సంపాదకీయం

అనివార్య మైత్రి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలై ఆరవ తేదీన జరుగవలసి ఉండిన భారత, అమెరికా దేశాల ‘చతుర్ముఖ’- టు ప్లస్ టు- సమావేశం సెప్టెంబర్ ఆరవ తేదీన జరగడానికి ప్రధాన కారణం వాణిజ్య ‘దౌర్జన్యం’.. ఈ దౌర్జన్యాన్ని అమెరికా అనేక ఏళ్లుగా కొనసాగిస్తోంది. పాకిస్తాన్ బీభత్సకాండను గురువారం ఢిల్లీలో జరిగిన ‘చతుర్ముఖ’ సమావేశంలో భారత, అమెరికాలు ఖండించాయి. కానీ బీభత్సకాండకు వ్యతిరేకంగా మన దేశంతో కలసి పోరాడడం కంటె తన వాణిజ్యం లోటును పూడ్చుకొనడానికి అమెరికా ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తోంది. తమ దేశపు ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ మన దేశంలో మరింతగా విస్తరించడానికి వీలైన సదుపాయాలను పెంపొందించడానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ప్రాధాన్యం దౌత్య దౌర్జన్యంగా మారి మన ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుండడం గురువారం నాటి ‘చతుర్ముఖ’ సమావేశానికి విచిత్రమైన నేపథ్యం. అమెరికాతో మన దేశం నిర్వహిస్తున్న ద్వైపాక్షిక వాణిజ్యంలో ప్రతి ఏటా దాదాపు లక్షా అరవై ఐదు వేల కోట్ల రూపాయల మేర మన దేశానికి మిగులు ఏర్పడుతోంది, ఈమేరకు అమెరికాకు లోటు ఏర్పడుతోంది. ఈ లోటును పూర్తిగా తుడిచిపెట్టడానికి వీలుగా, కనీసం భారీగా తగ్గించడానికి వీలుగా మన ప్రభుత్వం చర్యలను తీసుకోవాలన్నది అమెరికావారి దౌత్య దౌర్జన్యంలోని ప్రధాన అంశం.. ప్రతి ఏటా కనీసం డెబ్బయి వేల కోట్ల రూపాయల మేర మన దేశం అదనంగా తమ సరకులను కొనుగోలు చేయాలని అమెరికా ఒత్తిడి పెంచుతుండడం జూలై నాటి ‘చతుర్ముఖ’ సమావేశం గురువారం నాటికి వాయిదా పడడానికి ప్రధాన కారణం. చైనాతో మనం సాగిస్తున్న ద్వైపాక్షిక వాణిజ్యంలో ప్రతి ఏటా దాదాపు రెండు లక్షల నలబయి ఐదు వేల కోట్ల రూపాయల మేర మనకు లోటు ఏర్పడుతోంది. ఈ ‘లోటు’ను తగ్గించడానికి వీలుగా చర్యలను తీసుకొనడానికి చైనా అంగీకరించడం లేదు, మన ప్రభుత్వం ఒత్తిడి చేయడం లేదు. కానీ అమెరికా మాత్రం మన ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తోంది. ‘చతుర్ముఖ’ సమావేశంలో ఈ విషయమై చర్చించారా? అన్నది స్పష్టంగా తెలియదు..
ప్రతి సంవత్సరం ఒకసారి మన రక్షణ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి, అమెరికా రక్షణ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి సమావేశమై ఉభయ దేశాల వ్యూహాత్మక మైత్రిని సమీక్షించుకోవాలన్నది ‘చతుర్ముఖ’ చర్చలకు ప్రాతిపదిక. జూలై ఆరున అమెరికాలో జరుగవలసి ఉండిన ఈ ‘చతుర్ముఖ’ వ్యూహాత్మక దౌత్యగోష్ఠిని అమెరికా ఏకపక్షంగా వాయిదా వేసింది. ఇలా తొలి ‘చతుర్ముఖ’ సమావేశం వాయిదా పడడం అది మొదటిసారి కాదు. అంతకు పూర్వం కూడ చర్చలు ఒకసారి వాయిదా పడినాయి. నిర్ణీత కార్యక్రమం ప్రకారం ఈ చర్చలు ఏప్రిల్‌లో జరిగి ఉండాలి. కానీ అప్పటి విదేశాంగమంత్రి ఆర్.టిల్లర్‌సన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి తప్పించాడు. మార్చిలో టిల్లర్‌సన్ రాజీనామా చేయడం సాకుగా ఏప్రిల్ చర్చలను అమెరికా ప్రభుత్వం జూలైకి వాయిదా వేసింది. ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొనడం అమెరికా మనతో సాగిస్తున్న దౌత్య దౌర్జన్యంలో భాగం. అన్ని సార్వభౌమ దేశాల మధ్య ‘అధికార’ సమానత్వం, ‘ప్రతిపత్తి’ సమానత్వం నెలకొని ఉండడం అంతర్జాతీయ దౌత్య సంబంధాలకు వౌలిక ప్రాతిపదిక. కానీ అమెరికా మాత్రం మిత్ర దేశాలను చిన్నచూపు చూస్తుండడం, తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుండడం నడుస్తున్న చరిత్ర. ఈ ఆధిపత్య విధానాన్ని మన దేశం, ఇతర అమెరికా మిత్రదేశాలు బహిరంగంగా నిరసించక పోవడం అమెరికా ‘అతిశయాని’కి, ఆధిపత్య కీలలకు ‘ఇంధన తైలం..!’
