AADIVAVRAM - Others

సమ సమాజమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపేందుకు, వివిధ కులాల మధ్య హెచ్చు తగ్గులు లేకుండా చూసేందుకు, మానవ సేవయే మాధవసేవగా పరిగణిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలను, సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా కొనసాగిస్తున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. భగవత్ రామానుజాచార్యులు చిన జీయర్‌కు ఆదర్శమూర్తి. శ్రీశ్రీశ్రీ త్రిదండి పెద్ద శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ వీరికి గురువులు, ఆచార్యులు. భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడేందుకు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న చిన జీయర్ ఆంధ్రభూమి ప్రతినిధికి వివిధ అంశాలపై ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు సమగ్రంగా ఇక్కడ అందిస్తున్నాం.
*
ప్రశ్న: రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న తలంపు ఎందుకు వచ్చింది?
జవాబు: సమాజంలో అసమానతలు నెలకొని ఉన్నాయి. గతంలో ఉన్న నాలుగు కులాలు, ఇప్పుడు 600 కులాలుగా విడిపోయాయి. చాలా మంది డబ్బుకోసం అక్రమమార్గాలను అనుసరిస్తున్నారు. ప్రతి విషయంలో వ్యాపారధోరణి కనిపిస్తోంది. ఒకే మతం వారి మధ్య యుద్ధాలు కొనసాగుతున్నాయి. వేయిసంవత్సరాల క్రితమే రామానుజులు సమాజంలో సమానత్వం కోసం పాటుపడ్డారు. నేటికీ ఆదర్శమూర్తిగా నిలిచారు. అలాంటి మహానుభావుడి గురించి లోకానికి తెలియచేయాలని, భవిష్యత్తు తరాలకు కూడా ఉత్తేజం కలిగించాలని రామానుజుల సహస్రాబ్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
ప్ర: రామానుజుల విగ్రహంతో పాటు దివ్యదేశాల మాడళ్లను ఎందుకు నిర్మిస్తున్నారు
జ: దేవాలయాలు ప్రజలను కలిపే కేంద్రాలు. ఇవి సమానత్వానికి చిహ్నాలు. దివ్యదేశాలన్నీ భూలోక వైకుంఠాలుగా భావిస్తున్నాం. ఈ పవిత్ర క్షేత్రాల్లో ఆళ్వారులు దివ్యప్రబంధాలను చదివారు. రామానుజులు ఈ క్షేత్రాలన్నింటినీ పర్యటించారు. అన్ని దివ్యదేశాలను అందరూ తమ జీవితంలో చూడలేకపోవచ్చు. అందుకే దివ్యదేశాల మాడళ్లతో ఆలయాలను నిర్మిస్తున్నాం.
ప్రశ్న: సనాతన ధర్మం అంటే ఏమిటి?
జవాబు: ధర్మం అంటే ఆచరణ విధానం. ఇది రెండు రకాలు..తాత్కాలిక లాభం కోసం చేసేది ఒకటైతే, దీర్ఘకాలిక లాభం కోసం చేసేది రెండోది. ఈ జీవితంలో లాభం కలిగించేది తాత్కాలికమైంది. జీవితం తర్వాత మళ్లీ వచ్చే జీవితం కోసం చేసేది దీర్ఘకాలికమైందని వేదాలు చెబుతున్నాయి. ఒక మంచి పనిచేయడానే్న ధర్మం అంటారు. జీవితంలో ప్రతి పని ధర్మంగా చేయాలి. సనాతనలో ‘తన’ అనేది ఉంది. సనాతన ధర్మం అంటే పురాతన కాలానికి సంబంధించిన ధర్మమని చాలా మంది భావిస్తారు. ధర్మం అనేది ఎప్పటికైనా ఏ కాలంలోనైనా ఒకే రకంగా ఉంటుంది. స్నానం చేయడం ఒక ధర్మం. నదినీటిలో స్నానం చేయాలి..అది ఉత్తమ ధర్మం. నదిలేకుంటే పుష్కరిణి (ట్యాంక్) నీటిలో చేయాలి. లేదా నూతి నీటితో చేయాలి. పట్టణాల్లో కుళాయి నీటితో చేస్తున్నాం. నీరు లభించకపోతే ‘పుండరీకాక్ష, పుండరీకాక్ష’ అంటూ మూడు సార్లు నీటిని తలపై, శరీరంపై చల్లుకోవాలి. ఇదీ ధర్మం. ధర్మానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు.
