సబ్ ఫీచర్

ఎయిడ్స్‌కు తల వంచని ధీరవనిత ( ప్రపంచ సినిమా : ఈజిప్టు ) - ఆస్మా (2011)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గబ్బిలాలు, రక్తం, సాతాను శాపం, వేశ్యలు, మాదక ద్రవ్యాలవల్ల ఎయిడ్స్ వ్యాపిస్తుందని టీవీల్లో వచ్చే ప్రకటనలు 1980-90 ప్రాంతా ల్లో ఈజిప్టులో ప్రజలను భయభ్రాంతులను చేశాయి. ఈ వ్యాధి వెనుక వున్న అసలయిన కారణాలను పట్టించుకోకుండా, ఎయిడ్స్‌కు గురయిన ఆడ ఏజంట్లను మొస్సాద్ (ఇజ్రాయిల్ ఇంటలిజెన్స్ సంస్థ) పంపించి, ఎయిడ్స్ వ్యాపించేలా కుట్ర పన్నిందనే పుకార్లు వ్యాపించాయి. ఇలా రకరకాలుగా హెచ్.ఐ.వి. బాధితుల మీద వున్న అపోహలను, తప్పుడు ప్రచారాన్ని రూపుమాపడానికి ఈజిప్టులోని మీడియాను, అన్ ఎయిడ్స్ కంట్రీ కోఆర్డినేటర్ ఉపయోగించుకోవాలని ముందుకు వచ్చింది.
హెచ్.ఐ.వి. బాధితుల పట్ల ఇజిప్షియన్లకు వున్న నిరసన, అసహ్యం వల్ల ఎవరు తాము బాధితులమన్న సంగతిని బహిరంగంగా ప్రకటించలేకపోతున్నారు. ఈజిప్టులో దాదాపుగా పదకొండువేల మంది ఎయిడ్స్ బాధితులు వుంటే, అందులోంచి కేవలం 500 మంది మాత్రమే వైద్య సహాయం కోసం ముందుకొచ్చారు. వైద్యులకు కూడా ఎయిడ్స్ వ్యాప్తిపట్ల సరియైన అవగాహన లేకపోవడం వలన వైద్య సహాయానికి నిరాకరిస్తున్నారు. సంఘ బహిష్కరణ, ఉద్యోగ భద్రతలను దృష్టిలో వుంచుకొని ఎయిడ్స్ బాధితులు గుప్తంగానే వుండిపోతున్నారు. వాళ్ళు దీన్ని దేవుడిచ్చిన శాపం అనీ, తాము చేసిన పాపాలకు శిక్షయని భావించి మిన్నకుంటున్నారు. దేవుడు విధించిన శిక్షను అనుభవించక తప్పదనే భావనవల్ల చికిత్సకు దూరమవుతున్నారు. ఎయిడ్స్ బాధితుల యదార్థగాథల ఆధారంగా ఈజిప్టు దర్శకుడు అమ్‌స్రలామా ‘‘ఆస్మా’’ అనే సినిమాను అరబిక్ భాషలో తీశారు.
ఇందులో 45 ఏళ్ళ ఆస్మా, ముసలి తండ్రితో, టీనేజ్ కూతురు హబీబాతో నివసిస్తుంటుంది. ఆమె కైరో ఎయిర్‌పోర్టులో స్వీపర్‌గా పనిచేస్తూ చాలీచాలని జీవితాన్ని గడుపుతుంటుంది. గాల్‌బ్లాడర్ సమస్యతో బాధపడుతున్న ఆస్మా నొప్పిని తట్టుకోలేక ఆపరేషన్ కోసం ఆస్పత్రిలో చేరుతుంది. ఆపరేషన్ ముందు తను హెచ్‌ఐవి పాజిటివ్ అని చెప్పగానే డాక్టర్లు ఆపరేషన్ పక్కనబెట్టి థియేటర్లోంచి వెళ్ళిపోతారు.
