రాష్ట్రీయం

మరింత వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 7: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపట్ల కేంద్ర నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తంచేసిన నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికార్లలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. సీడబ్ల్యూసీ నిపుణుల కమిటీ ఛైర్మన్ వైకే శర్మ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు గురువారం క్షేత్ర స్థాయిలో పర్యటించి పనుల తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేసిన సంగతి విదితమే. సుమారు ఆరు గంటలకు పైగా కేంద్ర బృందం సభ్యులు నిర్మాణ ప్రాంతంలో పర్యటించి, అన్ని కోణాల్లో పరిశీలన జరిపారు. కేంద్ర నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తం చేయడంతో రెట్టించిన ఉత్సాహంతో మిగిలిన పనుల పూర్తికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు 57.90 శాతం పనులు పూర్తయ్యాయి. స్పిల్ వే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా గేట్లను అమర్చే పనులు మొదలు పెట్టనున్నారు. ఇటీవల వరదల వల్ల స్పిల్ వే పనులు నిలుపుచేయాల్సి వచ్చింది. వరద మట్టం తగ్గిన వెంటనే మళ్ళీ పనులు ఊపందుకున్నాయి. జెట్ గ్రౌటింగ్ మొత్తం 3467 మీటర్లు చేయాల్సివుంది. 3266 మీటర్ల మేర పూర్తయ్యింది. వరద నీటి మట్టం వల్ల చివరి దశలో ఆగింది. ప్రస్తుతం దాన్ని పూర్తిచేస్తున్నారు. పోలవరం హెడ్ వర్స్క్ విభాగంలో మెయిన్ డ్యామ్ ప్యాకేజీ 43.53 శాతం పూర్తయింది. స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, లెఫ్ట్ఫ్లాంక్ మట్టి పనులు 77.50 శాతం వరకు పూర్తయ్యాయి. కాంక్రీటు విషయానికొస్తే స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్ తదితర పనులు 35.30 శాతం పూర్తయ్యాయి. రేడియల్ గేట్లు ఫ్యాబ్రికేషన్ పనులు దాదాపు 61.81 శాతం పూర్తయ్యాయి. 1397 మీటర్ల డయాఫ్రమ్ వాల్ మొత్తం పూర్తయింది. జెట్ గ్రౌటింగ్ కాఫర్ డ్యామ్‌లకు సంబంధించి దాదాపు 94.20 శాతం పని పూర్తయింది.
ఇక కనెక్టివిటీ ప్యాకేజీలకు సంబంధించి 58.82 శాతం పనులు పూర్తయితే ఎడమ వైపు పనులు 47.38 శాతం, కుడి వైపు పనులు 71.77 శాతం పూర్తయ్యాయి. కుడి ప్రధాన కాల్వ పనులు 90 శాతం పూర్తికాగా, ఎడమ ప్రధాన కాల్వ పనులు 63.35 శాతం మాత్రమే పూర్తయ్యాయి.
మెయిన్ డ్యామ్‌లో ప్రధానంగా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్స్, లెఫ్ట్ ప్లాంక్ పనులకు సంబంధించి మట్టిపని 1115.59 లక్షల క్యూబిక్ మీటర్ల మేర జరగాల్సి వుంది. దీనిలో ఇప్పటి వరకు 864.13 లక్షల క్యూబిక్ మీటర్ల పని జరిగింది. కాంక్రీటు పని మొత్తం స్పిల్‌వేల, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్‌కు సంబంధించి మొత్తం 36.79 లక్షల క్యూబిక్ మీటర్లు జరగాల్సివుంది. ఇందులో 12.97 శాతం వరకు పూర్తయింది.
రేడియల్ గేట్లు 18వేల మెట్రిక్ టన్నులు లక్ష్యం కాగా 11,126 మెట్రిక్ టన్నుల పని పూర్తయ్యింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కూడా పూర్తవ్వడంతో ఎడమ ప్రధాన కాల్వపై దృష్టిసారించి, బ్యాలెన్స్ పనుల ప్యాకేజీలపై లక్ష్యాలు నిర్ధేశించి, పనులు పూర్తిచేయడానికి చర్యలు చేపట్టారు. కుడి ప్రధాన కాల్వకు సంబంధించి మట్టిపని మొత్తం పూర్తయింది. లైనింగ్‌కు సంబంధించి మొత్తం 176.20 కిలోమీటర్లకు గాను 149.295 కిలోమీటర్లు పూర్తయింది. ఈ ప్రధాన కాల్వ పరిధిలో మొత్తం 255 స్ట్రక్చర్లకు గాను ఇప్పటివరకు 185 స్ట్రక్చర్లు పూర్తయ్యాయి. ఇక ఎడమ ప్రధాన కాల్వ పరిధిలో మొత్తం 210.927 కిలోమీటర్ల మేరకు మట్టి పనికి గాను 179.948 కిలోమీటర్లు పూర్తయింది. ఎడమ ప్రధాన కాల్వ పరిధిలో పనులు నత్తనడకన జరుగుతున్నాయి. ప్రధానంగా వంతెనల పనులు మరింత మందకొడిగా సాగుతున్నాయి. ఈ కాల్వ పరిధిలో అత్యధికంగా స్ట్రక్చర్ల నిర్మించాల్సి వుంది. ఆ పనులు కుడి కాల్వ పరిధితో పోల్చుకుంటే ఆలస్యంగా జరుగుతున్నాయి. ఈ కాల్వ లైనింగ్‌కు సంబంధించి 210.927 కిలో మీటర్లకు గాను ఇప్పటి వరకు 124.593 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. మొత్తం ఈ కాల్వ పరిధిలో 452 స్ట్రక్చర్లకు గాను ఇప్పటి వరకు 146 స్ట్రక్చర్లు పూర్తయ్యాయి. ఇందులో కొన్ని డిజైన్లు కూడా రావాల్సి వుంది. మొత్తం మీద పరిశీలిస్తే..పోలవరం పనులు గత వారం కంటే వరదల తర్వాత యథావిథిగా లక్ష్యం దిశగా పయనిస్తున్నాయి. పనులు చురుకుగా జరుగుతున్న నేపథ్యంలో అధికార్లు పునరావాసంపై ప్రత్యేక దృష్టి సారించారు. భూసేకరణకు సంబంధించి కూడా సత్వరం పూర్తి చేసేందుకు, పెండింగ్‌లో వున్న డిజైన్లన్నీ త్వరితగతిన ఆమోదించి అన్ని విధాలా పనులను మరింత వేగం పెంచేందుకు చర్యలు చేపట్టారు.