డైలీ సీరియల్

పచ్చబొట్టు -- 36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకరుపోయారని అందరూ వెళ్ళిపోతే ఇక ఈ లోకంలో మిగిలేదెవరు? పోనీ చంపటం మానేస్తే ఈ ప్రపంచంలో మనుషులకు నిలబడటానికయినా స్థలం ఉంటుందా ఒక్కసారి ఆలోచించు అంతరంగం ప్రబోధం.
ఆ నీటినే చూస్తోంది విద్య. ప్రశాంతంగా ఏ బాదరబందీ లేనట్లు కదలకుండా ఉన్నాయి. అలాఅనుకునే లోపే రోడ్డుమీద వెళ్ళేవాడు ఊసుబోక ఒక రాయి తీసి నీళ్ళలోకి విసిరాడు. అంతే అలల కలకలం. ఓ సుడిగుండంలా చిత్రం-
అది వాస్తవమే. ప్రశాంతంగా ఉన్న తమ కుటుంబంలో మృత్యువనే రాయివేసి భగవంతుడు తమ జీవితాలను అల్లకల్లోలంచేసి పారేసాడు’’ అనుకుంది విద్య.
‘‘విద్యా! విద్యా!’’ పిలుస్తున్నాడు వినీల్.
అయినా విద్య పట్టించుకోవటం లేదు. ఆమె లోకంలో ఆమె ఉంది.
ఇలా ఇద్దరూ ఉంటున్నారనే ‘నానమ్మ’ ఇంటిని ప్లాను చేయించి తీసుకువెళ్ళాడు. ఏ ఉపశమనమయినా టెంపరరీగానే పనిచేస్తోంది. శాశ్వతంగా ఆ బాధను తను ఎప్పటికీ పోగొట్టలేడేమో?
ఇక అలాంటి ఆలోచనలలో విద్యను ఎక్కువసేపు ఉంచకూడదని ‘‘విద్యా! విద్యా! అని భుజం తట్టాడు.
ఉలిక్కిపడి వినీల్ వైపు చూసింది. ఆ కళ్ళలో ఇది వరకు వెలుగులు లేవు.
కాంతి హీనంగా తయారయ్యాయి. ఈమధ్య ఆమె కంటి క్రింద నల్లగా మచ్చలు పడుతున్నాయి. అదే ఆమె ఆలోచనల ఉధృతిని సూచిస్తోంది.
ఇల్లు మారాక ఆమెలో మార్పు తప్పక వస్తుందని వినీల్ ఆశ.
‘‘నచ్చిందా విద్యా?’’ అన్నాడు.
‘‘ఆ ఇల్లు కాకుండా ఏ ఇల్లైనా ఫరవాలేదు.’’
‘‘అంటే బాగోలేదా?’’
‘‘అదేం లేదు వినీల్. బాగుంది. నాకు నచ్చింది. అన్నయ్యకు కూడా ఒకసారి చూపించి ఓకే చేసకుందాం.’’
‘‘మరి వెళదామా?’’
విద్యకు కాసేపు అక్కడే ఉండాలని ఉంది. రాజులనాటి స్తంభాలు. దర్బార్ లాంటి హాలు. పెద్దపెద్ద గదులు. వెళదామని అనుకొన్నదే మరొక్కసారి ఇల్లంతా కలియతిరిగి వచ్చింది.
‘‘విద్యా! రెండురోజులు ఆగితే ఈ ఇల్లు మీకే.’’
‘‘అంతదాకా ఎందుకు నేనిక్కడే ఉంటాను అన్నయ్యకి ఫోన్‌కొట్టి పిలిపిద్దాం. వాడు ఓ.కే,. అంటే ఓనర్‌కి అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోదాం. ఇప్పటినుంచే మనది అవుతుంది.’’
‘‘సరే! అలాగే కానివ్వు.’’
‘‘హలో!’’ అటునుంచీ అనే్వష్ గొంతు.
