భాస్కర వాణి

కేసీఆర్ దూకుడుతో విపక్షాలు విలవిల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదేళ్ల వెండితెర ఎప్పుడు మూతబడుతుందా? అని ఎదురుచూస్తున్న రాజకీయ ప్రేక్షకులకు కేసీఆర్ ‘శతాభిషేకం’ చేసుకొనే భారీ చిత్రం ఎట్టకేలకు విడుదల చేశారు. తెలంగాణలో రాజకీయ పితలాటకం ముగియగానే, వనవాసానికి వెళ్తూ జమ్మి చెట్టుమీద దాచుకొన్న అస్త్రాలన్నీ ఒక్కొక్కటీ బయటకు తీస్తున్నారు. కేసీఆర్‌కు మంత్రిపదవి ఇస్తే ప్రపంచం మునిగిపోతుందన్న మొండితనంతో ‘కులం ముళ్లు’ను దాంతోనే తీయాలనుకొన్న చంద్రబాబుపై 18 ఏళ్ల క్రితం కేసీఆర్ తిరగబడ్డాడు. ఏ ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసాడో అదే చంద్రబాబును తెలంగాణ ఆత్మాభిమానం అనే అస్త్రాన్ని ప్రయోగించి ‘అమరావతి’దాకా పంపించాడు.
ఈ రోజు నరేంద్ర మోదీపై ఎలాంటి దుష్ప్రచారంతో వ్యక్తిగత మాన హననానికి చంద్రబాబు పాల్పడుతున్నాడో ఆనాడూ కేసిఆర్‌పై ఇలాగే కత్తిగట్టాడు. దాంతో అదే తెలుగుదేశం పాఠశాలలో పెద్దబాలశిక్ష చదువుకొన్న కేసీఆర్ చంద్రబాబుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారం దక్కకుండా చేయగలగడంలో సఫలీకృతుడైనాడు. ఒకరకంగా తెలుగుదేశాన్ని చీల్చి తెలంగాణ తెలుగుదేశం అన్న స్థాయిలో కేసిఆర్ ఇవాళ పార్టీని నడిపి ఇక్కడ చంద్రబాబుకు నిలువ నీడలేకుండా చేసాడు. రెండు కళ్ల సిద్ధాంతం, సొంత పార్టీ పేరుతో తెలుగుదేశానికి తెలంగాణలో భవిష్యత్తు లేకుండా కేసీఆర్ చేయడమే గాకుండా తెలంగాణ వచ్చాక పదేళ్ల ఉమ్మడి రాజధాని పేరుతో చంద్రబాబు తిష్ట వేయకుండా చేసేందుకు ‘ఓటుకు నోటు కేసు’గొప్ప ఆయుధమైంది.
‘నలభై ఏళ్ళ ఇండస్ట్రీ’ పేరుతో మోదీకి సవాల్ విసురుతున్న చంద్రబాబు తనను పనె్నత్తి ఒక్క మాట అనలేని దుస్థితికి కేసీఆర్ తెచ్చాడు. దేశంలోని 17 పార్టీలను ఏకం చేసి మోదీపై యుద్ధం చేస్తానంటున్న బాబు కేసీఆర్‌ను ఇప్పటివరకు ఈ విషయంపై కదపలేకపోయాడు. మోదీకి అనుకూలంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని కాంగ్రెస్ వాళ్లు అన్నంత గట్టిగా బాబు అనలేకపోతున్నాడు. ఆయనే కాదు, ఆయన తరఫున తెలంగాణలో వకాల్తా పుచ్చుకొన్న ప్రసార మాధ్యమాలు కూడా కేసిఆర్‌ను నిలదీసే సాహసం చేయడం లేదు. దీనికంతా ఒకే కారణం- రాజకీయాల్లో కేసీఆర్ నిష్కర్షగా వ్యవహరించడమే కాదు చంద్రబాబును తెలంగాణ ప్రజలకు ఆగర్భ శత్రువుగా చూపించడంలో విజయవంతం అయ్యాడు.
కాంగ్రెస్ కూడా మొదటి నుంచీ తెలంగాణ విషయంలో దోబూచులాడింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉంటూ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో వచ్చిన జై తెలంగాణ ఉద్యమాన్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసింది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చేతిలోకి వచ్చాక 1,200 మంది బలి అయితేనే తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేంద్రంలో ఎంపీల సంఖ్య కోసం కాంగ్రెస్ అతణ్ణి స్వేచ్ఛగా వదలిపెట్టి కేసీఆర్‌ను తొక్కేసే ప్రయత్నం చేసింది. ఆఖరుకు టీఆర్‌ఎస్‌లోని ఒక సామాజిక వర్గపు శాసనసభ్యులను ‘ఆపరేషన్ ఆకర్ష్’ ద్వారా వైఎస్ కాంగ్రెస్‌లోకి లాగేసుకున్నాడు. కేసీఆర్ మాత్రం ని రాశపడకుండా ఉప ఎన్నికలను ఆయుధంగా చేసుకుంటూ, ప్రజా సంఘాల కు, ఉద్యమకారులకు అనేక కార్యక్రమాలు అందిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నడిపించాడు. వైఎస్ మరణం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌లో స్తబ్ధత వచ్చింది. ఆ సమయాన్ని కేసీఆర్ తెలివిగా ఉపయోగించుకొని రాష్ట్రాన్ని సాధించుకొన్నాడు.
