ఎడిట్ పేజీ

ప్రగతి రథం పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేపటి గురించి ఈరోజు ఆలోచించేవాడే అసలైన నాయకుడు. ఎప్పటికప్పుడు భవిష్యత్ సవాళ్లకు అనుగుణంగా తన శ్రేణుల్ని సమాయత్తం చేస్తూ, ప్రత్యర్థుల్ని చిత్తు చేయడంలో ఓ ఆకు ఎక్కువ చదివినవాడే అధినాయకుడు. తెలంగాణ ఉద్యమనేతగా, కొత్త రాష్ట్రానికి తొలి పాలకుడిగా తనకు తానే సాటి అనిపించుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరితేరిన వ్యూహకర్త. లక్ష్యం ఉంటే నిర్దిష్టమైన మార్గం ఉంటుంది. సరైన మార్గాన్ని ఎంచుకుంటే లక్ష్యం అదే సాకారం అవుతుంది. తెరాస పార్టీ అధినేతగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పంథా ఇదే. దశాబ్దాల కలల సాకారానికి నిన్నటి ఉద్యమాన్ని ఎంత పటుతరంగా నడిపించారో.. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛలను నిజం చేసేందుకు అంతే పట్టుదలతో ఆయన తన మార్గాన్ని నిర్దేశించుకున్నారు. ఆ పథంలో సాగిన నాలుగేళ్ల పాలన అన్ని వర్గాల ఆశలు, ఆకాంక్షలను ఈడేర్చడంలో గణనీయంగా కృతకృత్యమైంది.
ఉపాధి కల్పనలోనూ, దాహార్తిని తీర్చడంలోనూ, రైతన్నను ఆదుకోవడంలోనూ యావత్ దేశానికే తెలంగాణను చుక్కానిగా అనతికాలంలోనే మార్చగలిగిన దార్శనికత కేసీఆర్‌ది. మిన్నువిరిగి మీదపడ్డా ఎంచుకున్న మార్గం నుంచి సడలని,తొణగని నిబద్ధత ఆయనది. అందుకే ఎన్ని అవరోధాలొచ్చినా, ఎవరెంతగా రెచ్చగొట్టినా ఎంచుకున్న లక్ష్యానికి వెన్నుచూపని రీతిలోనే తెలంగాణను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కేసీఆర్ ఉన్నతాశయానికి దీపికలు. తెలంగాణ మాగాణిని సస్యశ్యామలం చేసి, ప్రజల దాహార్తిని తీర్చే బృహత్తర ప్రాజెక్టులను ఆయన చేపట్టారు. సామాజికంగానూ ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా త్రికరణ శుద్ధిగా వాటి అమలుకు నడుం బిగించిన కార్యదక్షత ఆయనది. ఆశయం ఎంత ఉన్నతమైనదైనా ఆచరణలోపిస్తే అది ముమ్మాటికీ నిరుపయోగమే. అందుకే నేలవిడిచి సాము చేయని రీతిలో అడుగులు వేస్తూ ఆయన సామాన్యులకు చేరువయ్యారు. చెప్పింది చేయడమే తన నైజమని ఈ నాలుగేళ్లలో తాను అమలు చేసిన విభిన్న పథకాల ద్వారా రుజువు చేసుకున్నారు.
ప్రజా సంక్షేమం అన్నది ఓ అవిశ్రాంత యజ్ఞం. నిరంతర శ్రమ, అంకితభావం, కట్టుబాటుతో సాగితేనే ఆ యజ్ఞ్ఫలాలు సమకూరుతాయి. మొదటి నుంచి కేసీఆర్‌ది తదేక దీక్ష. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాకారం చేసుకోవడంలో నిరుపమాన దక్షత. దీక్షకు దక్షత తోడైతే అది నాలుగేళ్లుగా తెలంగాణలో సాగుతున్న ప్రగతికి దర్పణం పడుతుంది. ఒకే ఒక్కడన్నట్టుగా ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్నీ సమసామర్థ్యంతో నడిపిస్తున్న కేసీఆర్‌కు జనం మనోగతం తెలుసు. వారి ఆకాంక్షలూ ఎరుకే. జనం నాడి తెలిసిన నాయకుడు కాబట్టే విపక్షాలను చిత్తు చేయడంలోనే కాదు, పార్టీని గతానికి మించిన మెజార్టీతో మళ్లీ అందలం ఎక్కించేందుకూ అహరహం శ్రమిస్తున్నారు. ‘ఇవిగో నా హామీలు.. ఇవిగో వాస్తవాలు..’ అంటూ నాలుగేళ్ల ప్రగతి నివేదికను అందించేందుకు సమాయత్తమయ్యారు. ముందస్తు ఎన్నికలకు ఆయన నిర్ణయం తీసుకున్నారనే సంకేతాల నేపథ్యంలో నేడు ‘కొంగర కలాన్’ వద్ద జరుగుతున్న ‘ప్రగతి నివేదన’ సభ కేసీఆర్ పాలనా సామర్థ్యానికి, వాగ్దానాల అమలులో సాధించిన విజయాలకు నిలువెత్తు నిదర్శనమనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఏ నాయకుడూ ఇంత ధైర్యంగా ‘మీరే తేల్చండి’ అని జనం ముందుకొచ్చే దాఖలాలు చాలా అరుదుగా ఉంటాయి. తమ ప్రభుత్వాన్ని, తమ పాలనను జనం మెచ్చారు. తమ విధానాలను ఆమోదించారు. తమ పథకాల ఫలాలను ఆస్వాదించారన్న బలమైన నమ్మకం ఉంటే తప్ప సడలని