జాతీయ వార్తలు

మత్స్యకారులకు ఆపద్బంధువు ‘నావిక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 7: సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే హెచ్చరించే సరికొత్త జీపీఎస్ సిస్టం నావిక్ (ఎన్‌ఏవీఐసీ) ఆవిష్కృతమైంది. దేశీయంగానే రూపుదిద్దుకున్న ఈ డివైస్ ఫోన్ నెట్‌వర్క్‌లేని సుదూర సముద్ర ప్రాంతాల్లోనూ అద్భుతంగా ఉపకరిస్తుంది. సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దును దాటుతున్న సమయంలోనూ ఈ సిస్టం మత్స్యకారులను హెచ్చరిస్తుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన సీనియర్ శాస్తవ్రేత్త ఒకరు శుక్రవారం నాడిక్కడ వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలను గుర్తించలేక సముద్రం మీదికి వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయే దుస్థితి ఈ డివైస్ వల్ల తొలుగుతుంది. గత యేడాది డిసెంబర్‌లో కేరళలో ఓక్కి తుపాను కారణంగా పలువురు మత్స్యకారులు మృత్యువాత పడిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతోబాటు, తమిళనాడు, గుజరాత్ ప్రభుత్వాలు సైతం ఈ దుస్థితిని తొలగించే చర్యలు చేపట్టాల్సిందిగా ఇస్రోను కోరాయన్నారు. ఆక్రమంలోనే ఈ సరికొత్త విధానం కనుగొనేందుకు బీజం పడిందని అహమదాబాద్ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చే ఈ నావిక్ డివైస్ సముద్రంలో చేపలు దొరికే ప్రదేశాలను సైతం మత్స్యకారులకు తెలియజేస్తుందని ఆయన వివరించారు. ఫోన్‌కు అనుసంధానంగా ఏర్పాటుచేసే ఈ గాడ్జెట్ బ్లూటూత్‌కు నావిక్ మేస్సేజింగ్ ఫీచర్‌తోకనెక్టివిటీ కలిగివుంటుందని ఆయన వివరించారు. ప్రత్యేకించి సముద్రపు అలల కదలికలపై మత్య్సకారులకు తాము ఈ నావిక్ సిస్టం ద్వారా సమాచారాన్ని అందజేస్తామని నీలేష్ దేశాయ్ బెంగళూరులో జరిగిన స్పేస్ ఎక్స్‌పోలో జరిగిన చర్చల సందర్భంగా వివరించారు. కాగా గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులు తరచూ సముద్రంలోని అంతర్జాయ సరిహద్దు లైన్‌ను దాటివెళ్లిపోయి పాకిస్తాన్,శ్రీలంక దేశాల కోస్ట్‌గార్డులకు పట్టుబడడం జరుగుతోందని, ఈ సరికొత్త గాడ్జెట్ ద్వారా సరిహద్దులను దాటే ప్రమాదం నుంచి మత్స్యకారులు రక్షింపబడతారని ఆయన చెప్పారు. ఈ గాడ్జెట్ ఆయా రాష్ట్రాల్లోని మాతృభాషల్లో మత్స్యకారులకు అలెర్ట్ మెస్సేజ్‌లను అందజేస్తుందన్నారు. ఈ డివైస్ ఒక్కొక్కటి 3,500 రూపాయలు ధరకు లభిస్తుందన్నారు.