‘‘హలో అన్నయ్యా!’’
‘‘ఏంటిరా విద్యా?’’ ఎనీ ప్రాబ్లమ్.’’
‘‘అబ్బెబ్బే! అలాంటిదేం లేదు. నేనూ, వినీల్ ఒక ఇల్లు చూసాం - బాగుంది. నువ్వు కూడా చూస్తావని కాల్ చేసా!’’
‘‘మీ ఇద్దరికీ నచ్చితే ఓ.కే. చెప్పెయ్యండి. మళ్ళీ నేనెందుకు?’’ తప్పించుకోచూసాడు.
‘‘కుదరదు అన్నయ్యా! నువ్వూ చూసాకే!’’
‘‘సరే బయలుదేరతాను. అడ్రస్ చెప్పు.’’
వినీల్‌కిచ్చి చెప్పమంది.
‘‘వెంటనే వస్తానని’’ ఫోన్ పెట్టేశాడు.
అనే్వష్ విద్య ఒప్పుకోవటం లేదని వచ్చాడు. చూసాక అతనికీ బాగా నచ్చింది.
ఓనర్ ‘‘రామలింగం’’గారికి అడ్వాన్సు ఇచ్చారు. ‘‘రేపు మంచి రోజు బాబూ!’’ అన్నారాయన.
పెద్దవారు, మీరు చెప్పాక ఇక తిరుగేముంది. రేపే చేరిపోతాం అని చెప్పాడు.
రాత్రికి కడిగించి, తుడిపించి ఉంచుతానని చెప్పాక బయలుదేరారు.
స్టేషన్‌లో పని ఆపుకొని వచ్చానని అనే్వష్ అటు వెళ్లిపోయాడు.
వినీల్, విద్య ఇంటికి వచ్చారు.
ఈ ఇంటిలో అనుబంధం తీరిపోయిందంటే దిగులుగా ఉంది. అలాగని ఉండాలనీ అనిపించడంలేదు. ఈ ఇంటిని చూసినపుడల్లా అమ్మా, నాన్నను కోల్పోయిందిక్కడే అన్న ఫీలింగ్ ఎక్కువవవుతోంది.
నిజానికి ఇందులో ఇల్లు చేసిందేముంది?
బాధల్లో అన్నీ తప్పులే. అందరివీ తప్పుల్లాగే కనిపిస్తాయి.
ఎదుటివారంతా సంతోషంగా ఉన్నట్లు, తమంత దుఃఖం మరెవరికీ లేదనుకోవడం మామూలే. కానీ ఎవరి దుఃఖం వారికే. ఏ కష్టాలు లేని మనిషి ఇలలో ఉండడేమో?
వినీల్ తనే వెళ్లి ఇద్దరికీ టీ కలుపుకు వచ్చాడు.
‘‘విద్యా నువ్వే ఇలా ఉంటే ఇంక అనే్వష్ పరిస్థితి ఏమిటి?’’
‘‘నేను బయటపడుతున్నాను. వాడు బయటపడటంలేదు. అంతే తేడా’’
‘‘నువ్విలా దిగులుగా కూర్చుంటే లాభం లేదు. ఇల్లు మారటం అంటే మాటలా. ఎన్ని పాక్ చేసుకోవాలి?’’
అతని మాట పెదవి దాటనే లేదు. కాలింగ్ బెల్ మ్రోగింది.
‘‘లక్ష్మీ పేపర్స్’’ నుంచీ వచ్చాం. అనే్వష్‌గారు పంపారు.
‘‘సరే! లోపలికి రండి’’
కాసిని పాత గుడ్డలుంటే ఇవ్వండి అని అడిగారు.
విద్య లోపలికి వెళ్లి ఓ సంచి తెచ్చి ప్రక్కన పెట్టింది. అందులో అన్నీ పాత గుడ్డలే.
ముగ్గురే ముగ్గురు.. మూడు గంటల్లో మొత్తం పాకింగ్ చేసేసారు.