నమ్మకంతో ‘ముందస్తు’కు దూకే అవకాశం ఉండదు. ప్రజల ఆశీస్సులు మళ్లీ తమకేనన్న కేసీఆర్ ధీమా వెనుక జనం మెచ్చిన విశ్వసనీయత ఉంది. చెప్పింది చేయగలిగానన్న ఆయన ఆత్మ విశ్వాసమూ ఉంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తామని తామెక్కడా చెప్పలేదని టీఆర్‌ఎస్ నేతలు ఒకవైపు చెబుతున్నా, మరో వైపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అన్న మాటలోనే ‘తిరకాసు’ ఉంది. ఎన్నికలు ఎప్పుడంటే అప్పుడెందుకొస్తాయి? నిర్ణీత కాలవ్యవధి ప్రకారమే జరుగుతాయి. అర్ధాంతరంగా శాసనసభను రద్దు చేస్తే తప్ప ముందస్తు ఎన్నికలకు అవకాశం ఉండదన్నది జగమెరిగిన సత్యం. అయితే తెలంగాణ ప్రభుత్వ తాజా వైఖరి, ఇతర పరిణామాలు ‘ముందస్తు’ ఖాయమన్న సంకేతాలను ఇస్తున్నాయి. ఇప్పటివరకు ముందస్తుగా ఎన్నికలకు వెళ్లిన నేతల్లో ఒకటీ అరా తప్ప గెలిచిన ఉందంతాలు లేవంటున్న విపక్ష నేతలే ముందస్తు ఎన్నికలంటే ఎందుకో భయపడిపోతున్నారు. ముందస్తు ఎన్నికలు అచ్చిరాకపోతే ఓటమి పొందేది అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్సే. ముందస్తు ఎన్నికల వల్ల టీఆర్‌ఎస్ అధికారాన్ని కోల్పోతే లబ్ధిపొందేది విపక్షమే. అలాంటప్పుడు ముందస్తుకు జంకాల్సింది అధికార పక్షమే కానీ విపక్షాలు కాదు కదా!
విపక్షాల ఈ బలహీనతే అధికార టీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలకు సిద్ధపడటానికి ప్రధాన కారణం. శత్రువు బలహీనంగా ఉన్నప్పుడే దెబ్బతీయడం యుద్ధనీతి. ఈ నీతిని అనుసరించే ఎన్నికలకు ఎనిమిది నెలల ముందే పాలకపక్షం సన్నద్ధం అవుతోంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలను విపక్షాలు మరో కోణంలో కూడా అంచనా వేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను అయోమయానికి గురి చేయడానికే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ‘ముందస్తు’ నాటకం ఆడుతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ముందస్తు ఎన్నికల పేరిట ప్రతిపక్షాలను అప్రమత్తం చేయాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు? విపక్షాలను ఎన్నికలకు సన్నద్ధం చేయడం వల్ల పాలకపక్షం తనకు తాను కోరి నష్టాన్ని కొని తెచ్చుకోవడమే తప్ప దీని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో విపక్షాలు విశే్లషించుకోలేక పోతున్నాయి.
వాస్తవానికి తెలంగాణ శాసనసభకు లోక్‌సభ ఎన్నికలతో పాటే పోలింగ్ జరగాల్సి ఉంది. అలా జరిగిన పక్షంలో బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజలకు వ్యతిరేకత ఉంటే ఆ ప్రభావం తమపైనా పడే ప్రమాదం ఉందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగే మైనారిటీ ఓటర్లు బీజేపీ పట్ల ఉండే సహజసిద్ధ వ్యతిరేకతతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే, ఆ ప్రభావం రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమపై పడే అవకాశం లేకపోలేదని టీఆర్‌ఎస్ విశే్లషించుకుంటోంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టి అమలు వంటి నిర్ణయాల పట్ల మధ్య తరగతి, సామాన్య ప్రజానీకం మోదీ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్టు టీఆర్‌ఎస్ నిర్వహించిన సర్వే నివేదికల్లో వ్యక్తం అయినట్టు సమాచారం. సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే బీజేపీ పట్ల ఉన్న వ్యతిరేక ప్రభావం పడుతుందన్న అనుమానాలున్నాయి. మరోవైపు రాష్ట్రంలో విపక్షాలు ఎన్నికలకు సమాయత్తంగా లేకపోవడం, టీఆర్‌ఎస్ సర్కార్ పట్ల ప్రజల్లో చెప్పుకోదగ్గ వ్యతిరేకత లేకపోవడంతో కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లాడానికి ప్రధాన కారణాలన్నది రాజకీయ విశే్లషకుల విశే్లషణ.
