వం బాలల స్కూలు బ్యాగు చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే విద్య రాష్ట్ర జాబితాలో వున్నందున, దేశంలో వేగంగా విస్తరించిన కార్పొరేట్ చదువుల పుణ్యమా అని ఈ చట్టం అమలుకు నోచుకోలేదు. స్కూలు బ్యాగు బరువులవలన పిల్లల్లో వెన్ను, కండరాల సమస్యలు తలెత్తడం, జీవితాంతం నడుం నొప్పి, ఊపిరితిత్తుల సమస్యకు గురయ్యే ప్రమాదాలు వున్నాయి. విద్యార్థుల బరువులో స్కూలు బ్యాగు బరువు పది శాతంకంటే తక్కువగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తుంటే, ఇపుడు విద్యార్థులు వంద నుండి రెండు వందల శాతం బరువు ఎత్తుకుంటూ అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు.
విదేశాలలో గ్రేడ్ 10 వరకు ఎలాంటి హోంవర్కులు ఉండవు. పుస్తకాలు దాచుకునేందుకు క్లాసు రూముల్లోనే లాకర్ల సౌకర్యం వుంటుంది. ఇంటికి పుస్తకాలు తీసుకువెళ్లాల్సిన అవసరం అంతకంటే వుండదు. అంతగా చదువుకోవాలంటే స్కూలు వెబ్‌సైట్ నుండి పాఠ్యాంశాలు డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. విద్యార్థులనుండి లక్షల్లో ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ దిశగా ఆలోచించకపోవడం విడ్డూరంగా ఉంది.
పుస్తకాల బరువు యొక్క దుష్ప్రభావాలను చక్కగా సుప్రసిద్ధ కథకుడు ఆర్.కె.నారాయణ్ తన కథలలో విశే్లషిస్తూ బాల్యంలో పిల్లలను పుస్తకాల బరువుతో బాధించవద్దని ప్రాధేయపడ్డారు. జ్ఞానసముపార్జన అనేది స్కూలు బ్యాగు బరువుపైనా లేక ఎన్నిగంటలు తరగతి గదిలో గడిపారనే అంశంపై ఆధారపడి ఉండదు. చదువుపట్ల వారిలో సహజసిద్ధంగా ఉత్సుకత, జిజ్ఞాస రేకెత్తించే విధంగా విద్యాభ్యాసం రూపుదిద్దుకోవాలి. సహేతుక ఆలోచనకు, సృజనాత్మకతకు, మానసిక వికాసానికి ప్రాథమిక దశనుండే తరగతి గదులలో పునాదులు బలంగా పడాలి. ముక్కుపచ్చలారని తమ పిల్లలు కేజీలకు కేజీలు బరువు వున్న పుస్తకాల బ్యాగులను ఎంతో అవస్థతో వెనుక మోసుకుంటూ వెళ్తుంటే, అదేదో ఒక ఘనకార్యంలా భావించే నేటితరం తల్లిదండ్రులకు ఆర్.కె.నారాయణ్ కథలు, ఆదిత్య మునిరాజ్ యొక్క అర్థాంతరంగా ముగిసిన జీవితం ఒక కనువిప్పు కావాలి!

-సి.ప్రతాప్ 91368 27102