ఇలా సమావేశాలను వాయిదా వేయడం, ఏకపక్షంగా మన దిగుమతులను నిషేధించడం, సుంకాలను పెంచడం, భారతీయులకు తమ దేశ ‘ప్రవేశ అనుమతి’- వీసా- పత్రాలను జారీచేయడంలో విలంబనం చేయడం, ‘అక్రమంగా ప్రవేశించిన భారతీయుల’ కుటుంబాలను విడదీసి వేఱువేఱు కారాగృహాలలో నిర్బంధించడం వంటి చర్యలకు అమెరికా ప్రభుత్వం దశాబ్దులుగా పాలుపడుతోంది. 1965లో అప్పటి మన ప్రధాని లాల్‌బహదూర్ శాస్ర్తీ అమెరికాలో పర్యటించవలసి ఉండింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ బి.జాన్సన్ ఈ పర్యటనను ఏకపక్షంగా వాయిదా వేశాడు. ఈ ఏకపక్ష దుశ్చర్యను లాల్‌బహదూర్ శాస్ర్తీ బహిరంగంగా నిరసించాడు. తన పర్యటనను రద్దు చేసినట్టు ‘ఏకపక్షం’గా ప్రకటించగలిగాడు. కానీ అధికాధిక సందర్భాలలో మన ప్రభుత్వం అమెరికా వారి ఈ ఆధిపత్య దౌత్యాన్ని సహించి అంగీకరిస్తుండడం అమెరికా ‘దొరలు’ మరింత పేట్రేగిపోవడానికి దోహదం చేస్తోంది! నిజానికి మనకు అమెరికా వారి అవసరం కన్న మిన్నగా అమెరికాకు మన దేశపు సహకారం సహాయం అవసరమవుతుండడం అంతర్జాతీయ వాస్తవం. పాకిస్తాన్ ప్రభుత్వం జిహాదీ మతోన్మాద బీభత్సంతో మన దేశానికి వ్యతిరేకంగా మాత్రమే దశాబ్దులపాటు విషపు మంటలను వెళ్లగక్కింది. ఈ దశాబ్దుల కాలంలో అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌ను మందలించలేదు, నియంత్రించలేదు, ఆర్థిక సహాయాన్ని, ఆయుధ సహాయాన్ని నిలిపివేయలేదు. ఉన్మాద తీవ్రత పెరిగిన పాకిస్తాన్ ప్రభుత్వ జిహాదీ బీభత్సం గత కొన్ని ఏళ్లుగా అమెరికాకు వ్యితిరేకంగా కూడ ‘కోరల’ను నూరుతోంది. అమెరికా వ్యూహాత్మకంగా మన దేశానికి దగ్గర కావడానికి ఇది ప్రధాన కారణం! గురువారం నాటి ఢిల్లీ ‘చతుర్ముఖ’ సమావేశంలో మన దేశానికీ అమెరికాకు మధ్య కుదిరిన వ్యూహాత్మక రక్షణ వ్యవహారాల ఒప్పందాలకు ఇదీ ప్రధాన కారణం. మన విదేశీ వ్యవహారాల మంత్రి సుషమా స్వరాజ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, అమెరికా విదేశాంగ మంత్రి మైకు పాంపియో, రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ పాకిస్తాన్ బీభత్సకాండను బహిరంగంగా నిరసించడానికి ఇదీ నేపథ్యం. కుదిరిన ‘వ్యూహాత్మక అంగీకారం’లో భాగంగా అమెరికా వారి రక్షణ పరిజ్ఞానానికి చెందిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకు అందుబాటులోనికి వస్తుందట! దీనితోపాటు ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి అవసరమైన ‘వ్యవస్థ’లను పదార్థాలను పరికరాలను మనం అమెరికా వద్ద కొనుగోలు చేయక తప్పదు.. ద్వైపాక్షిక వాణిజ్యంలో ఏర్పడిన లోటును భర్తీచేసుకొనడానికి అమెరికాకు ఈ విధంగా కూడ వీలుకలుగుతోంది...
మన పట్ల వ్యతిరేకతతో చైనా పాకిస్తాన్ బీభత్స ప్రభుత్వాన్ని చంకనెత్తుకుంది. చైనా చంకనెక్కిన పాకిస్తాన్ అమెరికాను వెక్కిరిస్తోంది. అమెరికా పట్ల వ్యతిరేకతతో రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ పాకిస్తాన్ మతోన్మాద ప్రభుత్వాన్ని ఒడిలో చేర్చుకుని లాలిస్తున్నాడు. అరవై ఐదు ఏళ్లపాటు రష్యాకు పాకిస్తాన్‌కు మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గున మండింది. కానీ గత ఐదారు ఏళ్లుగా పాకిస్తాన్ రష్యాకు సన్నిహిత మిత్ర దేశమైంది. ఇలా రష్యా పాకిస్తాన్ చైనాల మధ్య ఏర్పడిన కూటమి భారత అమెరికా స్నేహాన్ని అనివార్యం చేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోను, ప్రశాంత మహాసాగర ప్రాంతంలోను కొనసాగుతున్న చైనా వ్యూహాత్మక దురాక్రమణను ప్రతిఘటించడానికి భారత, అమెరికాల మైత్రి పెంపొందడం అంతర్జాతీయ అనివార్యం..