ధీమాకు కారణం
ముందస్తు ఎన్నికలకు వెళ్తే మునుగుతారని విపక్షాలు శాపనర్థాలు పెడుతున్నా, సొంత పార్టీ నేతల్లో కొంత అపనమ్మకం తొలుస్తున్నా, ఏ ధీమాతో సీఎం కేసీఆర్ ముందస్తుకు సిద్దపడుతున్నారన్నదానికి బలమైన కారణాలే ఉన్నాయి. శాసనసభకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా వందకుపైగా సీట్లు గెలుచుకుంటామని కేసీఆర్ నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నాల్గేళ్లలో ఎనిమిది నెలలకోసారి నిర్వహించిన ఆరు సర్వేల్లోనూ రోజు రోజుకూ తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆదరణ పెరగడమే తప్ప తగ్గినట్టు ఏ సర్వేలోనూ కనిపించకపోవడమే ముందస్తు దిశగా ప్రభుత్వం సన్నద్ధం అవడానికి కారణంగా చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత జనాభా సుమారు 3 కోట్ల 50 లక్షలు. ఇందులో 2 కోట్ల 83 లక్షల 15 వేల మంది ఓటర్లు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నాల్గేళ్లలో ఓటర్లు ఎంత మంది ఉన్నారో అంతమందికీ, అన్ని కుటుంబాలకు ఏదో విధంగా లబ్ధి చేకూరేలా ప్రభుత్వ పథకాలు రూపుదిద్దుకున్నాయి. ఆసరా పెన్షన్ల ద్వారా 39 లక్షల 21 వేల మందికి, నెల నెలా లక్షా 25 వేల మంది ఒంటరి మహిళలు పెన్షన్లు అందుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, నిరుపేదలు 4 లక్షల మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సాయాన్ని అందుకున్నారు. కుటుంబంలో ప్రతి వ్యక్తికీ ఆరు కిలోల చొప్పున 85 లక్షల రేషన్‌కార్డుదారులు లబ్ధి పొందుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సన్నబియ్యం ద్వారా 44 లక్షల 61 వేల మంది ప్రయోజనం పొందుతున్నారు. రుణమాఫీ పథకం ద్వారా 35 లక్షల 29 వేల మంది రైతులు లబ్ధి పొందారు. రైతుబంధు పథకం ద్వారా 52 లక్షల మంది రైతులకు మేలు జరిగింది. రైతుబీమా పథకం ద్వారా 57 లక్షల మందికి భరోసా లభించింది. నాలుగు లక్షల మంది గొల్ల, కుర్మలకు, 3 లక్షల 70 వేల మంది మత్య్సకారులకు జీవనోపాధి లభించింది. 27 వేల మంది ఆశా వర్కర్లకు, 35 వేల మంది అంగన్‌వాడీ వర్కర్లకు, మసీదుల్లో ప్రార్థనలు చేయించే ఇమామ్, వౌజమ్‌లకు, హిందూ ఆలయాల్లో పూజారులకు ప్రభుత్వం వేతనాలు పెంచింది. తాజాగా 2లక్షల 13 వేల మంది పాడిరైతుల జీవనోపాధి కల్పించే మరో పథకాన్ని తీసుకొచ్చింది. నేత, గీత కార్మికులు, ఇతర కులవృత్తులు, సంచార జాతులు, మైనారిటీ వర్గాలకు సంబంధించి- వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందే కుటుంబాల సంఖ్య కూడా లక్షల్లోనే ఉంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ సంక్షేమ పథకాలపై 40 వేల కోట్లు ఖర్చు చేయడం లేదు. బంగారు తెలంగాణ లక్ష్యంగా కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసే దిశగా భారీ, మధ్యతరహా ప్రాజెక్టులను చేపట్టింది. నీటిపారుదల రంగంపై ఏటా 25 వేల కోట్ల చొప్పున ఖర్చు చేస్తూ త్వరితగతిన ప్రాజెక్టులను పూర్తి చేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నాలుగేళ్లలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఏదోరకంగా ప్రతి కుటుంబం, ప్రతి ఓటరూ లబ్ధి పొందడంతో తిరిగి టీఆర్‌ఎస్‌కే అధికారాన్ని అప్పగిస్తారన్న నమ్మకమే ముందస్తుకు పురిగొల్పిందని చెప్పవచ్చు. ‘లక్ష కిలో మీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు బయలుదేరినప్పుడు నా తొలి అడుగుకు లక్షల అడుగులు తోడయ్యాయి’ అని కేసీఆర్ తరచూ ప్రస్తావిస్తుంటారు. ఇదే మాదిరి తన అపార రాజకీయ అనుభవం, లక్ష్యసాధన, కార్యదక్షతపై ఉన్న నమ్మకమే ఆయన్ను ముందుస్తు దిశగా అడుగులు వేయిస్తోందని భావించాలి.

--వెల్జాల చంద్రశేఖర్