సినిమా మొదటినుండి వచ్చే అనేక ఫ్లాష్‌బాక్‌లలో నుండి, మొదటి ఫ్లాష్‌బాక్ ఆస్మా ఈజిప్షియన్ గ్రామీణ జీవితాన్ని చూపిస్తు మొదలవుతుంది. ఆత్మవిశ్వాసంతో, స్వతంత్ర భావాలు కలిగిన అందమైన అమ్మాయి ఆస్మా. గ్రామంలో ఆస్మా తన తండ్రితో కలిసి చేతితో నేసిన కార్పెట్లను బజారులో పెట్టి విక్రయిస్తుంటుంది. సైన్యంలో పనిచేసి వచ్చిన మొసాద్ పట్ల కలిగిన ప్రేమ క్రమంగా పెళ్ళికి దారితీస్తుంది. ప్రేమించి పెళ్ళిచేసుకున్న మొసాద్, ఆస్మా అన్యోన్యంగా వుంటూ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటుంటారు. అస్మా బజారులో నిలబడి కార్పెట్లు అమ్మడం కంటే, అందరి ఆడవాళ్ళలా ఇంటి దగ్గర అమ్మాలనీ, కావాల్సిన వాళ్ళు అక్కడికొచ్చి కొంటారని మొసాద్ అంటాడు. దానికి ఆస్మాఒప్పుకోదు. మన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అది తప్పదనీ, తన స్వేచ్ఛను పోగొట్టుకోలేనని చెబుతుంది. అక్కడ బజార్లో ఆమె కార్పెట్లు అమ్మకుండా ఆమె దుకాణాన్ని కూల్చేస్తారు. ఇంట్లో వుండి భర్త సేవ చేయకుండా, బజార్లో కూచోవడం ఎందుకని, ఆమెను వెళ్ళగొట్టడానికి ప్రయత్నిస్తే ఆమె ఎదిరిస్తుంది. ఇదంతా చేసిన దుండగీడు ఆమె చెంప పగలగొట్టగా, ఆమె వాడి మొహం మీద ఉమ్మేసి వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మొసాద్ మార్కెట్‌కు వెళ్ళి తన భార్యను ఎవరైనా వేధించినా, వాడ్ని చంపివేస్తానని హెచ్చరిస్తాడు. తన భార్యను అవమానించిన వాడ్ని చితకబాదగా, వాడు చచ్చిపోతాడు. జైల్లో వున్న భర్తను చూడటానికి వచ్చిన ఆస్మాను మళ్ళీ రావద్దని చెబుతాడు. ఆమె ఇంటికి వచ్చి తన కార్పెట్లన్నీ కాల్చివేస్తుంది. శిక్ష పూర్తిచేసుకుని జైల్లోంచి విడుదలయిన మొసాద్, అతనికి స్వాగతం పలకడానికి వచ్చిన ఆస్మాను పట్టించుకోడు. ఇంటికి వచ్చిన తర్వాత డిప్రెషన్‌లోకి పోయి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఓదార్చబోతున్న ఆస్మాకు విడాకులిస్తానని ప్రకటిస్తాడు. ఎందుకని గట్టిగా నిలదీస్తే, నాకు ఎయిడ్స్ వుందని జైల్లో తెలిసింది అది ఎలా వచ్చిందో అడక్కు. నేను త్వరలో చచ్చిపోతాను. అదీ నీకు అంటించి నీ జీవితాన్ని నాశనం చేయలేనంటాడు.
‘నాకు నీవే సర్వస్వం. నాకోసం జైలుకు పోయిన నిన్ను రక్షించుకోవడం, నీకు ఆసరాగా నిలబడడం నా ధర్మం అని ఆస్మా తెలియజేస్తుంది. మొసాద్‌కు ఎయిడ్స్ అని అందరికి తెలిసిపోయింది. సమీప బంధువు వచ్చి వాళ్ళ భూమిని అమ్మివేయమంటాడు. లేదా చనిపోయింతర్వాత ఎలాగైనా నా స్వంతం అవుతుందంటాడు. రోజురోజుకు మొసాద్ క్షీణిస్తుంటాడు. గర్భిణిగా వుండి బ్లడ్‌టెస్ట్‌కు వెళ్ళిన ఆస్మాకు హెచ్‌ఐవి పాజిటివ్ అని తెలిసి తల్లడిల్లిపోతుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకర్నొకరు పట్టుకుని రోదిస్తారు. జాగ్రత్తలు తీసుకుంటే గర్భస్త శిశువుకు రోగం సంక్రమించదని డాక్టర్లు చెబుతారు. చనిపోయేముందు మొసాద్, తన గురించి పుట్టబోయే బిడ్డకు ఏం చెప్పకూడదని ఒట్టువేయించుకుంటాడు. ఆస్మా ప్రసవిస్తే కొడుకును ఇక్కడే వదిలేసి, వేరే వూరికి వెళ్ళిపోవాలనీ- ఒకవేళ కూతురు పుడితే ఆ పిల్లతో సహా ఆస్మా వూరు విడిచి వెళ్ళాలని సమీప బంధువు నిర్ణయిస్తాడు. అదృష్టవశాత్తు పుట్టిన కూతురుకు ఎయిడ్స్ లేదని తెలిసి ఆస్మా సంతోషిస్తుంది. ఆ పసిగుడ్డును, ముసలి తండ్రిని తీసుకుని ఆస్మా ఆ ఊరు విడిచి కైరో చేరుకుంటుంది. ఆఫీసువాళ్ళు ఆస్మా మెడికల్ రిపోర్టులు అడుగుతారు. ఆఫీసులో ఆమె రిపోర్టులు చూసి, చట్టపరంగా నిన్ను తీసేయలేం. కాని నీతో పనిచేసేవాళ్ల అభిప్రాయాలు తెలుసుకుందాం. అంటే, ఎవరు ఆమెతో పనిచేయడానికి ఇష్టపడరు. దాంతో ఆమె ఇంటికి వెళ్ళిపోతుంటే ఒక కొలీగ్ పరుగెత్తుకొంటూ వచ్చి, నీ వైద్య సహాయం కోసం మేం విరాళాలు వసూలుచేశాం అని చెప్పి, ఆ డబ్బును ఆమె చేతికివ్వకుండా నేల మీద పెట్టి దూరంగా నిల్చొని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ డబ్బుతో ఆమె మందులు కొనుక్కుంటుంది.