తాతల కాలం నాడే కాకినాడ తీర్మానం చేసి ‘ఒక ఓటు- రెండు రాష్ట్రాలు’ పేరుతో తెలంగాణకు మద్దతు ప్రకటించిన భారతీయ జనతా పార్టీని ఏ దుష్టశక్తి వెనుకనుండి లాగిందో తెలియదు గాని తెలంగాణ ఉద్యమంలో సహభాగస్వామిగానే మిగిలేట్లు చేసింది. ఆలె నరేంద్ర భాజపా నుండి బయటకు వచ్చి ఓ పార్టీని స్థాపించి, కేసీఆర్ తడబాటులో వున్న సందర్భంలో మద్దతిచ్చి వెన్నుదన్నుగా నిలిచాడు. కేసీఆర్ బలం పుంజుకున్నాక వారిద్దరి మధ్య ఘర్షణ వాతావరణం వ్యక్తిగత దూషణ వరకు వెళ్లింది. విచిత్రం ఏమిటంటే గాదె ఇన్నయ్య, బెల్లా నాయక్ వంటివారితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నాక కేసీఆర్ వెంట వాళ్లెవరూ మిగలలేకపోయారు. అంతెందుకు..! సినీనటి విజయశాంతి తెలంగాణ వచ్చేంతవరకు తెరాసలో ఉన్నా, కేసిఆర్‌తో కుదరకపోవడంతో ఇపుడు ఆమెను రాజకీయ నిశ్శబ్దం ఆవరించింది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో భారతీయ జనతా పార్టీ హృదయపూర్వకంగా పాల్గొని, అతి పెద్ద ప్రతిపక్షంగా ఉద్యమానికి అండగా నిల్చింది. తెలంగాణలో హిందూ వోటు పోలరైజేషన్‌తో భాజపా ఎదుగుతుందన్న ఒకే ఒక కారణంతో ఆనాడు మజ్లిస్ ఈ ఉద్యమానికి దూరంగా ఉంది. ఒక దశలో అడ్డుకునేందుకూ ప్రయత్నించింది. కానీ ఈ నాలుగేళ్లలో మజ్లిస్ పార్టీ కేసీఆర్‌తో కావలసినంత లాభం పొందింది.
సిపిఐ కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చినా ఇపుడు తెలంగాణలో ఆ పార్టీకి పెద్ద చెప్పుకోదగ్గ స్థితేమీ లేదు. ఇక ఆనాడు కేసీఆర్ బంటుగా తెలంగాణ జేఏసీకి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ కోదండరాం ఎందుకో రెండు ఏళ్లుగా వెనుకబడ్డాడు. మల్లేపల్లి లక్ష్మయ్య, ఘంటా చక్రపాణి, నందిని సిధారెడ్డి, బి.ఎస్.రాములు, దేశపతి శ్రీనివాస్ వంటి మేధావులు తమకున్న వ్యక్తిగత సిద్ధాంతాల కన్నా తెలంగాణకు ప్రాధాన్యం ఇచ్చి కేసీఆర్ అడుగులో అడుగేసి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. కోదండరాంను ఏ శక్తులు ప్రోత్సహించాయో తెలియదు గాని సిపిఎం-2గా ఓ పార్టీని స్థాపించి దానిని లాగలేక, ఊగలేక ఆయాసపడుతున్నాడు.
కమ్యూనిస్టులను బయట వదిలితే వాళ్లకు వచ్చే ఓట్ల సంగతి ఏమో గాని వారి దుష్ప్రచారం ఆకట్టుకోవడం భయంకర సాహసం. కేసీఆర్ ఈ వ్యూహాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకొని కొందరు వామపక్షవాదులను తన ప్రభుత్వంలో కొనసాగిస్తున్నాడు. దాంతో హరగోపాల్‌ను, వరవరరావును, చుక్కా రామయ్యను, కంచె ఐలయ్యను, తమ్మినేని వీరభద్రాన్ని నోరు తెరవకుండా చేయగలిగాడు. మరోవైపు అద్భుతమైన దైవభక్తితో, బ్రాహ్మణ భక్తితో ఇంకో వర్గాన్ని తనకు అనుకూలంగా చేసుకొన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సింహభాగం అధికారం అనుభవించిన రెడ్డి సామాజిక వర్గం కేసీఆర్‌పై అలకబూనడం పచ్చినిజం. అందుకే కేసీఆర్ ముస్లింలను, బీసీ కులాలను అనేక సంక్షేమ పథకాలతో దువ్వుతూ వారి ప్రభావానికి సమానమైన ఓటు బ్యాంకును నిర్మాణం చేస్తున్నాడు. గతం, వర్తమానంతో కూడిన తెలంగాణ రాజకీయాల్లో ఇపుడు ఒక్కసారిగా ఎన్నికల ఆట మొదలైంది. రాష్ట్రంలో వేడి పుట్టింది. వర్షాకాలం పెద్దగా లేకున్నా హామీల వర్షాలు వరదలై పారుతున్నాయి. కేసీఆర్ డబుల్ బెడ్‌రూం ఇళ్లను తలదనే్నందుకు కాంగ్రెస్ వాళ్లు పాత ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా డబ్బులు చెల్లిస్తామని, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత రేషన్ బియ్యం, లక్షల్లో ఋణమాఫీ, 18 ఏళ్లు దాటిన యువకులందరికీ బీమా వంటి పథకాలను తన అమ్ముల పొదినుండి బయటకు తీస్తున్నారు.
