మెయిన్ ఫీచర్

చీకట్లను చీల్చేసి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకలి వారి చుట్టం..
కష్టాల కడగండ్లు వారి స్నేహితులు..
కన్నీటి చారికలే వారి అస్త్రాలు..
ఎన్నో ప్రతికూల పరిస్థితులు..
అయినా వెరవలేదు..
వెనుకంజ వేయలేదు..
చీకట్లను చీల్చుకుంటూ వెలుగు
మా సొంతం అంటూ
నింగిలోకి దూసుకుపోయారు.
పరిస్థితులు వెనక్కి లాగుతున్నా..
లక్ష్యసాధనలో నిమగ్నమై పతకాలను
ఒడిసిపట్టారు ఈ క్రీడాకారిణులు..
ఇంతటి స్ఫూర్తిమంతమైన వారి
నేపథ్యాలను ఒకసారి పరికిస్తే..

ఆసియాగేమ్స్‌లో హెప్ట్థ్లాన్‌లో మొదటిసారి భారత్‌కు స్వర్ణం లభించిన సంగతి తెలిసిందే.. ఇది సాధించిన బెంగాల్ అమ్మాయి స్వప్న బర్మన్. స్వప్న తండ్రి రిక్షా కార్మికుడు. తల్లి తేయాకు తోటలో పనిచేసే కూలి. ఇద్దరూ రెక్కల కష్టం చేసినా ఆరుగురు పిల్లలున్న ఆ ఇల్లు గడవడం కష్టం. స్వప్న తండ్రికి 2013లో స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుంచి అతను మంచంలోనే ఉన్నాడు. స్వప్న తల్లి సంపాదనతోనే ఇల్లు గడుస్తుంది. ఇలాంటి ఇంట్లో పుట్టిన స్వప్న ఆటల్లోకి రావడం, అంతర్జాతీయ స్థాయికి చేరడం ఆషామాషీ విషయం కాదు. కానీ సంకల్పం ఉంటే సాధ్యం కానిదేదీ లేదని చాటిచెప్పింది స్వప్న. వివరాల్లోకి వెళితే..
స్వప్నది పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురిలోని పేద గిరిజన కుటుంబం. మట్టిగోడలతో కట్టిన చిన్న పూరింట్లో అందరూ కలిసి నివసించేవారు. స్వప్న స్కూలుకు వెళుతూ అప్పుడప్పుడూ తల్లితో కలిసి పనికి వెళ్లేది. చిన్నప్పుడు స్వప్న ఫుట్‌బాల్ బాగా ఆడేది. ఆమె దూకుడు చూసిన పాఠశాల కోచ్ ఆమెను అథ్లెటిక్స్‌లోకి తీసుకొచ్చాడు. కానీ ఆమెకు బూట్లు కొనుక్కునే స్థోమత లేదు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఆటలు ఆడేది. ప్రతిరోజూ ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరం ఉండే స్టేడియానికి నడుచుకుంటూ వెళ్లేది. పాఠశాల స్థాయిలోనే అనేక పందాల్లో బహుమతులు గెలిచేది. స్వప్న మొదటిసారి పోటీలో నెగ్గినప్పుడు ఆమెకు రూ.500 వచ్చాయి. వాటిని ఆమె ఇంటికోసం ఖర్చు పెట్టిందట. అలా ఆమెకు కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆటలే మార్గంలా తోచాయట. అప్పటి నుంచి ఆమె ఆటను విడిచిపెట్టలేదు. ఆమె పెరిగే కొద్దీ కష్టాలు కూడా పెరిగాయట.. కానీ ఆమె ఆటని వదల్లేదు. ఎందుకంటే ఆ ఆటే కుటుంబ పరిస్థితిని మారుస్తుందని బలంగా నమ్మింది ఆమె. స్వప్నకు సరైన పౌష్టికాహారం అందకున్నా, పోటీలకు వెళ్లడం సమస్యగా మారినా వెనుకంజ వేయలేదు. స్థానిక కోచ్‌ల సాయంతోనే అథ్లెటిక్స్ పోటీల్లో నైపుణ్యం సాధించింది. అలా హెప్ట్థ్లాన్‌ను కెరీర్‌గా ఎంచుకుంది.
