డైలీ సీరియల్

పచ్చబొట్టు-37

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ జంట ఎందరికో ఆదర్శప్రాయంగా ఉండేది. ఆ అనుబంధం ఎందరికో స్ఫూర్తి అనుకొనేవాళ్ళు.
ఇప్పుడు ఈ విషయం తెలిసిన వాళ్ళంతా అనేది ఒకటే మాట-
‘‘పోనీలే! ఇద్దరూ ఒకేసారి వెళ్లిపోయారు. ఆ అదృష్టం అందరికీ దక్కేది కాదు. ఈ వయసులో జంట వీడిన పక్షిలా బ్రతకటం కంటే దుర్భరం మరొకటి ఉండదు’.
తమకి మాత్రం ఒక్కరన్నా మిగలలేదే అనే వ్యధ తొలిచేస్తూ ఉంటుంది.
మళ్లీ చెల్లి ఒక్కటే ఉందని గుర్తువచ్చి లోపలికి వచ్చాడు.
ఇల్లంతా కలియతిరిగి వచ్చి అప్పుడే కుర్చీలో కూర్చుంది విద్య.
‘‘చెల్లీ!’’ దగ్గిరకు వచ్చాడు.
అతని చేతికి తల ఆనిస్తూ కళ్ళు మూసుకుంది. ఆమె కళ్ళ క్రింద సుడిగుండాలే! అవి ఎంతసేపో అక్కడ ఉండలేవు. కన్నీళ్ళ ప్రవాహమై బుగ్గ మైదానంలో ఇంకిపోవాల్సిందే.
‘‘ఎంత కష్టం వచ్చిందిరా అన్నయ్యా మనకు?’’ అంటూ అన్నయ్యను చుట్టేసింది.
‘‘ఏడవకురా!’’ అన్నాడు ఓదారుస్తూ.
‘‘ఇకనుంచీ ఏం జరిగినా మనకు ఆనందమేముంటుంది అమ్మా నాన్నలు లేకపోతే. వాళ్ళుంటే ఉండే సంతోషం వేరు కదరా!’’
‘‘అద్దె ఇళ్లవాళ్ళు పెట్టే బాధలు భరించలేక మనకంటూ ఒక ఇల్లు ఉండాలిరా అనేది అమ్మ. ఇపుడు మనం ఇల్లు కట్టుకోగలం కానీ అమ్మనీ, నాన్నని చూడటానికి తీసుకురాలేం కదా’’ మనసు పొరల్లోంచి తన్నుకొస్తున్నాయి జ్ఞాపకాలు..
‘‘తులసిమొక్క మరిచిపోకుండా పట్టుకెళ్లాలి. అమ్మ దానికి ప్రతిరోజూ పూజ చేస్తూ ఉండేది’’.
‘‘అలాగే కుండీలన్నీ పట్టుకెళ్దాం. ఏదీ వదలద్దు. అవన్నీ అమ్మా నాన్న పెంచిన మొక్కలు. అవి పూలు పూస్తే వాటి నవ్వుల్లో మనం వాళ్ళిద్దరినీ చూసుకోవచ్చు’’.
‘‘ఇక ఈ ఇంటిని ఫొటోలో చూసుకోవటమే. ఎవరు వస్తారో? ఎవరు ఉంటారో’’
‘‘మనం వెళ్లిపోతున్నపుడు ఎవరు వస్తేనేం?’’ అతని మాటల్లో అంతులేని నిర్లిప్తత.
‘‘ఆ ఇంట్లో వారి చూపు ఎటు త్రిప్పినా జ్ఞాపకాల దొంతరలే!
ఉత్తరాలు రాగానే గోడకు తగిలించిన ఫ్యాషన్ బ్యాగ్ సొరుగులో పెట్టేది అమ్మ. నాన్నగారు బయటకు వెళ్లి రాగానే అందులో ఏమైనా ఉన్నాయేమో చూసుకొనేవారు.