ఎయిడ్స్ బాధితుల సంరక్షణ కోసం ఏర్పడిన గ్రూపుల్లో సల్మా చేరుతుంది. వీళ్ళంతా కలిసి ఎయిడ్స్ పట్ల అరబ్బులలో చైతన్యం కలిగించడానికి సెల్ప్ ప్రమోటింగ్ టాక్‌షో, టీవీలో ఏర్పాటుచేయడానికి సంకల్పిస్తారు. కాని ఆమె తన నిజమైన గుర్తింపును వ్యక్తపరచలేనని చెబుతుంది. ఎందుకంటే తను ఎయిడ్స్ బాధితురాలినని తండ్రికి మాత్రమే తెలుసు. ఈ సంగతి కూతురికి తెలియకూడదని తాపత్రయపడుతుంది. ఆ సంస్థలో పనిచేసే షఫీఖ్, అస్మాను పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు. ఇద్దరమూ హెచ్‌ఐవి పాజిటివ్‌లం. నాకు భార్యతోనే కాక, ఇతర స్ర్తిలతో కూడా సంబంధముండేది. నాకు ఎయిడ్స్ వచ్చింది. నా భార్య దాంతోనే చనిపోయింది. నేను బతికేవున్నాను. నీకు ఎలా వచ్చిందో నేను వూహించగలను. నన్ను పెళ్ళి చేసుకుంటే నీ సమస్యలు తీరుతాయి. నీ కూతురి పెళ్ళిచేయవచ్చు అని నచ్చజెపుతాడు. ఆస్మా, షఫీఖ్ కారులో ఇంటికి వస్తుంటే, వంతెన మీద తన కూతురు హబీబా ఒక యువకుడి కౌగిలిలోవుండడం చూసి ఆగిపోతుంది. వాళ్ళిద్దర్ని కోప్పడి, కూతుర్ని కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువచ్చి, ఆమె ప్రవర్తన గురించి నిలదీస్తుంది. దానికి రెచ్చిపోయిన కూతురు, నీ ఇష్టం వచ్చినట్టు నీవు బతుకుతుంటే, నా ఇష్టం. వచ్చినట్లు నేను వుంటున్నాను. నీ అలంకరణలు, నీ దుస్తులు, నీవు ఎక్కి వచ్చిన కారు ఎవరిది? అని ప్రశ్నిస్తుంది. నా తండ్రి గురించి, నా బాబాయ్‌ల గురించి అడిగితే చెప్పవు. మాట మార్చేస్తావు. బాత్‌రూంలోని కప్‌బోర్డులను ఎప్పుడూ తాళం వేసి వుంచుతావు.అందులో వున్న రహస్యం ఏమిటి? అందులో దొరికిన ఈ ఫొటో ఎవరిది? అని నిలదీసి ప్రశ్నించేసరికి అస్మా కుప్పకూలిపోతుంది.
ఈసారి ఆస్మా తన మొహం చూపవద్దనే షరతు మీద టివి లైవ్‌షోలో పాల్గొంటుంది. టివిలో ఇప్పుడు ఎయిడ్స్‌మీద ప్రత్యేక కార్యక్రమం. ఎయిడ్స్ బాధితురాలు తన హక్కులకోసం పోరాడుతున్నది. వాళ్ళు ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో చెబుతుందని అనౌన్స్‌మెంట్. ఎయిడ్స్ వైరస్ వాహకంగా వున్నాననీ, అది ఎలా వచ్చిందో చెప్పమని కొందరు అడుగుతున్నారు. చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పకపోవడం నా హక్కుల్లో భాగంగా భావిస్తాను. నా సమస్య ఎయిడ్స్‌తో కాదు. గాల్‌బ్లాడర్‌ది. దానికి ఆపరేషన్ అవసరం. ఎంతోమంది వైద్యులను సంప్రదించాను. ఎవరూ ముందుకు రాలేదు. భయపడ్డారు. వాళ్ళకు అది అంటుకుంటుందని వింటున్న వాళ్ళలోంచి ‘‘ఆమె మొహాన్నికప్పిపుచ్చుకోవడంతో అర్ధం లేదు. ఆమె ఆపరేషన్‌కు నిరాకరించిన డాక్టర్ల మీద కేసు వేయాలని ఒక కాలర్ ఉద్వేగంగా చెబుతుంది. అలా టివిలో ప్రసారమవుతున్న లైవ్‌షో మీద ప్రేక్షకులు ప్రశ్నలు కురిపిస్తారు. సానుభూతి చూపిస్తారు. కొంతమంది అనవసర చర్చ, ఛానెల్ మార్చెయ్యండని విసుక్కుంటారు. అంతలో ఫోన్ వస్తుంది. మీ ఎదురుగా కూర్చున్న ఆవిడ కూతుర్ని అంటుంది.
