డైలీ సీరియల్

వేదాలలో వైజ్ఞానిక విశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిలికాన్ అణువు అంటే ఏమిటి? అని ప్రశ్న. వైజ్ఞానికుడు వచ్చి ఆ రాతిని నూరి ఒక అణువును చూపాడు. ‘‘ఇది అణువు. దీని మధ్యలో ఒక న్యూట్రాన్ వుంటుంది. దాని చుట్టూతా కొన్ని ఎలక్ట్రానులు పరిభ్రమిస్తూ వుంటాయి’’ అని చెప్పాడు. ఎలక్ట్రాన్ అంటే ఏమిటి? దాని స్థితి ఏమిటి? అని మళ్ళీ ప్రశ్న. ఇక్కడే హైసన్‌బర్గ్ ప్రవేశించాడు. ఈ ఎలక్ట్రానులు ఒక విధంగా వుండటం లేదు. వాటి యొక్క వెలాసిటీ (వేగం) గానీ వాటి యొక్క బరువుగానీ ఒక్కొక్కసారి రెండు వేల రెట్లు మారిపోతూ వున్నాయి. మరి ఈ ఎలక్ట్రానును పరిశీలించి నిర్ణయించేది ఎలా? ప్రశ్న దగ్గరే యిందాక మనం చర్చించుకొన్న అనిశ్చితవాద సిద్ధాంతం ఆవిర్భవించి పర్యవసానంగా ఎలక్ట్రాను యొక్క స్వరూప స్వభావాలను నిశ్చయాత్మకంగా తెలుసుకోవటం ఎవరికీ సాధ్యం కాదని మనకు బోధిస్తోంది.
ఈ నేపథ్యంలో, పరాశక్తి నిత్యస్పందన శీలమని, దాని యొక్క రూపాలు అనంతమని దానిని ఎవరూ నిర్వచించి తెలుసుకోజాలరని పురాణాలు చేసిన వర్ణన వైజ్ఞానిక వర్ణన కాదని ఎలా అనగలం మనం?
పై చెప్పిన సిద్ధాంతం లోంచి, మరొక ఉప సిద్ధాంతం కూడా నిరూపణ కాగలదు.
ఒక అణుఖండాన్ని మనం నిర్వచించాలంటే మనకు దాని వేగమూ, దాని స్థితీ రెండూ తెలియాలి. హైసన్‌బర్గ్ ఆవిష్కరణవల్లఒక అణుఖండము యొక్క స్థితిని (చోటులో దాని స్థానాన్ని) బిగించినట్లైతే దాని వేగాన్ని నిర్ణయించడం సాధ్యంకాదు. వేగాన్ని ఖాయం చేసినట్లైతే దాని స్థితిని నిర్ణయించడం సంభవం కాదు. పర్యవసానంగా ఏ అణుఖండాన్ని గానీ నిర్వచించడము సాధ్యముకాదు. కనుక అది మనకు తెలియదని అంగీకరించక తప్పదు. అణుఖండాలు తెలియనివైతే అణువులు కూడా తెలియనివే అవుతాయి. అణువులు తెలియనివైతే మనకు ఘన పదార్థాలన్నీ తెలియనివే అవుతాయి. ఈ విధంగా విజ్ఞానవాదుల ఆత్మవిశ్వాసం- పదార్థమంటే ఏమిటో మాకు తెలుసునన్న ఆత్మవిశ్వాసం- పటాపంచలౌతోంది.
సృష్టిలో వేగంలేని అణుఖండం లేదు. వేగం తగ్గుతున్నకొద్దీ దాని స్థితి పెరుగుతుంది. ఈ తర్కాన్ని కొనసాగించి అణుఖండము యొక్క వేగం సన్న అయిందని ఊహించండి. అప్పుడు ఆ అణుఖండము యొక్క స్థితి అనంతం కావాలి. కావాలి అంటే ఆ అణుఖండం సర్వవ్యాపి అవుతుందన్నమాట.
మన వేదాంతం, మనస్సు కూడా పదార్థమే అంటోంది. అయితే యిది బహుసూక్ష్మతరమైన పదార్థం. మనస్సు సంపూర్ణంగా ప్రశాంతమైతే అది అనంతవౌతుంది. అన్నిటా వ్యాపిస్తుంది. అందుకనే ఉపనిషత్తులు ఆత్మతత్త్వాన్ని గురించి ప్రసంగిస్తూ ‘‘శయానో యాతి సర్వతః’’ అన్నాయి. అది ఒకేచోట వుంటూ అన్నిచోట్ల ప్రయాణిస్తుంది అని భావం. ఈ ఉపనిషత్ వాక్యం, పై చెప్పిన ఉపసిద్ధాంతాన్ని బలపరుస్తోంది కదూ!