‘‘మీకు నాకంటే ఆ ఉత్తరాలే ఎక్కువ. రాగానే వాటినే చూసుకుంటారు’’ అనేది అమ్మ.
‘‘పోనీ అలాగే అనుకో. ఎక్కడెక్కడినుంచో ఆప్యాయతల కబుర్లు నందించే ఉత్తరం అంటే నాకు చిన్నప్పటినుంచీ ప్రాణం. ఫోనులు వచ్చినా నేను ఉత్తరాలకే ప్రాముఖ్యతనిస్తాను. ఇదయితే ఎన్నిసార్లయినా చదువుకోవచ్చు. ఇష్టమైతే దాచుకొని మరీ చదువుకోవచ్చు’’.
‘‘నాన్నా! మీకు ఉత్తరం రాయాలనుంది నాన్నా! ఎక్కడికి రాయను? మీ అడ్రసు ఏమిటి? అంటూ నిలువెత్తు మనిషి నీరుగారిపోయినట్లు నేలమీద కుప్పకూలిపోయాడు’.
విద్య ‘అన్నయ్యా!’ అంటూ కంగారుగా అతని చెంత చేరింది.
‘‘ఏమీ లేదురా! అమ్మా, నాన్న బాగా గుర్తొస్తున్నారు. అంతకన్నా ఏం లేదు’’
‘‘నాకూ అంతేరా’’ అంది విద్య.
ఒకరు బాధపడతారని మరొకరు లోలోపల దాచుకున్న దుఃఖం అంతా ఒక్కసారి పొంగి పొర్లింది. ఆనకట్ట లేని ప్రవాహమైంది.
ఒకరికొకరం ఓదార్చుకుంటూనే బాధపడుతున్నారు?
ఎంత బాధపడినా అమ్మా నాన్న రారుగా. అడిగినా ఎవరూ తెచ్చివ్వలేరుగా. ఎవరూ ఆ పని చెయ్యలేరు అని తెలిసినా చేస్తే ఎంత బాగుంటుంది? అనే ఆలోచనే!
మళ్లీ అమ్మా, నాన్న తమ ముందుంటే ఇల్లు ఎంత కళకళలాడిపోతుంది? ఇద్దరమున్నా ఇల్లంతా బోసిగా, ఎవరూ లేనట్లు ఉండటం దుర్భరంగా ఉంది. అసలు ఈ చనిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళతారు? ఈ శరీరంతోపాటూ ఈ అనుబంధాలను వదిలేసుకొని వెళ్లిపోతారా? మళ్లీ వాళ్లకి తమని చూడాలని అనిపించదా? వారి గురించి తాము బాధపడటమే తప్ప వాళ్ళకి ఏ బాధా ఉండదా? వెళ్లినవాళ్ళు ఒక్కరైనా... ఒక్కరైనా. మేమిలా ఉన్నామని ఎవరికీ చెప్పరేం? అంతా మాయ.
పుట్టడం మనకు తెలియదు. గిట్టడం అసలే తెలియదు.. మధ్యమం మాత్రం మనదని మురిసిపోతూ ఉంటాం. వేదాంత ధోరణిలోనే ఆ రాత్రి గడిచిపోయింది.
***
ఉషోదయం కంటే ముందే వినీల్ విద్యను చేరాడు. అందమైన ఉషస్సు చూసి ఎన్నాళ్ళయిందో? అమ్మ ఉన్నప్పుడు తెల్లవారు ఝామునే లేచి స్నానం చేసి, ఇల్లు ఊడ్చి దేముని ముందు దీపం వెలిగించేది. పసిడితో ప్రత్యేకంగా ముందు రోజే మొగ్గలు తెప్పించుకునేది. అవి గినె్నలో వేసి మూత పెడితే అప్పుడే పుట్టిన పసిపాపల్లా తెల్లారేటప్పటికి విచ్చుకునేవి. వాటితో పూజ చేసేది. మందిరం అంతా వెలుగుతో, పువ్వులతో కళకళలాడుతూ ఉండేది. ఆమె వెళ్లిన దగ్గిరనుంచీ దీపమె వెలిగించలేదు.
