డైలీ సీరియల్

పచ్చబొట్టు-38

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘వచ్చేస్తున్నానురా!’’ అంటూ గబగబా వెళ్లి తెముల్చుకొని వచ్చాడు.
టిఫిన్లు చేసేటప్పటికి ‘పేకర్స్’ వాళ్ళు వచ్చి సామానులన్నీ లారీలో పెట్టేసారు. ఓనర్‌ని పిలిచి ఇల్లు అప్పగించారు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ అమ్మా నాన్నను చూసుకుంటున్నట్లే ఇల్లును చూసుకున్నారు. మనసులోనే ఆ ఇంటికి వీడ్కోలు పలికారు.
ముందు వారి కారు, వెనకాల లారీ ఒకదాని వెంట ఒకటి వెళుతున్నాయి వెలుగు నీడల్లా.
అనుకున్న సమయానికి విద్య పాలు పొంగించింది. పరమాన్నం చేసి దేమునికి నైవేద్యం పెట్టింది. లారీలో సామానులన్నీ వినీల్ దింపిస్తుంటే అనే్వష్, విద్య ఏది ఎక్కడ పెట్టాలో చెప్పి పెట్టించుకుంటున్నారు. రెండు గంటలలో అన్నీ సర్దేసి వాళ్ళకు కావలసిన డబ్బు తీసుకొని వెళ్లిపోయారు.
వాళ్ళు వెళ్లిపోయాక ప్రసాదం తీసుకున్నారు.
‘‘ఇప్పుడు నేనో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను’’ అన్నాడు వినీల్.
‘‘ఏమిటి?’’ ఒకేసారి అడిగారు ఇద్దరూ.
‘‘నిన్నటితో నా కారుకు కట్టాల్సిన డబ్బు కట్టేసాను. ఇపుడు నేను ఓనరుని. నా కారు నా సొంతం’’
‘నా’ కాదు మన సొంతం అన్నారు అనే్వష్, విద్య.
‘‘ఆహా! కొత్త ఇంట్లో కొత్త వార్త. అందరికీ ఆనందంగా అనిపించింది’’.
ఇంతలో నేనేం తక్కువా అని అనే్వష్ జేబులో సెల్ రింగయింది, ఏదో చెబుతానన్నట్లు
‘హలో!’ అంటూ మాట్లాడి పెట్టేసాడు.
‘‘నా తరఫున మరో శుభవార్త. పచ్చబొట్టు విషయంలో స్పెషల్ ఇనె్వస్టిగేటివ్ ఆఫీసర్‌గా నన్ను నియమించారు’’.
అన్నీ మంచి శకునములే.. పాట అందుకున్నాడు వినీల్.
ఈ శుభ సందర్భంలో విద్య కూడా ఏదయినా శుభవార్త చెబితే ఇంకా బాగుంటుందేమో?
ఒక్క నిముషం ఆలోచించి ‘‘పచ్చబొట్టును మీ ఇద్దరూ పట్టుకున్నాక ఆమెతో అన్నయ్యకి పెళ్లి చేసేస్తాను’’.
‘‘పచ్చబొట్టా! కనిపించని ఆమెకంటే మన కళ్ళముందున్న తృప్తి అయితే నాకు బాగుంటుంది’’ అనేసాడు వినీల్ అనాలోచితంగా.
విస్తుపోయారు అన్నాచెల్లెళ్ళు.
వాళ్ళనలా చూడగానే తను చేసిన తప్పేమిటో అర్థమయింది వినీల్‌కి.
‘‘సారీ! అనే్వష్! సరదాగా అన్నాను. అసలు చేసుకునేవాడివి నువ్వు. విద్య పచ్చబొట్టు అన్నా, నేను తృప్తి అన్నా నీ ఇష్టానికేగా ప్రాముఖ్యత. ఈ అమ్మాయి అని ఎవరిని చూపెట్టినా మేమిద్దరం ఓకె.. అంతేనా విద్యా?’’ అన్నాడు ఆమె వైపు తిరుగుతూ.