ప్ర: ‘దైవీ గుణాలు’ అంటే ఏమిటి? ఎవరికి అవసరం?
జ: భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా చెప్పారు..
‘అభయం సత్త్వసంశుద్ధిర్ జ్ఞాన యోగవ్యవ స్థితిః
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తవ ఆర్జవమ్‌॥
అహింసా సత్యమక్రోధస్త్వాగః శాన్తిరపైశునమ్‌
దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలమ్‌॥
తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా
భవన్తి సమ్పదం దైవీమభిజాతస్య భారత॥
అంటే భయరాహిత్యము, స్వీయస్థితి, పవిత్రీకరణం, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనం. దానగుణం, ఆత్మనిగ్రహం, యజ్ఞాచరణం, వేదాధ్యయనం, తపస్సు, సరళత్వము, అహింస, సత్యసందత, క్రోదరాహిత్యం, త్యాగం, శాంతి, ఇతరుల దోషాలను ఎన్నకుండుట, జీవులందరియెడ దయ, లోభరాహిత్యం, మృదుత్వం, సిగ్గు, దృఢనిశ్చయం, తేజము, క్షమ, ధైర్యం, శుచిత్వం, అసూయారాహిత్యం, గౌరవవాంఛ లేకుండుట అనేవి దివ్యగుణాలు...ఇవి దైవీ స్వభావం కలిగిన మనుషుల్లో ఉంటాయి. దైవీగుణాల వల్ల సత్ప్రవర్తన చేకూరుతుంది. ప్రతి ఒక్కరూ దైవీ గుణాలు కలిగి ఉండాలి. దైవీ గుణాలకు విరుద్దమైనవి అసుర (రాక్షస) గుణాలు. ప్రతి ఒక్కరూ దైవీగుణాలను అలవరచుకుంటే ఈ లోకం ఆనంద నిలయంగా మారుతుందనడంలో సందేహం లేదు.
ప్ర: చాలా మంది అశాంతితో జీవిస్తున్నారు..కారణాలు ఏమిటి? పరిష్కార మార్గాలు ఏమిటి?
జ: మనిషి అవసరాల కన్నా విలాసాలు ఎక్కువయ్యాయి. సాంకేతిక విజ్ఞానం పెరిగింది. ఈ విలాసాలకు హద్దు ఉండటం లేదు. ఉన్నదాంతో చాలామంది సంతృప్తి చెందడం లేదు. టీచర్లు, డాక్టర్లు, లాయర్లు, ఉద్యోగులు, కార్మికులు..ఇలా వివిధ వర్గాలకు చెందినవారిలో చాలా మంది తాము చేస్తున్న పని కష్టమని భావిస్తున్నారు. ఇష్టం లేకుండా చేసే ప్రతి పని కష్టంగానే ఉంటుంది. ప్రతిఒక్కరూ శీలాన్ని, వ్యక్తిత్వాన్ని, జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. యోగా, ధ్యానం వల్ల ఏకాగ్రత సాధించవచ్చు. ఏకాగ్రత, శ్రద్దతో చేసే ప్రతి పని సంతృప్తిని కలగిస్తుంది. తద్వారా శాంతి చేకూరుతుంది.

ప్ర: నీతి, న్యాయం, సత్యం, హక్కుల గురించి అంతా చెబుతుంటారు..ఆచరణకు వచ్చే వరకు ఇవి లోపిస్తున్నాయా?