‘‘మా అమ్మ నిజమైన హీరో. అలాంటి తల్లిని పొందగలగడం నా అదృష్టం’’ అంటుంటే తల్లి సంతోషంతో ఆనంద భాష్పాలు రాలుస్తుంది. ‘‘అప్పుడు ముసుగు తీసివేసి వెలుగులోకి వచ్చిన ఆస్మా ‘గాల్‌బ్లాడర్ సమస్యతో నాకు విపరీతమైన నొప్పి వచ్చేది. దాంతో ఎన్నో రాత్రుళ్ళు నిద్ర పట్టకపోయేది. ఎయిడ్స్‌తో ఎలాగూ సహజీవనం చేస్తున్నా. అది నన్ను చంపలేదు. ఒకవేళ నేను చచ్చిపోయినా ఎయిడ్స్‌వల్ల మాత్రం కాదు.’’ ఇది వింటున్న ఎవరో అజ్ఞాతశ్రోత. ఆస్మాకు ముప్పైవేల పౌండ్లను విరాళంగా ప్రకటిస్తాడు. విదేశాలకు వెళ్ళి వైద్యం చేయించుకొమ్మని. ‘‘నేను భయపడ్డాను. అన్నింటి గురించి భయపడ్డా. ప్రజల నుండి భయపడ్డాను. ప్రజలు ఇది ఏమిటో అర్ధం చేసుకోలేక భయపడ్డారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను బతికి వున్నాను కాబట్టి. ‘‘ఆత్మ విశ్వాసంతో వెలిగిపోతున్న ఆస్మా ఒకవైపు, లైవ్‌షో విజయవంతం అయినందుకు టివి వాళ్ళు, సేవా సంస్థల వాళ్ళు సంతోషాన్ని చూపిస్తూ సినిమా ముగుస్తుంది.
ఈజిప్ట్ ఇస్లామిక్ దేశం కాబట్టి మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలు వుంటాయి కాబట్టి ఎయిడ్స్ రోగుల సంఖ్య తక్కువ అనుకుంటారు. కాని ప్రజల అజ్ఞానంవల్ల ఈ వ్యాధి శరవేగంగా విస్తరిస్తున్నది. ఇలాంటి దశలో ప్రజలలో చైతన్యం కలిగించడానికి ఇలాంటి సినిమాల అవసరం వుందని దర్శక నిర్మాతల అభిప్రాయం. ఇందుకు ఆస్మాగా హెంద్‌సాబ్రీ. ఆమె తండ్రిగా సయ్యద్ రగబ్, టివిలో షోకోసం ఆస్మాను ఒప్పించి ఇంటర్వ్యూ చేసిన మొహిసిన్‌గా మాగెద్- ఎల్ - కెద్వానీ అద్భుతంగా నటించారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం అమ్ సలామా. ఈ చిత్రం సాధికారికంగా, నిజాయితీతో తీసిన చిత్రమనీ, ఎయిడ్స్‌కు తలవంచని ధీరవనిత కథ అని ఈజిప్ట్‌లోని మహిళా పత్రిక ప్రశంసించింది. మిగతా ఈజిప్షియన్ విమర్శకులు ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. 2012లో పామ్ స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో దీన్ని ఉత్తమ చిత్రంగా అంతా మెచ్చుకున్నారు. 2011లో జరిగిన అబూదబి ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొని ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడికి గాను అవార్డులను అందుకున్నారు. 2012లో జరిగిన ఫ్రిబోర్గ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఆడియన్స్ అవార్డును గెలుచుకుంది. విచిత్రం ఏమిటంటే, 2016లో తీసిన ‘‘అరులి’’ అనే తమిళ చిత్రం ఎన్నో అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం ‘‘ఆస్మా’’ ప్రేరణతో తీసిందే.

-కె.పి.అశోక్‌కుమార్