‘‘అంతే! అంతే!’’ అన్నట్లు తలూపింది విద్య.
అనుకోకుండా జరిగినా తన మనసులో భావాలకు అద్దంపట్టినట్లు జరిగిందక్కడ సంఘటన అనుకొన్నారు అనే్వష్, విద్య కూడా.
అదేమీ తెలియని వినీల్ మాత్రం నేను బాగా కవర్ చేశాను. అనే్వష్‌కి తృప్తి అంటే ఆ ఉద్దేశం ఉందనుకున్నాడు. విద్య ఏమిటి పచ్చబొట్టు అంటుంది. పచ్చబొట్టు లాంటి భావాలున్నవాళ్ళు అసలు పెళ్లి చేసుకుంటారా?
‘‘ఏం ఎందుకు చేసుకోరు?’’ అంతరంగం ఎదురుతిరిగింది.
‘‘పచ్చబొట్టు విషయంలో తనకు బాధ్యత మరింత పెరిగిందన్నమాట’’ మనసులోనే అనుకున్నాడు అనే్వష్.
ఇక్కడ అనే్వష్ క్రొత్తగా ప్రారంభగీతం ప్రారంభిస్తుంటే అక్కడ పచ్చబొట్టు తన చరమగీతానికి సంసిద్ధురాలవుతోంది.
ఆ రాత్రి నిద్రపోబోతుంటే టేబుల్‌మీద గులాబీ రంగు కవర్ కనిపించింది. ఇంతవరకూ తను చూడనే లేదే? ఒక్క ఉదుటున దుప్పటి తోసేసి వెళ్లి దాన్ని అందుకున్నాడు. ఆత్రంగా చదవసాగాడు.
హాయ్! గయ్!
కంగ్రాట్స్! నీ పని తొందరగా కానిచ్చుకో. లేకపోతే నేను పారిపోయే అవకాశాలు ఎక్కువున్నాయి. ఇపుడు తమరు స్పెషల్ ఇనె్వస్టిగేటివ్ ఆఫీసరు కదా! అరె అప్పుడే నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? అదంతేలే!
ఏమిటి? ఎదురుగా కనిపించు చూస్తా అంటావా? కళ్ళముందు నేనున్నా కనిపెట్టలేకపోయావు. ఇంక ననే్నం పట్టుకుంటావ్?
ఎక్కడా అని ఆలోచించి కాలాన్ని వృధా చెయ్యకు. నేనే చెప్పేస్తున్నానులే! సోది చెబుతానంటే వద్దన్నావుగా. లేదంటే పచ్చబొట్టు నీదే అని ఎంచక్కా చెప్పేదాన్నిగా.
షాకయ్యావా?
మళ్లీ తేరుకున్నాక కలుద్దాం!
నీ
పచ్చబొట్టు
నోట్: నీ ఉత్తరం నాకు చేరింది.
సోదమ్మాయి పచ్చబొట్టా? ఆశ్చర్యపోయాడు అనే్వష్. ఆ మాటతో నిద్ర గిద్ర ఎగిరిపోయింది.
సాయి స్టూడియోకి ఫోన్ చేసి ఆ రోజు సినిమా హాలు దగ్గర వీడియో తీసినవారిని ఆ సీడీతో వచ్చేట్లు చెయ్యమని, వెరీ అర్జెంట్ అని చెప్పాడు.
గంటలో సీడీ రానే వచ్చింది. సీడీ ప్లేయర్‌లో పెట్టి జాగ్రత్తగా గమనించసాగాడు. వీడియోలో సోదమ్మాయి ఉంది కానీ అది వెనకవైపునే చూపెడుతోంది. ఒక్కచోటా కూడా ముందువైపు ముఖాన్ని కనబడకుండా జాగ్రత్తపడింది. ఆ వెనుకవైపు కూడా ఒంటినిండా చీర, వంగిన నడుము తప్ప ఇంకేమీ లేదు. అందుకే అంత ధైర్యంగా ఉత్తరంలో చెప్పింది.