జ: ప్రతి వ్యక్తి తనను తాను సంస్కరించుకోవాలి. నీతిగా ఉండాలి. న్యాయంగా జీవించాలి. సత్యసంధతను అలవర్చుకోవాలి. సామాజిక కట్టుబాట్లకు అనుకూలంగా జీవించాలి. ప్రభుత్వం రూపొందించే నియమ, నిబంధనలు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడే ప్రవర్తించాలి. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. నేరం చేయడం తప్పు. ప్రభుత్వం రూపొందించిన చట్టాలను, నియమ, నిబంధనలు పాటించని వారిపట్ల శిక్ష ఉండాలి.
ప్ర: చాలా మంది వత్తిడితో జీవిస్తుంటారు. దీనికి పరిష్కారం ఏమిటి?
జ: మనం చేసే ప్రతి పని మనమే చేస్తున్నామన్న భావన తొలగించుకుని, భగవంతుడిపై భారం వేయాలి. భగవంతుడే చేస్తున్నాడన్న నమ్మకం ఉంటే వత్తిడి ఉండదు. చేసే పని శ్రద్దతో, ఓపికతో, కష్టం అని భావించకుండా ఇష్టంతో చేయాలి. ఇష్టంతో చేస్తే వత్తిడిని దూరం చేసుకోవచ్చు.
ప్ర: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచాయి. సమాజంలో అవసరమైన అభివృద్ధి కనిపిస్తోందా?
జ: అవును..సమాజంలో మార్పు కనిపిస్తోంది. నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశానికి ప్రపంచంలో మంచి గుర్తింపు వచ్చింది. అన్ని రంగాల్లో అభివృద్ధి కనిపిస్తోంది. సమాజంలో చెడుని తొలిగించి మంచికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభమైంది. దేశంలో ప్రతిపౌరుడు తమ బాధ్యతలను తు.చ తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. మన దేశాన్ని ఇప్పుడు ప్రపంచదేశాలు పొగుడుతున్నాయి.
ప్ర: పంచభూతాలు కలుషితం అవుతున్నాయా? పృథ్వీమాతను రక్షించుకోవడం ఎలా?
జ: పృథ్వీమాతను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. పంచభూతాలైన గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం కలుషితం కాకుండా చూడాలి. పంచభూతాలు కలుషితం అయితే ప్రకృతివైపరీత్యాలు వచ్చే అవకాశం ఉంది. మనం ఇప్పుడు తరచూ ప్రకృతివైపరీత్యాలను అనుభవిస్తున్నాం. అనేక విధాల నష్టపోతున్నాం. పంచభూతాలు/ప్రకృతి కలుషితం చేయకుండా నడవడం మన ధర్మం. ప్రకృతే భగవంతుడిగా భావించడం భారతీయ సంప్రదాయం. ప్రకృతిని ఆరాధించడం నేర్చుకుంటే పంచభూతాలు కలుషితం కాకుండా ఉంటాయి.
ప్ర: సమాజం ఎలా ఉండాలని మహానుభావులు భావిస్తుంటారు?
జ: ఒక తండ్రి తన పిల్లలు బాగుండాలని, నీతిగా, న్యాయంగా జీవించాలని కోరతాడు. సమాజంలోని అందరినీ తమ పిల్లలుగానే మహానుభావులు భావిస్తారు. ప్రతి ఒక్కరు నీతిగా, న్యాయంగా, ధర్మంగా జీవించాలని, తోటివారికి చేయూత ఇస్తుండాలని కోరతారు. మహానుభావులు సామాన్యుల నుండి ఆశించేది ఇదే!
ప్ర: ఈ జన్మలో చేసే మంచి, చెడులకు వచ్చే జన్మలో ఫలితాలు ఉండటం అనేది న్యాయమేనా?
జ: చిన్నచిన్న తప్పులకు ఈ జన్మలోనే ఫలితం ఉంటుంది. మంచికి కూడా ఇదే జన్మలో ఫలితం ఉంటుంది. పెద్దతప్పులకు మాత్రం మరుజన్మలో ఫలితాలు ఉంటాయి.