ఆరు వేళ్లు
స్వప్న కాళ్లకు మొత్తం పనె్నండు వేళ్లుంటాయి. కాళ్లకు పనె్నండు వేళ్లున్నంత మాత్రాన జీవితంలో కష్టాలు రావడం ఉండదు. కానీ ఒక క్రీడాకారుడు ఆరువేళ్లతో పరిగెత్తడం అంటే మాత్రం అది అంత సులభమైన విషయం కాదు. ఆరు వేళ్లుంటే అదృష్టవంతులని చాలామంది చెబుతుంటారు. ఆ అదృష్టంతోటే ఆమెకు స్వర్ణం రాలేదు. స్వర్ణం సాధించడం వెనుక ఎన్నో ఏళ్ల కృషి, అకుంఠిత దీక్ష ఉన్నాయి. కాళ్లకు కానీ, చేతులకు కానీ అదనపు వేళ్లు ఉండటం అనేది వ్యాధి కాదు. దీన్ని సైన్సు పరిభాషలో 3పాలిడక్టిలీ2 అంటారు. ఎవరికైనా పాలిడక్టిలీ పుట్టుకతోనే వస్తుంది. ఇది ఉండటం వల్ల రోజువారీ పనులు చేసుకోవడంలో పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇది మ్యుటేషన్ వల్ల జరుగుతుంది. అంటే పుట్టుక సమయంలో ఏదైనా జన్యు మార్పిడికి గురవడం వల్ల అదనపు వేళ్లు ఏర్పడతాయి. పాలిడక్టిలీలో చాలా రకాలు ఉంటాయి. చేతులు లేదా కాళ్లకు కేవలం అదనపు సాఫ్ట్ టిష్యూ ఉండడం వల్ల కూడా పుడుతున్నప్పుడు ఐదుకు బదులు ఆరు వేళ్లు కనిపిస్తాయి. అలా అదనపు టిష్యూ కనిపించినప్పుడు బిడ్డపుట్టగానే డాక్టర్ల పర్యవేక్షణలో దారం కట్టి దాన్ని తీసివేస్తారు. పాలీడక్టిలీలో రెండో రకం.. చేతులు, కాళ్లలో ఐదువేళ్లతో పాటు ఎముక లేకుండా కొంత మాంసభాగం బయటకు వచ్చి ఉంటుంది. ఇది చూడటానికి వేలులాగే కనిపిస్తుంది. ఇలాంటివాటికి సర్జరీ తప్ప వేరే చికిత్స లేదు. మూడోది చాలా క్లిష్టమైనది. ఇందులో ఐదు వేళ్ల తర్వాత ఆరో వేలు కూడా వస్తుంది. దీనిలో టిష్యూతోపాటు ఎముక కూడా ఉంటుంది. ఇలాంటి కేసుల్లో వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. సాధారణంగా ఇలాంటి సర్జరీ కోసం ఎముకల వైద్యుల దగ్గరకు వెళ్లాల్సి వసుత్ది. స్వప్న బర్మన్ రెండు పాదాలకు ఆరేసి వేళ్లుంటాయి. ఆమెకు పాలీడక్టలీ మూడో రకం సమస్య ఉంది. అందులో ఆరో వేలులో ఎముక కూడా ఉంటుంది. ఇప్పటివరకూ ఆమె వాటిని తీయించుకోలేదు. డాక్టర్లు చెబుతున్న దాని ప్రకారం ఆరువేళ్లతో పరిగెత్తడం కష్టం కాదు కానీ దానికోసం ఆమె ప్రత్యేకమైన బూట్లు ధరించాల్సి ఉంటుంది. స్వప్న ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దానితో డిజైనర్ బూట్లు కొనుక్కోలేని పరిస్థితి. అందుకే స్వప్న బూట్ల గురించి ఆలోచించలేదు. బూట్లు లేకుండా ఒట్టి కాళ్లతోనే పరిగెత్తేది. సరైన బూట్లు దొరక్కపోవడమే కాదు, బూట్లు లేవని ట్రైనింగ్ నుంచీ, గేమ్ నుంచీ ఆమెను చాలాసార్లు ఎంపిక చేయకుండా పక్కన పెట్టారు. అయినా స్వప్న వెరవలేదు. మామూలు షూ తొడుక్కుని పరిగెత్తేది. విపరీతమైన నొప్పి కలిగేది. నొప్పి ఉంటేనే గెలవాలనే పట్టుదల ఎక్కువ అవుతుంది అంటుంది స్వప్న. ఈ బాధలేవీ స్వప్న విజయాన్ని ఆపలేకపోయాయి. గత ఏడాది ఆసియా అథ్లెటిక్స్‌లో స్వర్ణాన్ని సాధించింది. దానితో ఆమెలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఇప్పుడు జకార్తాలో కూడా పతకం గెలవకుండా ఇంటికి రానని చెప్పిందట. అలా జకార్తాలో అత్యుత్తమ ప్రదర్శన చేసి స్వర్ణాన్ని గెలిచి స్వర్ణంతోనే ఇంటికి వెళుతోంది స్వప్న.