‘పాతిక లక్షల మందితో’ అంటూ కొంగర కలాన్‌లో ప్రగతి నివేదన సభ పెట్టిన తెరాస పార్టీకి తక్కువ మంది జనం రావడంతో చుక్కెదురైందని, కేసీఆర్ ప్రసంగం చప్పగా సాగిందని ప్రతిపక్షాలు సంబరపడుతున్నాయి. కేసీఆర్ యథాలాపంగా చెప్పే పిట్టకథలు, వ్యంగ్యాలు, ఛలోక్తులు, విరుపులు, తిట్లు వంటివి మొన్నటి సభలో చెప్పలేదని హుస్నాబాద్‌లో మరో సభకు తెరాస వారు హరీశ్‌రావు నాయకత్వంలో సిద్ధం చేస్తున్నారు.
ఇక భాజపా వారు ఈనెల 12నో, 15నో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందర్భంగా అమిత్ షా గతంలో యూపీలో వ్యూహం పన్నినట్టు ఇక్కడే మకాం వేస్తారని వార్తలొస్తున్నాయి. తాజాగా గురువారం నాడు అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత, 105 మంది అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ప్రకటించారు. కొందరి అభ్యర్థిత్వాల పట్ల అసమ్మతి సెగలు రాజుకొనే అవకాశం ఉందని విపక్షాలు ఆశలు పెట్టుకుంటున్నాయి. టిక్కెట్లు ఆశించి భంగపడ్డవారు తెరాస నుండి పక్కకు దొలిగి భాజపా టికెట్ ఆశించి రంగంలోకి దిగే అవకాశం ఉంది. దానిని ఉపయోగించుకొంటే భాజపా గణనీయంగా సీట్లు సాధించే అవకాశం ఉంది. భాజపాలో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులు గట్టి ప్రయత్నం చేస్తే అమిత్ షా ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. భాజపా గుడ్డిగా కేసీఆర్ వెంట వెళ్లినా అంతిమ ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. కాంగ్రెస్‌ను ఎదగనీయకుండా కేసీఆర్ అడ్డుపడవచ్చు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌కు మెజారిటీ వస్తే- రాబోయే మేలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో భాజపా మరో కొత్త ప్రత్యర్థిని ఎదుర్కోవలసి వస్తుంది.
ఏపీలో జనసేన, తెలంగాణలో జనసమితి రెండూ ఒకటే. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కోదండరాం చేసే ప్రచారం కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుందేమో కానీ ఆయన పార్టీకి ఏం లాభం జరుగదు. బిఎల్‌ఎస్ పార్టీగా కొత్త అవతారం ఎత్తిన సిపిఎం ‘తెలంగాణలో తాడూ బొంగరం లేని’ జనసేనతో కలిసి పోటీ చేయడం కుక్కతోక పట్టుకొని గోదారి ఈదడమే! ఎక్కడ భాజపాతో కలుస్తాడేమోనని పవన్ కల్యాణ్ పంచన చేరిన ఆంధ్రా వామపక్షాలు- ‘తాము మునగవు.. ఇతరుల్ని తేల్చవు’! గెలిచాక వైసీపీ ఎలాగూ మావైపే వస్తుందిలే అని ఆంధ్రా భాజపా నిశ్చింతగా ఉంది. ఆంధ్రాలో చంద్రబాబుకు భాజపా నిద్ర లేకుండా అయితే చేయగలిగింది కానీ తన పాదును నెలకొల్పలేకపోయింది. ఇక, తెలంగాణలో పుట్టిన కొత్త పార్టీల్లో అధ్యక్షులెవరో, కార్యకర్తలెవరో తెలియని దుస్థితి. హైదరాబాద్‌లో ఉంటూ ఆంధ్రా ప్రాంతంపై కలలుగనే- ‘చంద్రబాబు భజంత్రీలైన’ ప్రసార మాధ్యమాలకు తెలంగాణలో ఎన్నికలు రావడం కక్కలేని మింగలేని పరిస్థితి?
ఇన్ని సంవేదనలు, ఇరకాటాల మధ్య పుట్టిన రాజకీయ వేడి ఏ పార్టీని ఎటువైపు నడిపిస్తుందో వేచి చూస్తున్న ప్రజలకు వినోదమే తప్ప ఇంకోటి కాదు. మారబోతున్న ‘రాజకీయ రణరంగం’ ఎవరిని విజయతీరాలకు తీసుకెళ్తుందో?

-డాక్టర్ పి.భాస్కర యోగి