మెయన్ ఫీచర్

వోటింగ్ యంత్రాలపై నెపం దేనికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల్లో ఓడిపోతే ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాల (ఈవీఎం)ను తారుమారు చేశారనడం, గెలిస్తే ప్రజలు తమపై విశ్వాసంతో గెలిపించారనడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారింది. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడచినా, సమాచార సాంకేతిక రంగంలో దేశం ముందుకు దూసుకెళుతున్నా, మన రాజకీయ పార్టీలు ఇంకా ‘కూపస్థ మండూకాల్లా’ ఆలోచిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఎన్నికల్లో వాడవద్దంటూ బలంగా వాదిస్తున్నాయి. పాత పద్ధతిలో బ్యాలెట్ పత్రాలను ఉపయోగించి ఎన్నికలు జరపాలంటున్నాయి. ఈ తరహా డిమాండ్లను చూస్తుంటే నిజంగానే ఎవరికైనా మతిపోతుంది. ఇలాంటి మాటలను చిన్నా చితకా రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు మాట్లాడితే పట్టించుకోవాల్సిన పనిలేదు. దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ తరచుగా ‘బ్యాలెట్ కావాలి, ఇవీఎంలు వద్దు’ అనడం విడ్డూరం. ప్రజల పట్ల నమ్మకం లేకనా? లేక తమ పట్ల తమకే విశ్వాసం లేక ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా? అనిపిస్తుంది.
1951 నుంచి 1990 దశకం దాకా అన్నిరకాల ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలోనే జరిగాయి. కాంగ్రెస్‌కు ప్రజలు దాదాపు అన్ని ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. ఆ రోజుల్లో పోలింగ్ బూత్‌లో సీసీటీవీ కెమెరాలు లేవు, ఈవీఎంలు లేవు. ఇంత పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కూడా లేదు. ఎన్నికల్లో అవకతవకలపై ఫిర్యాదు చేసేందుకు ఆధునిక సాంకేతిక వ్యవస్థ సైతం లేదు. కాని బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికలన్నీ బూటకమని అనగలమా ? వాస్తవానికి బ్యాలెట్ పద్ధతిలో దొంగ ఓట్లకు అవకాశం ఎక్కువ. అప్పట్లో ఫొటో గుర్తింపుకార్డులు ఉండేవి కావు. పోలింగ్ కేంద్రాల్లోకి ఆయుధాలతో వెళ్లి ఎన్నికల అధికారులను బెదిరించి రిగ్గింగ్‌కు పాల్పడిన ఘటనలు లెక్కలేనన్ని జరిగాయి. ఇటువంటి అవకతవకలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వచ్చిన తర్వాత ఫుల్‌స్టాప్ పెట్టినట్లయింది. ప్రస్తుతం పోలింగ్ బూత్‌లలో చీమ చిటుక్కుమన్నా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాల కార్యాలయాలకు, రిటర్నింగ్ అధికారులకు, కలెక్టర్లకు క్షణాల్లో తెలిసిపోతుంది.
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందింది. నిజంగా ఈవీఎంలను టాంపరింగ్ చేసే అవకాశం ఉంటే అధికారంలో ఉన్న బీజేపీ గెలిచి ఉండేది. ప్రజల తీర్పును జీర్ణించుకోలేకపోతే నెపాన్ని ఈవీఎంలపై నెట్టడం రాజకీయ పార్టీలకు అలవాటైంది. 2014 ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందనుకుంటే- ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్, కర్నాటక రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలోకి ఎందుకు రాలేకపోయింది. బిహార్ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ పార్టీలకే ప్రజలు పట్టం కట్టారు. బీజేపీని ప్రజలు ఓడించారు. 1998 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఈవీఎంలను దేశంలో ఉపయోగించారు. అంతకుముందు 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా ఈవీఎంలను అమలు చేశారు. 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆనాటి ప్రతిపక్ష నేత, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ కూడా ఈవీఎంల పనితీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత వరుసగా వివిధ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పాటు బీజేపీని వ్యతిరేకించే అనేక పార్టీలు ఓటమి చెందాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, వామపక్ష పార్టీలు, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ కూడా బ్యాలెట్ కావాలని కోరుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమబెంగాల్‌లో వామపక్ష పార్టీలను వరసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మట్టికరిపించింది. ఈవీఎంల ద్వారానే ఇక్కడ ఎన్నికలు జరిగాయి.
కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈవీఎంలకు సంబంధించి రాజకీయ పార్టీల అనుమానాలను నివృత్తి చేసేందుకు అనేక సార్లు సమావేశాలను నిర్వహించింది. ఈవీఎంలు ‘టాంపర్ ప్రూఫ్’ అని సాంకేతిక నిపుణులు కూడా ధ్రువీకరించారు. అనేక న్యాయస్థానాలు, చివరకు సుప్రీం కోర్టు కూడా ఈవీఎంల పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈవీఎంల పనితీరు బాగుందని చెప్పేందుకు, ఈ విషయమై అనుమానాలు తీర్చేందుకు వోటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) పద్ధతిని అందుబాటులోకి తేనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీని వల్ల ఓటరు తాను ఏ పార్టీకి ఓటు వేశానో తెలుసుకునేనందుకు వీలవుతుంది. వీవీప్యాట్ పద్ధతిని 2013లో నాగాలాండ్ ఎన్నికల్లో తొలిసారిగా వినియోగించారు. 2017లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేశారు. 2019 ఎన్నికల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో వీవీప్యాట్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
ప్రపంచంలో భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ప్రజలు స్వేచ్చగా ఓటు వేసి అధికారాన్ని బదలాయిస్తున్నారు. రాజకీయ పార్టీల భవితను శాసిస్తున్నారు. దేశ భవిష్యత్తును ప్రజలు నిర్దేశిస్తున్నారు. ప్రజలకు కేంద్ర ఎన్నికల సంఘం, న్యాయ వ్యవస్థ అంటే ఇప్పటికీ చెక్కుచెదరని నమ్మకం ఉంది. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా రాజకీయ పార్టీలు నిరాధారమైన అభియోగాలను చేయడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరపరిచినట్లవుతుంది. ‘ఎన్నికల్లో మేము గెలిస్తే ఈవీఎంలు బాగా పనిచేసినట్లు. ఓడిపోతే అధికార పార్టీ ఈవీఎంలను ట్యాపరింగ్ చేసినట్లు ’ అనే కాలదోషం పట్టిన వాదనలను రాజకీయ పార్టీలు తెరపైకి తీసుకురావడం సిగ్గుచేటు.
గతంలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగిన సందర్భాల్లో రిగ్గింగ్ ద్వారా ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చారని ఓటమి చెందిన పార్టీలు ఆరోపించేవి. ఈ ఆరోపణలు కేవలం ఒకటి రెండు ప్రెస్‌మీట్లు పెట్టేందుకు ఉపయోగపడేవి. ఎన్నికల్లో ఓడితే, హుందాగా ఓటమిని స్వీకరించే మర్యాదను మన రాజకీయ పార్టీలు అలవరుచుకోవాలి. ఈవీఎంల వల్ల చెల్లని ఓట్లు ఉండవు. ఓటర్లకు ఇష్టం లేకపోతే ‘నోటా’ పద్ధతిని ఎంపిక చేసుకోవచ్చు. ఈవీఎంల ద్వారా గంటకు 240 మంది ఓట్లు వేస్తారు. ఈవీఎంల వల్ల పెద్ద సంఖ్యలో ఓట్ల పోలింగ్ శాతాలు నమోదవుతున్నాయి. గతంలో అసాంఘిక శక్తులు బ్యాలెట్ బాక్స్‌లలో ఇంకు పోసేవారు. మరి కొన్ని చోట్ల వాటిని ఎత్తుకెళ్లేవారు. ఈవీఎంల వల్ల రెండు నుంచి మూడు గంటల్లో ఫలితాలు వెలువడుతాయి. బ్యాలెట్ పద్ధతిలో 30 నుంచి 40 గంటల పాటు కౌంటింగ్ జరుగుతుంది. 2014 ఎన్నికల్ల 9,30,000 పోలింగ్ స్టేషన్లలో 1.4 మిలియన్ల ఈవీఎంలను ఉపయోగించారు. 817 మిలియన్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో 877 మిలియన్ల మంది ఓటర్లున్నారని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కొత్తగా ప్రవేశపెట్టనున్న వీవీప్యాట్‌ల వల్ల ఇకనైనా రాజకీయ పార్టీలు అర్థం పర్థం లేని ఆరోపణలకు స్వస్తి చెప్పడం మంచిది. ఓటర్లు తాము ఏ పార్టీకి ఓటువేశామో కచ్చితంగా తెలియచేసే విధంగా వీవీ ప్యాట్‌లను రూపొందించారు. ఇంత పెద్ద దేశంలో అక్కడక్కడా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించవచ్చు. ఏవైనా లోపాలుంటే సరిదిద్దేందుకు సాంకేతిక నిపుణులను కూడా సిద్ధంగా ఉంటారు. లేదంటే ప్రత్యామ్నాయంగా కొత్త ఈవీఎంలను సమకూర్చుతారు. అంతగా అవసరమనుకుంటే మర్నాడు కొత్త ఈవీఎంలను తెచ్చి ఎన్నికలు నిర్వహించిన సందర్భాలు లేకపోలేదు. రాజకీయ పార్టీలు తమ శక్తియుక్తులను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఎన్నికల సంఘంపైన- ఈవీఎంలను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలను సంధించే ధోరణిని మానుకోవడం మంచిది. ఎన్నికలను పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించేందుకు ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, సాంకేతిక నిపుణులు నిరుపమానమైన సేవలు అందిస్తున్నారు.
బ్యాలెట్ పద్ధతి ఉన్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎంతో విశ్వాసంతోనే గెలిపించారు. 1983 నాటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తెలుగుదేశం పార్టీ బ్యాలెట్ పద్ధతిలో చిత్తుగా ఓడించింది. ఉత్తరప్రదేశ్‌లో 2017 ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా బీజేపీకి ప్రజలు ఈవీఎంల ద్వారానే బ్రహ్మరథం పట్టారు. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బ్యాలెట్ పద్ధతిలోనే ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించారు. కనీవినీ ఎరుగని మెజార్టీని కాంగ్రెస్‌కు ఇచ్చారు. అదే ప్రజలు 2004, 2009 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ ఫ్రంట్‌కు ఈవీఎంల ద్వారానే ప్రజలు పట్టం కట్టారు. ఆ ప్రజలే నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీకి 2014 ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా అనుకూలమైన తీర్పు ఇచ్చారు. ఈవీఎంలలో బోగస్ ఓట్లకు తావులేదు. ఊహాజనితమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా ప్రజాసమస్యల పరిష్కారంపై రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం మంచిది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097