తులసికోట ఎంత అందాన్ని సంతరించుకొనేది. పసుపు రాసుకొని, కుంకుమ పెట్టుకొని, పూలతో కళకళలాడే కనె్నపిల్లలా తులసి తల్లి అమ్మ చేతుల్తో అలంకరింపబడేది. ఎప్పుడు చూసినా పసుపు కుంకుమలతో, మొక్క అంతా పూలతో ముచ్చటేసేది. పసిడి దానికి రోజూ గుర్తుపెట్టుకొని నీళ్ళు పోస్తోంది.
తను వచ్చి చాలా సేపయినా ‘విద్య’ చూడకపోవటంతో ఆమె ఆలోచనలు ఎటువెళ్ళాయో అతను గ్రహించాడు. అదేమీ తెలియనట్లు, అప్పుడే వచ్చినట్లుగా ‘‘విద్యా! స్నానాలు అయ్యాయా? బయలుదేరుదామా?’’ అడిగాడు వినీల్.
‘‘అన్నయ్య ఇంకా లేవలేదు. నేనూ స్నానం ఇంకా చెయ్యలేదు. పసిడి వెళ్లిపోతానంటే దానికివ్వాల్సినవన్నీ ఇస్తున్నాను. పాపం దానికి మా ఇల్లు దూరమయిపోతోంది. రాదేమో అనుకున్నాను. అయినా ముందు వచ్చి మాకు చేసేసి వెళ్లిపోతానంది. మళ్లీ అక్కడ ఎవర్ని పట్టుకోవాలో? దొరుకుతారో? దొరకరో? ఎలాంటివారో? ఇలా ఎన్ననుకొన్నానో! రక్షించింది.. వస్తాను అన్న ఒక్క మాటతో.’’
ఇదివరకు ఇవన్నీ అమ్మ చూసుకొనేది ఇపుడు నేనే చూసుకోవాలి అనే శే్లష వద్దన్నా ఆమె మాటల్లో వినిపిస్తోంది.
‘‘పెళ్లవనీ విద్యా! అమ్మనీ, నాన్నని మరపిస్తాను. నీకా ఊసు దరిదాపులలోకి రాకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను’’ మనసులో అనుకున్నాడు వినీల్.
‘‘సరే! పసిడి వస్తానందిగా. నోప్రాబ్లమ్. తొందరగా స్నానం చేసి వచ్చెయ్. అనే్వష్‌ని నేను లేపుతాను. వేడి వేడిగా టిఫిన్ తెచ్చేస్తాను. మీదే ఆలస్యం’’ అని తొందరచేసాడు.
‘‘వినీల్! అన్నయ్య లేస్తానంటే లేపు. వద్దంటే పడుకోనీ. రాత్రంతా వాడు నిద్రలేదు’’.
‘‘మరి నువ్వో?’’
‘‘‘నేనూ అంతే!’’
‘‘అయ్యో! అర్థంలేని సెంటిమెంట్స్ పట్టుకొని వ్రేలాడి వీళ్ళిద్దరినీ వదిలిపెట్టానా? ఉండిపోయినా బాగుండేది’’.
‘‘అనే్వష్! అనే్వష్! లేస్తావా?’’
వినీల్ పిలుపుతో కళ్ళు తెరిచాడు అనే్వష్. ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయా కళ్ళు.
ఒక్క నిమిషం ఆ కళ్ళు చూస్తే భయం వేసింది వినీల్‌కి.
‘‘కాసేపు పడుకో అనే్వష్. తరువాత లేపుతాలే’’ అన్నాడు.
వాటంతటవే కళ్ళు మూసుకుపోయాయి ఎవరో చెప్పినట్లే. అనే్వష్‌కిదంతా ఏమీ తెలియదని లేచాక కానీ తెలియలేదు. తనంతట తనకే మెలకువ వచ్చి లేచాడు. అప్పటికే విద్య రెడీ అయిపోయింది. -సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206