ఆమె పుట్టుకనే అనుమానించారు.. అవమానించారు.. జంకలేదు.. వెనుకంజ వేయలేదు.. సమస్యలకు ఎదురీదింది.. అత్యున్నత క్రీడా న్యాయస్థానంలో గెలిచింది.. ఏషియాలోనే అత్యంత వేగవంతమైన రెండో క్రీడాకారిణిగా నిలిచింది. ఆమే ద్యుతిచంద్. వివరాల్లోకి వెళితే..
ద్యుతిది ఒడిశాలోని చాకోగోపాల్‌పూర్ అనే చిన్న గ్రామం. అక్కడ రోడ్లు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం.. వంటి కనీస వసతులు కూడా లేవు. తల్లిదండ్రుల జీవనాధారం నేతపని. ద్యుతితో కలిసి ఐదుగురు సంతానం. నలుగురు అమ్మాయిలు, ఒకబ్బాయి. కడుపునిండా తిండి కూడా లేని పరిస్థితి. ఆ ఊర్లోని ప్రాథమిక పాఠశాలలోనే చదువుకునేది ద్యుతి. అక్కడ ఆటలపోటీలు పెట్టేవారు. గెలిచినవారికి పలక, బలపం, పెన్ను, నోట్ పుస్తకాలు ఇచ్చేవారు. వాటికోసం ద్యుతి కూడా పోటీల్లో పాల్గొనేది. వాటిని సంపాదించుకునేది. చిన్నప్పటి నుంచి ద్యుతికి పరుగుపందెం అంటే చాలా ఇష్టం. అందుకే చిన్నప్పుడు ఆటల్లో ఎప్పుడూ పరుగునే ఎంచుకునేది.
ద్యుతి సాధన చూశాక పటియాలా శిక్షణ శిబిరం కోచ్ రమేష్ ఆమెను ఎలాగైనా అంతర్జాతీయ క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలనుకున్నాడు. అలా ఆమె జీవితం మలుపు తిరిగింది. కానీ ఆ గ్రామంలో ఎవరికీ క్రీడలు, పతకాల గురించి తెలియదు. దాంతో ఆ గ్రామం వారు ద్యుతి తల్లిదండ్రుల్ని దెప్పి పొడిచేవారు. ఆడపిల్లల్ని చాలా తప్పుగా పెంచుతున్నారని నిందించేవారు. అయినా ద్యుతి తల్లిదండ్రులు వాటిని పట్టించుకోలేదు. అందుకని ద్యుతి తెల్లవారుజామున మూడుగంటలకి లేచి చీకట్లో పరిగెత్తేది. వెలుతురు రాకముందే ఇంటికి చేరుకునేది. ఇది చూసే కోచ్ రమేష్ ఆమె దిశను మార్చాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ద్యుతితో ప్రాక్టీస్ మొదలుపెట్టించాడు. అలా రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపుతెచ్చుకోవడం మొదలుపెట్టింది ద్యుతి. అప్పటికి కూడా ఆమెకు ట్రాక్‌పాంట్లు, షూలు కొనే స్థోమత లేక ఒడిశా ప్రభుత్వాన్ని ఎన్నో అభ్యర్థించింది ద్యుతి. అలా పటియాలా శిక్షణకు ఎంపికైన కొన్నాళ్లకి రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా ఉద్యోగం వచ్చింది ద్యుతికి. దాంతో ఆమెలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.
ఆమె జీవితంలో వెలుగుకంటే చీకటే ఎక్కువ. అయినా సరే ప్రతి విషయంలో తనను తాను మార్చుకుంది. మానసికంగా దృఢపడింది. వాక్చాతుర్యం, హుందాగా కనిపించడం, ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకెళ్లడం, ఓటమి ఎదురైనప్పుడు బాధపడకుండా గోడకు కొట్టిన బంతిలా మళ్లీ యథాస్థానానికి రావడం వంటి లక్షణాలన్నీ ద్యుతిని అత్యున్నత స్థానంలో నిలబెడుతున్నాయి. అందుకే తాజాగా ఏషియన్ గేమ్స్‌లో 100 మీటర్ల పరుగులో పాల్గొని మనదేశానికి రెండు రజతాలను సాధించింది. ఏషియాలోనే వేగవంతమైన క్రీడాకారిణిగా రెండో స్థానంలో నిలిచింది.

-ఎస్.ఎన్.ఉమామహేశ్వరి