ప్ర: ప్రజలకు వౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుందా? సమాజం బాధ్యత ఏమిటి?
జ: ప్రతి ఒక్క పనీ ప్రభుత్వమే చేయాలన్న ఆలోచనల నుండి ప్రజలంతా బయటపడాలి. విద్య, వైద్యం, ఆహారం, వౌలిక వసతుల కల్పన కేవలం ప్రభుత్వ బాధ్యతనే కాదు. సామాజిక బాధ్యతగా భావించాలి.
ప్ర: హిందూ ధర్మానికి ఇతర వర్గాల నుండి హానికలుగుతోందా?
జ: హిందువులకే తమ ధర్మం గురించి పూర్తిగా అవగాహన ఉండటంలేదు. క్రిస్టియన్లు బైబిల్‌ను, ముస్లింలు ఖురాన్‌ను గౌరవిస్తారు. ఏ క్రిస్టియన్, ఏ ముస్లిం తమ మతాలను విమర్శించడంలేదు. హిందూమతం గురించి హిందువులే తెలుసుకోవడం లేదు. ఒక రామాయణం, ఒక భారతం, భగవద్గీత, వేదాలు, పౌరాణిక పుస్తకాలను ఎంతమంది చదువుతున్నారు..? కొంత మంది అజ్ఞానంతో సొంత మతానే్న విమర్శిస్తున్నారు. మతం, మతగ్రంథాలను అధ్యయనం చేయడం నేర్చుకోవాలి. పాజిటివ్‌గా ఆలోచించాలి.
ప్ర: దేవాలయాల పరిపాలనలో ప్రభుత్వ జోక్యం ఎంతవరకు ఉండాలి?
జ: ప్రభుత్వ జోక్యం లేకపోతేనే మంచిది. అనేక గ్రామాలు, పట్టణాల్లోని కాలనీల్లో ప్రభుత్వ (దేవాదాయ శాఖ) జోక్యంలేని ఆలయాలు చాలా చక్కగా నడుస్తున్నాయి. స్థానికులే పవిత్రంగా నడిపిస్తున్నారు.
ప్ర: ప్రతితప్పునకు ‘కలి’ ప్రభావం అంటూంటారు..నిజమేనా?
జ: మనం తప్పు చేసి, ‘కలి’ని నిందించడం ఎందుకు? ప్రతి పౌరుడు రాజ్యాంగానికి అనుగుణంగా, చట్టాలకు లోబడి జీవించాలి. ఎవరైనా చట్టాన్ని, రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే కఠిన దండన ఉండాలి. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పువల్ల వచ్చే ఫలితం ఒకే రకంగా ఉంటుంది. అందుకే తప్పు చేయకుండా మనం జాగ్రత్తపడాలి.
ప్ర: నైతిక విలువలు పెంపొందడం ఎలా?
జ: పిల్లలకు చిన్నతనం నుండే మంచి గురించి తెలియచేయాలి. ‘నైతిక విలువల’ గురించి సిలబస్‌లో ఒక పాఠ్యాంశంగా ఉండాలి. దానివల్ల సత్ఫలితాలు వస్తాయని ఆశించవచ్చు.
ప్ర: యువత చెడు మార్గంలో వెళుతున్నారన్న భావన ఉంది.
జ: అలాంటి భావన తప్పు. చాలా మంది మంచిమార్గంలోనే నడుస్తున్నారు. గుణం ప్రధానం.. కాని వయస్సు కాదు.
ప్ర: అమావాస్య రోజు శుభకార్యాలు చేయకూడదంటారు..నిజమేనా?
జ: తెలుగువారమైన మనం చంద్రమానం విధానాన్ని అనుసరిస్తున్నాం. తమిళులు సౌరమానం విధానాన్ని పాటిస్తారు. చంద్రమానంలో అమావాస్య మంచి కాదని భావించడం వల్ల శుభకార్యాలకు ఉపయోగపడదు. *