సోదమ్మాయి ముఖం గుర్తుతెచ్చుకుందామని ప్రయత్నించాడు. ముఖమంతా వ్రేలాడుతున్న వెంట్రుకలు, పెద్ద రూపాయి బిళ్ళంత బొట్టు, వాటిమధ్య రహస్యంగా దాక్కున్న కళ్ళు. అసలు ఏదీ మనసులోకి ఎక్కలేదు. ఎంతసేపూ ఆ వయసులో ఆమె పనిచేసుకుంటోందనే జాలే!
అరవై ఏండ్లు దాటిన వారు శ్రమపడకుండా ఎవరైనా పెడితే తినేలా ఉండాలని తను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు. ఆ దృష్టిలోనే ఉండిపోయాడు. ఆమె పచ్చబొట్టు అని ఎలా ఊహిస్తాడు?
ఫోన్ ద్వారా పట్టుకుందామన్నా రెండు నిముషాలలో పెట్టేస్తోంది. తను అది తెలుసుకునేలోపు మాయమయిపోతోంది. అదీ ఒక్కసారే ఆ ఛాన్స్ కూడా. మళ్లీ చెయ్యలేదు.
ఆ రోజు మాత్రం తను ఊరుకున్నాడా? ఆ ఫోన్ ఎక్కడినుంచీ వచ్చిందో కనిపెట్టాడు. ఆ ఊరు పుత్తూరు. ఒక యస్‌టిడి బూత్ దగ్గిరున్న డబ్బా ఫోన్ నుంచీ కాల్‌చేసింది. వెంటనే తను పుత్తూరు ఎస్‌ఐని రిక్వెస్ట్ చేసి పంపాడు విషయం కనుక్కోమని. అప్పుడా బూత్ ఓనర్ డబ్బా ఫోన్లో ఎక్కడికయినా చేసుకోవచ్చు అని రూల్ వచ్చిన దగ్గిరనుంచీ ప్రతివాళ్ళూ రూపాయి పుచ్చుకొని డబ్బా ఫోన్లకే వెళుతున్నారు. మా దగ్గిరకు వచ్చేవాళ్ళు తక్కువ. చాలామంది వచ్చి ఫోన్ చేసుకుని వెళతారు కాబట్టి మేం పట్టించుకోం అని చెప్పేసాడు. ఇప్పటివాళ్ళకు పోలీసులన్నా భయంలేదు.
‘‘ఒక్క ఐదు నిముషాలు క్రితం చేసిందయ్యా ఆ అమ్మాయి’’ లాభం లేదని తెలిసినా మళ్లీ గుర్తుచేస్తూ.
‘‘చూడలేదండీ. చూస్తే చెప్పనాండీ. ఇప్పటిదాకా నా ఫ్రెండ్ వచ్చి కూర్చుని దొరికానని బుర్ర తినేసి వెళ్లాడు. ఇకనుంచీ గమనించి చెప్పమంటే తప్పక చెబుతాను’’ అనటంతో ఇక చేసేదేమీ లేక అనే్వష్‌కి ఆ విషయం చెప్పి పెట్టేశాడు అక్కడ ఎస్‌ఐ.
అప్పటిదాకా పచ్చబొట్టు రూపురేఖలయినా తెలుస్తాయని ఎంతో ఆశపడ్డ అనే్వష్ నిరుత్సాహపడ్డాడు. కనీసం అతనికి ఏ తెలిసిన అమ్మాయో అయితే అలా అయినా కనుక్కోవచ్చునుకున్నాడు. ఎవరూ చూడకపోవటం పచ్చబొట్టు అదృష్టమా?
-సశేషం

-యలమర్తి అనూరాధ 9247260206