ఒకరు అట్టపెట్టె సిద్ధం చేస్తున్నారు. మరొకళ్ళు దాన్ని అలమారా దగ్గర పెట్టుకొని అందులోని సామానులన్నీ పెట్టెలలో సర్దేస్తున్నారు. గాజువి, ప్లాస్టిక్‌వి జాగ్రత్త కావాలనుకున్నవి పాత గుడ్డల్లో చుట్టిపెడుతున్నారు. మూడో అతను ప్లాస్టిక్ టేపు పెట్టెను ఊడకుండా పాక్ చేస్తున్నాడు. కళ్ళముందే ఏదో అద్భుతం జరుగుతున్నట్లుంది వినీల్‌కు.
ఇంట్లో ఎవరికి వాళ్ళు సర్దుకోవటం తెలుసు కానీ ఇలా దీనికి సపరేట్‌గా మనుషులు ఉంటారని, వాళ్ళే పాక్ చేసి, వాళ్ళే మళ్లీ దింపి కావాలంటే సర్దేసి కూడా వెళ్లిపోతారని తనకు తెలియదు. అంతా డబ్బు మహత్యం. ఈ సర్వీసుకు విడిగా ఛార్జీలు తీసుకుంటారు. అయితేనేం ఎంత శ్రమ తప్పుతుంది?
వినీల్ వాళ్ళెక్కడ పాక్ చేస్తుంటే అక్కడకు వెళ్లి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ముచ్చటేసింది. విద్యకు అంత బాధలోనూ అతన్ని అలా చూస్తుంటే.
మధ్యలో విద్య టీ పెడతానంటే వద్దని టీ త్రాగి రమ్మని వాళ్లకి డబ్బులిచ్చి పంపాడు. వాళ్ళు అరగంట తర్వాత వచ్చి మళ్లీ ప్రారంభించారు సర్దటం. అలా చకచకా సర్దేసి రేపు ప్రొద్దున వెహికల్ తీసుకొచ్చి షిప్ట్ చేస్తామని చెప్పి వెళ్లారు.
వాళ్ళు అటు వెళ్ళగానే ఇటు అనే్వష్ వచ్చాడు. వచ్చేప్పుడు హోటల్ నుంచి ఫుడ్ పాక్ చేయించుకొని వచ్చాడు.
ముగ్గురూ కలిసి తిన్నామనిపించారు. అసలాలా పెట్టెలతో ఇల్లంతా ఉంటే తినాలనిపించలేదు. అదీకాక ఎన్నో ఏళ్ళుగా ఉంటున్న ఆ ఇంటిని వదిలి వెళ్లిపోతున్నామన్న దిగులు.
వినీల్ అదే అనుకొన్నాడు. ఈమధ్య వచ్చిన తనకే ఇంత బాధగా ఉంటే మరి వాళ్ళకెంత ఉంటుందో?
ఏం చేస్తాం? ఒకరికి ఒకరు.. ఈ రాత్రికి వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరే తోడు.
‘‘అనే్వష్! వస్తాను! ప్రొద్దునే్న వచ్చేస్తాను, విద్యా! వెళ్తున్నాను’’
‘‘అలాగే!’’ అన్నట్లు తల ఊపారు.
అనే్వష్ వెళ్లి కాసేపు బాల్కనీలో కూర్చున్నాడు. తండ్రి ఎక్కువ సమయం అక్కడే గడిపేవారు. కుర్చీ వేసుకుని ఏ పేపరో చదువుకోవటం, లేదా అమ్మతో కబుర్లు చెప్పుకోవటం.
వాళ్ళిద్దరూ ఎంత బాగుండేవారో? అంత వయసు వచ్చినా ఒకర్ని ఒకరు ఒక్క మాట కూడా అనుకొనేవారు కాదు. ఇద్దరూ నవ్వుతూ, నవ్విస్తూ కాలం గడిపేవారు.

-సశేషం

-యలమర్తి అనూరాధ సెల్:9247260206