సంపాదకీయం

‘రద్దు’ నేర్పుతున్న పాఠం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభకు, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపించడం సాధ్యం కాదన్న రాజ్యాంగ వాస్తవానికి తెలంగాణ శాసనసభ గురువారం రద్దయిపోవడం మరో నిదర్శనం. శాసనసభ రెండు సమావేశాల మధ్య ఆరు నెలల కంటె ఎక్కువ కాలవ్యవధి ఉండడానికి వీలులేదు. అందువల్ల ఈ రాజ్యాంగ నిబంధనకు లోబడి తెలంగాణలో ఎన్నికలు జరగాలి, శాసనసభ మళ్లీ ఏర్పడాలి! అక్టోబర్‌లో ఎన్నికల ప్రక్రియ మొదలై, నవంబర్ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని డిసెంబర్ నాటికి కొత్త శాసనసభ కొలువు తీరగలదని ‘పాతసభ’ను రద్దు చేయించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ప్రకటించాడు. నిర్ణీత కాలవ్యవధి కంటె దాదాపు తొమ్మిది నెలల ముందుగా ‘సభ’ను రద్దు చేసి సమరానికి సిద్ధం కావడం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి- తెరాస- విజయ విశ్వాసానికి నిదర్శనం. ఓటమి భయం ఉన్న అధికార పక్షాలు గడువు పూర్తయ్యేవరకూ గద్దెను అంటిపెట్టుకొని ఉండడానికి మాత్రమే ప్రయత్నిస్తాయి. అందువల్ల కేసీఆర్ స్వయంగా అభివర్ణించిన ‘కాలవ్యవధి త్యాగం’ విజయ విశ్వాసానికి చిహ్నం. ప్రజల కోసం అనేక త్యాగాలు చేశామని, తొమ్మిది నెలల పదవీ సమయాన్ని కూడ త్యాగం చేస్తున్నామని గురువారం ‘సభ’ రద్దయిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. బాగుంది! శాసనసభను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర మంత్రివర్గం సలహాపై రాజ్యపాల్- గవర్నర్- నిర్ణీత కాలవ్యవధి కంటె ముందుగానే శాసనసభను రద్దు చేయడానికి రాజ్యాంగంలోని నూట డెబ్బయి నాలుగవ అధికరణం వీలు కల్పిస్తోంది. ఈ ‘వీలు’ను తెరాస ఉపయోగించుకొంది. అందువల్ల ‘వీలు’ లేని ప్రత్యర్థి రాజకీయ పక్షాలు రుసరుసలాడడం సహజం. కానీ ఈ రాజకీయ నిర్ణయాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగాను, ప్రజాస్వామ్య విరుద్ధంగాను చిత్రీకరించడం ‘అనభిజ్ఞత’- ఇగ్నోరెన్స్-కు చిహ్నం. ఇది రాజ్యాంగ నిబంధనలకు సంబంధించిన ‘అనభిజ్ఞత’, రాజకీయ చరిత్రకు సంబంధించిన ‘అనభిజ్ఞత’. శాసనసభను రద్దు చేయాలని నిర్ణయించే మంత్రివర్గం వారు ముందుగా అధికారపక్ష శాసనసభ్యులను సంప్రదించాలన్న నిబంధన రాజ్యాంగంలో లేదు. సంప్రదించడం, సంప్రదించక పోవడం అధికార పక్షాల అంతర్గత వ్యవహారం. గతంలో దాదాపు అన్ని రాష్ట్రాలలోను ముఖ్యమంత్రులు ‘సభ’లను ఎప్పుడో అప్పుడు రద్దు చేయించడం చరిత్ర. ‘సభ’ను రద్దు చేయించడం అప్రజాస్వామ్య చర్య అన్న భ్రాంతికి గురికావడం రాజకీయ చారిత్రక అనభిజ్ఞతకు, రాజ్యాంగ అనభిజ్ఞతకు చిహ్నం. తెలంగాణ శాసనసభ రద్దు గురించి వారాల తరబడి ఊహాగానాలు కొనసాగాయి. రాజకీయ కుతూహలగ్రస్తుల ఉత్కంఠను నిరంతరం పెంచాయి. ఈ ఊహాగానాలను మొదట ఆలపించింది ప్రతిపక్షాల వారు! అందువల్ల శాసనసభ రద్దు ఆకస్మిక సంఘటన కాజాలదు, ప్రతిపక్షాలకు కుతూహలగ్రస్తులకు ఆశ్చర్యకరం కారాదు! ఉత్కంఠకు విఘాతం కలగడం మాత్రమే గురువారం సంభవించిన పరిణామం!
ఇలా శాసనసభను రద్దు చేయించడం రాష్ట్ర మంత్రివర్గ అధికార పరిధికి లోబడిన పరిణామం. కొత్త శాసనసభను ఏర్పాటు చేయడానికి వీలుగా ఎప్పుడు ఎన్నికలను- రాజ్యాంగ నిబంధనలకు లోబడి- నిర్ధారించవలసింది కేంద్ర ఎన్నికల సంఘం- ఎలక్షన్ కమిషన్! ఎన్నికల సంఘం వారి బాధ్యతను సైతం కేసీఆర్ తన భుజాలకెత్తుకొనడం మాత్రం విచిత్రమైన వ్యవహారం. అక్టోబర్‌లో ఎన్నికల ప్రక్రియ మొదలైపోతుందన్నది ఎన్నికల కమిషన్ వారు నిర్ణయించవలసిన, ప్రకటించవలసిన వ్యవహారం. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయవచ్చు.. కానీ నిర్ణయాలు జరిగిపోయినట్టు ‘ఎన్నికల సంఘం’ అధికార ప్రతినిధి వలె కేసీఆర్ మాధ్యమ మిత్రుల చెవులలో బహిరంగంగా ఊదడం రాజకీయ వైచిత్రికి నిదర్శనం. ఆయన కేంద్ర ఎన్నికల సంఘం వారిని సంప్రదించి ఉండవచ్చు. కానీ శాసనసభ రద్దుకు పూర్వమే ‘ఎన్నికల ప్రక్రియ’ ఎప్పుడు మొదలయ్యేది, ఎప్పుడు పరిసమాప్తమయ్యేది కేంద్ర ఎన్నికల సంఘం ఎలా నిర్ధారించి ఉంటుంది?? ఎన్నికలను ఫలానా సమయంలో జరిపించాలని ‘రద్దు’ తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి ఎన్నికల సంఘానికి ఆధికారికంగా విజ్ఞప్తి చేయాలి. కానీ ఎన్నికలు ఎప్పుడు జరుగనున్నదీ ముఖ్యమంత్రి కచ్చితంగా ప్రకటించడం ‘ఎన్నికల సంఘం’ అధికార పరిధిలోకి చొరబడడం మాత్రమే!
గతంలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు ఎన్నికల కార్యక్రమాన్ని నిర్ధారించడానికి ఎన్నికల సంఘం అంగీకరించలేదు. ఇతర రాష్ట్రాల్లో సైతం ఇలాంటి చరిత్ర ఉంది. రాజ్యాంగంలోని 174-1-వ అధికరణం నిర్దేశనం మేరకు శాసనసభ ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్ధారించాలి. కానీ తెరాస అధినేత తన పార్టీ అభ్యర్థుల జాబితాతో పాటు ఎన్నికల ప్రక్రియ ‘సమయ సారిణి’ని సైతం ఆవిష్కరించగలిగారు. ఇదీ విడ్డూరం. మితిమీరిన విశ్వాసానికి ఇది నిదర్శనం. ఏమైనప్పటికీ నిర్ణీత సమయం కంటె ముందుగా ఎన్నికలు జరిపించిన సందర్భాలలో అధికార పక్షాలు ఓడిపోయాయి కూడ! 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు ఆరు నెలల ముందుగానే ఎన్నికలను జరిపించి తమ తెలుగుదేశం పార్టీకి ఘోర పరాజయాన్ని సాధించి పెట్టాడు. ఈయనతో జట్టుకట్టి ఆరు నెలల ముందుగానే లోక్‌సభకు ఎన్నికలు జరిపించిన అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఆధ్వర్యంలో భాజపా సైతం విస్మయకర పరాజయాన్ని పొందడం చరిత్ర. ‘అభివృద్ధి శంఖారావం’తో చెవులు బద్దలైన జనం అప్పుడు ‘స మహేంద్ర తక్షకాయ స్వాహా’ అన్న తీర్పును వినిపించారు. తక్షకుడైన తెలుగుదేశం పార్టీతో పాటు ఇంద్రుడైన భాజపా 2004లో అలా స్వాహా అయింది! అందువల్ల ‘ప్రగతి నివేదన’ కచ్చితంగా తెరాసకు విజయాన్ని సమకూర్చవచ్చు, సమకూర్చక పోవచ్చు... జనం నిర్ధారించేవరకూ వేచి చూడక తప్పదు. కానీ తెరాసకు ప్రత్యర్థులుగా అవతరించిన కాంగ్రెస్ కాని, భాజపా కాని ఇంతవరకూ మెరుగైన పాలనా ప్రత్యామ్నాయాలను కాని, మెరుగైన పథకాలను కాని, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను కాని ఆవిష్కరించిన దాఖలా లేదు. ‘మిషన్ భగీరథ’, ‘మిషన్ కాకతీయ’, ‘హరితహారం’, వ్యవసాయానికి ‘పెట్టుబడి’, నిరంతర వ్యవసాయానికి విద్యుత్ సరఫరా- వంటి పథకాల స్వరూప స్వభావాల ఔచిత్యాన్ని అంగీకరించక పోవడం అన్యాయం మాత్రమే కాదు, అతార్కికం కూడ.. అమలు జరగడంలో అవకతవకలు జరిగి ఉండవచ్చు గాక! అందువల్ల ‘రాజకీయపు రంగుల వైరుధ్యాల కళ్లద్దాలు’ లేని వారికి నాలుగేళ్ల మూడు నెలల తెరాస పాలన మంచిగానే కన్పిస్తోందన్నది ఆవిష్కృతమవుతున్న దృశ్యం..
తెలంగాణ శాసనసభ ముందుగా రద్దు కావడం ఒక ఉదాహరణ మాత్రమే. లోక్‌సభకు, శాసనసభలకు ఏదో ఒక సంవత్సరంలో ఒకేసారి ఎన్నికలు జరిపించవచ్చు. కానీ ఈ సమాంతర ప్రక్రియ శాశ్వతం కాజాలదన్నది ప్రస్తుత రాజ్యాంగ నిబంధనలు చెబుతున్న పాఠం. ఏ ఒక్క రాష్ట్రంలో శాసనసభ మధ్యంతరంగా రద్దయిపోయినప్పటికీ ఎన్నికల ‘సమాంతర ప్రక్రియ’కు విఘాతం కలిగి తీరుతుంది. ఈ రాజ్యాంగ వాస్తవానికి ‘సోదాహరణ నిరూపణ’ తెలంగాణ శాసనసభ రద్దు కావడం. ‘ఏకకాలం’ ఎన్నికల ప్రక్రియ వ్యవస్థీకృతం కావాలంటే రాజ్యాంగంలో విప్లవాత్మక సంస్కరణలు జరగాలి. ఇదీ తెలంగాణ శాసనసభ ‘రద్దు’ నేర్పుతున్న పాఠం...