మనస్సు భౌతిక విజ్ఞాన శాస్త్రాలలోకి ప్రవేశించింది:
మీరీ కాగితం చదువుతున్నారు. కనుక ఈ కాగితం మీకంటే పూర్తిగా భిన్నమని గత శతాబ్దపు భౌతిక విజ్ఞాన దృష్టి. కాని అనిశ్చితవాద సిద్ధాంతం మనకు క్రొత్త వెలుగు చూపుతోంది. ఈ కాగితంలో అణువులు, అణుఖండాలు వున్నాయి. వీటిని మీరు గమనిస్తున్నారు. మీ గమనింపుతో అణుఖండాలలో కొన్ని మార్పులు వస్తూ వున్నాయి. మీ గమనింపంటే ఏమిటి? అది మనస్సు చేసే పని. అంటే మీ మనస్సు ఈ కాగితంలోని అణుఖండాలతో సరాసరి సంబంధం పెట్టుకొని వున్నదన్నమాట. అంటే ఈ అణుఖండాల చర్యలను గమినించే వైజ్ఞానికుడు తన మనస్సు ప్రభావంతో ముడిపడి వున్న అణుఖండాల స్వభావానే్న పరిశీలిస్తున్నాడు తప్పితే, స్వచ్ఛమైన- తన మనస్సుయొక్క స్పర్శలేని అణుఖండాలను అతడు పరిశీలించడం లేదు. ఆ విధంగా భౌతికశాస్త్రంలోకి అనివార్యంగా మానవ చేతన ప్రవేశిస్తోంది. అందుకనే ‘నోబుల్’ బహుమతి గ్రహీత అయిన భౌతిక విజ్ఞాని యూజీన్ వింగర్ ‘‘చేతన యొక్క ప్రత్యక్ష ముద్ర లేకుండ అణుఖండాల స్వభావాలను నిర్వచించడం సాధ్యంకాదు’’ అన్నడు.
ఒక సందేహము:
ఒక సుదీర్ఘ చర్చ చూసేసరికి- ‘‘ఒక మనిషి వంద మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటున్నాడనుకోండి. మీరు చెప్పిన అనిశ్చితవాద సిద్ధాంతం ప్రకారం అతని వేగాన్ని కాని స్థితిని కాని నిశ్చయించడం సాధ్యంకాదని మీ వుద్దేశ్యమా’’ అని ఒక సందేహం కలుగవచ్చు.
ఈ సందేహంలో మనమొక ముఖ్యమైన విషయాన్ని మరచిపోతున్నాం. మనకు యింతవరకు చేసిన చర్చ అంతా సూక్ష్మాతి సూక్ష్మమైన అణుఖండాల చలనం గురించి. మనం వంద మీటర్ల పరుగుపందాన్ని చూసేటప్పుడు అణుచలనాలను కొలిచే కొలతలతో రుూ వేగాన్ని కొలవం. ఒక నిర్దిష్టమైన క్షణంలో పరుగెత్తే వ్యక్తిలోగల అణువులలో మనం చెప్పుకున్న చర్చంతా సరిగా సరిపోతుంది. కానీ స్థూలంగా పరుగు వేగం లెక్కించేటప్పుడు మన స్థూలమైన కొలతకు రుూ సూక్ష్మమైన కొలతలు అన్వయించవు. స్థూలమైన కొలతలు మాత్రం మనం సరిగ్గానే కొలుస్తూనే వున్నాం. ఎటొచ్చీ సూక్ష్మమైనవే మనకు చర్చనీయ అంశాలు.
అలాగే అణుఖండాల స్థితి నిశ్చయించి చెప్పలేమని చెప్పుకున్నాం. ఇది యింట్లో వుండే బీరువాలకు, పెట్టెలకు వర్తించదు. మనం ఏ పెట్టె ఏ బీరువాలో పెట్టితే అది అక్కడే వుంటుంది. ఎక్కడ వుంటుందో నిశ్చయంగా చెప్పవచ్చు. ఇంకావుంది...

‘ఎమెస్కో’ ప్రచురించిన ‘వేదాలలో వైజ్ఞానిక విశేషాలు’ నుంచి స్వీకృతం, పుస్తకం లభించు స్థలం:
ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 1-2-7, బానూకాలనీ, గగన్‌మహల్ రోడ్, దోమలగూడ, హైదరాబాద్- 500 029. తెలంగాణ.

ఎమెస్కో బుక్స్ ప్రై.లి. 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ - 520 004
. ఆం.ప్ర. 0866 - 2436643

కుప్పా వేంకట కృష్ణమూర్తి